బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు,
దేవలోకంలోని దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడుగా వుండటం తటస్థించింది.
బ్రహ్మదత్తుడు అప్పుడు మంచి యౌవనంలో ఉన్నాడు. రాజ్యాధికారం, తరగని సంపదలు,
వీటితోపాటు మంచి వయసు తోడుకావడంతో అతనిలో క్రమంగా అహంకారం పెరిగిపోసాగింది.
దాంతో ఎదుటివారిని ఏమాత్రం లెక్క చేసేవాడు కాడు. పూచిక పుల్లకన్నా హీనంగా
చూసేవాడు.
మంచీ చెడూ చెప్పేవారు లేకపోవడంతో అతనిలో అన్ని అవలక్షణాలూ చోటు
చేసుకున్నాయి. దేవుణ్ణి కూడా పట్టించుకోకుండా కన్నూ మిన్నూ తెలియక
ప్రవర్తించసాగాడు. అన్నిటికీ మించి వయసుమళ్ళిన జంతువులన్నా, మనుషులన్నా,
పాతవస్తువులన్నా అతనికి ఎందుకో తగని ఏహ్యభావం కలిగింది. అవన్నీ ఒక విధమైన
రోతగా కనబడేవి.
వయసు మీరిన జంతువులేవైనా సరే-గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, మరేవైనా
కానీ కంటపడితే, వెంటనే వాటిని తరిమి తరిమి కొట్టేవాడు. పాతబడిన బళు్ళకాని,
ఇంకేదైనా వస్తువుకాని కనిపిస్తే చాలు, ఆ క్షణమే వాటిని ముక్క చెక్కలుగా
చేసి పార వేసేవాడు. వయసు గడచిన మనుషులు-అంటే వృద్ధులు ఎదుటపడితే, వాళ్ళ
నెరసిన గడ్డాలు పట్టుకు లాగేవాడు. వాళ్ళను కింద పడుకోబెట్టించి పాత్రలు
దొర్లించినట్టుగా దొర్లించేవాడు.
ఆ వృద్ధులు స్త్రీలయితే, నానా హింసలూ పెట్టేవాడు. బ్రహ్మదత్తుడు చేసే ఈ
అర్థం లేని ఆటలకూ, దుండగాలకూ ఒక మితీ, మేరా లేక పోయింది. ఇంద్రుడి
లక్ష్యమూ, చంద్రుడి లక్ష్యమూ లేకుండా సంచరించే ఆ రాజకుమారుణ్ణి
ఎదిరించటానికి ఎవళ్ళకూ తరం కాలేదు. ఇలా రాజు చేసే దుర్నయాలకూ, పెట్టే
యాతనలకూ ప్రజలు కటకటలాడి పోసాగారు.
చేసేది లేక తల వంచుకున్నారు. చాలా మంది గృహస్థులు వృద్ధులైన తమ
తల్లిదండ్రులను రాజ్యం దాటించి ఇతర ప్రదేశాలకు చేర్చుకొన్నారు. ఈ విధంగా
తల్లిదండ్రులను దూర దేశాలలో దిగబెట్టి, వారికి ఎడబాపులై వుండటం తప్ప మరి
గత్యంతరం లేక పోయింది. ఇలా ప్రజలు తల్లిదండ్రులను విడిచి పెట్టి ఉండటం వల్ల
వారు మహాపాపం చేసిన వారయ్యారు. ఇటువంటి పాపాత్ములతో రౌరవాది నరకాలన్నీ
నిండిపోజొచ్చినై.
స్వర్గలోకమంతా ఖాళీగా ఉండిపోయింది. స్వర్గలోకంలో తగినంత పని కనబడక
పోయేసరికి దేవేంద్రుడు విచారగ్రస్తుడయ్యాడు. దీనికి వెంటనే ఒకపరిష్కార
మార్గం చూడాలని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవేంద్రుడు
కడుపేద అయిన ఒక శతవృద్ధు రూపం దాల్చాడు. రెండు జాడీలలో మజ్జిగ నింపి,
శిథిలావస్థలో వుండే ఒక బండిలో పెట్టాడు. ఆ బండికి రెండు ముసలి బక్క
ఎద్దులను పూన్చి, బయలుదేరాడు. ఈ విధంగా దేవేంద్రుడు వెళుతూండగా-అతి వైభవంగా
గొప్ప ఊరేగింపుతో గజారోహణం చేసి వస్తున్న బ్రహ్మదత్తుడు ఎదురయ్యాడు.
