బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక
వానరంగా జన్మించాడు. ఈ వానరం పేరు ‘నందీయుడు.' నందీయుడికి ఒక
సోదరుడున్నాడు. సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాలలో ఎనభైవేల కోతుల మందకు
నాయకులుగా ఉంటూ వున్నారు. నందీయుడికి ఇంటి దగ్గర పోషించవలసిన తల్లి
వున్నది. ఆమె పాపం అంధురాలు.
నందీయుడూ, తమ్ముడూ కలిసి రోజూ, వనాలలో దొరికే మంచి మంచి ఫలాలన్నీ
పట్టుకువచ్చి, మందలోని సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. ఐతే,
ద్రోహులైన సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వక తామే కాజేస్తూ వచ్చారు!
ఒకనాడు నందీయుడు తల్లిని చూడవచ్చాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయి, ‘‘అమ్మా!
ఏమిటిలా శుష్కించిపోయూవు తిండి లేనట్టుగా? రోజూ మేం పంపే ఫలాలు తినటం
లేదా?'' అని అడిగాడు. ‘‘లేదు, నాయనా! ఫలాలూ లేవు, ఏమీ లేవు.
తిండి ఉంటే ఎందుకిలా చిక్కిపోతాను?'' అని చెప్పింది తల్లి. నందీయుడు
బాగా ఆలోచించాడు. నిజం బోధపడింది. వెంటనే హిమాలయూలకు వెళ్ళి జరిగిందంతా
సోదరుడికి చెప్పి, ‘‘తమ్ముడూ! ఇంటివద్ద ఉండి నేను అమ్మపోషణ చూస్తాను.
నువ్వు నాయకత్వం వహించి, ఈ మందను ఏలుకో,'' అన్నాడు.
అందుకు చిన్నవాడు, ‘‘అన్నయ్యూ! నీతోపాటు నేనూ ఇంటి దగ్గరనే ఉండి,
అమ్మపోషణ చూస్తాను,'' అన్నాడు. ఈ విధంగా ఇద్దరూ ఏక మనస్కులై, ఇంటికి
వెళ్ళారు. తల్లికి ఒక రావిచెట్టు మీద చక్కని బస అమర్చి, ఆమెకు ఏ కొరతా
రాకుండా వేయికళ్ళతో కాపాడుతూ వచ్చారు.
ఇదిలా వుండగా ఒకానొక బ్రాహ్మణుడు తక్షశిలా నగరంలో గురువువద్ద
విద్యలు అభ్యసిస్తున్నాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరవాత అతడు
గురువువద్దకు పోయి, సెలవిమ్మని అనుజ్ఞ కోరాడు. ఆయన శిష్యుణ్ణి చూసి,
‘‘నాయనా! నువ్వు విద్య పూర్తి చేసుకున్నావు. సంతోషమే. నీది తీవ్రస్వభావము.
తొందర పడి ఎన్నడూ క్రూరమైన పనులు చేయబోకు, తరవాత పశ్చాత్తాపపడినా లాభం
లేదు. ఇదే నా ఉపదేశం,'' అని చెప్పి దీవించాడు. బ్రాహ్మణ కురవ్రాడు
గురువువద్ద సెలవు తీసుకొని, కాశీనగరం చేరుకున్నాడు. పెళ్ళి అయింది,
గృహస్థాశ్రమం స్వీకరించాడు. అతనికి ఏవిధంగానూ పొట్టపోసుకోవడానికి దారి
కనబడలేదు. అందుచేత, విల్లమ్ములు చేతపట్టి బోయవాడి వృత్తి అవలంబించాడు.
జంతువులనూ,
పక్షులనూ వేటాడి, వాటి మాంసం విక్రయించి, ఆ వచ్చిన డబ్బుతో కాలక్షేపం
చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఎంత తిరిగినా బోయవాడిలా మారిన బ్రాహ్మడికి ఒక్క
జంతువు కూడా దొరకలేదు. ఇక లాభం లేదని ఇంటికి మరలిపోతూ, అతడు ఒక రావిచెట్టు
కేసి చూశాడు. ఆ సమయూన చెట్టు కొమ్మలలో తల్లికి ఫలాహారం పెట్టి
స్థిమితపరిచి, ఆమె వెనుకనే నందీయుడూ, తమ్ముడూ కూర్చుని వున్నారు.
వాళ్ళూ బోయవాడిని చూశారు. అప్పుడు చెట్టుకేసి చూస్తూ బోయవాడు, ఉత్త
చేతులతో ఇంటికి మరలడమేమిటని తలచి, తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. దానిని
నందీయుడు చూసి తమ్ముడితో, ‘‘అదుగో, వాడు మన తల్లి కేసి బాణం గురి పెట్టాడు.
ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. నేను పోయిన తరువాత ఆమెను నువ్వే
రక్షించాలి!'' అంటూ చెట్టు దిగి వచ్చాడు.
‘‘ ఓయీ, బోయవాడా! మా తల్లిని చంపకు, ఆమె ముసలిది, కావాలంటే ఆమెకు
బదులు నన్ను చంపు,'' అన్నాడు నందీయుడు. అందుకు కఠినాత్ముడైన ఆ బోయవాడు
‘సరే'నంటూ నిర్దాక్షిణ్యంగా నందీయుణ్ణి బాణంతో కొట్టాడు. ఐతే, ఆ మాట మీద
నిలబడక బోయవాడు, నందీయుడు చనిపోగానే మళ్ళీ తల్లి కోతికి బాణం గురిపెట్టాడు.
ఇది కనిపెట్టి, ఈసారి చిన్నవాడు దిగి వచ్చి బోయవాడితో, తన అన్న
చెప్పినట్టే చెప్పాడు.
‘సరే'నన్నాడు బోయవాడు. నిర్దాక్షిణ్యంగా చిన్నవాడిని కూడా చంపివేశాడు.
‘‘నాకూ, నా కుటుంబానికీ ఈ రెండు కోతులూ చాలు,'' అని అనుకున్నాడు. కాని,
మరుక్షణంలోనే అతడి మనసు మారిపోయింది. వాడు దయమాలి ఏమాత్రం పాపభీతి లేకుండా
బాణంతో తల్లి కోతిని కూడా కొట్టి, కూల్చివేశాడు. ఈ విధంగా ఆనాడు చంపిన మూడు
కోతులనూ భుజాన వున్న కరక్రు వేలాడవేసి, ఇంటిముఖం పట్టాడు.
ఊరి పొలిమేర చేరుకునేసరికల్లా-పిడుగుపడి వాడి ఇల్లు కాలిపోతున్నదనీ,
వాడి భార్యా, ఇద్దరు బిడ్డలూ దానిలోనే ఉండిపోయూరనీ తెలిసింది! ఈ మాట చెవిని
పడేసరికి, బోయవాడు చెప్పలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఇంటికి పోయూడు.
వాడు సాహసించి లోపలికి వెళ్ళేటప్పటికి, వాడు నించున్నచోట భూమి హఠాత్తుగా
బద్దలయింది. వాడు పాతాళానికి కూరుకుపోతూ, ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నాడు:
‘‘నా గురువుగారు ఆనాడే చెప్పారు, క్రూరమైన పనులు
చేయవద్దని-పశ్చాత్తాపపడినా లాభం ఉండదు సుమా అని. నేను చేసుకున్న పాపాలకు
తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను...'' అనుకుంటూ మరి కనబడకుండా
నరకవాసానికి పోయూడు.
No comments:
Post a Comment