Pages

Sunday, September 16, 2012

సీతాపతిరాజు


 
అమలాపురం గ్రామంలో వీరేశ్వరశాస్త్రి అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు త్రిపురసుందరీదేవి ఉపాసకుడు. ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు, దేవీపూజ ముగించుకుని రాగానే, తన వద్దకు వచ్చినవారికి ఈ జన్మకు సంబంధించిన విశేషాలనే కాకుండా, పూర్వజన్మల గురించి కూడా చెప్పగలడని పేరుగాంచాడు. ఈ సంగతి తెలిసి రామచంద్రపురం గ్రామాధికారి సీతాపతిరాజు, తన జాతకం చెప్పించుకోవడానికి ఒక శుక్రవారం తెల్లవారేసరికి వీరేశ్వరశాస్త్రి వద్దకు వెళ్ళాడు.
 
ఆయన జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించి, కొంతసేపు ధ్యానంలో గడిపి కళు్ళ తెరిచి, ``ఒకానొకప్పుడు రామచంద్రపురానికి పాలకుడిగా, దాన ధర్మాలు చేసి ధర్మ ప్రభువుగా కీర్తిగాంచిన రామచంద్రరాజు అంశ నీలో ఉన్నది. అందుకే నీకు సీతాపతిరాజు అనే నామ ధేయం కూడా సహజంగా సిద్ధించింది. గ్రామాధి కారిగా రామచంద్రపురాన్ని ఎదురు లేకుండా శాసించగలవని కూడా జాతకం చెబుతోంది,'' అన్నాడు.
 
ఆ మాట వినగానే సీతాపతిరాజు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఎందుకంటే, అతని వంశానికి చెందిన రామచంద్రరాజే, ఒకప్పుడు రామచంద్రపురాన్ని నిర్మించాడు. ఆ కారణం చేతనే గ్రామస్థులు ఈనాటికీ, గ్రామంలో జరిగే ప్రతి కార్యానికీ సీతాపతిరాజు కుటుంబానికి అగ్రతాంబూలం ఇచ్చి గౌరవిస్తున్నారు. ఇది గ్రామంలో తరతరాలుగా వస్తూన్న సంప్రదాయం. ప్రస్తుతం తాను గ్రామాధికారిగా మాత్రమే ఉంటున్నాడు; ఇకపై గ్రామానికి తనే రాజునని సీతాపతిరాజు ఊహలలో తేలిపోసాగాడు.

రామచంద్రపురానికి తిరిగి రాగానే సీతాపతిరాజు, గ్రామానికి సంబంధించిన లెక్కలూ, పాత వివరాలూ తెప్పించి పరిశీలించాడు. రామచంద్రపురంలోని పాఠశాల, వైద్యశాల, ధర్మ సత్రం, చెరువు మొదలైనవన్నీ రామచంద్రరాజు దానమిచ్చినవే అని తెలియడంతో, సీతాపతిరాజు తానే మళ్ళీ ఆ ఊరికి రాజైపోయినంతగా సంబరపడిపోయాడు. వెంటనే గ్రామపెద్దలను పిలిపించి, వీరేశ్వరశాస్త్రి చెప్పిన విషయం గురించి చెప్పి, ``నేను ఆ జన్మలో దానమిచ్చిన ఆస్తులన్నిటినీ ఇప్పుడు స్వాధీనం చేసుకుని నేనే నిర్వహిస్తూ, అవినీతికి తావులేకుండా ప్రజలకు మేలు చేయాలనుకున్న అప్పటి నా ఆశయాన్ని నెరవేరుస్తాను,'' అన్నాడు.
 
ఆ మాటవిన్న గ్రామపెద్దలు మొదట దిగ్భ్రాంతి చెందారు. ఆ తరవాత తేరుకుని, ``గ్రామాధికారిగా ఈ గ్రామప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకునే అధికారం మీకున్నది. అంతేగాని, జ్యోతిష్కుడు చెప్పాడు కదా అని వంద సంవత్సరాలనాటి రామచంద్రరాజుగా మిమ్మల్ని ఊహించుకుని, ఆయన దానంగా ఇచ్చిన వాటిని ఇప్పుడు తిరిగిపుచ్చుకుంటాననడం ఏమాత్రం భావ్యం కాదు.
 
అది సాధ్యం కూడా కాదు. కావాలంటే, రామచంద్రరాజు వంశానికి చెందిన వారుగా మిమ్మల్ని వాటికి ధర్మకర్తగా అంగీకరించగలం,'' అన్నారు వినయంగా. వారి మాటలకు ఆగ్రహం చెందిన సీతాపతిరాజు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని, ``ఇప్పటికే గ్రామాధికారిగా నేనే వాటికి ధర్మకర్తను. ఆ విషయం నాకు తెలుసు. మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు.
 
వాటి మీద నా అధికారాన్నీ, నేను తీసుకునే నిర్ణయాలనూ ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీ అనుమతి కోరికాదు; ఏదో చెప్పాలి గనక చెప్పాను. అంతే,'' అన్నాడు తీవ్రమైన కంఠస్వరంతో. ఆవేశంతో మాట్లాడుతూన్న గ్రామాధి కారికి బదులు చెప్పడానికి జంకిన గ్రామపెద్దలు, ``ఏమైనా మీవల్ల మాకు మంచే జరుగుతుంది,'' అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు.

