Pages

Wednesday, September 19, 2012

నమ్మకద్రోహి

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో అయిదు వందలమంది వర్తకులు ఒక నౌకలో సముద్రం మీద పోతూ ఉండగా, నడిసముద్రంలో నౌక మునిగిపోయింది. నౌకలో ఉన్నవారిలో ఒకడు తప్ప అందరూ చేపలకు ఎర అయ్యారు. అందరూ చావగా మిగిలినవాడు కరంబియు అనే సముద్రతీర నగరాన్ని చేరుకుని తిండికోసమూ, బట్టకోసమూ ముష్టి ఎత్తసాగాడు.

అక్కడి ప్రజలు వాడి దుస్థితికి జాలిపడి సమస్తమైన వస్తువులు వాడికి ఇవ్వబోయారు. ‘‘ఇవన్నీ నాకెందుకు? నాకింత బట్టా, తిండీ చాలు!’’ అని వాడు, వారిచ్చిన వస్తువులను నిరాకరించాడు. ఇది చూసి ప్రజలు, ‘‘ఓహో, ఇతడెవడో గొప్ప విరాగి, తపస్వి!’’ అనుకుని, అతనికొక పర్ణశాల నిర్మించి, అందులోఉంటూ తపస్సు చేసుకోమన్నారు.

అతను అందులో ఉంటూ, కరంబియు మహాముని అని పేరు పెట్టుకుని, ఎంతో గౌరవ ప్రపత్తులు సంపాదించుకున్నాడు. అతని దర్శనం కోసం రాజులు కూడా రాసాగారు. ఈ విధంగా కరంబియుడి స్నేహం సంపాదించిన వారిలో పాములకు రాజైన పండరకుడూ, గరుడులకు రాజుగా జన్మించిన బోధిసత్వుడూ ఉన్నారు.

ఒకనాడు గరుడరాజు వచ్చి, కరంబియుడికి ప్రణామం చేసి, ‘‘స్వామీ, మా గరుడులకూ, పాములకూ యుద్ధం జరిగినప్పుడల్లా పాములకన్న గరుడులే ఎక్కువగా చావటం జరుగుతున్నది. మాకు పాములను ఎలా పట్టాలో తెలియటం లేదనుకుంటాను. ఇందులో ఏదో రహస్యం ఉన్నది. ఆ రహస్యం ఏమిటో మీరు పాముల నుంచి తెలుసుకుని నాకు చెప్పగలరా?’’ అని అడిగాడు.


కరంబియుడు సరేనన్నాడు. గరుడరాజు వెళ్ళిపోయాడు. తరవాత సర్పరాజు తనను చూడటానికి వచ్చినప్పుడు కరంబియుడు ఆయనతో, ‘‘రాజా, గరుడులు మిమ్మల్ని పట్టుకోగానే చచ్చిపోతాయట. దీనికేమిటి కారణం? ఎలా పట్టుకుంటే మీ సర్పాలు లొంగిపోతాయి?’’ అని అడిగాడు.

దీనికి సర్పరాజు వినయంగా జవాబిస్తూ, ‘‘స్వామీ, అది మా రహస్యం. నేను గనక ఈ రహస్యాన్ని బయటపెట్టానో నా జాతి కంతకూ ద్రోహం చేసినవాణ్ణి అవుతాను. జాతి వినాశనానికి కారకుడనవుతాను! కనుక ఆ సంగతి నన్నడగకండి,’’ అన్నాడు.

‘‘అదేమిటి? రహస్యాన్ని మరొకరికి చెప్పేస్తానని నువ్వు శంకిస్తున్నావా? అలా ఎన్నటికీ జరగదు. నేను కేవలం ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామనే అడుగుతున్నాను. నాకు చెప్పినందువల్ల నీ జాతికేమాత్రమూ నష్టం కలగదు,’’ అని కరంబియుడన్నాడు.

