ఒక రాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. రాణి రాజును మరో వివాహం
చేసుకోమని అర్థించింది. రెండో భార్యకూ సంతానం కలగలేదు. రాజు మూడో పెళ్ళి,
నాలుగో పెళ్ళి కూడా చేసుకున్నాడు. కానీ సంతాన భాగ్యం మాత్రం కలగలేదు.
మంత్రుల సలహా ప్రకారం, పెద్దల సూచనల మేరకు భార్యల సమేతంగా ఎన్నెన్నో
మంచిపనులు చేశాడు. కానీ నలుగురు భార్యలలో ఒక్కరికీ పిల్లలు కలగలేదు.
తనకు ఈ జన్మకు సంతానభాగ్యం లేదేమోననుకుని అంతా విధిప్రకారం
జరుగుతుందని నిస్పృహతో ఊరుకున్నాడు. క్రమక్రమంగా ఆయనకు రాజ్యపాలనా
వ్యవహారాల పట్లకూడా ఆసక్తి సన్నగిల్లసాగింది. రాజ్యంలోని ప్రజలు
చింతాక్రాంతులయ్యారు. ఆ సమయంలో ఒకయోగి దేశాటన చేస్తూ ఆ రాజ్య రాజధానికి
వచ్చాడు. ఆయన గురించి ప్రజలు ప్రధానమంత్రికి తెలియజేశారు. ప్రధానమంత్రి
వెళ్ళి యోగిని దర్శించి, సంగతి చెప్పి రాజభవనానికి తీసుకువచ్చాడు. రాజు సకల
మర్యాదలతో, భక్తిశ్రద్ధలతో యోగికి స్వాగతం పలికాడు.
యోగి
ఉచితాసనంలో కూర్చుని, ``రాజా! నీకు ఇంతవరకు సంతానం కలుగలేదు కదా?'' అని
అడిగాడు. ``అవును, స్వామీ! అదొక్కటే తీరని కోరికగా ఉంది,'' అన్నాడు రాజు
విచారంగా. ``నలుగురు భార్యలుండీ, ఒక్కరికీ సంతానం కలగకపోవడం ఆశ్చర్యం!''
అన్నాడు యోగి. ``ఎన్నో మంచి పనులు చేశాను. పెద్దలు, విజ్ఞులు చెప్పినవన్నీ
చేశాను. కాని ప్రయోజనం కనిపించలేదు,'' అన్నాడు రాజు. ``అన్నీ చేశావుగాని,
సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి ఆశీర్వదించమని ప్రార్థించావా?'' అని అడిగాడు
యోగి.
``లేదు స్వామీ,'' అన్నాడు రాజు. ``అదీ అసలుకారణం! మంచి అవకాశాన్ని
జారవిడుచుకున్నావు. ఇంకా నీకు సంతానం కావాలనే కోరుకుంటున్నావా?'' అని
అడిగాడు యోగి. ``అవును స్వామీ,'' అన్నాడు రాజు. ``సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి
ప్రార్థించు. అదే సమయంలో నీకున్న సంపదలలో నాలుగోవంతు పేదలకు పంచు. దేవుడు
సంతోషించి నీ కోరిక తప్పక నెరవేర్చగలడు,'' అని ఆశీర్వదించాడు యోగి.
రాజు యోగికి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి రాజును మళ్ళీ ఒకసారి
దీవించి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ క్షణం నుంచే రాజు సంతానం ప్రసాదించమని
దేవుణ్ణి ప్రార్థించసాగాడు. నిరంతరం దైవప్రార్థనలతో గడపసాగాడు. భూములు లేని
వారికి భూములు పంచాడు. దాన ధర్మాలు చేశాడు. కొన్నాళ్ళకు రాజుగారి
చిన్నభార్య గర్భవతి అయి పండంటి మగబిడ్డను ప్రసవించింది.
కొడుకు పుట్టగానే రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రజలకు
కానుకలు పంచాడు. రాజ్యమంతా వేడుకలు ఏర్పాటు చేశాడు. రాజుతోపాటు ప్రజలు కూడా
ఎంతగానో సంతోషించారు. బిడ్డను అల్లారుముద్దుగా పెంచసాగారు. యువరాజు
యుక్తవయస్కుడయ్యేసరికి అద్భుతమైన చక్కని రూపంతో పాటు ధైర్యసాహసాలను
సంతరించుకున్నాడు.
