బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు సుతనుడనే
పేరు గల పేద గృహస్థుగా జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడై తన సంపాదనతో
తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చాడు. కొంత కాలానికి సుతనుడి తండ్రి చనిపోయూడు.
తల్లి మాత్రం మిగిలింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు రోజల్లా శ్రమపడినా
తనకూ, తన తల్లికీ చాలినంత సంపాదించలేక సుతనుడు చాలా ఇబ్బందిపడుతూ ఉండేవాడు.
ఆ దేశపు రాజుగారికి వేటయందు చాలా ప్రీతి. ఆయన తరుచూ అడవికి వెళ్ళి
అక్కడ అడవిజంతువులను వేటాడుతూ ఉండే వాడు. ఒకనాడు రాజుగారు ఒక లేడిని
తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి, ఎలాగైతేనేం దాన్ని బాణంతో కొట్టాడు. లేడి
బాణం దెబ్బకు చచ్చి పడిపోయింది. సమీపంలో రాజుగారి భటులెవరూ లేరు. అందుచేత
రాజే ఆ లేడిని భుజాన వేసుకుని తిరిగి రాసాగాడు.
మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతున్నది. వేట మూలంగానూ, లేడిని మోసుకు
వస్తూవుండటం వల్లనూ రాజు చాలా అలసిపోయూడు. అటువంటి స్థితిలో ఆయనకు ఒక
విశాలమైన మర్రి చెట్టు నీడ చల్లగా కనిపించింది. రాజు లేడిని నీడలో పడేసి,
విశ్రాంతి తీసుకోవటానికి తాను కూడా అక్కడే కూర్చున్నాడు. మరుక్షణమే రాజు
ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై, ‘‘నిన్ను తినేస్తాను!'' అంటూ మీదికి
రాసాగింది. ‘‘ఎవరు నువ్వు? నన్ను తినటానికి నీకేమి అధికారం ఉన్నది?'' అని
రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు.
‘‘ఈ చెట్టు నాది. దీని నీడలోకి ఎవరైతే వస్తారో, ఈ చెట్టుకింద ఉండే నేల
మీద ఎవరైతే కాలు పెడతారో వారి నెల్లా తినటానికి నాకు హక్కున్నది. నేను
బ్రహ్మరాక్షసిని,'' అన్నదా భూతం. రాజు దీర్ఘంగా ఆలోచించాడు. చివర కాయన
బ్రహ్మరాక్షసితో, ‘‘నువ్వు ఈనాడు మాత్రమే తిండితింటావా? లేక రోజూ నీకు
ఆహారం కావాలా?'' అని అడిగాడు. ‘‘నాకు రోజూ ఆహారం కావాలి,'' అన్నది
బ్రహ్మరాక్షసి.
‘‘అయితే, ఈ పూట నన్ను తినటం వల్ల నీ ఆహార సమస్య తీరదు. ఈ పూటకు ఈ
లేడిని తిని నన్ను వదిలేశావంటే, నీకు ఏ రోజూ కూడా ఆహారసమస్య లేకుండా
చేస్తాను. నేను ఈ దేశానికి రాజును. అందుచేత నీకు రోజూ అన్నంతోపాటు, ఒక
మనిషిని పంపగలను,'' అన్నాడు రాజు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా
సంతోషించింది.
‘‘అలా
అయితే నిన్ను విడిచిపెడతాను. కాని ఏ రోజు నాకు వేళకు ఆహారం రాకపోయినా,
నేనే బయలుదేరి వచ్చి నిన్ను తినేస్తాను!'' అన్నది బ్రహ్మరాక్షసి. రాజుగారు
లేడిని బ్రహ్మరాక్షసికి ఇచ్చేసి, తన రాజధానికి తిరిగి వచ్చి, తన మంత్రితో
జరిగినదంతా చెప్పాడు. ‘‘మహారాజా, మీరేమీ విచారించకండి. మన కారాగారంలో
చాలామంది నేరస్థులున్నారు. వారిని రోజుకొకరు చొప్పున బ్రహ్మ రాక్షసికి
ఆహారంగా పంపుతాను!'' అన్నాడు మంత్రి.
అది మొదలు మంత్రిగారు రోజుకొక ఖైదీని అడవిలో ఉన్న మర్రిచెట్టు వద్దకు
అన్నంతోసహా పంపటమూ, బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినటమూ జరుగుతూ వచ్చింది. కొంత
కాలానికి ఖైదీలందరూ అయిపోయూరు! ఏమి చెయ్యూలో మంత్రిగారికి పాలుపోలేదు. ఆయన
రాజ్యమంతటా చాటింపు వేయించాడు:
‘‘ఎవరైతే అన్నం తీసుకుని అడవిలో ఉండే దయ్యూలమర్రి వద్దకు పోతారో
వారికి రాజుగారు వెయ్యి వరహాలు బహుమానం ఇస్తారు!'' ఈ చాటింపు విని సుతనుడు,
‘‘ఏమి ఆశ్చర్యం! నేను ఎంత కష్టపడి పనిచేసినా రాగిడబ్బులు తప్ప కళ్ళబడవే,
బ్రహ్మరాక్షసికి ఆహారమైతే ఇంత డబ్బిస్తారా?'' అని ఆశ్చర్య పోయూడు.
