Pages

Wednesday, September 19, 2012

దురాచారం

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి కుమారుడుగా జన్మించాడు. అతనికి బ్రహ్మదత్త కుమారుడని నామకరణం చేశారు. అతను తక్షశిలకు వెళ్ళి పదహారేళ్ళు నిండే లోపునే వేదాలూ, వేదాంగాలూ, ఉపనిషత్తులూ చదివాడు. అతను విద్య పూర్తిచేసుకుని తిరిగి రాగానే తండ్రి అతనికి యౌవరాజ్యాభిషేకం చేశాడు.

ఆ కాలంలో కాశీరాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు. అనేక జాతరలు చేసేవారు. జాతరలు జరిగినప్పుడల్లా గొర్రెలనూ, మేకలనూ, కోళ్ళనూ దేవతలకు బలి ఇచ్చి, వాటి రక్తం నైవేద్యం పెట్టేవారు. బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలనూ, దురాచారాలనూ చూసి చాలా బాధపడే వాడు. ‘‘నేను రాజునయ్యాక ఈ దురాచారాల నన్నిటినీ అరికడతాను. నేల మీద ఒక్క చుక్క రక్తం రాల్చకుండా చేస్తాను,’’ అని అనుకునేవాడు.

కాశీనగరం వెలుపల ఒక మర్రిచెట్టుండేది. ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదనీ, మొక్కుకున్నవాళ్ళకు ఆ దేవత పిల్లల నిస్తుందనీ, ఇతర కోరికలేవైనా ఉంటే ఈడేర్చుతుందనీ ప్రజలు నమ్మేవాళ్ళు. ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథ మెక్కి ఊరి వెలుపల ఉన్న మర్రిచెట్టు వద్దకు వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూరా అనేకమంది స్ర్తీలూ, పురుషులూ భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నారు. చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి, చెట్టును పూలతో పూజించి, చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు. ఆ తరవాత అతను తన రథమెక్కి నగరంలోకి తిరిగి వెళ్ళిపోయాడు.

అది మొదలు అతను తరుచూ ఆ మర్రిచెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు చేమలపై, క్షుద్రదేవతలపై విశ్వాసం ఉండే మామూలు మనుషుల లాగే చెట్టును పూజిస్తూ, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాసాగాడు. కొంతకాలం ఇలా గడిచాక ముసలి రాజు చనిపోయాడు. బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు. రాజ్యాభిషేకం అయిన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు: ‘‘నేను రాజు నెలా అయ్యానో మీరెవరూ ఎరగరు.

కాని, యువరాజుగా ఉన్న కాలంలో నేను ఊరి బయట ఉండే మర్రి చెట్టును భక్తిశ్రద్ధలతో పూజించి వస్తూ ఉండిన సంగతి మీరెరిగే ఉంటారు. నన్ను రాజును చేసినట్టయితే ఆ మర్రిచెట్టుకు వెయ్యి జీవాలను బలి ఇస్తానని మొక్కుకున్నాను. ఈనాటికి నా కోరిక ఈడేరింది. అన్న మాట ప్రకారం మొక్కు చెల్లించాలి. మర్రిచెట్టుకు తప్పకుండా బలి జరగాలి!’’
ఈ సంగతి వినగానే సభికులంతా పరమానంద భరితులయ్యారు. మంత్రులు, ‘‘మహారాజా, తాము మర్రిచెట్టుకు ఏ జంతువులను బలి ఇస్తామనుకున్నారో సెలవిప్పించండి. వెంటనే అన్ని ఏర్పాట్లూ చేయిస్తాం,’’ అన్నారు.

‘‘నేను బలి ఇస్తానని మొక్కుకున్నది జంతువులను కాదు-దేవతలకు జంతువులను బలి ఇచ్చే మనుషులను. అటువంటివారిని వెయ్యిమందిని తీసుకురండి. నా మొక్కు చెల్లించుకుంటాను. ఈరోజు లగాయతు ఎవరెవరైతే దేవతలకు బలులిస్తారో, వారు మర్రిచెట్టుకు బలి చేయబడతారని దేశమంతటా చాటింపు చేయించండి!,’’ అన్నాడు రాజు.
సభికులు నిర్విణ్ణులైపోయారు. కాని వారు బలులలో నమ్మకం ఉన్నవారే గనక, ఏమీ అనలేకపోయారు. దేశమంతటా చాటింపు జరిగింది. అది మొదలు ఇంద్రజాలం లాగా కాశీరాజ్యంలో జంతుబలులు మటుమాయమయ్యాయి.

No comments:

Post a Comment