Pages

Sunday, September 16, 2012

న్యాయాధికారి చాతుర్యం

రామవరం గ్రామంలోని కూర్మయ్య ఒంటెద్దు బండి మీద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు.సాయంకాలానికి కూరగాయలు మిగిలితే,వాటిని కాస్త తక్కువ ధరకు అమ్మటం,లేదా తన ఎద్దుకు మేతగా వేయటం కూర్మయ్య అలవాటు.అందువల్ల అతడి వద్ద కూరగాయలు తాజాగా ఉంటాయని పేరు వచ్చింది.

ఒకనాడు తన ఆరోగ్యం బాగుండక పోవడంతో,కూర్మయ్య కూతురు పూర్ణమ్మను తోడు తీసుకుని బయలుదేరాడు.మధ్యాన్నం వరకు నాలుగు ఊళ్ళు తిరిగి వ్యాపారం చూసుకుని ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రీ కూతుళ్ళకు ఒక కాలువ పక్కన గల ముళ్ళపొదను తమ గ్రామానికి చెందిన పట్టయ్య ముల్లుకర్రతో పొడుస్తూ కనిపించాడు.దాన్ని చూసిన కూర్మయ్య,"ఏమిటి పట్టయ్యా,వెతుకుతున్నావు? కుందేలు గాని కనబడిందా?" అని అడిగాడు కుతూహలంగా.

"కుందేలు కాదు; మంచిరకం తాబేలొకటి కాలువలోంచి బయటకు వచ్చి,ఇప్పుడే ఈ పొదలో దూరింది," అంటూ వెతకసాగాడు పట్టయ్య.

తాబేలు అనగానే భక్తితో చెంపలు వేసుకున్న కూర్మయ్య,"పట్టయ్యా,దాన్ని ఏమీ చేయకు.కూర్మనాథస్వామి మా కులదైవం.నీకు కావాలంటే డబ్బిస్తాను.దాన్ని నాకు ఇవ్వు," అంటూ రొండిన దోపుకున్న ఆకుపచ్చరంగు డబ్బు సంచీని వెలుపలికి తీశాడు.డబ్బును చూడగానే ఎంతో సంతోషించిన పట్టయ్య,అంతలో వెలుపలికి వచ్చిన తాబేలును కూర్మయ్యకు అప్పగించి,డబ్బు పుచ్చుకుని తన దారిన వెళ్ళిపోయాడు.

అంతవరకు నాలుగు కాళ్ళనూ,తలనూ లోపలికి లాక్కున్న తాబేలు,పూర్ణమ్మ దాన్ని ఆప్యాయంగా చేత్తో నిమరడంతో,తలను బయటపెట్టి అటూ ఇటూ వింతగా చూడసాగింది.

"నీకు ఎలాంటి భయమూ వద్దు.నీ గాయాలకు మందు రాసి మెత్తని గుడ్డచుడతాను.కొన్ని రోజులు మా ఇంట్లో విశ్రాంతి తీసుకో," అంటూ కూర్మయ్య తాబేలును కూతురు దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకుని,బండిలోని ఖాళీ గంపలో ఉంచాడు.

తరవాత కొద్ది రోజులకే గాయాలు మానడంతో తాబేలు ఎంతో ఆరోగ్యంగా తయారయింది.కూర్మయ్య దానిని భక్తితో తీసుకువెళ్ళి రామవరానికి ఉత్తరంగా ప్రవహిస్తూన్న కృష్ణానది పాయలో వదిలి వచ్చాడు.

ఇది జరిగిన మూడో రోజు ఒక వింత సంఘటన జరిగింది.పట్టణంలోని జమీందారు దివాణం నుంచి ఒక న్యాయాధికారి కూర్మయ్య ఇంటికి వచ్చి అతడి పూర్వీకుల వివరాలు అడిగాడు.

"మా నాన్నకు ముగ్గురన్నదమ్ములు,ఒక అక్కగారు.వాళ్ళ నాన్నకు అంటే మా తాత గారికి అన్నదమ్ములు లేరుగాని ఒక చెల్లె ఉండేదట.వాళ్ళ తాత రాజుగారి ఆస్థానంలో మల్లయుద్ధ వీరుడుగా పేరు పొందాడట.ఆయన పేరు జెట్టి జగ్గయ్య అని చెప్పుకునేవారు;ఆయన రాజుగారి నుంచి ఘనంగా సన్మానాలు కూడా అందుకున్నాడట," అంటూ కూర్మయ్య తన తండ్రి తాతలు చిన్నప్పుడు చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ వివరించాడు.

