బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు
మగధరాజ్యంలో ఒక పేదవాడుగా జన్మించి, మగధరాజు పరివారంలో ఒకడుగా ఉంటూ
ఉండేవాడు. మగధదేశానికీ, అంగదేశానికీ మధ్యగా చంపానది ప్రవహిస్తూ ఉండేది. ఆ
నది అడుగున నాగరాజ్యం ఉండేది. చంపేయ్యుడు ఆ రాజ్యానికి రాజు.
మగధరాజ్యానికీ, అంగరాజ్యానికీ మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతూండేవి.
అలా జరిగిన ఒక యుద్ధంలో మగధరాజు ఓడిపోయూడు. ఆయన తన గుర్రం మీద ఎక్కి
పారిపోతూ చంపానది వద్దకు వచ్చి, తన శత్రువు చేతికి చిక్కి చావటంకంటె
ఆత్మహత్య చేసుకోవటం మంచిదనే ఉద్దేశంతో, తన గుర్రంతో సహా నదిలోకి ఉరికాడు.
మగధరాజుతో సహా గుర్రం నది అడుగున వున్న నాగరాజు కొలువు కూటంలో వాలింది.
నాగరాజు తన సింహాసనం నుంచి లేచి వచ్చి మగధరాజుకు ఆదరపూర్వకంగా
స్వాగతమిచ్చి, ఆయన కథ యూవత్తూ తెలుసుకున్నాడు. ‘‘జరిగినదానికి మీరు
విచారించకండి.
అంగరాజుతో జరిగే ఈ యుద్ధంలో మీకు విజయం లభించటానికి నేను
తోడ్పడగలను,'' అని నాగరాజు తన అతిథికి మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే నాగరాజు
మగధరాజుకు యుద్ధంలో సహాయపడ్డాడు. అంగరాజు మగధరాజు చేతిలో చనిపోయూడు.
మగధరాజు రెండు దేశాలకూ రాజై వైభవంగా పరిపాలించసాగాడు. అది మొదలు మగధరాజుకూ,
నాగరాజుకూ బద్ధమైత్రి ఏర్పడింది. మగధరాజు యేటా ఒక రోజున సపరివారంగా
చంపానదీతీరానికి వెళ్ళేవాడు.
ఆ రోజున నాగరాజు నది నుంచి వైభవంతో వెలువడి మగధరాజు తెచ్చిన బహుమానాలు
అందుకునేవాడు. మగధరాజు పరివారంలో ఒక భృత్యుడుగా ఉంటున్న బోధిసత్వుడు ఏటా
నాగరాజు వైభవాన్ని కళ్ళారా చూస్తూ వచ్చాడు. ఆయన చనిపోయే క్షణాన ఈ నాగరాజు
వైభవమే ఆయన మనసులో మెదిలింది. ఆ కారణంచేత ఆయన నాగరాజు చనిపోయిన ఏడవనాడు
తానే నాగరాజుగా జన్మించాడు.
కాని కిందటి జన్మలో పుణ్యాత్ముడై ఉండిన కారణం చేత ఆయనకిప్పుడు తన పాము
శరీరం చూసుకోగానే ఎంతో రోత పుట్టింది; నాగరాజు ఐశ్వర్యాన్ని
కాంక్షించినందుకు ఆయనకు పశ్చాత్తాపం కూడా కలిగింది. ఆయన ఆత్మహత్య చేసుకుని ఈ
జన్మ చాలింతామనుకుంటున్న సమయంలో సుమన అనే నాగకన్య తన చెలికత్తెలను
వెంటబెట్టుకుని వచ్చి, ఆయనకు ప్రణామం చేసింది.
సుమనను చూడగానే నాగరాజు ఆత్మహత్యా ప్రయత్నం మానేసి, ఆమెను తన భార్యను
చేసుకుని నాగలోకాన్ని పరిపాలించసాగాడు. కాని కొంత కాలానికి ఆయనకు ఉపవాసాలూ,
నిష్ఠలూ జరిపి, పుణ్యం సంపాదించుకోవాలనే కోరిక కలిగింది. ఇందుకుగాను ఆయన
తన లోకాన్ని విడిచి మానవలోకంలోకి వెళ్ళ నిశ్చయించాడు.
