Pages

Sunday, September 16, 2012

ప్రశాంత జీవనం

పూర్వం ఒక గ్రామంలో గోవిందయ్య అనే ధనవంతుడుండేవాడు. ఆయన రకరకాల వ్యాపారాలు చేసి, ధనం ఆర్జించాడు. ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. అయితే, ఆయనకు అరవై ఏళ్ళు వచ్చేసరికి తన వాళ్ళంటూ ఎవరూ లేకుండాపోయారు. ఆయన విరక్తిపుట్టి, తనకున్నదంతా గ్రామం బాగుకు ధారపోసి, ప్రశాంతంగా తన మిగిలిన జీవితం వెళ్ళబుచ్చటానికి వనాలకు వెళ్ళిపోయాడు.

సుదూరంలోని అరణ్య మధ్యంలో నీటివనరులకు దగ్గిరలో ఒక అందమైన కుటీరం నిర్మించుకుని, కాయలూ, పళ్ళూ, కందమూలాలూ తిని బతుకుతూ ఆయన ప్రశాంతంగా జీవించసాగాడు.

ఇంతలో ఒకనాడు ఒక వింత సంఘటన జరిగింది. గోవిందయ్య పొదలలో ఏవోకాయలు కోసుకుంటూండగా భయంకరమైన ఒక పెద్ద పులి ఆయన వెనకగా, దాదాపు ఆయనను రాచుకుంటూ వెళ్ళిపోయింది. అంతకు ముందే దాని గాండ్రింపు విని భయపడిపోయి చెట్టెక్కిన కట్టెలుకొట్టేవాడు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూశాడు. కాని గోవిందయ్యకు మాత్రం తన వెనకగా పులి వెళ్ళిన సంగతి అసలు తెలియదు.

కట్టెలు కొట్టేవాడు గోవిందయ్య మామూలు మనిషి కాదని నిశ్చయించుకుని, గబగబా చెట్టు దిగివచ్చి, గోవిందయ్య కాళ్ళ మీదపడి, "పెద్దకుటుంబం గలవాణ్ణి. సంసారం ఈదలేక చస్తున్నాను. ఈ సంసారసాగరాన్ని తరించే మార్గం చెప్పండి, స్వామీ!" అన్నాడు దీనంగా.

గోవిందయ్య వాణ్ణి లేవనెత్తి, "నీ కష్టం నువ్వు చెయ్యి. కుటుంబ పోషణకు కష్టపడక తప్పదు కదా. తరించటం మాట నీకెందుకు?" అన్నాడు.

ఆ కట్టెలు కొట్టేవాడు సమీపంలో ఉన్న తన గ్రామానికి వెళ్ళి, గోవిందయ్య గురించి ఎంతో అద్భుతంగా చెప్పాడు. అది మొదలు జనం అరణ్యంలో కుటీరం నిర్మించుకుని ఉన్న గోవిందయ్య దర్శనం చేసుకుని పాపాలు పోగొట్టుకోవటానికి రాసాగారు. రాను రాను అది తీర్థప్రజ అయింది.

ప్రశాంతంగా జీవింతామనుకున్న గోవిందయ్యకు ప్రజల కష్టాలూ, సమస్యలూ, ఈతిబాధలూ వినక తప్పలేదు. వారు ఏకరువు పెట్టే సమస్యలకు తనకు తోచిన పరిష్కారమార్గాలు సూచించేవాడు. జనం అతన్ని గోవింద స్వామిని చేసి, దేవుడు లాగా పూజించసాగారు. క్రమ క్రమంగా అతని పేరు ఇంకా, ఇంకా దూర గ్రామాలకు పాకింది.

ఒకసారి బహు దూర గ్రామం నుంచి సుందరయ్యా, కాంతమ్మా అనే బీద రైతు దంపతులు కష్టాలు భరించలేక ఏదైనా పరిష్కారం లభించగలదన్న ఆశతో గోవిందస్వామి దర్శనం చేసుకోవాలని బయలుదేరారు.

వారు కొంతదూరం వెళ్ళేసరికి, యాత్రికుల వేషంలో పోతున్న కొందరు దొంగలు వారికి తగిలారు. సుందరయ్య అవతారమూ, బవిరి గడ్డమూ చూసి దొంగలకు ఒక ఆలోచన వచ్చింది. ఆకలితో అలమటిస్తున్న సుందరయ్యకూ, కాంతమ్మకూ వాళ్ళు తమ వద్ద ఉన్న తిండి పెట్టి, వాళ్ళకు తమ సంచీలలో నుంచి కాషాయవస్త్రాలు తీసి కట్ట బెట్టారు. తరవాత తాము కూడా కాషాయవస్త్రాలు ధరించారు.

తరవాత దొంగలు ఆ అడవి ప్రాంతంలోనే ఒక చిన్న ఆశ్రమం నిర్మించి, సుందరయ్యను అందులో గోవిందస్వామి ప్రియ శిష్యుడిగా ప్రతిష్ఠించారు. అతను అభ్యంతరం చెబితే చంపేస్తామన్నారు. తాము అతని శిష్యులలాగా నటిస్తూ, కొత్త స్వామి గురించి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ప్రచారం చేశారు.

