వెంకప్ప అన్నదము్మల్లో ఆఖరివాడు. వాడికి అన్నలందరికంటే చదువు బాగా
వచ్చింది. చాలా తెలివైనవాడని విద్య నేర్పిన గురువు అన్నాడు. కాని,
చిన్నప్పటి నుంచీ వాడి ధోరణి ఎరిగిన అన్నలు మాత్రం, ``తెలివితేటలున్నా,
వీడికి లోకజ్ఞానం లేదు. ఇలాంటివాడు రాజుగారి కొలువులో ఉద్యోగానికి తప్ప
మరెందుకూ పనికిరాడు. వీడికి అక్కడ ఉద్యోగం వేయించు,'' అని తండ్రికి
చెప్పారు. ఇందుకు వెంకప్ప ఒప్పుకోక, తండ్రితో, ``రాజుగారి కొలువులో ఉద్యోగం
చేయడం నా కిష్టమే.
కాని, నేను అన్ని పనుల్లోనూ పనికివస్తానని తేలాకే, అక్కడికి వెళతాను.
ఒక్కయేడాది నాకు వ్యవసాయం చేసే అవకాశం ఇవు్వ. నా శక్తి రుజువు చేస్తాను,''
అన్నాడు. తండ్రి వాడికి అయిదెకరాల భూమి ఇచ్చాడు. వెంకప్ప మట్టిని
పరీక్షించి, అందులో ఏది బాగా పండుతుందో నిర్ణయించి, ఆ పంట వేశాడు.
వాతావరణంలోని మార్పులను శ్రద్ధగా గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఆ ఏడు వాడి పొలం విరగపండింది. అన్నలకంటె ఎక్కువ దిగుబడి సాధించాడు.
వెంకప్ప పంటనంతా అప్పటికప్పుడే అమ్మివేసి, డబ్బు చేసుకున్నాడు. బాగా
సంపాయించానన్న ఉత్సాహంలో, కాస్త విలాసంగా ఖర్చు పెట్టాడు. ఆరు నెలలు
గడిచేసరికి వాడి దగ్గిర డబ్బంతా అయిపోయింది. తిరిగి కొత్త పంట వేయడానికి
పెట్టుబడికి గాను ఏమీ మిగలలేదు. అయితే, వాడికంటె తక్కువ భూమిలో, అంతకంటె
తక్కువ పంట పండినవారు కూడా సుఖంగా వున్నారు. ఇందుక్కారణం లేకపోలేదు.
మిగతావాళ్ళందరూ, మంచి ధర వచ్చేదాకా ఆగి పంట అము్మకున్నారు. పొలమంతా
ఒకే పంట వేయకుండా, ఇంట్లోకి అవసరం అయిన ఇతరత్రా పంటలు కూడా వేశారు. వెంకప్ప
మొత్తమంతా అమ్మివేయడం వల్ల, తనక్కావలసిన తిండి గింజలు కూడా, తను
అమ్మినదానికి రెట్టింపు ధరకు కొనుక్కోవలసి వచ్చింది. ``వీడు
వెర్రివెంగళప్పఅనిమేం ముందే చెప్పాం. తొందరగా వీడికి ఉద్యోగం వేయించు,''
అని అన్నలు తండ్రిని హెచ్చరించారు. వెంకప్ప తండ్రి కాళు్ళ పట్టుకుని,
``వ్యవసాయం నాకు అచ్చిరాలేదు.
అయినా, అది ఒంట్లో బలం వున్నవాళు్ళ చేయవలసినపని. నాకు బుద్ధిబలం
వున్నది. నేను వ్యాపారం చేస్తాను. ఒక వెయ్యి వరహాలు ఇవు్వ,'' అని అడిగాడు.
తండ్రి వాడికి వెయ్యి వరహాలు ఇచ్చాడు. వెంకప్ప ఊళ్ళో ఏ వస్తువు ఎంత ధరకు
అము్మడుపోతున్నదో చూశాడు. చుట్టుపక్కల ఆ వస్తువులు చవగ్గా దొరికే
ప్రాంతాలేవో తెలుసుకున్నాడు.