ఉపవాస దినాలు వచ్చినప్పుడాయన తన భవనం వెలువడి, ఒక రహదారి పక్కన ఉండే
చీమలపుట్ట మీద చుట్టచుట్టుకు పడుకుని, ‘‘నన్ను ఏ గరుడపక్షి అయినా తన్నుకు
పోనీ! ఏ పాములవాడైనా పట్టుకుపోనీ!'' అనుకునేవాడు. కానీ ఆయన అనుకున్నట్టు
జరగలేదు. రహదారి వెంట వెళ్ళే మనుషులు పుట్ట మీద చుట్టుకుని ఉన్న పామును
చూసి దేవతగా భావించి, పూలతో, పూజించసాగారు.
మరి కొందరు ఆ నాగరాజుండే పుట్టవద్ద ఒక ఆలయం కట్టారు. ప్రతిరోజూ
అక్కడికి రకరకాల ప్రజలు వచ్చి పిల్లలు కావాలనీ, తమ శరీర వ్యాధులు నయం
కావాలనీ, తమ కోరికలు తీరాలనీ మొక్కుకోసాగారు. నాగరాజు ఉపవాసదినాలన్నీ ఈ
విధంగా పుట్ట మీద గడిపి ప్రతి మాసమూ కృష్ణపాడ్యమి నాడు ఇంటికి తిరిగిపోతూ
ఉండేవాడు.
ఒకనాడు సుమన ఆయనకు, ‘‘స్వామీ, మీరు తరుచూ మానవలోకంలోకి వెళుతు న్నారు.
ఆ లోకం అపాయకరమైనది, భయంకరమైనది. మీకేదైనా ప్రమాదం జరిగే పక్షాన నాకా
సంగతి తెలిసేదెలా?'' అని అన్నది. నాగరాజు సుమనను ఒక కొలను వద్దకు
తీసుకుపోయి, ‘‘ఈ నీరు చూడు! నాకేదైనా దెబ్బ తగిలితే ఈ నీరు మురికి
అవుతుంది. నన్నేదైనా గరుడపక్షి తన్నుకు పోతే ఈ నీరు ఇగిరిపోతుంది.
అలా కాక, ఏ మంత్రగాడైనా నన్ను పట్టుకున్న పక్షంలో ఈ నీరు రక్తవర్ణంగా
మారుతుంది,'' అని ఆమెతో చెప్పాడు. కాశీనగరవాసి అయిన ఒక బ్రాహ్మణ యువకుడు
తక్షశిలకు వెళ్ళి అక్కడ వశీకరణవిద్య నేర్చుకుని, తన దేశానికి తిరిగిపోతూ
నాగరాజు పడుకునే చోటికి రహదారి వెంబడి వచ్చాడు. పుట్టపైన చుట్టుకుని
పడుకుని ఉన్న నాగరాజు అతని కంట పడ్డాడు. వెంటనే ఈ యువకుడు పామును మంత్రంతో
బంధించి పట్టుకుని, ఒక బుట్టలో పెట్టి, ఒక గ్రామానికి తీసుకుపోయి, అక్కడ ఆ
పామును ఆడించాడు.
ఇది చూడవచ్చిన గ్రామస్థులు పాములాటకు చాలా సంతోషించి బ్రాహ్మణ
యువకుడికి డబ్బూ, ఇతర విలువైన బహుమానాలూ ఇచ్చారు. ‘‘ఈ కుగ్రామంలోనే ఇంత
డబ్బు వస్తే ఇంక పట్టణాలలో పాము నాడిస్తే ఇంకా ఎంత వస్తుందో!'' అని
బ్రాహ్మణ యువకుడికి ఆశ కలిగింది. అతను పామును వెంటతీసుకుని కాశీ నగరానికి
బయలుదేరి, బండి మీద ప్రయూణం చేస్తూ, ఒక మాసానికల్లా కాశీ నగరాన్ని
చేరుకున్నాడు. ఈ నెల రోజులపాటూ నాగరాజు ఉపవాసాలు చేశాడేగాని, ఆహారంగా
బ్రాహ్మణ యువకుడిచ్చిన కప్పలను తాకనేలేదు.