సర్పరాజు కరంబియుడికి రహస్యం చెబుతానని మాట ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు. ఆయన తన దర్శనం కోసం మర్నాడు వచ్చినప్పుడు కరంబియుడు మళ్ళీ అడిగాడు. కాని సర్పరాజు రహస్యం బయట పెట్టలేదు. ఆయన మూడవసారి వచ్చినప్పుడు కరంబియుడు, ‘‘ఇవాళ మూడవసారి అడుగుతున్నాను. మీ రహస్యం చెప్పవు. కారణమేమిటి?’’ అని అడిగాడు.

దానికి సర్పరాజు, ‘‘స్వామీ, తమరు ఈ రహస్యాన్ని మరెవరికైనా చెప్పేస్తారేమోనని నాకు భయంగా ఉంది!’’ అన్నాడు.

‘‘నేనలా ఎన్నటికీ చెప్పను. చెప్పనని ప్రమాణం చేస్తున్నాను!’’ అని కరంబియుడు అన్న మీదట సర్పరాజు తమ రహస్యాన్ని ఈ విధంగా బయటపెట్టాడు:

‘‘మేము పెద్దపెద్ద రాళ్ళను మింగి మా శరీరాలను బరువుగా చేసుకుని పడుకుని వుంటాము. గరుడులు మా మీదికి వచ్చినప్పుడు మేము నోళ్ళు తెరుచుకుని వారిమీద కలియబడతాము. గరుడులు మా తలలను పట్టుకుని గాలిలోకి ఎగురుతారు. మా బరువులు మోయటంచేత వారి శరీరాలలో వుండే నీరంతా పైకి వచ్చేస్తుంది. ఆ కారణంగా చచ్చిపోతారు. మూఢులైన ఆ గరుడులు మా తలలు పట్టుకోవటానికి బదులు మా తోకలు పట్టుకుని గాలిలోకి లేచినట్టయితే మేము మింగిన రాళ్ళన్నీ కింద పడిపోతాయి. మా శరీరాలు తేలిక అవుతాయి. మమ్మల్ని వారు తన్నుకుపోగలుగుతారు. ఇదే మా రహస్యం!’’


సర్పరాజు వెళ్ళిపోగానే గరుడరాజు వచ్చి కరంబియుడితో, ‘‘స్వామీ, సర్పరాజు నుంచి పాముల రహస్యం తెలుసుకున్నారా?’’ అన్నాడు. కరంబియుడు సర్పరాజు నుంచి తాను తెలుసుకున్న రహస్యం కాస్తా గరుడరాజుకు చెప్పేశాడు.

‘‘ఈ సర్పరాజు గొప్ప అపచారం చేశాడు. తన జాతి యావత్తూ నాశనం అయ్యేటందుకు సహాయపడగల రహస్యాన్ని ఆయన మరొకరికి తెలియనిచ్చి వుండగూడదు. నేనిప్పుడే వెళ్ళి ఆయనను పట్టుకుంటాను,’’ అంటూ గరుడరాజు తన రెక్కలతో ఝంఝామారుతాన్ని లేపి, సర్పరాజు తోకను పట్టుకుని ఆకాశం లోకి ఎగిరాడు.

తలకిందుగా వేలాడుతున్న సర్పరాజు తాను మింగిన రాళ్ళనన్నిటినీ కక్కేస్తూ విచారంతో, ‘‘అయ్యో, నా నాశనాన్ని నేను కోరి చేతులారా తెచ్చుకున్నాను గదా! ఆ దుర్మార్గుడు మహాముని అని మోసపోయి, నా రహస్యం కాస్తా చెప్పేశాను,’’ అని విలపించాడు.

ఇది విని గరుడరాజు, ‘‘మూర్ఖుడా, నీ రహస్యం ఆ దొంగసన్యాసికి చెప్పేసి ఇంకా ఎందుకు దుఃఖిస్తావు? చావు ఎవరికీ తప్పదు, కాని వివేకం మానవుడి ప్రధాన ధర్మం. నీ దుర్గతికి కారణం నేనూ కాదు, సన్యాసీ కాడు, నీ అవివేకమే. ప్రాణికి తల్లిదండ్రులకన్న ప్రేమపాత్రులుండరు; అలాటి తల్లిదండ్రులకు కూడా నీ రహస్యం  చెప్పరాదు. అనేకమంది బంధువులూ, మిత్రులూ వుంటారు. రూపవతి అయిన భార్య వుంటుంది; వారికెవ్వరికీ నీ రహస్యం  తెలియనివ్వరాదు. ఆ విధంగా రహస్యం దాచగలిగిన వాడే శత్రువును దూరంగా ఉంచగలుగుతాడు!’’ అన్నాడు.

