కళింగ రాజ్యంలో అనేకమైన గొప్ప నగరాలుండేవి. వాటిలో దాంతిపురమనే
నగరానికి ప్రభువు కళింగు. అతనికి పెద్ద కళింగు, చిన్న కళింగు అని ఇద్దరు
కొడుకులు. వీరి జాతకాలు పరిశీలించిన దైవజ్ఞులు ఇలా చెప్పారు:
తండ్రి తదనంతరం పెద్దవాడే రాజ్యానికి వస్తాడు. చిన్నవాడిది మాత్రం
చిత్రమైన జాతకం. అతని జీవితమంతా సన్యాసి యోగమే. కాని, మహారాజయోగం గల
అదృష్టవంతుడు కుమారుడుగా పుడతాడు!
కొద్ది కాలానికి రాజు కళింగు కాలం చేశాడు. జ్యేష్ఠుడు సింహాసన
మధిష్ఠించాడు. చిన్నవాడికి రాజప్రతినిధి పదవి వచ్చింది. తనకు కలగబోయే
కుమారుడు మహారాజు కాబోతాడని జ్యోతిష్కులు చెప్పిన మాట చిన్న కళింగుకు బాగా
మనసుకు పట్టింది. ఈ ధీమాతో అతడు అన్నకు లొంగి వుండక స్వతంత్రుడుగా
వ్యవహరింప సాగాడు. ఉభయుల మధ్యా కలతలు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్ళకు రాజు
చిన్నవాణ్ణి బంధించమని ఆజ్ఞాపించాడు.
అదే కాలమందు బోధిసత్వుడు అవతరించి, కళింగరాజ్య మంత్రులలో ఒకడుగా ఉంటూ
వచ్చాడు. పెద్ద కళింగుతరం నాటికి అతడు బాగా వృద్ధుడయ్యాడు. కుటుంబ క్షేమం
కోరిన ఆ వృద్ధమంత్రి చిన్నకళింగు వద్దకు వచ్చి, రహస్యంగా రాజాజ్ఞను
వెల్లడించాడు. రానున్న అవమానాన్ని తలపోశాడు చిన్నవాడు.
‘‘తాతా! అన్నివిధాలా నాకు నీవే హితుడవు. ఆనాడు జ్యోతిష్కులు చెప్పిన
మాటలు నీకు తెలుసుకదా! అవి ఫలించడమే నిజమైతే నా కోరిక నెరవేర్చవలసిన బాధ్యత
నీపై వున్నది. ఇదిగో, నా పేరుగల ఉంగరం, నా శాలువా, నా ఖడ్గం, ఈ మూడూ
ఎవడైతే నీ వద్దకు తెచ్చి ఆనవాలు చూపిస్తాడో, వాడే నా కొడుకని గుర్తుంచుకో.
నీ చేతనైన సహాయం కూడా చెయ్యి,'' అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రెండవ
కంటికి తెలియకుండా అరణ్యాల్లోకి పారిపోయాడు.
ఆ రోజుల్లో మగధరాజుకు లేకలేక ఒక కుమార్తె కలిగింది. ఈమె జాతకం చూసిన
జ్యోతిష్కులు, ‘‘ఇది ఒక చిత్రమైన జాతకం. రాజకుమారి జీవితం ఒక సన్యాసినిగా
గడుపుతుంది. ఐతే, ఆమెకు మహారాజయోగంగల కుమారుడు పుడతాడు,'' అని చెప్పారు.
ఈ సంగతి తెలియగానే సామంతరాజులందరూ రాజకుమారిని పెళ్ళాడాలని వచ్చి
పోటీలు పడసాగారు. రాజుకు గట్టి చిక్కే వచ్చింది. వీరిలో తన కూతుర్ని ఏ
ఒకరికి ఇచ్చినా తక్కినవారు కక్షగట్టి పగ తీర్చుకోవడం సహజం. కనుక, ఈ అపాయం
నుంచి తప్పించుకోడానికి నిశ్చయించాడు. గత్యంతరం లేక భార్యనూ, కూతుర్నీ
వెంటబెట్టుకుని మారువేషంతో అరణ్యాల్లోకి పలాయనమయ్యాడు.
నదీతీరాన సదుపాయమైన స్థలంలో ఒక చిన్న కుటీరం నిర్మించుకుని అందులో
ముగ్గురూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. వీరి కుటీరానికి కొంచెం ఎగువనే
కళింగరాజపుత్రుని కుటీరం ఉన్నది.