రాజుకోసం నగరమంతా ఆనాడు రంగురంగుల తోరణాలతో అలంకరించ బడింది! బండి మీద
ముసలివాణ్ణి చూస్తూనే రాజు, ``పోరా, అవతలకి ముసలి పీనుగా! తప్పుకోరా!
ఏమిటింత పొగరు?'' అంటూ కేకలు వేశాడు. పక్కనున్న ప్రజలకు ఇదంతా ఆశ్చర్యం
కొలిపింది. `ఏమిటి, రాజు ఇలా కేకలు వేస్తాడెందుకో!' అని అనుకొన్నారు.
చిత్రమేమిటంటే-మారు వేషంలో వున్న ఆ దేవేంద్రుడు ఒక్క రాజుకే
కనిపిస్తున్నాడు. కాని ప్రజలలో ఒక్కళ్ళకూ గోచరించటం లేదు.
దేవేంద్రుడి మహిమ వల్లనే ప్రజల కళ్ళకు మాయ కమ్మింది! అలా కోపంతో కేకలు
వేసే రాజు మీదికి వేగంగా వెళ్ళి, వృద్ధుడు తన బండిలోని ఒక మజ్జిగ జాడీ
తీసి రాజు నెత్తి మీద పగలగొట్టాడు. అనూహ్యమైన ముసలివాడి చర్యకు రాజు
దిగ్భ్రాంతి చెందాడు. భయంతో ఏనుగుపై నుంచి కిందికి దూకి పారిపో జూశాడు.
అప్పుడు ముసలివాడు వదలకుండా రెండవ జాడీ కూడా తీసి రాజు తలకు వేసి కొట్టాడు.
ఆ మజ్జిగ ఒలికి రాజు వళ్ళంతా తడిసిపోయింది. రాజుకు ఏం చేయడానికీ
తోచలేదు. ఆ సమయంలో ముసలివాడు ఎక్కి వచ్చిన బండి అదృశ్యమైపోయింది. మజ్జిగ
జాడీలు కనపడకుండా పోయినై. అప్పుడు దేవేంద్రుడు స్వస్వరూపంతో రాజు ఎదుట
సాక్షాత్కరించాడు. పాదాక్రాంతుడైన రాజును చూసి దేవేంద్రుడు, ``ఏమి రాజా!
పొగరుబోతుతనము ఎవరికి? నీకా, నాకా? కన్నుకానని గర్వంతో ఎవరు మిట్టిపడుతూ
వున్నారు? నువ్వా, నేనా? ఎల్లప్పుడూ ఈ యౌవనంలో ఇలాగే వుండి పోతావా నువు్వ?
నీకు వృద్ధాప్యం రాదా? ముసలివారినీ, పాత వస్తువులనూ హేళన చేస్తావా? నీ
దుశ్చేష్టల వల్ల రాజ్యంలో ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నావా?
నువు్వ పెట్టే యాతనలవల్ల వాళ్ళందరూ కన్న తల్లిదండ్రులను దూర ప్రదేశాలకు
పంపివేసి, వారి రక్షణ చూడలేని మహాపాపులవుతున్న సంగతి కొంచెమైనా
గుర్తించావా? ఈ విధంగా నరకలోకాలు నిండిపోవటం, స్వర్గానికి ఒక్కళూ్ళ
రాకపోవటం గమనించావా? ఈ క్షణం నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని, తప్పు
దిద్దుకుని, సరిగా ప్రవర్తించు.
లేకుంటే, ఇదుగో ఈ పిడుగు వచ్చి, నీ తలనూ, మొండెమునూ వేరు చేస్తుంది.
జాగ్రత్త!'' అని హెచ్చరించి, అదృశ్యమయ్యాడు. నాటి నుంచి బ్రహ్మదత్తుడి
ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతడు వృద్ధులను గౌరవించసాగాడు. అందువల్ల
ఇంతకుముందు రాజ్యంలో కలిగిన అలజడి తగ్గింది. ప్రజలు వాళ్ళ వాళ్ళ
తల్లిదండ్రులను దూర ప్రాంతాల నుంచి తిరిగి తెచ్చుకొని, సేవించి సుఖంగా ఉంటూ
వచ్చారు. బోధిసత్వుడి ప్రభావం వల్ల ఇంతటి మంచి మార్పు కలిగింది.
No comments:
Post a Comment