‘‘మహాత్మా, నీ హితబోధ గ్రహించాను. తల్లి తన బిడ్డపైన ఎలాటి కరుణ చూపుతుందో నాపైన అలాటి కరుణ చూపు!’’ అని సర్పరాజు గరుడరాజును ప్రార్థించాడు.

‘‘కొడుకులలో మూడు రకాలు: శిష్యులూ, పెంచినవారూ, గర్భవాసాన పుట్టినవారూ. అందులో నువ్వు నాకు శిష్యుడవు, కనుక కొడుకువయ్యావు. అందుచేత నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను!’’ అంటూ గరుడరాజు సర్పరాజును నేలమీదికి దించి వదలిపెట్టాడు.


సర్పరాజు నాగలోకానికి వెళ్ళాడు. గరుడరాజు తన లోకానికి వెళ్ళి గరుడులతో, ‘‘సర్పరాజైన పండరకుణ్ణి మిత్రుడుగా చేసుకున్నాను. కాని అతనికి నా పట్ల ఎలాటి భావం ఉన్నదో పరీక్షించవలసి వున్నది,’’ అని చెప్పి, నాగలోకానికి వెళ్ళి తన రెక్కలతో మళ్ళీ ఝంఝామారుతం లేపాడు. వెంటనే సర్పరాజు రాళ్ళూ, ఇసుకా మింగి, తోక కనపడకుండా చుట్ట చుట్టుకుని నేలపై పడుకుని, నోరు తెరిచి బుసకొట్టసాగాడు.

అప్పుడు గరుడరాజు, ‘‘ఇదేమి, సర్పరాజా? మనం సంధీ, స్నేహమూ చేసుకొంటిమిగదా, మళ్ళీ నన్ను చంపటానికి సిద్ధపడుతున్నావేమిటి?’’ అని అడిగాడు.
దానికి సర్పరాజు, ‘‘మిత్రమా, వివేకి అయినవాడు ఎవరినీ నమ్మరాదు! అందులో, నిన్నటివరకూ శత్రువుగా ఉండిన నిన్ను ఎలా నమ్మను?’’ అన్నాడు.

గరుడరాజు నవ్వి, ‘‘నా పాఠం నాకు బాగానే వప్పగించావు! పద, ఆ దొంగ సన్యాసిని చూసివస్తాం!’’ అన్నాడు.

ఇద్దరూ కలిసి కరంబియుడి పర్ణశాలకు వెళ్ళారు. సర్పరాజు కరంబియుణ్ణి చూసి, ‘‘నిన్ను చూసి గొప్ప మునివనుకుని నా రహస్యం చెబితే, దాన్ని గరుడరాజుకు చెప్పి ఎందుకు నమ్మక ద్రోహం చేశావు?’’ అని అడిగాడు.

‘‘నేను అజ్ఞానంచేత ఆ పని చెయ్యలేదు. మీరిద్దరూ నాకు మిత్రులే అయినప్పటికీ నాకు గరుడరాజుపైన అభిమానం జాస్తి. అందుచేత నీ రహస్యం గరుడరాజుకు చెప్పేశాను!’’ అన్నాడు కరంబియుడు.

‘‘ఛీ, నీచుడా! సర్వసంగాలనూ పరిత్యజించి కూడా పక్షపాత బుద్ధి, శత్రు మిత్రభావమూ పోని నువ్వు కూడా ఒక మునివేనా? లోకాన్ని ఈ విధంగా వంచిస్తున్నందుకు నీ శిరస్సు ఏడు చెక్కలగుగాక!’’ అని సర్పరాజు కరంబియుణ్ణి శపించాడు.

మరుక్షణమే కరంబియుడి శిరస్సు ఏడు చెక్కలయింది. అతని కింద భూమి విచ్చుకున్నది. అతను తిన్నగా అవీచీ నరకానికి దిగిపోయాడు.



No comments:

Post a Comment