ఒక రోజున, కుమార్తెను కుటీరంలో వదలి, మగధ రాజదంపతులు కందమూల
ఫలాదులకోసం వెళ్ళారు. ఆ సమయంలో రాజపుత్రి రకరకాల పువ్వులు పోగుచేసి ఒక
చక్కని దండ కట్టింది. కుటీరం పక్కనే గంగ ఒడ్డున ఒక గున్న మామిడిచెట్టు
వుంది. మగధ రాజపుత్రి ఆ చెట్టెక్కి కొమ్మల్లో కూర్చుని తను కట్టిన పువ్వుల
దండను అక్కడి నుండి నీటిలో పడవేసి, వేడుక చూస్తున్నది.
ఆ పువ్వులదండ తేలి ఆడుతూ పోయి పోయి, స్నానం చేస్తున్న చిన్న కళింగు
తలకు తాకింది. వెంటనే అతడు దానిని తీసి చూసి, ‘‘ఎంత చక్కటి పూలదండ! ఎన్ని
రకాల పువ్వులు! దీనిని ఇంత ఇంపుగా సొంపుగా కూర్చినామె అపురూపమైన అందకత్తె
అయివుంటుంది. ఈ మహారణ్యంలో ఇటువంటి సుందరికి పనియేమిటో?'' అని ఆలోచించాడు.
దండ కట్టిన సుందరిని వెతకాలని అతని మనసు ఉరకలు వేయసాగింది.
ఈ సంకల్పంతో కళింగు అరణ్యమార్గాన వెళుతూవుండగా, ఒక దిక్కు నుండి
వీనులవిందు చేసే తీయని కంఠస్వరం వినవచ్చింది. అట్టె నిలబడి అటు ఇటు చూడగా,
మామిడిచెట్టు కొమ్మల్లో కూర్చొని పాడుతున్న సుందరి అతడికి కనిపించింది. ఆ
యువతిని చూసి, కళింగు పరవశుడై ఆమెతో కుశల ప్రశ్నలు ప్రారంభించాడు.
చివరకు, ఆమెను తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం వెల్లడించాడు. అందుకామె, ‘‘మీరు ఋషిసంతతికి చెందిన వారు, మేము క్షత్రియులం!'' అన్నది.
వెంటనే కళింగు, ‘‘నేనూ క్షత్రియుణ్ణే,'' అంటూ తన గుట్టుమట్టులన్నీ
విప్పి చెప్పాడు. అప్పుడు రాజకుమారి తమ పరిస్థితులు కూడా దాపరికం లేకుండా
చెప్పివేసింది.
ఇద్దరూ కలిసి ఆమె తండ్రివద్దకు వెళ్ళగానే, సంగతి సందర్భాలు తెలుసుకుని, ‘‘ఇతడే అమ్మాయికి తగిన వరుడు,'' అని మగధరాజు నిశ్చయించాడు.
చిన్న కళింగుకూ, మగధ రాజకుమారికీ వివాహం జరిగింది. కొద్ది కాలానికే
వారికి ఒక కుమారుడు కలిగాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ బిడ్డడికి,
విజయకళింగు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
కొన్నాళ్ళు గడిచిన తరవాత ఒక రోజున, చిన్న కళింగు జాతకాలు తీసి,
లెక్కవేసి గ్రహకూటాలు ఎలా వున్నదీ చూశాడు. అప్పటికి తన అన్న ఐన పెద్ద
కళింగు ఆయువు మూడి వుంటుందని లెక్కలవల్ల తేలింది.
అప్పుడు కళింగు కొడుకును చేర బిలిచి, ‘‘కుమారా! నీవు జీవితం గడప
వలసింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగు దాంతిపుర ప్రభువు. ఆ
రాజ్యానికి వారసుడవు నీవే! కనుక, వెంటనే వెళ్ళి ఆ సింహాసనం అధిష్ఠించు,''
అని చెప్పి, వృద్ధమంత్రిని గురించి చెప్పి, మూడు వస్తువులూ ఆనవాలిచ్చి
దీవించి పంపాడు.
తల్లిదండ్రుల వద్దా, తాతా అమ్మమ్మల వద్దా సెలవు తీసుకున్న విజయకళింగు
దాంతిపురం చేరుకుని, వృద్ధమంత్రిని దర్శించి, తాను ఫలానా అని చెప్పాడు.
అప్పటికి, చిన్న కళింగు అంచనా ప్రకారమే అతని అన్న కాలం చేశాడు; దాంతిపురం అరాచకస్థితిలో వున్నది.
ఒక మహాసభ ఏర్పాటు చేసి, వృద్ధమంత్రి చిన్నవాడైన విజయకళింగు
పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించేసరికి, సభికులందరూ ఆశ్చర్యభరితులై జేజేలు
పలికారు.
వృద్ధమంత్రి అయిన బోధిసత్వుడి సలహాలు పాటిస్తూ, విజయకళింగు చక్కగా రాజ్యం పరిపాలించి, పెద్దల పేరు నిలబెట్టాడు.
No comments:
Post a Comment