రాజు ఒకనాడు ఉద్యానవనంలో నలుగురు భార్యలతో విహరిస్తూ కొడుకు పెళ్ళిని
గురించి ప్రస్తావించి, ``మన అబ్బాయికి అతడి అందానికి తగ్గ మంచి అందగత్తెను
చూసి పెళ్ళిచేయాలి,'' అన్నాడు. ``మీరు ఎవరనుకుంటే, ఆ వధువుతో అబ్బాయికి
పెళ్ళి జరపడంలో మాకెలాంటి అభ్యంతరమూ లేదు,'' అన్నారు రాణులు ముక్త కంఠంతో.
నలుగురు రాణులూ జ్యోతిష్కులను పిలిపించి యువరాజుకు తగిన వధువును
చూడమన్నారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజు, ``వధువు ధనవంతుల బిడ్డయినా, పేదింటి
పిల్లయినా ఫరవాలేదు. యువరాజు అద్భుత రూపానికి తగ్గట్టు అందచందాలతో ఉండడం
చాలా అవసరం. భార్యాభర్తలు ఈడూజోడూగా ఉండాలి,'' అన్నాడు. ``చిత్తం ప్రభూ,
యువరాజుకు తగిన అందాలరాశి కనిపించగానే వచ్చి చెబుతాము,'' అంటూ జ్యోతిష్కులు
వెళ్ళిపోయారు. వాళు్ళ రాజ్యమంతా తిరిగి చూశారుగాని, యువరాజు రూపానికి
సరితూగగల అందమైన యువతిని కనుగోనలేకపోయారు.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అదే సమయంలో తన కోసం పెద్దలు వధువును
అన్వేషిస్తున్నారు అని తెలియగానే, యువరాజు తల్లి వద్దకు వెళ్ళి, ``అమ్మా,
అప్పుడే నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు,
నచ్చిన వధువును నేనే చూసుకుంటాను. మీకా విచారం వద్దు. ప్రస్తుతానికి
వధువును వెతికే పని వద్దని నాన్నగారికి చెప్పు,'' అన్నాడు. భార్య ద్వారా
కొడుకు అభిప్రాయాన్ని తెలుసుకున్న రాజు బాధపడ్డాడు.
కొడుకును పిలిచి, ``మీ తల్లితో వధువును చూడవద్దని ఎందుకు చెప్పావు?
అది నాకు అవమానం తెచ్చిపెడుతుంది కదా. ప్రజలు నన్ను పిసినారి అని
నిందించరా? లేకలేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు యుక్తవయస్కుడైనా పెళ్ళి
చేయలేదేమని నన్ను గురించి హేళనగా మాట్లాడుకుంటారు కదా? అది నాకు కావాలా?''
అని నిలదీశాడు. యువరాజు బదులేదీ చెప్పకుండా మౌనం వహించాడు. అది రాజుకు
మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
``నా మాట విని పళ్ళి చేసుకోకపోతే, నువు్వ ఉండవలసింది రాజభవనంలో కాదు;
చెరసాలలో. పెళ్ళి చేసుకోనన్నాడని కొడుకును చెరసాలలో పెట్టాడని ప్రజలు
నిందించినా లెక్కచేయను,'' అన్నాడు ఆవేశంతో. అప్పటికీ యువరాజు
నోరువిప్పకపోవడంతో రాజు మంత్రిని పిలిపించి, ``అడ్డు ప్రశ్నలు వేయకుండా,
యువరాజును తీసుకెళ్ళి చెరసాలలో బంధించు. అతడు పెళ్ళికి ఒప్పుకునేంత వరకు
అక్కడే ఉంటాడు.
ఇది నా ఆజ్ఞ,'' అన్నాడు ఆవేశంతో. యువరాజు మంత్రివెంట నడిచాడు.
చెరసాలలో బంధించాక, ``రాజుగారి ఆనతిని తమరు పాటిస్తే, మేము మిమ్మల్ని
ఎంతగానో గౌరవించగలం,'' అని చెప్పి, బరువెక్కిన మనసుతో అక్కడి నుంచి
వెనుదిరిగాడు మంత్రి. కొంత సేపయ్యాక అక్కడికి వచ్చిన రాజు కాపలాభటులను,
``మా రాణులే వచ్చి అడిగినా వాణ్ణి విడిపించకండి. వాడి మీద ఎలాంటి సానుభూతీ,
గౌరవమర్యాదలూ చూపకండి. ఇతర ఖైదీలను చూసుకున్నట్టే చూసుకోండి. `పెళ్ళికి
సమ్మతమా?' అని రోజూ అడగండి. వాడు `సమ్మతం,' అని చెప్పినప్పుడు నా వద్దకు
వచ్చి చెప్పండి.
