బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, కాశీనగరానికి కొంత
దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది. అందులో అయిదు వందలమంది
వడ్రంగులుండేవారు. సామాన్య ప్రజలకు అవసరమైన వస్తుసామగ్రిని తయూరు చేయడంలో
వాళ్ళు మంచి నేర్పరులు. వాటితోపాటు కలపతో పిల్లలు ఆడుకునే రకరకాల
ఆటవస్తువులూ, అలంకార వస్తువులూ ఎంతో నాణ్యంగా తయూరు చేసేవారు. వారు చిన్న
చిన్న పడవలలో బయలుదేరి, దాపులనున్న అరణ్యానికి వెళ్ళి, అక్కడ చెట్లు
పడగొట్టి, కలప కోసి, పడవలలో తెచ్చుకుంటూ వుండేవారు.
ఆ కలప ఖర్చయిపోగానే తెచ్చుకోవడానికి మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి
వెళుతూ వుండేవారు. ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు వుంటూండేది. ఒకనాడు అది
దాపులనున్న కొలనులో నీళ్ళుతాగి తిరిగి వస్తూండగా దాని కాలిలో పెద్ద పేడు
దిగబడింది. దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్ట నారంభించింది. అది
ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయటం సాధ్యం కాలేదు. ఇలా అది కొన్ని రోజులు
చెప్పరానంత బాధ అనుభవించింది. ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే
చప్పుడూ, కలప కోసే చప్పుడూ వినిపించింది. అది కుంటుతూ వారున్న చోటికి
వెళ్ళింది.
ఏనుగును చూడగానే దానికేదో బాధ కలిగిందని గ్రహించి, వడ్రంగులు తాము
చేసే పని కట్టిపెట్టారు. ఏనుగు వారి ముందు పడుకున్నది. దాని కాలు వాచి
ఉండటం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకుని, వడ్రంగులు తమ ఉలులతో
ఉపాయంగా పేడును బయటికి లాగి, అక్కడ లభించే ఆకుల పసరు పూసి గాయూనికి
చికిత్సచేశారు. త్వరలోనే ఏనుగు కాలు బాగయింది. అది మొదలు ఆ ఏనుగు
వడ్రంగులకు ఎంతో కృతజ్ఞతతో సాయపడ సాగింది.
అది పడిపోయిన చెట్లను తీసుకువచ్చేది, దుంగలను దొర్లించేది, కోసిన
పలకలను నదిలో పడవల వద్దకు చేరవేసేది. ఆ యేటి కాయేడు వడ్రంగులకూ ఏనుగుకూ
మధ్య స్నేహం పెరిగింది. అయిదు వందలమంది వడ్రంగులూ తమ ఆహారంలో తలాకాస్తా
తీసి ఏనుగుకు పెట్టేవాళ్ళు.
కాలక్రమాన ఈ అడవి ఏనుగుకు ఒక పిల్ల కలిగింది. అది ఐరావతం జాతిది,
తెల్లగా ఉండేది. ఆడ ఏనుగు ముసలిదై పోయూక, అది తన పిల్లను తెచ్చి వడ్రంగులకు
అప్పగించి, తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడీ తెల్ల ఏనుగు
వడ్రంగులకు తోడ్పడుతూ, వారిచ్చే ఆహారాన్ని తింటూ, వారి పిల్లలను తన వీపు
మీద ఎక్కించుకుని తిప్పుతూ, నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం వెళ్ళ
బుచ్చుతున్నది. వడ్రంగులు ఆ ఏనుగు పిల్లను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు.
అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి, దాన్ని ఎలాగైనా పట్టుకుందామని
బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు. వడ్రంగులు రాజును చూసి, ఆయన
కలపకోసం వచ్చాడనుకుని, ‘‘మహారాజా, శ్రమపడి తామే వచ్చారెందుకు? కలప
కావలిస్తే మేము తెచ్చి ఇవ్వకపోయూమా?'' అన్నారు చేతులు జోడిస్తూ.
‘‘నేను కలపకోసం రాలేదు. ఈ తెల్ల ఏనుగుకోసం వచ్చాను,'' అన్నాడు రాజు.
‘‘అయితే తీసుకు వెళ్ళండి!'' అన్నారు వడ్రంగులు వినయంగా. వారి సంభాషణ విన్న
ఏనుగుపిల్లకు విచారం కలిగింది. తను రాజువెంట వెళితే, వడ్రంగుల పిల్లలను
ఆడిస్తూ, సాయపడే వారెవరు? అందువల్ల అది ఎంతకీ అక్కడ నుంచి కదలలేదు.
రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు, ‘‘మహారాజా, ఇది చాలా వివేకంగల జంతువు.
