Pages

Sunday, September 16, 2012

దివాణం నౌకరీ


రామతీర్థంలోని శాల్మలుడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఊళ్ళోవాళు్ళ చెప్పిన పనులు చేసుకుని పొట్టపోసుకుంటూ, పూజారి ఇంట పనులు చేసి నాలుగు అక్షరాలు నేర్చుకుని, యుక్తవయస్కుడయ్యే సరికి అందరిచేతా తెలివైనవాడని పేరు తెచ్చుకున్నాడు. జమీందారు దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాయించాలని అతడు రాఘవపురం వచ్చాడు.
 
ఆ ఊరి గ్రామాధికారిని కలుసుకుని తన పరిస్థితిని వివరించి సాయం అర్థించాడు. ``ఈ క్షణం వరకు ముక్కూమొహం తెలియనివాడివి. నిన్ను గురించి జమీందారుకు నేనేమని చెప్పేది? తీరా నేను చెబితే జమీందారుగారు నామీదే విరుచుకు పడగలరు. వెళు్ళ, వెళు్ళ,'' అని కసిరి పంపాడు గ్రామాధికారి.
 
ఆశాభంగంతో వెనుదిరిగిన శాల్మలుడికి అదే దారిలో ఒక అరుగుపై కూర్చుని, జంద్యాలు వడుకుతూన్న సిద్ధాంతి కంట బడడంతో ఆగి, ఆయనకు తన ఉద్యోగం విషయం చెప్పాడు. ``జమీందారు వద్ద పని చేయడానికి ఎంతో అనుభవం ఉండాలి. అసలు ఈ ఊళ్ళో నీకు పని ఇచ్చేదెవరని?'' అంటూ హేళన చేశాడు సిద్ధాంతి. అక్కడి నుంచి బయలుదేరుతూన్న శాల్మలుణ్ణి, భైరవశెట్టి అనే నేతి వ్యాపారి చూశాడు. ``బాబూ, ఈ రోజు కార్తీక సోమవారం. శివాలయం దగ్గరికి ఈ నేతి కుండను మోసుకువెళ్ళాలి. చెయ్యగలవా?'' అని అతడు చెప్పడమే తడవుగా శాల్మలుడు నేతికుండను భుజంపైకి ఎత్తుకున్నాడు. శాల్మలుడలా నేతికుండను దింపిన మరుక్షణం నేతిని కొనడానికి భక్తులు మూగారు.

ఈ రద్దీలో తను ఒంటరిగా చూసుకోలేనని సాయంత్రందాకా తన వెంట ఉండి వ్యాపారం చూడమని భైరవశెట్టి చెప్పగానే సరే నన్నాడు శాల్మలుడు. కుండలోని నెయ్యి మధ్యాహ్నానికే అము్మడైపోయింది. భైరవశెట్టి చాలా సంతోషించి, శాల్మలుడికి కూలీ డబ్బులిచ్చి, ``ఎంతో అనుభవం ఉన్నవాడిలా సాయపడ్డావు. మా పనివాడు రేపు వచ్చేస్తాడు.
 
లేకపోతే నిన్నే ఏకంగా పెట్టుకునే వాణ్ణి,'' అంటూ పంపేశాడు. మరునాడు శాల్మలుడు జమీందారు దివాణానికి వెళ్ళాడు. ఇద్దరు పనివాళు్ళ అడ్డగించి వివరాలు అడిగి అతడి కోరిక వినగానే, ``ఇప్పుడే పనివాడొకడు పీంగాణిపాత్ర పగలగొట్టాడని నానా తిట్లు తిన్నాడు. ఈ సమయంలో వెళితే, నీ పని అంతే! వెళు్ళ, వెళు్ళ,'' అని తిప్పి పంపేశారు.
 
దిగులుగా వెనుదిరిగిన శాల్మలుడికి మళ్ళీ భైరవశెట్టి తారసపడి, అతని దిగులుకు కారణం అడిగాడు. శాల్మలుడు ఆ ఊరు వచ్చినప్పటి నుంచి ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టాడు. అంతా విన్న భైరవశెట్టి, ``నౌకర్లు ఆయన గురించి ఎందుకలా చెప్పారో గాని, జమీందారుకు స్వతహాగా చాలా మంచి మనసు.దేనికీ మరోసారి ప్రయత్నించి చూడు,'' అన్నాడు. ఆ మాట వినగానే శాల్మలుడికి ఎలాగైనా జమీందారు దివాణంలో నౌకరీ సాధించాలన్న పట్టుదలపెరిగింది. అంతలో భైరవశెట్టి, ``అసలు విషయం చెప్పడం మరిచాను. కోనవరంలో శివాలయం కట్టారు. ప్రతిష్ఠనాడు నేతి అమ్మకానికి మరి కొందరి అవసరమున్నది.
 
ఈ రోజు నువు్వ కూడా వెళతావా?'' అని అడిగాడు. శాల్మలుడు మారు మాట్లాడకుండా నేతికుండను మోసుకుని వెళ్ళాడు. అమ్మకం అయ్యాక తిరిగి వచ్చి, లెక్కంతా అప్పగించి, ``ఈ నేతిని అంతమంది కొని దేవుడికి ఇస్తున్నారు కదా? ఎందుకని?'' అని తన అనుమానాన్ని బయటపెట్టాడు. ``మనం ఏదయినా కోరుకుని వారానికి ఓసారి దేవుడికి నేతితో అభిషేకం చెయ్యిస్తే, మన కోరిక త్వరగా తీరుతుందని భక్తుల విశ్వాసం,'' అన్నాడు భైరవశెట్టి. ఆ మాట వినగానే శాల్మలుడు అప్పుడే దివాణంలో నౌకరీ లభించినంత సంబరపడిపోయాడు. అది మొదలు కష్టపడి కూలిపని చేసిన డబ్బులతో నేతినికొని శివుడికి అభిషేకం చేయించసాగాడు.