నేనే
స్వయంగా వచ్చి వాణ్ణి విడిపిస్తాను,'' అని ఆజ్ఞాపించివెళ్ళాడు. కాపలాభటులు
రాజాజ్ఞను తు.చ. తప్పకుండా పాటించసాగారు. రోజూ యువరాజును, ``పెళ్ళికి
సమ్మతమా?'' అని అడిగేవారు. యువరాజు ``కాదు,'' అనేవాడు. ఇలా కొన్నాళు్ళ
గడిచాయి. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో కాపలాభటులకు ఎవరో మాట్లాడుకోవడం
వినిపించింది. కాని రూపాలు కనిపించలేదు. ఆ సంభాషణలను బట్టి, అవి వవిత్ర
వనాలను పాలించే దేవరాజు కుటుంబానివని తెలిసింది.
యువరాజు చెరసాలలో ఉన్నాడని వారికి తెలియడంతో చూడడానికి వచ్చారు. కాపలా
భటులు చెవులు రిక్కించి వినసాగారు: ``యువరాజుకు భార్య కాతగినవారు మానవులలో
ఎవరూ లేరు. కాబట్టి ఆయన మన ఇద్దరు కుమార్తెలలో ఒకరిని భార్యగా
స్వీకరించడానికి అంగీకరించ వచ్చు,'' అన్నాడు దేవరాజు.
``అందుకు మన అమ్మాయిలు అంగీకరించాలి కదా?'' అన్నది ఆయన భార్య. ఆ మాట
వినగానే, ``మీకు సమ్మతమయితే నాకూ సమ్మతమే. ఈ రాత్రికి నన్ను ఇక్కడ
ఉండడానికి అనుమతించినట్టయితే, యువరాజును వివాహానికి సమ్మతించేలా చేయగలను,''
అన్నది దేవరాజుగారి పెద్ద కుమార్తె. తల్లిదండ్రులు అందుకు అంగీకరించి
ఆమెను అక్కడే వదిలి వెళ్ళారు. ఆమె చెరసాలలోకి ఊచలగుండా ప్రవేశించింది.
యువరాజు గాఢనిద్రలో ఉన్నాడు. ఆమె మంచం సమీపంలో కూర్చున్నది. కొంతసేపటికి
ఎవరో తన గదిలో ఉన్నట్టు గ్రహించిన యువరాజు కళు్ళ తెరిచి చూశాడు.
ఎదురుగుండా కనులు చెదిరే అద్భుత సౌందర్యంతో ఒక యువతి కూర్చుని ఉండడం
చూసి, మూసివున్న ఈ గది లోపలికి ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యపోయాడు. ఆమె
అందమైన చిరునవు్వకు మంత్రముగ్థుడై పోయినట్టు మైమరచి పోయాడు. కొంత సేపటికి,
``నన్ను వివాహ మాడగలవా?'' అని అడిగాడు. ``సంతోషంగా,'' అన్నది ఆ యువతి. ఆ
యువతి కేవలం సౌందర్యవతి మాత్రమే కాదనీ, కొన్ని అద్భుత శక్తులు కలదనీ
యువరాజు గ్రహించాడు.
తన
వేలి ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగాడు, ఆమె ఉంగరం కేసి ఆశగా చూశాడు. ఆమె
ఉంగరం తీసి యువరాజు వేలికి వేసింది. పెళ్ళితంతు పూర్తయింది!
తెల్లవారుతూండగా గది కేసి వచ్చిన కాపలాభటులు యువరాజుతో పాటు ఒక అందాల యువతి
ఉండడం చూసి అమితాశ్చర్యం చెందారు. ఒక భటుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు ఆ
వింత దృశ్యం గురించి చెప్పాడు. రాజూ, నలుగురు రాణులూ హుటాహుటిగా అక్కడికి
వచ్చారు.
ఇన్నాళు్ళ తనకు నచ్చిన వధువు లభించకపోవడం వల్లే యువరాజు పెళ్ళి
వద్దంటూ వచ్చాడనీ; ఇప్పుడు అపురూప సౌందర్యవతి లభించడంతో వెంటనే వివాహ
మాడాడనీ గ్రహించి వాళు్ళ ఆనందాశ్చర్యాలు చెందారు. కొడుకునూ, కోడలినీ
మనసారాదీవించారు. రాజ్యమంతటా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు!
No comments:
Post a Comment