అక్కడి నుంచి సరుకు కొని తెచ్చి, ఊళ్ళో మిగిలినవాళ్ళకంటె కాస్త చవగ్గా
అమ్మడం ప్రారంభించాడు. వాడి వ్యాపారం దినదిన ప్రవర్థమానమై పోయింది. మొదటి
రెండు, మూడు మాసాల్లోనే తండ్రి వాడికిచ్చిన వెయ్యి వరహాలనూ, పదివేలవరహాలు
చేశాడు. అన్నలు తనను అందరివద్దా వెర్రివెంగ ళప్ప అంటారని వాడికి తెలుసు.
అందుకని వెంకప్ప పనిగట్టుకుని ప్రతి వ్యాపారస్థుడి దగ్గిరకూ వెళ్ళి, ``ఈ
రెండూ, మూడూ మాసాల్లో నా దగ్గిర డబ్బు పది రెట్లయింది.
మీ అందరిక్కూడా అంత పెద్ద లాభాలు వస్తున్నయ్యా?'' అని అడిగాడు. ఒక్క
వ్యాపారి కూడా తనకు పెద్దగా లాభాలు వస్తున్నవని ఒప్పుకోలేదు. ``నీకు అంత
పెద్ద లాభాలు ఎలా వస్తున్నయ్యో, మాకు అంతు చిక్కడం లేదు. అతి కష్టం మీద, మా
పెట్టుబడి మాకు తిరిగి వస్తున్నది,'' అన్నారు వాళు్ళ. వెంకప్ప
ఆశ్చర్యపోయి, తనంత తెలివైనవాడు లేడనుకున్నాడు. సంపాయించిన డబ్బును ఇష్టం
వచ్చినట్టు ఖర్చు పెట్టేవాడు. నెలకు ఒక వెయ్యి రూపాయలు దాచగలిగితే చాలునని
వాడి అభిప్రాయం.
ఆరు మాసాలు గడిచాక ఉన్నట్టుండి వెంకప్ప దగ్గిరకు, రాజుగారి పన్నులు
వసూలు చేసే అధికారి వచ్చి, ``వ్యాపారంలో నీకు ఇటీవల బాగా లాభాలు వచ్చాయి
కదా?'' అని అడిగాడు. ``అవును. ఈ ఊళ్ళో ఎవరికీ రానంతగా వచ్చాయి,'' అన్నాడు
వెంకప్ప. ``నీ లాభాల సంగతి, నా దాకా వచ్చింది. నువు్వ, రాజుగారికి
ముపై్ఫవేల వరహాలు పన్నుగా చెల్లించవలసి వున్నది,'' అన్నాడు అధికారి.
``పన్నేమిటి?'' అంటూ ఆశ్చర్యపోయాడు వెంకప్ప. ``నీకు వచ్చిన లాభాల్లో
ముపై్ఫశాతం రాజుగారికి పన్నుగా కట్టాలి. ఇంతవరకూ నీకు లక్షవరహాలు లాభం
వచ్చింది. అంటే, ముపై్ఫవేల వరహాలు పన్నుకట్టాలి. నీలాగే మిగతా వ్యాపారులు
కూడా పన్నుకట్టాలి. త్వరగా పన్ను చెల్లించు,'' అన్నాడు అధికారి. వెంకప్పకు
గుండె ఆగినంత పనైంది. తను మళ్ళీ తండ్రి దగ్గిర అప్పు చేసి, ఈ పన్ను
చెల్లించాలి. మిగతా వ్యాపారులు లాభాలు రావడంలేదని ఎందుకన్నారో, వాడికప్పుడు
అర్థమైంది.
వెంకప్ప తండ్రి, పన్నులు వసూలు చేసేఅధికారికి సర్దిచెప్పి పంపేసి,
``నీ అన్నలు చెప్పినట్టు, నువు్వ నిజంగా వెర్రివెంగళప్పవే! మనం రాజధానికి
వెళదాం, అక్కడ నీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను,'' అన్నాడు వెంకప్పతో.
వెంకప్ప అవమానంతో తల వంచుకుని, ``నా ఉద్యోగం నేను సంపాయించుకోగలను.