సుందరయ్య ఆశ్రమానికి గోవిందయ్య ఆశ్రమం చాలా దూరం. అందుచేత గోవిందస్వామి దర్శనం చేసుకునేటందుకు పోలేని వారు, ఈ చిన్న గోవిందస్వామిని చూడవచ్చారు. దొంగలు సుందరయ్యకు కొన్ని చిట్కాలు, ఇంద్రజాల విద్యలు నేర్పారు. అతను ఉత్త చేతులు రుద్దుకుని బూడిద తెప్పించేవాడు. నోట్లో నుంచి శివలింగాలు తీసేవాడు. ఈ గమ్మత్తులు చూసి భక్తులు పరవశించిపోయి, చిన్న గోవిందస్వామికి భక్తితో కానుకలు అర్పిస్తే, వాటిని దొంగలు తీసుకునేవారు. వాళ్ళకు ఈరకం వృత్తి, దారిదోపిడీలకన్నా ఎంతో గిట్టుబాటుగానూ, చాలా గౌరవప్రదంగానూ ఉన్నది.రానురాను అసలు గోవిందస్వామి కన్న చిన్న గోవిందస్వామే గొప్ప గొప్ప మహిమలు గలవాడని వాడుకపడింది. అరణ్యమధ్యంలో మరీ దూరాన ఎక్కడో ఉన్న గోవిందయ్యకు భక్తులు తగ్గి, సమీపంలో ఉన్న సుందరయ్యకు హెచ్చారు.

తన పేరు ఉపయోగించుకుని ఎవరో జనాన్ని మోసగిస్తున్నారని గోవిందయ్యకు అనుమానం కలిగింది. అది ఆయనకు తీరని ఆవేదన కలిగించింది. తాను "స్వామి" అయిన మాట నిజమేగాని, ఎవరినీ ఎన్నడూ ఏ విధంగానూ మోసం చెయ్యలేదు. ఈ కొత్తస్వామి ఎవరు?

అది తెలుసుకుందామని ఒకనాడు గోవిందయ్య సుందరయ్య ఆశ్రమానికి బయలుదేరాడు. అతను ఎవరైనదీ తెలియని దొంగలు అతన్ని ఇతర భక్తులను ఆదరించినట్టే ఆదరించారు.

సుందరయ్య తన మహత్తులు ప్రదర్శించగానే చూడవచ్చిన భక్తులు వెళ్ళిపోయారు. దొంగల అనుమతి మీద గోవిందయ్య సుందరయ్యతో ఒంటరిగా కొంతసేపు మాట్లాడాడు. సుందరయ్య స్వామి హోదాలోనే అతని ప్రశ్నలకు జవాబు చెప్పాడు.

"తమ గురువుగారైన గోవిందస్వామి గారిని గురించి తెలుసుకోవాలని ఉన్నది. మీకు తెలిసినది చెప్పండి," అన్నాడు గోవిందయ్య.

"నాయనా, వారిని గురించి నేను ఏమి చెప్పగలను? వారు గొప్ప తపస్సంపన్నులు!

దైవసాక్షాత్కారం పొందిన అపూర్వ జ్ఞానులు!" అన్నాడు సుందరయ్య పరవశంగా కళ్ళుమూసుకుని.

"వారి పూర్వనామం ఏమై వుంటుందో తమకు తెలుసా?" అని గోవిందయ్య మళ్ళీ అడిగాడు.

"పిచ్చివాడా! వారికి పూర్వనామం ఏమిటి? వారు పుట్టుతూండగానే అశరీరవాణి 'గోవిందస్వామి!' అని పలికింది," అన్నాడు సుందరయ్య.

"ఆ స్వామి వారిని తమరు ఎంతకాలం క్రితం చూశారు?" అని గోవిందయ్య అడిగాడు.

"నే నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వారి దివ్యవిగ్రహం దర్శనమిస్తుంది!" అన్నాడు సుందరయ్య.

"అలా అయితే నన్ను గుర్తుపట్టావా!" అన్నాడు గోవిందయ్య.

"నువ్వు ఎవరు, నాయనా?" అని సుందరయ్య అడిగాడు.

"ఇప్పుడు మీరు కీర్తిస్తున్న గోవిందస్వామిని, స్వామీ!" అన్నాడు గోవిందయ్య. అది విని సుందరయ్య నిర్ఘాంత పోయాడు నోటమాట రాలేదు.

"ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు?" అని గోవిందయ్య అడిగాడు.

దొంగలు తనను అడ్డం పెట్టుకుని జనాన్ని ఎలా మోసం చేస్తున్నదీ సుందరయ్య వివరంగా చెప్పాడు. దొంగల నుంచి తప్పించుకుని పారిపోవటానికి తనకు, అభ్యంతరం లేదని కూడా అతను గోవిందయ్యకు స్పష్టం చేశాడు.

ఆ రాత్రి దొంగలు మత్తు నిద్రలో ఉన్న సమయంలో గోవిందయ్య సుందరయ్యనూ, అతని భార్యనూ తీసుకుని బయలుదేరాడు. వాళ్ళు చాలా దూరం ప్రయాణంచేసి, ఒక పట్టణం చేరుకుని, మామూలు పనులు చేసుకుంటూ బతకసాగారు.

నట్టడవిలో దొరకని మనశ్శాంతి గోవిందయ్యకు జనసమ్మర్దంగల పట్టణంలో దొరికింది. ఎందుకంటే అక్కడ అతన్ని ఎరిగినవారూ, అతని సంగతి పట్టించుకునేవారూ లేరు.

No comments:

Post a Comment