Pages

Wednesday, September 19, 2012

సూర్యునితో పందెం

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు, చిత్రకూట పర్వత ప్రాంతాన తొంభైవేల హంసలు నివసిస్తూ ఉండేవి. ఆ కాలమందే బోధిసత్వుడు ఒక హంసగా జన్మించాడు. ఆ హంస అనేకమైన సుగుణాలతోపాటు అపరిమితమైన వేగం కలిగివుండటంచేత, తొంభైవేల హంసలకూ అది పెద్ద అయింది. ఇన్ని ఉత్తమ గుణాలూ, శక్తులూ వుండడం వల్ల ఆ హంసల పెద్దకు ‘రాజహంస' అని పేరు.
ఒకనాడు రాజహంస, తన గుంపుతో సహా, సరోవరంలో విహరించి నివాసానికి మర లుతూ, కాశీరాజ్యం గుండా రావడం తటస్థించింది. బ్రహ్మాండమైన ఆ పక్షుల గుంపును చూస్తే, కాశీరాజ్యమంతటా బంగారు చాందినీ పరిచినట్టుగా వుంది. కాశీరాజు ఆశ్చర్యంతో అటు పరికించాడు. ఆ పక్షులన్నిటిలోనూ, చుక్కలలో చంద్రుడిలా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింత ఎక్కువగా ఆకర్షించింది.
ఆ రాజహంసలో మంచి ఠీవీ, తేజస్సూ మొదలైన రాజలక్షణాలు ఉండటం కాశీరాజు గమనించాడు. సేవకుల చేత దివ్యమైన పుష్పమాలికలూ, పూజాద్రవ్యాలూ తెప్పించి, వాటితో రాజహంసకు స్వాగత మిచ్చాడు. ఘనమైన ఆ స్వాగతాన్ని ఆప్యాయతతో అందుకొన్నది రాజహంస. తన పరివారంతో సహా కొన్నాళ్ళు అక్కడ వుండి, కాశీరాజు ఆతిథ్యం పొంది, నివాసానికి మరలిపోయింది. ఆ క్షణం నుంచీ కాశీరాజుకు రాజహంసపైన గల మమత మరింత అతిశయింప సాగింది. ఇప్పుడాయన మనస్సంతా రాజహంసపైనే ఉంటున్నది. అహర్నిశలు దానిని గురించే తలంపు.