అతను తన తల్లితో, ‘‘అమ్మా, నేను వెయ్యి వరహాలు తీసుకుని దయ్యూల మర్రి
వద్దకు అన్నం పట్టుకుపోతాను. ఆ డబ్బుతో నీకు చాలా సుఖంగా జరిగి పోతుంది!''
అని చెప్పాడు. ‘‘నా కిప్పుడేం తక్కువయిందిరా? నేను సుఖంగానే వున్నాను.
నువ్వు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదులే!'' అన్నది సుతనుడి తల్లి కన్నీళ్ళతో.
‘‘నాకేదో ఆపద కలుగుతుందని భయపడకు. నాకే అపాయమూ రాదు! నేను క్షేమంగా తిరిగి
వస్తే సరిగదా!'' అని సుతనుడు తల్లిని ఒప్పించి రాజువద్దకు వెళ్ళాడు.
‘‘మహారాజా, మీ పాదరక్షలూ, గొడుగూ, కత్తీ, ఒక బంగారు పాత్ర
ఇప్పించినట్టయితే, నేను దయ్యూలమర్రి వద్దకు ఆహారం తీసుకు పోతాను,'' అని
సుతనుడు రాజుగారితో అన్నాడు. ‘‘అడవికి అన్నం పట్టుకుపోవటానికి ఇవన్నీ
ఎందుకు?'' అని రాజుగారు అడిగాడు. ‘‘బ్రహ్మరాక్షసిని ఓడించటానికి!'' అన్నాడు
సుతనుడు. తరవాత సుతనుడు కత్తి ధరించి, పాదరక్షలు తొడుగుకుని, గొడుగు
వేసుకుని, బంగారు పాత్రలో అన్నం తీసుకుని మధ్యాహ్నానికి దయ్యూల మర్రి
దగ్గిరికి వెళ్ళాడు.
అతను చెట్టునీడ లోపలికి రాకుండా, ఎడంగా గొడుగు నీడలో నిలబడ్డాడు.
అతనికోసం ఎదురు చూస్తున్న బ్రహ్మరాక్షసి, ‘‘ఎండలోపడి చాలా దూరం వచ్చావు.
నీడలోకి వచ్చి, విశ్రాంతి తీసుకో!'' అన్నది. ‘‘లేదు! నేను వెంటనే తిరిగి
వెళ్ళాలి! ఇదుగో, నీకు ఆహారం తెచ్చాను. తీసుకో!'' అంటూ సుతనుడు బంగారు
పాత్రను ఎండపడే చోట నేల మీద పెట్టి, తన వెంట తెచ్చిన కత్తితో పాత్రను
చెట్టు నీడలోకి తోశాడు. సుతనుడి యుక్తి చూసి బ్రహ్మరాక్షసి, ‘‘నేను
ఆహారాన్నీ, ఆహారం తెచ్చినవాణ్ణీ కూడా తింటాను!'' అని కోపంతో హుంకరించింది.
‘‘నువ్వు నన్ను మాత్రం తినలేవు. నేను నీ చెట్టు నీడలోకి రాలేదు. నన్ను
తినటానికి నీకేమి అధికారం ఉన్నది?'' అని అడిగాడు సుతనుడు. ‘‘పచ్చిమోసం!
నాకు నీతో ఏం పని? నేను వెళ్ళి ఆ రాజునే తినేస్తాను!'' అని బ్రహ్మరాక్షసి
చిందులు తొక్కింది. ‘‘నువ్వు ఏ జన్మలోనో మహాపాపం చేసి ఇలాటి పాపిష్ఠిజన్మ
ఎత్తావో తెలియదు.
భూతానివై ఈ మర్రిచెట్టును ఆశ్రయించావు! ఇంత నీచపు బ్రతుకు బ్రతుకుతూ
ఉన్నప్పటికీ నీకింకా బుద్ధి రాలేదా? ఇకనైనా బుద్ధి కలిగి జీవించు!'' అని
సుతనుడు బ్రహ్మరాక్షసిని మందలించాడు. బ్రహ్మరాక్షసి విచారంగా, ‘‘నన్నేం
చెయ్యమంటావు? ఇంతకంటే బాగా బ్రతికే మార్గం నాకెలా దొరుకుతుంది?'' అని
అడిగింది. ‘‘నా వెంట వచ్చి మా నగరద్వారం వద్ద నివసించు. అక్కడికి రోజూ నీకు
శుచి అయిన ఆహారం పంపే ఏర్పాటు చేస్తాను.
మనుషులను పీక్కుతినే దురలవాటు మానుకో. రాక్షసి జన్మ నుంచి విముక్తి
పొందుతావు,'' అన్నాడు సుతనుడు. బ్రహ్మరాక్షసి అందుకు సంతోషంగా
అంగీకరించింది. సుతనుడు ప్రాణాలతో తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపోయూడు.
సుతనుడు జరిగిన వృత్తాంతమంతా రాజుతో చెప్పాడు. రాజు పరమానందం చెంది,
సుతనుణ్ణి తన సలహాదారుగా నియమించి, అతడి సలహాలు తీసుకుంటూ చక్కగా రాజ్యపాలన
చేశాడు.
No comments:
Post a Comment