Pages

Sunday, September 16, 2012

ప్రాణాన్ని కాపాడిన నిజం

దాదాపు వెయ్యి సంవత్సరాలకు పూర్వం షేక్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ అల్‌-గిలానీ అనే గొప్ప సాధువు నివసించాడు. ఆయన ఎనిమిదేళ్ళ ప్రాయంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ఒకనాడు ఒక ఆవు, ``పశువులు మేసే ఈ పొలాల మధ్య ఏం చేస్తున్నావు? నువు్వ సృష్టించబడింది ఇందుకు కాదు,'' అనడం ఆయన విని ఉలిక్కిపడ్డాడు. హడలిపోయి ఇంటికేసి పరిగెత్తి పోయి ఇంటి పైకప్పు మీదికి ఎక్కి నిలబడ్డాడు.
దూరంలో గుంపులు గుంపులుగా ప్రజలు రావడం చూశాడు. వాళు్ళ మెక్కా సమీపంలోని ఆరాఫత్‌ పర్వతం మీద హజ్‌ ప్రార్థనలు జరిపి తిరిగివస్తున్నారు. అబ్దుల్‌ ఖాదిర్‌లో చెప్పరాని ఉత్సాహం పెల్లుబికింది. అతడు బాగ్దాదు వెళ్ళి జ్ఞాన మార్గంలో నడవడానికి తనను అనుమతించమని తల్లిని వేడుకున్నాడు. దైవనిర్ణయాన్ని గ్రహించిన అతని తల్లి అందుకు వెంటనే సమ్మతించింది. సంతోషంగా అనుమతి ఇవ్వడంతో పాటు, అబ్దుల్‌ ఖాదిర్‌కు తండ్రి నుంచి సంక్రమించిన అతని వాటా నలభై బంగారు నాణాలను అతనికి ఇచ్చింది.
ఆ నాణాలను ఆమె ఖాదిర్‌ ధరించిన కోటు లోపలివైపు బట్టలో దాచి కుట్టింది. కొడుకు బయలుదేరుతూండగా, ``నాయనా, నువు్వ నన్ను వదిలి వెళుతున్నావు. అల్లా నిమిత్తం నిన్ను నేను నా నుంచి దూరం చేసుకుంటున్నాను. `తుదితీర్పు' రోజు వరకు నిన్ను చూసే అవకాశం లేదనుకుంటాను. ఇప్పుడు నీ తల్లి ఇస్తూన్న సలహా ఒక్కటే. నువు్వ ఎల్లప్పుడూ సత్యంగా జీవించాలి. ప్రాణాల మీదికి వచ్చినా సరే సత్యమే మాట్లాడాలి. సత్యాన్నే ప్రచారం చేయాలి,'' అన్నది.
అలాగే అనిచెప్పి అబ్దుల్‌ ఖాదిర్‌ బాగ్దాదుకు మరికొందరు ప్రయాణీకులతో కలిసి బయలుదేరాడు. అలా ప్రయాణం చేస్తూ వాళ్ళొక కష్టమైన మార్గంలో వెళుతూండగా, గుర్రాలపై వచ్చిన దొంగలు వాళ్ళను చుట్టుముట్టి దోచుకోసాగారు. ఒక దొంగ ఖాదిర్‌కేసి తిరిగి, ``చూడ్డానికి బిక్షగాడిలా ఉన్నావు. నీ దగ్గర ఏమైనా ఉన్నదా?'' అని అడిగాడు. ``నా దగ్గర నలభై బంగారు నాణాలు ఉన్నాయి. వాటిని మా అమ్మ నా కోటులోపల బట్టలో భద్రపరచి కుట్టింది,'' అని సమాధానమిచ్చాడు ఖాదిర్‌.

కురవ్రాడు హాస్యమాడుతున్నాడని భావించి, ఆ దొంగ నవు్వకుని అవతలికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి రెండో దొంగ వచ్చి ఖాదిర్‌ను అదే ప్రశ్న అడిగాడు. మళ్ళీ ఖాదిర్‌ అదే సమాధానం చెప్పాడు. ఈ దొంగ కూడా అతని మాట నమ్మకుండా వెళ్ళిపోయాడు. తమ నాయకుడు రాగానే ఆ ఇద్దరు దొంగలు ఖాదిర్‌ను లాక్కుపోయి అతడి ముందు నిలబెట్టి, ``ఈ కుర్రాడు చూడ్డానికేమో బిక్షగాడిలా ఉన్నాడు. అయితే, తన వద్ద నలభై బంగారు నాణాలు ఉన్నాయంటున్నాడు.
మిగిలిన అందరినీ మేము దోచుకున్నాం గాని, వీడి జోలికి పోలేదు. వీడు చెప్పిన బంగారు నాణాల మీద నమ్మకం కుదరక వీణ్ణి అసలు ముట్టుకోలేదు. వీడు మనల్ని ఆటపట్టించాలని చూస్తున్నాడులాగున్నది,'' అన్నారు. దొంగల నాయకుడు కూడా అబ్దుల్‌ ఖాదిర్‌ను మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఖాదిర్‌ అదే సమాధానం ఇచ్చాడు. దొంగల నాయకుడు వాడి కోటును విప్పి చూస్తే వాడు చెప్పినట్టే నలభై బంగారు నాణాలు కనిపించాయి.
అమితాశ్చర్యం చెందిన దొంగల నాయకుడు, సులభంగా తప్పించుకునే మార్గం ఉండి కూడా నిజం చెప్పడానికిగల కారణం ఏమిటని ఖాదిర్‌ను నిలదీశాడు. ``ప్రాణాలు పోయినా సరే సత్యమే చెప్పాలని మా తల్లి నా దగ్గర మాట తీసుకున్నది. ఇప్పుడు నలభై బంగారు నాణాల కోసం, నా తల్లి నా మీద ఉంచిన నమ్మకాన్ని వము్మ చేయకూడదు కదా. అందుకే నిజం చెప్పాను,'' అన్నాడు అబ్దుల్‌ ఖాదిర్‌. దొంగల నాయకుడు కళ్ళ నుంచి పెల్లుబుకుతూన్న కన్నీటి బాష్పాలను తుడుచుకుంటూ, ``పిన్నవాడివైనా నువు్వ మహనీయురాలైన నీ తల్లి సలహాను పాటించావు. మేమేమో మా తల్లిదండ్రులు మా మీద ఉంచిన నమ్మకాన్ని కాలరాచి, సృష్టికర్త ఒడంబడికను కూడా అనేక సంవత్సరాలుగా మోసగిస్తున్నాము.
ఈ క్షణం నుంచి నువ్వే మాకు మంచి మార్గం చూపాలి. మా పాపాలకు పశ్చాత్తాప పడుతున్నాం. ఇకపై నువ్వే మా నాయకుడివి,'' అన్నాడు. ఆ క్షణమే దొంగలందరూ దొంగతనాలు చేయడం మానేయాలని నిర్ణయించారు. ఆ రోజు నుంచి సత్ప్రవర్తనతో మంచి వాళు్ళగా మారారు. ఉత్తమురాలైన ఒక తల్లి, తన బిడ్డకు ఇచ్చిన సలహా కారణంగా ఆ రోజే షేక్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ అల్‌-గిలానీ అనే గొప్ప సాధువు ఆవిర్భవించాడు.

No comments:

Post a Comment