ఏ క్షణమందు ఏ దిశ నుంచి ఆ రాజహంస వస్తుందో అని వెయ్యి కళ్ళతో కనిపెట్టి చూస్తూ వుండేవాడు. ఒకనాడు చిత్రకూట పర్వత ప్రాంత మందలి హంసలలో రెండు చిన్నారి హంసలు రాజహంస వద్దకు వచ్చి, ‘‘రాజా! మా ఇద్దరికీ ఎంతో కాలంగా సూర్యునితో పందెం కడదామని సరదాగా వుంది,'' అంటూ, వాటి మనస్సులోని ఉద్దేశం వెల్లడించినై. ఈ మాటకు రాజహంస, ‘‘ఓసీ, కూనల్లారా! సూర్యుడితో ఏమిటి, మీరు పందెం కట్టడ మేమిటి? విడ్డూరం! సూర్యుని వేగం ఎంతటిదో మీకు తెలియదు.
కనుకనే అజ్ఞానంలో పడ్డారు. మీరు ఆయనతో పరుగెత్తలేరు సరికదా, పందెంలో మీకు ప్రమాదమూ, ప్రాణాపాయమూ కూడా కలగవచ్చు. అందుచేత ఇంతటితో మీరిద్దరూ మీ పిచ్చి ఊహలు కట్టిపెట్టండి,'' అని నెమ్మదిగా హితవు చెప్పింది. హంసపిల్లలకు ఈ హితవు నచ్చలేదు. మళ్ళీ మరొకనాడు పోయి రాజహంసను అనుమతి కోరినై. ఈసారీ అలానే చెప్పింది రాజహంస. అంతటితోనైనా ఊరుకోకుండా మూడో సారి పోయి మళ్ళీ అడిగినై పిల్లలు.ఈమారూ రాజహంస అంగీకరించలేదు.
ఇది పని కాదని తలచి, తమ సత్తువ తెలియని హంసపిల్లలు రెండూ, యజమానికి తెలియకుండానే యుగంధర పర్వత శిఖరానికి ఎగిరిపోయినై. ఈ శిఖరం సూర్యమండలాన్ని తాకుతున్నదా అనిపించేటంత ఎత్తయింది. కనుక ఆ పెద్ద పర్వత శిఖరం మీద చేరి, సూర్యునితో పందెం వేద్దామని హంసపిల్లలు అనుకున్నవి. యథాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్క చూసుకోగా రెండు హంసలు తగ్గినై. జరిగిన సంగతి గ్రహించి, అది ఎంతగానో విచారించింది.
వాటిని ఎలా ఐనా రక్షించాలనుకున్నది. వెంటనే తను కూడా యుగంధర పర్వత శిఖరానికి చేరుకుని, హంసపిల్లలకు తెలియని విధంగా ఒకచోట కూర్చున్నది. సూర్యోదయం కాగానే హంసపిల్లలు సూర్యునితోపాటు, ఎగరసాగినై. రాజహంస కూడా వాటిని అనుసరించింది. హంసపిల్లలు రెండింటిలో చిన్నది మధ్యాహ్నం వరకూ ఎగిరి, రెక్కలలో మంటపుట్టి, సోలి పడిపోయింది.

పడి పోయేట ప్పుడు దానికి రాజహంస కనబడగా, ‘‘రాజా! నావల్ల కాలేదు. ఓడిపోయూను...'' అన్నది నిస్పృహతో. అప్పుడు రాజహంస, ‘‘ఫరవాలేదు, నేనున్నానుగా!'' అంటూ దానిని రెక్కలపై కెక్కించుకుని వచ్చి తమ నివాసస్థానంలో తక్కిన గుంపుతో చేర్చింది. మరి కొంచెం సేపటికి రెండవ హంసపిల్లకు కూడా రెక్కలలో సూదులు పొడిచినట్టు బాధకలిగి, సోలిపోయింది. అదీ రాజహంసను చూసి నిస్పృహతో దీనంగా పలికింది.
దానికి కూడా రాజహంస ధైర్యం చెప్పి, రెక్కలపై ఎక్కించుకొని, తమ నివాస స్థానమైన చిత్రకూటం చేర్చింది. ఈ విధంగా తన పరివారంలోని రెండు పక్షులు ఓడిపోవటం సహించలేక, రాజహంస తనే పందెం వేయూలని బయల్దేరింది. చెప్పనలవికాని సహజ వేగం గల రాజహంస ఎగరడం ప్రారంభించిన కొద్ది సేపట్లోనే సూర్యబింబాన్ని కలుసుకోవడం, దాటిపోవడమూ కూడా జరిగింది! సూర్యుని సత్తువ ఎంతటిదో చూదామనుకొన్నది కాని, రాజహంసకు పందెం ఎందుకు? దీనివల్ల దానికి కలిసివచ్చే దేమిటి? కనుక, ఇష్టం వచ్చినట్టు కొంచెం సేపు చుట్టి చుట్టి, చివరకు అలసటచేత భూలోకానికి దిగివచ్చి, కాశీరాజ్యం చేరుకున్నది.
కన్నులు కాయలు కాచేటట్టు కనిపెట్టుకునివున్న కాశీరాజు రాజహంసను చూడగానే తన్మయుడైపోయూడు. రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి, బంగారు పళ్ళెంతో పాయసం, బంగారు కలశంతో చల్లటి పానకం తెచ్చి దానిముందు పెట్టాడు. అది కొంచెం స్థిమితపడ్డ తరువాత రాజు కుశలప్రశ్నలు ప్రారంభించాడు. జరిగిందంతా వివరించింది రాజహంస. అది చెప్పినదంతా విన్న రాజు, ‘‘పక్షి రాజా! సూర్యునితోనే పందెం కట్టి, అతనిని మించిన నీ ప్రజ్ఞ ఎటువంటిదో చూడవేడుకగా వున్నది,'' అన్నాడు.
అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించదలిచి, ‘‘రాజా! నీ రాజ్యంలో, మెరుపు మెరిసేటంతకన్న వేగంగా బాణం వదలగల మేటి విలుకాండ్రు వుంటే, వారిలో నలుగురిని ఇక్కడికి రప్పించు,'' అన్నది. రాజు విలుకాండ్రను పిలిపించాడు.