‘‘నేను ఆహారం తిన్నంతకాలమూ నాకీ బుట్టలో మంత్రశక్తులున్న ఈ యువకుడి
వల్ల ఖైదు తప్పదు!'' అని ఆయన తెలుసుకున్నాడు. బ్రాహ్మణ యువకుడు నాగరాజును
కాశీనగర సమీపాన గల అనేక గ్రామాలలో ఆడించి అక్కడి ప్రజలనుంచి అంతులేని డబ్బు
సంపాదించాడు. ఈ పాములాట వినోదం గురించి త్వరలోనే కాశీరాజుకు
తెలియవచ్చింది. ఆయన బ్రాహ్మణయువకుణ్ణి పిలిపించి తన వినోదం కొరకు పాములాట
ఏర్పాటు చేయించాడు.
ఈలోపల నాగలోకంలో సుమన, నెల రోజులుగా తన భర్త ఇంటికి రాకపోవటం గమనించి
ఏదో జరిగివుంటుందని భయపడి, నిజం తెలుసుకునేటందుకు కొలను వద్దకు వెళ్ళింది.
కొలనులో నీరు ఎరగ్రా, రక్తం రంగులో ఉన్నది. ఎవడో పాములవాడు తన భర్తను
పట్టుకున్నట్టు సుమన తెలుసుకున్నది. ఆమె తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరి,
దారిలో విచారిస్తూ, త్వరలోనే కాశీనగరం చేరుకున్నది.
ఆమె అక్కడికి చేరేసరికి, పాములాట జరుగుతున్నది. రాజుగారూ, అనేకమంది
ప్రజలూ చేరి వినోదం చూస్తున్నారు. తన భార్యను చూడగానే నాగరాజు సిగ్గుపడి,
ఆట మాని, చప్పున బుట్టలోకి వెళ్ళిపోయూడు. సుమన మానవస్ర్తీ రూపం ధరించి
రాజును సమీపించి, చేతులు జోడించి, ‘‘మహారాజా, నాకు పతిభిక్ష పెట్టండి!''
అని వేడుకున్నది. ఇంతలోనే పాము కూడా బుట్టలో నుంచి బయటికి పాకివచ్చి, అందరూ
చూస్తూండగానే, ఒక ఆకర్షణీయమైన యువకుడి ఆకారం ధరించింది.
కాశీరాజు ఆ నాగదంపతులను చూసి ఎంతో ముచ్చటపడి, వారిని వారం రోజుల పాటు
తన అతిథులుగా ఉంచుకుని, అటు తరవాత వారి వెంట తాను కూడా సపరివారంగా ప్రయూణమై
నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకంలోని ఐశ్వర్యమూ, అందమూ, వైభవమూ చూసి
కాశీరాజుకు చెప్పతరంకాని ఆశ్చర్యం కలిగింది. ‘‘ఇంత వైభవంలో ఓలలాడుతూ మీరు
పాము రూపంలో చీమల పుట్టపై చుట్టచుట్టుకుని పడుకోవటానికి కారణమేమిటి?'' అని
కాశీరాజు నాగరాజును అడిగాడు.
‘‘రాజా, ఇక్కడ ఎంత వైభవం ఉన్నప్పటికీ, జన్మరాహిత్యం పొందే సౌకర్యం మీ
మానవ లోకంలో మాత్రమే ఉన్నది!'' అని నాగరాజు ఆయనకు సమాధానం చెప్పాడు.
కాశీరాజు ఈ మాట విని పరమానందం చెందాడు. ఆయన తన రాజ్యానికి తిరిగి
వెళ్ళేటప్పుడు నాగరాజు ఆయనకు అంతులేని బహుమానాలిచ్చి పంపాడు.
No comments:
Post a Comment