Pages

Wednesday, September 19, 2012

చిన్నశెట్టి శిష్యుడు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని ఏలుతుండగా బోధిసత్వుడు శ్రేష్ఠికులంలో పుట్టి, ‘‘చిన్న శెట్టి'' అని పిలవబడ్డాడు. ఆయన బుద్ధిమంతుడూ, శకునశాస్ర్తం క్షుణ్ణంగా తెలిసిన వాడూనూ.
ఒకనాడు చిన్నశెట్టి రాజసభకు వెళుతూ, ఒక చచ్చిన ఎలుకను చూసి, ‘‘ఒక తెలివి గల …యువకుడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం ప్రారంభించి, పెళ్ళి చేసుకోవచ్చును,'' అన్నాడు.
ఈ మాటలు అటుకేసి వెళుతూన్న ఒక యువకుడి చెవుల పడ్డాయి. అతను మంచి కుటుంబంలో పుట్టినవాడే, కాని చాలా పేదవాడు.
ఆ యువకుడు చచ్చిన ఎలుకను తీసుకుపోయి, పిల్లికి ఆహారం కింద ఒక కానీకి ఏదో దుకాణంలో అమ్మాడు.
అతను ఆ కానీకి బెల్లంగడ్డ కొని, ఒక కుండెడు మంచినీళ్ళు కూడా తీసుకుని, అడవికి వెళ్ళే మార్గంలో కూర్చున్నాడు. అడవినుంచి పూలుతెచ్చే మాలాకారులకు అతను కొంచెం కొంచెం బెల్లం పెట్టి, తాగటానికి నీరు ఇచ్చి, వారి వద్ద నుంచి గుప్పెడు, గుప్పెడు పూలు పుచ్చుకున్నాడు. తరవాత అతను ఆ పూలు అమ్మి డబ్బు చేసుకున్నాడు.
మర్నాడు అతను మరింత ఎక్కువ బెల్లం తీసుకుని, మంచి నీటితో మళ్ళీ అదే చోటికివెళ్ళి కూర్చున్నాడు. ఈ రోజు అతనికి మాలాకారులు పూలమొక్కలు కూడా ఇచ్చారు. వాటిని తీసుకువెళ్ళి అమ్మి డబ్బు చేసుకున్నాడు. ఇలా అతను చాలా కొద్దిరోజులలోనే ఎనిమిది కార్షాపణాలు (వెండి నాణాలు) సంపాదించాడు.
ఒకనాడు గాలివాన వచ్చింది. రాజోద్యానంలో ఎండు కొమ్మలూ, ఆకులూ అమితంగా గాలికి రాలిపడ్డాయి. తోటమాలి ఉద్యానాన్ని ఎలా శుభ్రం చే…యటమా అని ఆలో చిస్తూండగా, యువకుడు అక్కడికి వెళ్ళి, రాలిన కరల్రు, కంపా తనకు ఇచ్చే పక్షంలో ఉద్యానాన్ని తాను బాగుచేస్తానన్నాడు.