ఒక నెలగడిచాక శాల్మలుడు ధైర్యంచేసి మళ్ళీ జమీందారు దివాణానికి వెళ్ళాడు. నౌకర్లు అడ్డగిస్తే, ``ఈ సారయినా నన్ను జమీందారును చూడనివ్వండి. నాకు నౌకరీ కావాలి,'' అన్నాడు. ``పిచ్చివాడా, నిన్నే ఉన్న ఇద్దరు నౌకర్ల ఉద్యోగాలు ఊడాయి. నిష్కారణంగా ఇంటికి పంపేశారు. అలావుంది జమీందారు వ్యవహారం,'' అని వెనక్కు పంపేశారు నౌకర్లు. అప్పటికీ శాల్మలుడికి నౌకరీ మీద ఆశపోలేదు.
 
ఎప్పటిలాగే తన కోర్కెను తీర్చమని శివుణ్ణి ప్రార్థిస్తూ నేతితో అభిషేకం చేయిస్తూనే ఉన్నాడు. ఒకసారి నెయ్యి కొనడానికి తన కొట్టుకువచ్చిన శాల్మలుడితో, భైరవశెట్టి, ``నాకు పోటీగా నేతి వ్యాపారంగాని చేయటం లేదుకదా?'' అని హాస్యమాడాడు. శాల్మలుడు బదులుగా నవ్వి విషయం వివరించాడు. ``త్వరలోనే నీ కోరిక నెరవేరగలదని ఆశిస్తున్నాను. అన్నట్టు, జమీందారుకు ఈ మధ్య ఏదో తీరని జబ్బు చేసిందని విన్నాను,'' అని చెప్పాడు భైరవశెట్టి.
 
అది విన్న శాల్మలుడికి మనసు నిలువలేదు. ఆ రాత్రంతా జమీందారు అనారోగ్యం గురించి తీవ్రంగా విచారించాడు. మరునాడు ఉదయం శివాలయానికి వెళ్ళి, జమీందారు త్వరగా కోలుకోవాలని మనసారా ప్రార్థించి నేతి అభిషేకం చేయించాడు. ``ఇన్నాళు్ళ దివాణంలో నౌకరీ దొరకాలని దేవుడికి అభిషేకం చేయించినవాడివి, ఇప్పుడేమో జమీందారు ఆరోగ్యం కోసం చేయిస్తున్నావేమిటి?'' అని అడిగాడు పూజారి.

``నాకు ఉద్యోగం ఇచ్చే యజమానే అనారోగ్యం పాలయితే ఇక నేనెవరిని నౌకరీ అడగగలను? అందుకే ఆయన ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను,'' అన్నాడు శాల్మలుడు. ఇది జరిగిన కొన్నాళ్ళకే జమీందారు పూర్తిగా కోలుకున్నాడు. శివాలయంలో మృత్యుంజయ హోమం, అభిషేకం చేయించాలనుకుని వాటి ఏర్పాట్ల కోసం పూజారిని పిలిపించాడు.
 
అప్పుడు పూజారి, ``అయ్యా, స్వస్తత సమకూరాక తమరు ఇప్పుడు శివుడికి అభిషేకం చేయించాలనుకుంటున్నారు. అయితే, తమరు మంచం పట్టారని తెలిసిన మరుక్షణం నుంచే, మీకు ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తూ, నేతి అభిషేకం చేయిస్తున్నాడు ఒక యువకుడు,'' అంటూ శాల్మలుడి గురించి వివరించాడు. ఆ మాట వినగానే జమీందారు కళు్ళ చెమ్మగిల్లాయి.
 
అజ్ఞాతంగా తన మంచిని కోరుకుంటూన్న శాల్మలుణ్ణి చూడాలనుకుని పూజారి ద్వారా కబురు చేశాడు. అతడు రాగానే, స్వార్థం కొద్దీ మరెవ్వరినీ తన దరిదాపులకు రానివ్వకుండా అడ్డుకుంటూన్న దివాణంలోని కొందరు నౌకర్ల దుర్మార్గం బయటపడింది. వారి మీద కఠిన చర్యలు తీసుకున్నాడు. తన వద్ద పనిచేయాలన్న పట్టుదలతో, తనను ఎంతగానో అభిమానించి, తన క్షేమం కాంక్షించిన శాల్మలుడికి దివాణంలో తగిన ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. ఆ రోజు సాయంత్రం శాల్మలుడు శివాలయానికి వెళ్ళాడు.
 
అతన్ని చూసిన పూజారి, ``చూశావా నాయనా! నువు్వ నీ కోసం అభిషేకం చేయించినన్నాళు్ళ శివుడు ఊరుకున్నాడు. జమీందారు ఆరోగ్యం కోసం ప్రార్థించిన వెంటనే నీ మొర ఆలకించాడు. అటు జమీందారు ఆరోగ్యం కుదుట పడడంతోపాటు, ఇటు నీకు నౌకరీ కూడా దొరికింది. ఎదుటివారి క్షేమంలోనే మన క్షేమంకూడా ఇమిడి ఉందని గ్రహించి, భగవద్భక్తితో మసలుకోవడమే అందరికీ మంచిది,'' అని చెప్పి ఆశీర్వదించాడు.

No comments:

Post a Comment