ఒకానొకప్పుడు ఒకానొక మారుమూల గ్రామంలో భక్తుడైన ఒక
బ్రాహ్మణుడుండేవాడు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆయన తన ఇంటి ఆవరణలో పురాణ
కాలక్షేపం చేసేవాడు. పురాణకాలక్షేపం వినడానికి వచ్చే గ్రామ ప్రజలు, విన్న
తరవాత తమకు తోచినది, బ్రాహ్మణుడి పక్కనే ఉన్న వెండి పళ్ళెంలో భక్తితో వేసి
వెళ్ళేవారు.
దాంతో ఆయన జీవనం సాగించేవాడు. రోజులు గడిచే కొద్దీ బ్రాహ్మణుడిలో తన
పాండిత్యం పట్ల, పవిత్రత పట్ల అహంకారం పెరగసాగింది. గ్రామస్థులందరిలోకీ
తాను అధికుణ్ణన్న భావం ఏర్పడసాగింది. దాంతో ప్రజలతో కటువుగా
ప్రవర్తించసాగాడు. వెండి పళ్ళెంలో కాసులువేయకుండా వెళ్ళేవారిని చూసి
మందలించేవాడు.
పురాణకాలక్షేపం వినడానికి వచ్చిన ప్రజలు చెల్లించిన డబ్బులు,
కొన్నాళ్ళకు ఆయన తీర్థయాత్రకు వెళ్ళిరావడానికి సరిపడా పోగయ్యాయి. దానిని
చూసి ఆయన ఎంతగానో సంబర పడి, ఒకనాడు ఉపన్యాసం పూర్తి చేశాక, ``మీలో
హరిద్వార్‌ను గురించి విన్నవాళు్ళ ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు. అది ఈ
భూమండలంలోని పవిత్ర తీర్థాలలోకెల్లా పవిత్రమైనది. నేను హరిద్వార్ యాత్రకు
వెళుతున్నాను.
యాత్ర
నుంచి తిరిగివచ్చాక పురాణకాలక్షేపం ప్రారంభిస్తాను,'' అన్నాడు. కాలక్షేపం
వినడానికి వచ్చిన ప్రజలు ఒక రొకరుగా వెళ్ళిపోసాగారు. కొందరు వెళ్ళే ముందు
బ్రాహ్మణుడి పాదాల ముందు సాష్టాంగ పడి మొక్కి, ఆయన నుంచి ఆశీస్సులు పొంది
మరీ వెళ్ళారు. ఆఖరుగా ఒక యువకుడు చేతులు జోడించి, బ్రాహ్మణుడి ఎదుటికి
వచ్చాడు. బ్రాహ్మణుడా యువకుణ్ణి గుర్తు పట్టి, ``ఏరా, కల్హణా? ఏం కావాలి?''
అని అడిగాడు.
``స్వామీ, నేనూ మీతో పాటు మీరు వెళు తూన్న పవిత్రమైన హరిద్వార్
యాత్రకు రావచ్చా?'' అని అడిగాడు. ఒక గొర్రెల కాపరి ఉన్నట్టుండి భక్తుడై
పోవడం బ్రాహ్మణుడికి విస్మయం కలిగించింది. ``హరిద్వార్, పక్కనే ఏదో
కూతవేటు దూరంలో ఉందనుకుంటున్నావా? చాలా దూరం వెళ్ళాలి. నువు్వ నాతో
వచ్చావంటే, తిరిగివచ్చేంతవరకు నీ గొర్రెల్ని ఎవరు చూసుకుంటారు?'' అని
అడిగాడు బ్రాహ్మణుడు.
``అదేం సమస్య కాదు స్వామీ. అవి తమంతట మేసేసి, సాయంకాలానికి కొట్టానికి
తిరిగి రాగలవు,'' అన్నాడు గొర్రెలకాపరి. ``అలాగా! నువు్వ నాతో రావడం
సంతోషమే. రేపు తెల్లవారుజామునే ప్రయాణం. అన్నీ సిద్ధం చేసుకో,'' అన్నాడు
బ్రాహ్మణుడు గొప్ప ఉపకారం చేస్తున్నట్టు. దారి పొడవునా బ్రాహ్మణుడు
హరిద్వార్ పవిత్రతను గురించీ, అలాంటి పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడం
అందరికీ సాధ్యం కాదనీ, పుణ్యాత్ములకే ఆ భాగ్యం కలుగుతుందనీ చెబుతూ వచ్చాడు.
