Pages

Sunday, September 16, 2012

అంతఃపుర రహస్యం


ధర్మపురి రాజ్యం రాజు శివనాగసేనుడికి పట్టమహిషి మణిచంద్రిక అంటే పంచప్రాణాలు. ఎన్నో మంచి లక్షణాలున్న మణిచంద్రికకు ఒకటే బలహీనత. మనసులో ఏ రహస్యమూ దాచుకోజాలదు. వివాహమైన కొత్తలో ఆ విషయం గ్రహించిన శివనాగసేనుడు మణిచంద్రికతో, ``నమ్మకస్థురాలైన ఒక ఆంతరంగిక చెలికత్తెతో నీ రహస్యాలు చెప్పుకో. నీ మనసు తేలికవుతుంది.
 
రహస్యం బయటకు పొక్కకుండానూ ఉంటుంది,'' అని సలహా ఇచ్చాడు. అప్పుడు మణిచంద్రిక, ``అటువంటి నమ్మకస్థురాలు ఎవరో కూడా మీరే ఎంపిక చేస్తే బావుంటుంది కదా,'' అంటూ కొంతమంది చెలికత్తెల పేర్లు చెప్పింది. వారి మీద నిఘా ఏర్పాటు చేసిన శివనాగసేనుడు, మణిచంద్రిక పుట్టింటి నుంచి వచ్చిన దాసి మంజరిని ఎంపిక చేశాడు.
 
అప్పటినుంచి మహారాణి తన మనసులోని భావాలను మంజరితో పంచుకునేది. వాటిలో అంతఃపుర రహస్యాలు కూడా ఉండేవి. అయితే, మంజరి మహారాణి తనతో చెప్పిన అంతఃపుర రహస్యాలను ఏనాడూ, ఎవరి దగ్గరా వెల్లడించేది కాదు. ఆ విషయం ఎరిగిన మహారాణి, మంజరిని విలువైన కానుకలతో సత్కరించేది. తమ ఎంపికలో పొరబాటు దొర్లనందుకు మహారాజు కూడా ఎంతో సంతోషించేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి.
 
వృద్ధాప్యంలో అడుగు పెడుతూన్న మంజరికి ఒకసారి ఆరోగ్యం చెడింది. రాజవైద్యులు వైద్యం చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. హఠాత్తుగా కన్ను మూసింది. మంజరి మరణానికి మహారాణి కలత చెందింది. ఆంతరంగిక విషయాలు చర్చించడానికి మనిషి దొరక్క, ఆమె మరింత దిగులు చెందింది.

ఆ విషయం గ్రహించిన మహారాజు, ``మనసులోని మాట చెప్పుకోడానికి మరొకరు దొరికేంతవరకు నీకీ బాధ తప్పదు,'' అన్నాడు. ``అవును, వివాహమైన కొత్తలో మనసులోని మాట చెప్పుకోవడానికి, మంజరిని మీరే ఎంపిక చేశారు. అలాంటివారు మరొకరు దొరకరు,'' అని బాధపడింది మహారాణి. ``ప్రయత్నిస్తే దొరక్క పోరు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు,'' అన్నాడు మహారాజు.
 
``మంజరికి ఒక కూతురున్నది. దాన్ని దాసిగా పెట్టుకుంటే మంజరికి మేలు చేసిన దాన్నవుతాను,'' అన్నది మహారాణి. రాజు మంజరి కూతురు చంద్రిక గురించి ఆరాతీయించాడు. చంద్రిక మనిషి మంచిదే కాని, దాని నోట్లో ఏ చిన్న విషయమూ దాగదు. తనకు తెలిసిన విషయం పదిమందినీ పోగేసి చెప్పందే దానికి నిద్రపట్టదు. ఆ విషయం తెలుసుకున్న మహారాజు, మహారాణికి చెప్పేలోగా ఆమె చంద్రికను పిలిపించి, ``నిన్ను మీ అమ్మస్థానంలో దాసిగా నియమిస్తున్నాను,'' అని చెప్పి తన దగ్గర ఉండేలా ఏర్పాటు చేసుకున్నది.
 
