బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక
పల్లెటూరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని పేరు సోమదత్తుడు. అతని
తండ్రి అతి బీద వాడు. రెక్కలు ముక్కలు చేసుకుని తనకున్న కుంటపొలమూ సేద్యం
చేసుకుని అతి కష్టం మీద ఎలాగో జీవించేవాడు. సోమదత్తుడు పెరిగి పెద్దవాడై,
తన తండ్రి కుటుంబ పోషణ కోసం పడే శ్రమ కళ్ళారా చూసి ఎంతో విచారించాడు.
తన తల్లిదండ్రు లను సుఖపెట్టడానికి అతనికి ఒకటే మార్గం కనిపించింది.
అదేమంటే, తాను ఎక్కడనైనా విద్య నేర్చుకుని కొలువులో ప్రవేశించటం. తాను కూడా
తండ్రితో పాటు కష్టపడవచ్చు, కాని ఉన్న పొలం కొద్దిగనక ఫలితం ఉండదు.
అందుకని సోమదత్తుడు తండ్రితో, ‘‘నేను తక్షశిలానగరం వెళ్ళి ఏదైనా విద్య
నేర్చు కుంటాను,'' అన్నాడు. తండ్రి అందుకు సమ్మతించాడు.
సోమదత్తుడు తక్షశిల వెళ్ళి, ఒక గురువు వద్ద శుశ్రూష చేసి, కొన్నేళ్ళ
పాటు శ్రద్ధగా విద్య నేర్చుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. తన తండ్రి
ఎప్పటిలాగే తనకు గల రెండు ఎద్దులతో ఆ కుంట పొలమే సాగుచేస్తూ, ఉదయం లగాయతు
అస్తమయం దాకా శరీరశ్రమ చేస్తున్నాడు. ఇది చూసి సోమద త్తుడు, ఇక ఒక్కక్షణం
కూడా ఉపేక్షించ రాదనుకుని, మర్నాడే బయలుదేరి కాశీ నగరం వెళ్ళి అక్కడ రాజు
దగ్గిర కొలువులో ప్రవేశించాడు.
ఇది జరిగిన కొద్ది రోజులకే సోమదత్తుడి తండ్రివద్ద ఉన్న రెండు ఎద్దులలో
ఒకటి మరణించింది. ఎన్నో ఏళ్ళుగా తనను పోషిస్తూ, తన చేత పోషించబడుతూ ఉండిన
ఎద్దు పోయేసరికి సోమదత్తుడి తండ్రికి ఒక చెయ్యి పడిపోయినట్టయింది. విచారంతో
తీవ్రంగా ఆలోచించాడు.
తన కొడుకు ప్రయోజకుడై రాజుగారి వద్ద కొలువు చేస్తు న్నాడు గదా, రాజుతో
చెప్పి ఒక్క ఎద్దును ఇప్పించలేక పోతాడా అనే ఉద్దేశంతో, సోమదత్తుడి తండ్రి
అప్పటికప్పుడే కాశీ నగరానికి వెళ్ళి తన కొడుకును కలుసుకుని వచ్చిన పని
గురించి చెప్పాడు. జరిగినదంతా విని సోమదత్తుడు తండ్రితో, ‘‘అమ్మా, నువ్వూ
పెద్దవాళ్ళయి పోయూరు. ఆ కాస్తభూమికోసం ఎందుకు తాపత్రయ పడతారు? మీరు కూడా
వచ్చేసి నా వెంట వుండండి.
ఏదో విధంగా జరిగిపోతుంది,'' అన్నాడు. దానికి తండ్రి సుతరామూ ఒప్పుకోక,
‘‘నేను ఆ గడ్డమీదనే పోవాలి. అది వదిలిపెట్టి రానే రాను. ఇంకొక ఎద్దును
ఇప్పించావంటే మడి దున్నుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తాను. నాకు అక్కడ ఉండే
శాంతి ఇక్కడ ఉండదు,'' అన్నాడు. సోమదత్తుడు కొలువులో చేరి కొద్ది రోజులే అయి
వుండటం చేత అతని వద్ద ఎద్దును కొనడానికి తగినడబ్బు లేదు. రాజును యూచిం చటం
భావ్యంగా వుండదు.
నిన్నగాక మొన్ననే వచ్చి అప్పుడే చెయ్యి చాస్తున్నాడని రాజుగారు
అనుకోగలరు. అందుచేత అతను తండ్రితో, ‘‘నేను రాజును ఎద్దుకోసం యూచిస్తే,
‘నీకు ఎద్దుతో ఏంపని? ఎవరికోసం అడుగుతు న్నావు?' అని ప్రశ్నలు వేస్తారు.