"కూర్మయ్యా,నువ్వు చెప్పే సంగతులు వాస్తవాలేనని రుజువు చేయడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా?" అని అడిగాడు న్యాయాధికారి.

"ఉన్నాయి బాబూ," అంటూ కూర్మయ్య ఇంటిలోపలికి వెళ్ళి, పాత ఇనుప పెట్టెలో దాచిన తమ వంశవృక్షం వివరాలు గల తాళపత్రం తెచ్చి చూపించాడు.

న్యాయాధికారి తన చేతి సంచీలోంచి ఒక కాగితం తీసి,కూర్మయ్య ఇచ్చిన తాళపత్రంతో పోల్చి చూసి,"కూర్మయ్యా, నేను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తివి నువ్వే.నువ్వు చాలా అదృష్టవంతుడివి.నీకు నీ పూర్వీకుల నుంచి పెద్ద ఆస్తి సంక్రమించింది. నీ ఆస్తిని నీకు అప్పగించమని జమీందారు నన్ను పంపారు.వెంటనే పట్నం బయలుదేరు," అన్నాడు సంతోషంగా.

ఆ విధంగా కూర్మయ్య కుటుంబం ఒక్క నెల తిరిగేసరికి పట్నంలోని పెద్ద భవంతికి చేరి ధనవంతుల కుటుంబంగా పేరుపొందింది.కూర్మయ్యకు పట్టిన అదృష్టం గురించి రామవరంలో గొప్పగా చెప్పుకోసాగారు.

ఒక సంవత్సరం రోజులు గడిచిపోయాయి.ఒకనాటి ఉదయం కూర్మయ్య ఇంటి ముందు పదిమంది చేరి ఏదో గొడవ ప్రారంభించారు.ఇంతకూ,ఆ గొడవ చేస్తున్న వాళ్ళు కూర్మయ్య స్వగ్రామమైన రామవరానికి చెందిన పట్టయ్య; అతడి కొడుకు మల్లయ్య.

"మనిషంటే మాట మీద నిలబడాలి.ఈ రోజు నాలుగు డబ్బులు వచ్చినంత మాత్రాన ఇచ్చిన మాట తప్పుతావా? అయినా నీ నడమంత్రపు సిరి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు?నేనిచ్చిన తాబేలు ద్వారా పట్టిన అదృష్టంవల్లనే కదా? ఆ సంగతి ఇంతలోనే మరిచిపోయావా?" అని పట్టయ్య నానా రభస చేస్తున్నాడు.

"ఇంతకూ నన్ను ఏం చేయమన్నావు పట్టయ్యా?" అని అడిగాడు కూర్మయ్య నెమ్మదిగా.

"ఎమీ ఎరగనట్టు ఏమిటా నంగనాచి మాటలు?నీ కూతురు పూర్ణమ్మను నా కొడుకు మల్లయ్యకిచ్చి పెళ్ళి చేస్తానన్నావు కదా? ఇప్పుడు కాదంటావేమిటి? పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా," అన్నాడు పట్టయ్య.

"ఇదిగో పట్టయ్యా,మేము పట్నం వచ్చాక, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేయమని చాలా సార్లు వచ్చావు.అందుకు నేను ఒప్పుకోలేదని ఈ నాటకం ఆడుతున్నావా?" అన్నాడు కూర్మయ్య కోపంగా.

"నువ్వు అలా అంటావనే మన ఊరి వాళ్ళను వెంట బెట్టుకు వచ్చాను," అన్నాడు

పట్టయ్య వాళ్ళకేసి చేయి చూపుతూ.వాళ్ళందరూ,"అవును,పట్టయ్య కొడుక్కు నీ కూతురునిచ్చి పెళ్ళి చెయ్యాల్సిందే," అన్నారు ఒక్కసారిగా.

వాళ్ళ అబద్ధపు మాటలకు తండ్రీకూతుళ్ళు దిగ్భ్రాంతి చెంది,ఒకరినొకరు చూసుకోసాగారు.దాన్ని అవకాశంగా తీసుకుని,"ఏమిటి పూర్ణమ్మా,మీ నాన్నలాగా నువ్వూ మమ్మల్ని మరిచిపోయావా?" అన్నాడు పట్టయ్య వ్యంగ్యంగా.

పూర్ణమ్మ మౌనంగా తలవంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.అంతలో అక్కడ జరుగుతూన్న గొడవకు చుట్టు పక్కల వాళ్ళు గుమిగూడారు.కూర్మయ్యను మాట్లాడనీయకుండా పట్టయ్య చిందులు వేస్తూ ఏవేవో చెబుతున్నాడు.