తోటమాలి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడా యువకుడు పిల్లలు ఆడుకుంటున్న చోటికి పోయి, అందరికీ తలాకాస్తా బెల్లం పెట్టి, వాళ్ళను ఉద్యానానికి తీసుకుపోయి, వాళ్లచేత ఉద్యానంలో రాలిపడిన కరల్రూ, కంపా పోగుచేయించి, ఉద్యానద్వారం వద్ద చేర్పించాడు.
ఆసమయంలో రాజుగారి కుమ్మరి అటుగా వచ్చి, ఉద్యానద్వారం వద్దవున్న కుప్పను కుండలు కాల్చటానికి బేరం చేశాడు. ఈ బేరంలో యువకుడికి ఇరవైఆరు కార్షాపణాలూ, కొసరు కింద కొన్ని చట్లూ లభించాయి. ఇలా ముఫ్పైనాలుగు కార్షాపణాలు సంపాదించిన మీదట అతనికొక ఆలోచన వచ్చింది. అతను నగరద్వారానికి సమీపంలో ఉన్న చలివేంద్రానికి వెళ్ళి, అయిదు వందల మంది గడ్డికోసుకునే వాళ్ళకు తాగటానికి నీరు అందించాడు. వాళ్ళు కోరిన సహాయం చేస్తామన్నారు.
తరవాత ఒకనాడు, ఆ యువకుడికి తెలిసిన ఒక వర్తకుడి ద్వారా, మర్నాడు ఆ నగరానికి ఒక గుర్రాల వర్తకుడు అయిదు వందల గుర్రాలతో రానున్నట్టు తెలిసింది. వెంటనే ఆ యువకుడు గడ్డి మోపుల వాళ్ళను కలుసుకుని, ‘‘రేపు మీరంతా నాకు తలా ఒక గడ్డిమోపు ఇ…య్యాలి. నా మోపులు అమ్ముడయ్యే దాకా మీరు ఎక్కడా గడ్డి అమ్మవద్దు!'' అన్నాడు. వాళ్ళు అలాగేనని, అయిదు వందల గడ్డిమోపులు తెచ్చి, అతని ఇంటి దగ్గర పడేశారు. అనుకున్న ప్రకారం గుర్రాల వర్తకుడు అయిదు వందల గుర్రాలతో వచ్చాడు.

వాటికి కావలసిన గడ్డి ఇంకెక్కడా దొరకక పోవటం చేత, యువకుడి దగ్గర అయిదు వందలగడ్డి మోపులూ కొని, అతనికి వెయ్యి నాణాలు ఇచ్చాడు. మరికొంత కాలానికి యువకుడు తనకు పరిచ…యం వున్న ఒక నౌకావ్యాపారి ద్వారా, ఒక పెద్దనావ రేవులోకి వచ్చినట్టు విని, ఒక మంచి ఆలోచన చేశాడు.
ఆ ఆలోచన ప్రకారం అతను ఉత్తమమైన బండిని ఎనిమిది కార్షాపణాలకు బాడుగకు తీసుకుని, దానితో రేవుకు వెళ్ళాడు. అతను ఒక ఉంగరాన్ని బయానా కింద ఇచ్చి, అక్కడి నావను కొన్నాడు.
తరవాత ముగ్గురు ప్రతీహారులను నియమించి, వర్తకులెవరైనా వస్తే తన వద్దకు తీసుకురమ్మన్నాడు.
ఈ లోపల నావ రేవులోకి వచ్చినట్టు తెలిసి, కాశీనగరంలోని నూరుమంది వర్తకులు సరుకులు కొనుక్కుందామని వచ్చారు. అప్పటికే సరుకంతా ఎవరో…యువకుడు కొనేసినట్టు వారికి తెలిసింది. వర్తకులు ఆ యువకుడి వద్దకు వచ్చారు. యువకుడు వారికి నావలోని సరుకుతో బాటు, జాగా కూడా రెండేసి వేలకు అమ్మి, రెండు లక్షలు సంపాదించాడు.
తరవాత ఆ …యువకుడు చిన్న శెట్టి వద్దకు వెళ్ళి, ఆయనకు లక్ష నాణాలు చూపాడు. ‘‘నాయనా, నీకు ఈ డబ్బంతా ఎలా వచ్చింది?'' అని చిన్నశెట్టి అడిగాడు.
‘‘తమ ఉపదేశం మూలంగా, నాలుగు మాసాల కాలంలో ఈ డబ్బు సంపాదించాను!'' అంటూ ఆ యువకుడు తాను చచ్చిన ఎలుకను కానీకి అమ్మినది మొదలుకుని, అంతా వివరంగా చెప్పాడు.
అంతా విని చిన్నశెట్టి, ‘‘ఇటువంటి కురవ్రాణ్ణి ఇతరుల చేతిలో పడనియ్యరాదు!'' అనుకుని, పెళ్ళికి సిద్ధంగా వున్న తన కూతుర్ని ఆ కురవ్రాడికిచ్చి పెళ్ళిచేసి, తనకున్న ఆస్తి అంతా అతనిపరం చేశాడు. చిన్నశెట్టి చనిపోయిన తరవాత ఆ యువకుడికి ‘‘శ్రేష్ఠి'' పదవివచ్చింది.

No comments:

Post a Comment