ఉద్యానవనంలో ఒక నలుచదరపు స్తంభం ఉన్నది. విలుకాండ్రు నలుగురినీ ఆ స్తంభం నాలుగువైపులా నించో బెట్టింది రాజహంస. తరవాత తన మెడకు ఒక గంట కట్టుకుని, స్తంభం పైన కూర్చుని, ‘‘నేను సంజ్ఞ చేయగానే మీరు నలుగురూ బాణాలు వదలండి. నేను ఎగిరి వెళ్ళి, మీ ఒక్కొక్కరి బాణమే తెచ్చి మీ ముందు పెడతాను. ఐతే, నా మెడలో ఉండే గంట చప్పుడువల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు గాని, నన్ను కంటితో చూదామంటే ఎంతమాత్రం సాధ్యం కాదు,'' అని చెప్పింది.
ఆ ప్రకారమే, మెరుపు మెరిసేటంతలో విలుకాండ్రు వదిలిన నాలుగు బాణాలూ తెచ్చి రాజహంస, వాళ్ళ ముందు పెట్టింది. రాజూ, పరివారమూ ఆశ్చర్యభరితులయ్యూరు. ‘‘రాజా! చూశావా నా వేగం! ఇది, నేను అతి మెల్లగా ఎగిరినప్పటి కనీసపు వేగం అన్నమాట. దీన్నిబట్టి అసలు, వేగం అనేది ఎటువంటిదో ఊహించగలవేమో చూడు,'' అన్నది. ఆత్రంతో రాజు, ‘‘పక్షిరాజా! నీ వేగం ఎటువంటిదో మచ్చు చూడగలిగాము. మరి, ఇంతకు మించిన వేగం మరెవరికైనా ఉన్నదా?'' అని ప్రశ్నించాడు.
అందుకు రాజహంస, ‘‘లేకేమి! నేను నా శక్తి అంతా వినియోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికీ, నా కంటె వెయ్యి రెట్లు వేగంతో పరుగుతీసే మహాశక్తి ఒకటి ఉన్నది. అదే కాలం అనే సర్పం! ఆ కాలసర్పం అనుక్షణమూ ఈ ప్రపంచ మందలి జీవులను వర్ణింప తరంకాని ప్రచండ వేగంతో నాశనం చేస్తున్నది...'' అని చెప్పేసరికి, రాజు భయంతో కంపించిపోయూడు. అప్పుడు రాజహంస రూపంలో వున్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు:
‘‘రాజా! కాలసర్పం ఒకటి ఉన్నదన్న మాట గుర్తుంచుకొన్నవాళ్ళకు భయపడ వలసినపనే లేదు. నీతిమంతుడివై, ధర్మాత్ముడివై, పరిపాలన సాగించేటంతవరకూ నీకు ఎవ్వరివల్లనూ ఎట్టి భయమూ లేదు. కనుక నీ విధులు నువ్వు సక్రమంగా నెరవేర్చుకో.'' బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరాజు ధర్మపాలనచేసి, గొప్పకీర్తి గడించాడు.

No comments:

Post a Comment