అదంతా
విన్న కల్హణుడు మౌనంగా ఊరుకున్నాడే తప్ప, బ్రాహ్మణుడిలా మాటి మాటికీ
భగవన్నామాన్ని భక్తితో స్మరించలేక పోయాడు. హరిద్వార్ చేరుతూండగా
బ్రాహ్మణుడు మరింత బిగ్గరగా నామకీర్తన చేయసాగాడు. కల్హణుడిలో ఎలాంటి
ఉద్వేగం లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పైగా, ఆ యువకుడు చుట్టుపక్కల
ప్రకృతి దృశ్యాలను చూడ్డంలో ఆసక్తిగా ఉన్నాడు. పవిత్ర గంగానదిని
దర్శించగానే బ్రాహ్మణుడు వంగి, ``అమ్మా, గంగామాతా! నీ బిడ్డను ఆశీర్వదించు
తల్లీ! అద్భుతమైన ఈ రోజుకోసమే ఇన్నాళు్ళ వేచి ఉన్నాను,'' అంటూ భక్తితో
నమస్కరించాడు.
అతడు లేచి నిలబడి కల్హణుడికేసి తిరిగి చూశాడు. అతడు ఎలాంటి చలనమూ
లేకుండా నదీ ప్రవాహం కేసి చూస్తున్నాడు. ఇలాంటి మూర్ఖుణ్ణి ఇక్కడికి
వెంటబెట్టుకు వచ్చి మహాపాపం చేశాను. ఇతర పాపాలతో పాటు ఈ పాపాన్ని కూడా
ప్రక్షాళనం చేసుకోవాలి అనుకుంటూ, ``కల్హణా! నువు్వ ఇక్కడే ఉండు. పవిత్ర
గంగలో స్నానం చేసి వస్తాను.
నేను వచ్చాక నువు్వ వెళ్ళవచ్చు,'' అంటూ నదిలోకి దిగాడు. ఇప్పుడు
ఆశ్చర్యపోవడం కల్హణుడి వంతయింది. ``ఈ నదీ జలాలలో స్నానం చేయడానికా నేను ఇంత
దూరం ప్రయాణం చేసివచ్చాను?'' అని అన్నాడు పైకి వినిపిస్తున్నట్టుగా.
``పాపం శమించుగాక! ఇది పరమ పావనమైన గంగానది! పవిత్రమైన నదులన్నిటిలోకీ
పవిత్రమైనది!'' అన్నాడు బ్రాహ్మణుడు కల్హణుడి అజ్ఞానానికి నొచ్చుకుంటూ.
``నేను మన ఊళ్ళోనే ఉండి పోయి, అక్కడి నదిలోనే స్నానం చేసి ఉంటే బావుండేది.
రెండు నదులకు మధ్య నాకేం తేడా కనిపించడం లేదు!'' అన్నాడు కల్హణుడు.
``నేనిప్పుడు నీతో వాదించడానికి సిద్ధంగా లేను. పవిత్ర తీర్థ స్నానానికి
వెళుతున్నాను. నీకిష్టమైన పనిచెయ్!'' అంటూ స్నానఘట్టం మెట్లగుండా నదిలోకి
దిగాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మాటలనూ విన్న గంగామాత, ``ఆ యువకుడు ప్రతి
నదినీ గంగమ్మ తల్లిగా భావిస్తున్నాడు. హరిద్వార్‌లో ప్రవహిస్తూన్న ఈ నదే
కాకుండా ప్రతి నదీ పవిత్రమైనదేనని అనుకుంటున్నాడు. అతణ్ణి తప్పక
దీవించాలి,'' అనుకుంటూ కల్హణుణ్ణి సమీపించి, ``నేనే గంగను.