దానిని తమరు తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది. వారికి పరిహారం
ఇస్తేనేగాని అది కదలదు!'' అన్నాడు. రాజు ఏనుగు నాలుగు కాళ్ళదగ్గిరా, తొండం
దగ్గిరా, తోకదగ్గిరా ఒక్కొక్క లక్ష వరహాలు చొప్పున పెట్టి, వడ్రంగులను
తీసుకోమన్నాడు. అప్పటికీ ఏనుగు అక్కడి నుంచి కదలలేదు.
వడ్రంగుల భార్యలకూ, పిల్లలకూ బట్టలు పెట్టినాక అది కదిలి రాజు వెంట
నగరానికి వెళ్ళిపోయింది. ఏనుగును చక్కగా అలంకరించి మేళ తాళాలతో నగరం లోకి
తీసుకుపోయూరు. వీధులన్నీ ఊరేగించారు. ప్రజలు ఆనందోత్సాహాలతో దానిని
తిలకించారు. తరవాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు. ఆహార విషయంలోనూ,
ప్రత్యేక శ్రద్ధ కనబరచ సాగారు. అది పట్టపుటేనుగు అయింది. చక్కగా
అలంకరింబడిన దాని మీద రాజుగారు తప్ప ఇంకెవరూ ఎక్కటానికి వీలులేదు.
ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యం చాలా విస్తరించింది. సిరిసంపదలతో
తులతూగసాగింది. రాజ్య ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లారు. దాని ప్రభావం వల్ల
ఎంతటి బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయూరు. కొంత కాలానికి రాజు
భార్య గర్భవతి అయింది. ఆమె కడుపున బోధిసత్వుడు ప్రవేశించాడు. ఇంకొక
వారానికి రాణి ప్రసవిస్తుందనగా రాజు చనిపోయూడు. ఇదే మంచి సమయమనుకుని కోసల
దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు.
ఏం చెయ్యూలో మంత్రులకు పాలుబోలేదు. వారు చాలా సేపు తమలో తాము
చర్చించుకుని, చివరకు కోసలరాజుకు ఈ విధంగా కబురు పంపారు: ‘‘మా రాణీగారు ఒక
వారం లోపల ప్రసవిస్తుంది, ఆమె ఆడపిల్లను కన్నట్లయితే మీరు వచ్చి
కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి. మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో
యుద్ధం చేస్తాం!''
కోసలరాజు ఈ కబురు అందుకుని, వారం రోజులు గడువిచ్చాడు. వారం గడవగానే
మహారాణి బోధిసత్వుణ్ణి ప్రసవించింది. కాశీ సేనలు కోసల సేనలతో యుద్ధానికి
తలపడ్డాయి. కాని యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది. అప్పుడు
మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి, ‘‘అమ్మా, మన పట్టపు ఏనుగు యుద్ధరంగంలో
ప్రవేశిస్తేనే గాని మనకు విజయం చేకూరదు. కాని మహారాజు మరణించినది మొదలు
ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగివున్నది,'' అని విన్నవించారు.
ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీదనుంచి లేచింది. తన కుమారుడికి
రాజోచితమైన దుస్తులు తొడిగింది. ఆమె తన కుమారుణ్ణి ఏనుగుకాళ్ళ ముందు
పెట్టి నమస్కారం చేసి, ‘‘గజరాజా, నీ యజమాని పోయినందుకు విచారించవద్దు,
ఇదిగో నీ నూతన యజమాని! వీడి శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు. నీవు
ఇప్పుడే వెళ్ళి వారిని ఓడించు; లేదా నీ కాళ్ళకింద ఈ శిశువును తొక్కి
చంపెయ్యి,'' అన్నది.
అంతవరకూ విచారంగా వున్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా
తడివింది. అతణ్ణి తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది. తరవాత
అతణ్ణి తల్లి చేతుల్లో పెట్టి యుద్ధరంగానికి కదిలిపోయింది. ఏనుగు భీకరంగా
ఘీంకరిస్తూ వాయు వేగంతో తమపైకి వచ్చి పడుతూండటం చూసి, కోసల సైనికుల గుండెలు
అవిసి పోయూయి. వారు చెల్లాచెదరుగా పారిపో సాగారు.
ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది. అతణ్ణి తొండంతో చుట్టి
తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడవేసింది. కోసలరాజు పసివాడి కాళ్ళు
అంటుకుని క్షమాపణ వేడుకున్నాడు. కాశీ మంత్రులు అతనికి ఎట్టి అపకారమూ చేయక,
అతని దుశ్చర్యను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు. బోధిసత్వుడు
ఏడేళ్ళవాడయ్యే దాకా ఏనుగు కాశీరాజ్యాన్ని కాపాడింది. తరవాత బోధిసత్వుడు
సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపుటేనుగు చేసుకుని, రాజ్యపాలన చేశాడు.
No comments:
Post a Comment