వ్యాపారంలాంటి అబద్ధాలు పలకవలసిన వృత్తిలో నేను రాణించలేకపోవచ్చు.
కాని, నా తెలివితేటలతో రాజుగారిని మెప్పించగలను,'' అన్నాడు. తండ్రి ఒక
క్షణం ఆలోచించి, ``సరే, అలాగే చెయ్యి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో! ఎంత
గొప్పవాళ్ళకైనా సరాసరి వెళ్ళగానే రాజదర్శనం లభించదు. ఎవడైనా గొప్పవాడి
ద్వారా రాజుగారి ప్రాపకం సంపాయించుకో. నీవల్ల పని కాకపోతే మాత్రం, నాకు
కబురు చెయ్యి. వచ్చి సాయం చేస్తాను,'' అన్నాడు. వెంకప్ప రాజధానీనగరం
చేరాడు. ఆ రోజు రాజుగారు మహాకవి అప్పన్నకు కనకాభిషేకం చేస్తున్నాడు. జనం
తండోపతండాలుగా వెళుతున్నారు. ఆ విశేషం చూడ్డానికి వెంకప్ప కూడా వెళ్ళాడు.
రాజ్యంలోని ప్రముఖలందరూ మహా కవికి ప్రణామాలు చేయడం వెంకప్ప చూశాడు.
రాజు స్వయంగా ఒక పళ్ళెంనిండా బంగారు నాణాలు తెచ్చి, పురోహితులు మంత్రపఠనం
చేస్తూండగా, అప్పన్నను అభిషేకించి, పాదాభివందనం చేశాడు. అప్పన్న రాజును
ఆశీర్వదించాడు. జయ జయ ధ్వానాలతో సభ దద్దరిల్లి పోయింది. ఆ సాయంత్రం
వెంకప్ప, మహాకవి అప్పన్నను చూడబోయాడు.
ఎంతో సులువుగా వాడికి, ఆయన దర్శనం లభించింది. వెంకప్ప ఆయనకు వినయంగా
నమస్కరించి, ``నా తెలివి తేటలు ప్రదర్శించే అవకాశం ఇస్తే, ఎంతటివారినైనా
మెప్పించగలను. మీ మాట సాయంతో, నేను రాజుగారి కొలువులో ఉద్యోగం
సంపాయించుకోవాలనుకుంటున్నాను,'' అన్నాడు. అప్పన్న ఆశ్చర్యపోయి, ``నాయనా,
నువ్వెవరివో గాని వెర్రివెంగళప్పలాగున్నావు. అలా కాకపోతే, కొలువులో ఉద్యోగం
కోసం నా దగ్గిరకు రావు,'' అన్నాడు.
వెంకప్ప చిన్నబుచ్చుకుని, ``అంతా అన్నట్టే, మీరూ అన్నారు! రాజుగారి
చేత కనకాభిషేకం చేయించుకున్న మీకంటె గొప్పవారు, నా కెక్కడ దొరుకుతారు?''
అన్నాడు. అప్పన్న నవ్వి,`` వెర్రివాడా, ఈ సంగతి తెలియదా? ఒక కవిని
సన్మానించడం రాజుకు గౌరవకారణం అవుతుంది. అందుకే ఆయన నాకు కనకాభిషేకం
చేశాడు. అంతకంటె ఆయనకు నా మీద ప్రత్యేకాభిమానం అంటూ ఏమీ లేదు.
ఉద్యోగం కావాలంటే మంత్రి దగ్గిరకు వెళు్ళ, సేనాధిపతి దగ్గిరకు,
విదూషకుడి దగ్గిరకు వెళు్ళ. ఆఖరికి ఆయనగారి క్షౌరకుడూ, రజకుడూ అయినా, నీకు
సాయపడవచ్చు. సన్మానం ముగిశాక, నే నెవరినో కూడా రాజుకు గుర్తుండక పోవచ్చు,''
అన్నాడు. వెంకప్పకు ఈ ప్రపంచమంతా అయోమయం అనిపించింది. వాడు, తండ్రికి
కబురు పంపి, ