Pages

Sunday, September 16, 2012

కురమ్రాంత్రికుడు


అవంతిరాజ్యం నందివరంలో నివసిస్తూన్న ప్రజ్వలుడు బాల్యం నుంచే పరోపకారబుద్ధికలవాడు. యుక్త వయస్కుడయ్యే సరికి అతడిలో అన్యాయాలను ఎదుర్కొనే స్వభావం కూడా దృఢపడింది. అదే ఊళ్ళో కేశవుడనే పేదరైతు చావుబతుకుల్లో ఉన్న తన భార్య వైద్యం కోసం తనకున్న కొద్దిపాటి పొలాన్ని ఫణిరాజు అనే ధనవంతుడికి అమ్మాడు.
 
ఫణిరాజు రైతుకు సగం డబ్బిచ్చి, మిగిలినది తరవాత ఇస్తానన్నాడు. వారం తరవాత కేశవుడు తనకు రావలసిన డబ్బు అడగడానికి ఫణిరాజు ఇంటికి వెళ్ళాడు. ఫణిరాజు డబ్బు ఇవ్వకపోగా, కేశవుడి మీద దొంగతనం నేరం మోపి, రక్షక భటులకు అప్పగించాడు. కేశవుడు ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా కొత్వాలు అతన్ని కారాగారానికి పంపాడు.
 
ఇది అన్యాయం అని తెలిసినప్పటికీ, కొత్వాలుకు భయపడి గ్రామస్థులెవరూ నోరు మెదపలేక పోయారు. అయితే, ప్రజ్వలుడు దీన్ని చూస్తూ సహించలేక కొత్వాలు వద్దకు వెళ్ళి అసలు సంగతి చెప్పాడు. అయితే, కొత్వాలు ఫణిరాజుకు కావలసినవాడు గనక, ప్రజ్వలుడి మాటను వినిపించుకోలేదు. ఎంత చెప్పినప్పటికీ కేశవుణ్ణి వదిలి పెట్టక పోవడంతో, ప్రజ్వలుడు రెచ్చిపోయి ఎదురు తిరిగాడు. కొత్వాలు అతన్ని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు.
 
అయితే, ప్రజ్వలుడు వాళ్ళకు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోయి, ఒక కొండ ప్రాంతంలోని గుహలోకి జొరబడ్డాడు. గుహకు ఆవలివైపున దట్టమైన అరణ్యం ఉంది. అరణ్యంలో చాలా దూరం నడిచిన ప్రజ్వలుడు బాగా అలిసిపోవడంతో ఒక చెట్టునీడలో చతికిలబడి, కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. చాలా సేపయ్యాక ముఖం మీద నీటి బిందువులు పడడంతో, ప్రజ్వలుడు కళు్ళ తెరిచాడు.

ఎదురుగా దండ కమండలాలతో మందహాసం చేస్తూ దివ్యతేజస్సుతో నిలబడ్డ ఒక వృద్ధ ముని, ``దుష్టమృగాలు తిరిగే ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చావు నాయనా?'' అని అడిగాడు. ``వాటికన్నా భయంకర స్వభావులైన అధికారగణం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాను మహాత్మా,'' అంటూ నెమ్మదిగా లేచి కూర్చున్న ప్రజ్వలుడు జరిగినదంతా మునికి వివరించాడు.
 
అంతా విన్న ముని తల పంకిస్తూ, ``అవును, అవంతిరాజు హేమాంగదుడి అలసత్వం వల్లే అధికారులిలా ప్రజలను వేధిస్తున్నారని నేనూ విన్నాను,'' అన్నాడు. ``ఇలాంటి దుర్మార్గులను శిక్షించే మార్గమే లేదా?'' అని అడిగాడు ప్రజ్వలుడు బాధ, ఆవేశం నిండిన కంఠస్వరంతో. ``నీలాంటి ధర్మావేశం గల సమర్థుడైన యువకుడికోసమే ఇన్నాళు్ళగా ఎదురు చూస్తున్నాను,'' అన్నాడు ముని.
 
ఆ తరవాత ఆయన దాపులనున్న చెట్టు నుంచి, వింత ఆకారంగల ఒక కరన్రు విరిచి, కళు్ళ మూసుకుని కొంత సేపు మంత్రం జపిస్తూ నొసటికి ఆనించాడు. ఆ పిమ్మట దాన్ని ప్రజ్వలుడికి ఇస్తూ, ``నాయనా, ఈ మంత్రదండం సాయంతో నువు్వ అదృశ్యంగా సంచరించవచ్చు. వాయువేగంతో పయనించవచ్చు. శత్రువులను నిర్వీర్యం చేసి అంగుష్ఠ ప్రమాణులుగా మార్చవచ్చు. తరవాత వారిని కావాలనుకున్నప్పుడు మామూలు మనుషులుగా చేయవచ్చు. అయితే, ఇది నీకు మాత్రమే, అదీ దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి మంచిపనులు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. విజయోస్తు!'' అని ఆశీర్వదించాడు.
 
ప్రజ్వలుడు ఆ మంత్రదండాన్ని ఆనందంతో అందుకుని, భక్తితో కళ్ళకద్దుకుని, మునికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇతరులు తనను గుర్తుపట్టకుండా-రాగిరంగు జుట్టు, పొడవాటి ముక్కు, నిప్పుకణికల్లా కళూ్ళ, పెదవి దాటిన దంతాలూ మోకాళ్ళ వరకు నల్లటి అంగీగల యువకుడి రూపం ధరించాడు. ఆ తరవాత నందివరానికి తిరుగు ప్రయాణమై వస్తూండగా మార్గ మధ్యంలో ఒక గ్రామం నడివీధిలో ఒక యువతి, ``రక్షించండి, రక్షించండి!'' అని కేకలు పెడుతూ పరిగెత్తడం చూసి ఆగాడు.

గున్న ఏనుగులా ఉన్న ఒక మధ్యవయస్కుడు, పదిమంది బలాఢ్యులను తోడు తీసుకుని ఆమె వెంటబడి తరుముతున్నాడు. గ్రామస్థులు భయం భయంగా ఆ దృశ్యంకేసి చూస్తున్నారే తప్ప ఒక్కరూ అడ్డుకోలేదు. ``ఆగు,'' అంటూ ప్రజ్వలుడు దారికి అడ్డంగా వెళ్ళాడు. అమితాగ్రహం చెందిన ఆ మధ్య వయస్కుడు, ``నాకు అడ్డురాగల ధీరుడివి, ఎవడివిరా నువు్వ?'' అని అడిగాడు.
 
``చట్టాన్ని!'' అన్నాడు ప్రజ్వలుడు. ``ఇన్నాళు్ళ ఎక్కడున్నావు? నన్ను ఏ చట్టాలూ ఏమీ చేయలేవు. నేను ఈ గ్రామాధికారి నాగస్వరాన్ని. నాకు కావలసిన యువతిని వివాహ మాడగలను. నన్ను అడ్డుకునే మగధీరుడు ఇంకా పుట్టలేదు,'' అని హుంకరించాడు గ్రామాధికారి. ``ఇంతకు ముందు ఇష్టపడని యువతులను బలవంతంగా వివాహ మాడినందుకు ఐదు సంవత్సరాలు, ఇప్పుడీ యువతిని పెళ్ళాడమని బలాత్కరించినందుకు ఒక సంవత్సరం వెరసి, ఈ దేశపు చట్టం ప్రకారం నీకు ఆరు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను,'' అన్నాడు ప్రజ్వలుడు గంభీరంగా. నాగస్వరానికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.
 
``ఈ కురక్రుంక నాకు శిక్ష విధించగలిగినంతవాడా? వాణ్ణి పట్టి చెట్టుకు కట్టి చావగొట్టండి,'' అని అరిచాడు. ప్రజ్వలుడు దుస్తుల్లో దాచిన మంత్ర దండాన్ని తీసి వాళ్ళకేసి చూపాడు. దాని నుంచి నీలి కిరణాలు ప్రసరించడంతో నాగస్వరం, వాడి అనుచరులు బొటన వేలంతగా మారిపోయారు. ప్రజ్వలుడు వాళ్ళను పట్టి చిన్న బుట్టలో వేసుకుని, నాలుగడుగులు వెనక్కు వేసి, అదృశ్యమైపోయాడు. ఆ వింత దృశ్యం చూసి జనం నిశ్చేష్టులై పోయారు.
 
ఆ తరవాత మరికొన్ని క్షణాల్లో ప్రజ్వలుడు నందివరంలోని కొత్వాలు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఫణిరాజు కూడా అక్కడే ఉన్నాడు. ``కేశవుడికి రావలసిన డబ్బు ఇవ్వక పోగా, అతన్ని ఖైదు చేయడం దురన్యాయం. వెంటనే అతన్ని వదిలిపెట్టి, అతనికి చెందవలసిన డబ్బిచ్చి పంపండి,'' అన్నాడు ప్రజ్వలుడు.

``మాకు న్యాయాన్యాయాల గురించి చెప్పడానికి నువ్వెవడివి? నోరు మూసుకుని వెళు్ళ. అనవసరంగా తలదూర్చావంటే నువూ్వ కటకటాల పాలుకాలగవు!'' అన్నాడు కొత్వాలు కోపంగా. వెంటనే ప్రజ్వలుడు కొత్వాలునూ, ఫణిరాజునూ బొటన వేలంతవాళు్ళగా మార్చి, బుట్టలో వేసుకున్నాడు. క్షణాలలో కేశవుణ్ణి ఖైదు నుంచి విడిపించి అందరూ దిగ్భ్రాంతులై చూస్తూండగా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు! ఆ రోజునుంచి ప్రజ్వలుడు అదృశ్యంగా సంచరిస్తూ-అమాయకులనూ, బలహీనులనూ పీడించే దుర్మార్గులను కనిపెట్టి పట్టుకు రాసాగాడు.
 