కొంతసేపటికి న్యాయాధికారి అటుకేసి రావడంతో సద్దు మణిగింది.న్యాయాధికారి పట్టయ్య చెప్పినదంతా సావధానంగా విని తల పంకించి,"మీ అబ్బాయి మల్లయ్యకూ,కూర్మయ్య కూతురు పూర్ణమ్మకూ పెళ్ళి ఖాయమయిందనీ,ఇంతలో ఎదురు చూడని ఆస్తి కలిసి రావడంతో కూర్మయ్య ఇచ్చిన మాట తప్పాడంటావు.అదే నిజమయితే,కూర్మయ్య చేసింది తప్పే కదా!" అన్నాడు.

"ధర్మ ప్రభువులు న్యాయం చిటికలో గ్రహించారు.తమరే నాకు న్యాయం జరిగేలా చూడాలి," అన్నాడు పట్టయ్య.

అదే సమయంలో ప్రముఖ బట్టల వ్యాపారి రామలింగయ్య హడావుడిగా అక్కడికి వచ్చి, "ఏమిటీ, నేను విన్నది నిజమేనా? పూర్ణమ్మకు ద్వితీయ వివాహమా!" అని కూర్మయ్యను నిలదీశాడు.ఏం జరుగుతున్నదీ తెలియక కూర్మయ్యకు నోట మాట రాలేదు.

"ఏమిటి మీరనేది? కాస్త వివరంగా చెప్పండి రామలింగయ్యా," అని అడిగాడు న్యాయాధికారి.

"పూర్ణమ్మకూ, మా అబ్బాయికీ ఇదే ఊళ్ళో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది," అన్నాడు రామలింగయ్య.

"నిజంగానే పూర్ణమ్మకు ఆరు నెలల క్రితం మీ అబ్బాయితో వివాహం జరిగి ఉన్నట్టయితే,పట్టయ్య చేసే ఆరోపణలు చెల్లవు," అన్నాడు న్యాయాధికారి గంభీరంగా.

సరిగ్గా అప్పుడే ఒక వృద్ధుడు జనంలోంచి ముందుకు వచ్చి, పట్టయ్యను పరిశీలనగా చూస్తూ,"ఒరే పట్టయ్యా,నీ పాపిష్ఠిబుద్ధులు ఇంకా పోలేదా? ఎడా పెడా అప్పులు చేసి ఊరి నుంచి పారిపోయావు కదా? మళ్ళీ ఎప్పుడు వచ్చావు?" అన్నాడు.

పథకం బెడిసి కొట్టి,పరిస్థితి తనకు ప్రతికూలంగా మారడంతో పట్టయ్య అక్కడి నుంచి పారిపోవడానికి చూశాడు. కాని కొందరు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. మల్లయ్యతో సహా అతడి వెంట వచ్చిన గ్రామస్థులు దిక్కుకొకరు పారిపోయారు.

"ఇలాంటి దుష్టుణ్ణి కఠినంగా శిక్షించాలి.వదిలిపెడితే పలువురు అమాయకులు నష్టపోతారు," అన్నారు న్యాయాధికారితో అక్కడ చేరిన వాళ్ళు.పట్టయ్యకు మూడు నెలల కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి.

సమయానికి వచ్చి కాపాడిన న్యాయాధికారికి కూర్మయ్య కృతజ్ఞతలు తెలియజేశాడు.

"నీలాంటి నిజాయితీ పరులకు దుష్టుల వల్ల సమస్యలు ఎదురైనా అవి మంచు తెరల్లా తొలగిపోతాయి.అయినా సమయానికి నేనిక్కడికి రావడానికి కారణం నీ కుమార్తె పూర్ణమ్మ.వీధిలో గొడవ పడుతూంటే, ఆమె పెరటి దారిగుండా ధైర్యంగా వచ్చి, నన్ను చూసి సంగతి వివరించి సాయం అర్థించింది.పట్టయ్య అసూయతో నిన్ను వంచించడానికి పథకం వేశాడని గ్రహించాను.నా మనుషులతో నాటకం ఆడించి, దోషిని పట్టుకుని శిక్షించగలిగాను," అన్నాడు న్యాయాధికారి.

చిన్నగా నవ్వుతూన్న తన కుమార్తెను అభినందిస్తూన్నట్టు చూశాడు కూర్మయ్య.

No comments:

Post a Comment