చంద్రిక నోట్లో ఏ విషయమూ దాగదన్న నిజం రాణికి చెప్పి, ఆమె మనసు నొప్పించడం ఇష్టంలేని మహారాజు, చంద్రిక చర్యల మీద నిఘా వేయడానికి, ఒక గూఢచారిని ఏర్పాటు చేశాడు. ఒకనాటి రాత్రి మహారాజు, మహారాణితో మాటల సందర్భంలో, ``నీ ఆంతరంగిక చెలికత్తె చంద్రికతో ఇవాళ ఏం రహస్యాలు చెప్పావేమిటి?'' అని అడిగాడు. ``జయపురి రాజు మన మీద దాడికి సన్నద్ధమవుతున్న విషయం చెప్పాను.
 
నాకు తెలిసిన రహస్యం ఎవరో ఒకరికి చెప్పకుండా నేను ఉండలేనని తమకు తెలియనిది కాదు కదా,'' అన్నది మహారాణి. చంద్రిక నోరు జారితే యుద్ధం విషయం పదిమందికీ తెలిసి, ప్రజలు ముందే భయభ్రాంతులవుతారేమోనని రాజు కలవర పడ్డాడు. అయినా మహారాణి వద్ద తన కలవరపాటును కనబరచలేదు. మరునాటి ఉదయం మహారాజు, చంద్రిక విషయమై వాకబు చేయడానికి గూఢచారిని పిలిపించి, చంద్రిక ఎవరెవరిని కలిసిందో ఆరాతీశాడు.

``మహారాజా, చంద్రిక ఇంట్లోని వాళ్ళందరూ పెళ్ళికని లక్ష్మీపురం వెళ్ళారు. చంద్రిక రాత్రంతా నిద్రపట్టక సతమతమవుతూ గడిపింది. ఉదయాన్నే మొదట తన తల్లి సమాధి వద్దకూ, ఆ తరవాత అన్నపూర్ణా దేవి ఆలయానికీ వెళ్ళి చాలాసేపు ధ్యానంలో గడిపింది,'' అని చెప్పి వెళ్ళాడు గూఢచారి.
 
కొంతసేపయ్యాక అంతఃపురానికి వచ్చిన చంద్రిక మహారాణితో, ``దేవాలయానికి వెళ్ళివచ్చాను. ప్రసాదం స్వీకరించండి,'' అని ప్రసాదం అందించింది. అప్పుడే అక్కడికివస్తూ దానిని చూసిన మహారాజు, ``దేవిని ఏం కోరుకున్నావు, చంద్రికా?'' అని అడిగాడు. చంద్రిక మహారాజుకు వినయంగా నమస్కరించి, ``మహారాజా నానోట్లో ఏ విషయమూ దాగదు.
 
అది నా బలహీనత. ఇంతకు ముందు నేను ఏ విషయం ఎవరికి చెప్పినా ప్రమాదం లేదు. ఇప్పుడు నేను అంతఃపురదాసిని. అంతఃపుర రహస్యం బయటకు పొక్కితే ఎంత ప్రమాదమో, చనిపోయిన మా అమ్మ నాతో తరచూ చెప్పేది. ఒక వేళ ఆమె తరవాత నేను మహారాణి వద్ద దాసీగా చేరితే, ఎంత జాగ్రత్తగా మసలుకోవాలో నేర్పేది. అందుకే రానున్న యుద్ధం గురించి, మహారాణిగారు నా చెవిన వేసిన విషయం, బయటివారికి చెప్పుకోలేక మౌనంగా మా అమ్మ సమాధికీ, గుడిలోని దేవతకూ చెప్పుకున్నాను.
 
అంతేకాదు. యుద్ధం రాకుండా చూడమని ప్రార్థించాను,'' అని చెప్పింది. ఆ మాటలు విని మహారాజు చంద్రికను సంతోషంతో అభినందించి, తన చేతి వ్రేలికున్న ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చి, మహారాణి కేసి తిరిగి, ``దేవీ, నీ మనసులోని మాట చెప్పుకోవడానికి మంచి చెలికత్తె దొరికింది. మరేం భయం లేదు,'' అన్నాడు. ఆ తరవాత, ``మహారాజావారు నీకెందుకు ఉంగరం బహుమతిగా ఇచ్చారు?'' అని ఎందరడిగినా చంద్రిక, ``అది అంతఃపుర రహ„స్యం,'' అని చెప్పి తప్పుకునేదేగాని, అసలు విషయం మాత్రం ఎప్పుడూ బయట పెట్టలేదు.

No comments:

Post a Comment