అదీగాక కొలువు చేసేవారు యూచించటం ధర్మం కాదు, నీకీ బాధలేవీ లేవు. ఉన్న
సంగతి అంతా చెప్పి, ఒక ఎద్దును దయ చేయించ మని అడుగు. రాజు తప్పక ఇస్తాడు,''
అన్నాడు. దీనికి తండ్రి ఒప్పలేదు. ‘‘నాయనా, నేను పల్లెటూరి వాణ్ణి. నాకు
నాగలి పట్టటం తప్ప మరేమీ తెలీదు.
ఎక్కడ రాజుగారు, ఎక్కడ దర్బారు, ఎక్కడ నేను! నాకా సభలోకి అడుగు పెడితే
నోటమాట కూడా రాదేమో. రాజు గారితో ఎట్లా మాట్లాడాలో, ఆ మర్యాద లేమిటో
నాకేమైనా తెలుస్తాయూ? వద్దు, వద్దు! ఎట్లాగో నువ్వే నాకు పని సానుకూలం చేసి
పెట్టు,'' అన్నాడాయన కొడుకుతో. ‘‘అదంతా ఇబ్బంది కాకుండా నేను ఒక పని
చేస్తాను. నీకు ఒక శ్లోకం రాసి ఇస్తాను. దాన్ని రెండు మూడు రోజులు బాగా
వల్లెవేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి చదువు. నీ పని తప్పక సానుకూల
మవుతుంది,'' అని సోమదత్తుడు తండ్రికి ధైర్యం చెప్పాడు. తరవాత అతను ఆ శ్లోకం
రాసి తండ్రి చేత వల్లె వేయించాడు.
‘‘ద్వే మేం గోణా, మహారాజ, యేహి ఖేత్తం కసామసే; తేసు ఏకో మతోదేవ,
దుతియం దేహి ఖత్తియ.'' దీని భావమేమంటే, ‘‘మహారాజా, నాకు రెండు ఎడ్లుండేవి.
వాటితో సేద్యం చేసుకునే వాణ్ణి. దేవా, ఇప్పుడు వాటిలో ఒకటి చచ్చి పోయింది.
ఓరాజా, రెండో ఎద్దును ఇప్పిం చండి,'' అని. ముసలివాడు చాలా శ్రమపడి ఈ
శ్లోకాన్ని కంఠస్థం చేసుకున్నాడు. తరవాత సోమదత్తుడు తన తండ్రిని తనతో బాటు
దర్బారుకు తీసుకువెళ్ళాడు. కొడుకు చెప్పిన విధంగా ఆయన రాజుకూ, మంత్రులకూ
నమస్కారాలు చేసి, చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు.
‘‘ఎవరు మీరు? ఏం కావాలి?'' అని రాజు అడిగాడు. వెంటనే ముసలివాడు లోగడ
వల్లె వేసిన శ్లోకం చదివాడు. కాని కంగారులో శ్లోకం గడగడా చెప్పడంతో
కొద్దిగా మారిపోయి ఈ విధంగా తయూరయింది. ‘‘ద్వే మేం గోణా, మహారాజ, యేహి
ఖేత్తం కసామసే; తేసు ఏకో మతోదేవ, దుతియం గణ్హ ఖత్తియ.'' సభికులంతా నవ్వారు.
సోమదత్తుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఎందుచేతనంటే అతని తండ్రి కంగారులో,
‘‘నాకు రెండో యెద్దును ఇప్పించండి,'' అనటానికి బదులు, ‘‘నా రెండో ఎద్దును
తీసుకోండి!'' అనేశాడు.
రాజు వృద్ధుడితో, ‘‘నీ ఎద్దును నాకివ్వటాని కేనా ఇంటి నుంచి బయలుదేరి
ఇంత దూరం వచ్చావు?'' అన్నాడు నవ్వుతూ. ‘‘మహారాజా, కావలిస్తే మీరు దాన్ని
తీసు కోండి. దానిమూలానే ఇంత గొడవ వచ్చింది,'' అంటూ జరిగినదంతా రాజుకు
సోమదత్తుడి తండ్రి విన్నవించుకున్నాడు. సోమదత్తుడి నీతివర్తనకు రాజు
సంతోషిం చాడు. తన కొలువులో వున్న వాళ్ళంతా రాజును చీటికీ మాటికీ అదీ ఇదీ
కావాలని కోరేవారే. సోమదత్తుడు అలా చేయలేదు. రాజు ఎనిమిది జతల యెడ్లను
అలంకరింప చేసి, సోమదత్తుడి తండ్రికి దానం ఇచ్చేశాడు.
No comments:
Post a Comment