ఆ రోజు నుంచి సీతాపతిరాజు ధర్మసత్రం, పాఠశాల, వైద్యశాల విషయాల్లో అనవసరంగా చీటికీ మాటికీ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. రామచంద్రరాజు దానగుణం తనలో ఉందని ముఖస్తుతి చేసినవారికీ, అలా పొగడని వారిపై చాడీలు చెప్పేవారికీ కానుకలిచ్చేవాడు. తనకు నచ్చని వాస్తవాలు ఎవరైనా చెబితే కఠినంగా శిక్షించేవాడు. అలాంటి వారిని ఉద్యోగాలనుంచి తొలగించేవాడు.
 
తనను అడిగేవారు లేరన్న అహంతో విరవ్రీగసాగాడు. ఇలాంటి బాధలు రోజురోజుకు ఎక్కువ కావడంతో కొందరు ఉద్యోగులు, ఇక భరించలేక అమలాపురం వెళ్ళి వీరేశ్వరశాస్త్రిని చూసి విషయం వివరించి, ``జ్యోతిషం నిజమో, కాదో మాకు తెలియదు. అయితే, కొందరికి గత జన్మల గురించిన అపోహలు కలిగిస్తే మాత్రం విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. మేము అనుభవిస్తూన్న బాధలే అందుకు నిదర్శనం. ఆ బాధల నుంచి బయటపడే మార్గం మీరే చూపాలి,'' అని మొరపెట్టుకున్నారు.
 
ఆ పరిస్థితికి వీరేశ్వరశాస్త్రినొచ్చుకుని, ``నేను చెప్పింది జ్యోతిషం. అది గణితం మీద ఆధారపడిన గొప్ప శాస్త్రం. అది ఎన్నటికీ తప్పుకాదు. చెప్పేవారిలో, చెప్పించుకునే వారిలో దోషాలు దొర్ల వచ్చు. ఏమైనా నా కారణంగా మీరు బాధలు అనుభవిస్తున్నందుకు విచారిస్తున్నాను,'' అని కొంతసేపు ఆలోచించి, ``వచ్చే ఏకాదశి నాటికి సీతాపతి ాజుకు గ్రామపెద్దల సమక్షంలో ఒక సన్మానసభ ఏర్పాటు చేయండి. ఆ సభకు ప్రత్యేక అతిథిగా నేను వచ్చి, మీ బాధలు తొలగిస్తాను; నిశ్చింతగా వెళ్ళిరండి,'' అన్నాడు.


రామచంద్రపురానికి తిరిగివచ్చిన ఉద్యోగులు వీరేశ్వరశాస్త్రి చెప్పిన రోజున సీతాపతిరాజు సన్మాన సభ ఏర్పాటు చేశారు. వీరేశ్వరశాస్త్రి ప్రత్యేక అతిథిగా వచ్చి తనను ఆశీర్వదిస్తాడని తెలియగానే, సీతాపతిరాజు మరింత ఆనందంతో సభకు వచ్చాడు. వీరేశ్వరశాస్త్రి ప్రసంగిస్తూ, ``గ్రహగతులనుబట్టి మానవుల భూత భవిష్యత్తులను తెలియజేసే అద్భుత శాస్త్రం జ్యోతిషం. ఈ గ్రామాన్ని నిర్మించిన రామచంద్రరాజే ఇప్పుడు గ్రామాధికారి సీతాపతిరాజుగా జన్మించాడని, నేను చెప్పిన సంగతిని పలువురు ప్రస్తావించి ప్రశంసించారు.
 
చాలా సంతోషం. అలాగే వచ్చే జన్మలో సీతాపతిరాజు కాలభైరవాంశతో జన్మించడం ఖాయం అని కూడా నా జ్యోతిషం లెక్కలు చెబుతున్నాయి. అంటే, అతడు ఈ జన్మలో మంచిగా నడుచుకుంటే కాలభైరవరాజుగానూ, లేకుంటే కాలభైరవుడి మరోరూపమైన శునకంగానూ పుట్టగలడు. సీతాపతిరాజు మునుముందు ప్రజల అవసరాలు తీర్చడంలో పక్షపాతం చూపకుండా ధర్మబద్ధంగా ప్రవర్తించి, ఈ జన్మను సార్థకం చేసుకుని, మళ్ళీ కాలభైరవరాజుగా ఈ రామచంద్రపురంలోనే జన్మించి, ఊరికి ఉపకారం చేయాలని ఆశీర్వదిస్తున్నాను.
 
ఆయనకు శునక జన్మ ప్రాప్తించకూడదని త్రిపురసుందరీ దేవిని త్రికరణశుద్ధిగా ప్రార్థిస్తున్నాను,'' అన్నాడు. ఆయన ప్రసంగానికి అక్కడ చేరినవారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. సీతాపతిరాజు మాత్రం ఉలిక్కిపడ్డాడు. వీరేశ్వరశాస్త్రి జ్యోతిషం ద్వారానే తనను పరోక్షంగా హెచ్చరించాడని గ్రహించాడు. తనకు చేసిన సన్మానానికి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ క్షణం నుంచే బుద్ధిని సరిదిద్దుకుని మంచి గ్రామాధికారిగా ఉద్యోగులతోపాటు అందరి మన్ననలూ పొందాడు. 

No comments:

Post a Comment