నువు్వ
నన్ను గురించి చెప్పింది విన్నాను. నా భక్తులందరికన్నా నీలో చక్కటి జ్ఞానం
ప్రకాశిస్తున్నది. పేర్లు వేరైనప్పటికీ నదులన్నీ పవిత్రమైనవే. ఏదీ, నీనోరు
తెరువు. జ్ఞానవాక్కులను పల్కిన నీ నాలుకను చూడాలి!'' అన్నది. కల్హణుడు
అమాయకంగా నోరు తెరిచాడు. గంగామాత అతడి నాలుకపై ఏదో రాసి, ``ఈ క్షణం నుంచి
నువు్వ పక్షులతోనూ, జంతువులతోనూ కూడా మాట్లాడగలవు. వాటి భాష, జ్ఞానం నీకు
అర్థమవుతుంది.
నీకు మహత్తరమైన భవిష్యత్తు ఉంది,'' అని దీవించింది. కల్హణుడు
ఆశ్చర్యంగా చూస్తూండగానే ఆమె అంతర్థాన మయింది. అతడు స్నాన ఘట్టంకేసి తిరిగి
చూశాడు. అక్కడ స్నానం చేస్తున్న వారిలో తమ గ్రామం బ్రాహ్మణుడు
కనిపించలేదు. చుట్టు పక్కల తిరిగి చూశాడు. బ్రాహ్మణుడి జాడ కనిపించలేదు.
అతడికి గ్రామంలో తన కోసం ఎదురు చూసే తన గొర్రెలు గుర్తురావడంతో, వచ్చిన పని
పూర్తయింది కదా అని తిరుగు ప్రయాణమయ్యాడు.
వచ్చినప్పుడు కనిపించిన భవనాలూ, దృశ్యాలూ మళ్ళీ కనిపించడంతో సరైన
మార్గం లోనే తిరిగి వెళుతున్నానన్న నమ్మకంతో నడుస్తూన్న కల్హణుడు ఎదురుగా
పెద్ద ఊరేగింపురావడం గమనించాడు. ఊరేగింపుకు ముందు అలంకరించబడిన ఒక ఏనుగు
తొండంతో పూల మాలను పట్టుకుని వస్తున్నది. దానిని చూడగానే కల్హణుడు దారి
ఇవ్వడానికి పక్కకు తప్పుకుని, పక్కనున్న పెద్ద మనిషిని, ``ఏమిటా
ఊరేగింపు?'' అని అడిగాడు.
ఆ ప్రాంతాన్నేలేరాజు హఠాత్తుగా మరణించాడనీ, రాజుకు సంతానం లేనందువల్ల,
పట్టపుటేనుగు మాలవేసినవారే రాజు కావడం అక్కడి సంప్రదాయమనీ, అందుకే ఆ
ఊరేగింపు అనీ ఆ పక్కనున్న మనిషి వివరించాడు. ఏనుగు కల్హణుణ్ణి సమీపించగానే,
నిలబడి తొండమెత్తి గట్టిగా ఘీంకరించి, పూలదండను అతడి మెడలో వేసింది. ప్రజల
కరతాళ ధ్వనుల మధ్య, ఏనుగు కల్హణుణ్ణి, తొండంతో పైకెత్తి తన వీపుపై
కూర్చోబెట్టుకున్నది. ``మహారాజుకు జై... మహారాజుకు జై,'' అంటూ ప్రజలు
నినాదాలు చేశారు. మేళతాళాలతో ఊరేగింపు ముందుకు సాగింది.
రాజమార్గానికి
ఇరువైపులా బారులు తీరి నిలబడ్డ ప్రజలలో గంగాస్నానం ముగించి వచ్చిన,
కల్హణుడి గ్రామం బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. ఆయన కల్హణుణ్ణి వెంటనే
గుర్తుపట్టలేక పోయాడు. గుర్తు పట్టాక, ``ఆహా! నిన్న మొన్నటి వరకు గొర్రెల
కాపరి! ఈ రోజు కల్హణ మహారాజు! ఏమి అదృష్టం!'' అంటూ ఆశ్చర్యపోయాడు.
No comments:
Post a Comment