అలా పట్టుకు వచ్చినవారిని ఇనుప పంజరాలలో బంధించేవాడు. ప్రజ్వలుణ్ణి గురించి రాజ్యంలో రకరకాల వదంతులు వ్యాపించాయి. కుర్ర మాంత్రికుడు నేరస్థుల్ని పట్టుకెళ్ళి చీకటి గుహలో బంధించి చిత్రహింసలు పెడుతున్నాడని కొందరూ; ఏదో వింతశక్తి కురమ్రాంత్రికుడి రూపంలో చట్టబద్ధంగా శిక్షలు అమలు చేస్తున్నదని మరి కొందరూ అనుకోసాగారు. సామాన్య ప్రజలకు బాధలు తగ్గాయని అందరూ సంతోషంగా చెప్పుకోసాగారు.
 
బలహీనులను పీడించాలనుకునే పెత్తందార్లకు కంటి మీద కునుకు కరువయింది. వాళ్ళందరూ రాజు వద్దకు వెళ్ళి తమ గోడు విన్నవించుకున్నారు. రాజు మహామంత్రిని పిలిచి మంతనాలు జరిపాడు. మరునాడు రాజు సభను ఏర్పాటు చేసి, మంత్రులు, దండనాధులు, రాజోద్యోగుల సమక్షంలో కురమ్రాంత్రికుడి చర్యలను వివరించి, ``ఆ కుర్ర మాంత్రికుడు చేస్తున్నది మంచిదా, కాదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం.
 
వాడు మనకు పోటీగా తయారయ్యాడన్నది సుస్పష్టం. ఒక రాజ్యంలో రెండు అధికారకేంద్రాలు ప్రమాదకరం గనక, వాణ్ణి నిర్మూలించే మార్గం చూడాలి,'' అన్నాడు. ఆ మాట వినగానే మహామంత్రి భయంతో వణుకుతూ లేచి నిలబడి, ``మహా ప్రభూ, ముందు నన్ను ఖైదులో ఉంచండి,'' అని వేడుకున్నాడు. ``తమరినెందుకు ఖైదులో ఉంచడం మహామాత్యా?'' అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా.

``తమకు తెలియకుండా నేను ప్రజలను వేధించే కొన్ని అపరాధాలు చేశాను. ఆ కుర్ర మాంత్రికుడికి చిక్కి, వాడి చేత చిత్రహింసలు అనుభవించడం కన్నా, తమ బందిఖానాలో శిక్ష అనుభవించడమే మేలని భావిస్తున్నాను,'' అన్నాడు మహామంత్రి దీనస్వరంతో. మహారాజు అందుకు అయిష్టంగానే అంగీకరించి, మహామంత్రి నేరాన్ని విచారించి చట్టప్రకారం తగిన శిక్ష విధించాడు.
 
ఆ తరవాత రాజుగారి కొలువులో ఉన్న మరికొందరు స్వచ్ఛందంగా తప్పులు ఒప్పుకుని లొంగిపోయారు. కుర్ర మాంత్రికుడికి భయపడి, నేరాలకు పాల్పడ్డ వారందరూ రాజుకు లొంగిపోయారన్న వార్త రాజ్య మంతటా వ్యాపించడంతో ప్రజలలో సైతం నేరప్రవృత్తి బాగా తగ్గిపోయింది. క్రమంగా రాజ్యంలో నేరస్థులే కరువయ్యారు. ప్రజ్వలుడు ఒక్కరిని కూడా పట్టుకువెళ్ళలేని మంచి పరిస్థితి ఏర్పడింది.
 
దాంతో ప్రజ్వలుణ్ణి గురించి ప్రజలు అబ్బురంగా మాట్లాడుకోవడం కూడా ఆగిపోయింది. ఒకనాటి సాయంకాలం మహామంత్రితో కలిసి ఉద్యాన వనానికి వాహ్యాళికి వెళ్ళిన మహారాజు, ``తమ సలహా చక్కగా పనిచేసింది మంత్రివర్యా. ప్రజలిప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు,'' అంటూ మంత్రిని అభినందించాడు. ``అభినందించవలసింది నన్ను కాదు. కుర్ర మాంత్రికుడని ప్రజలు చెప్పుకుంటూన్న ఆ యువకుణ్ణి,'' అన్నాడు మంత్రి. ఏమిటి అన్నట్టు చూశాడు రాజు.
 
``అవును మహారాజా, ఒకనాడు ఆ యువకుడు నా వద్దకు వచ్చి తను చేస్తూన్న పనిని గురించి చెప్పి, పంజరాలలో బంధించిన నేరస్థులను నాకు చూపాడు. మనం చేయవలసిన పనిని అతడు చేస్తున్నాడని మొదట ఎంతగానో సంతోషించినప్పటికీ, ఆ తరవాత నేరస్థుల పట్ల ఉపేక్ష తగదని గ్రహించాను. ఎవరైనా సరే భయం ఉంటేనే దుష్టకార్యాలకు దూరంగా ఉండగలరని భావించి, నేరస్థులు స్వచ్ఛందంగా లొంగిపోయే ఉపాయం ఆలోచించాను. దోషిగా నటించాను,'' అన్నాడు మంత్రి. అలాగా అన్నట్టు రాజు మందహాసంతో తలపంకించాడు.

No comments:

Post a Comment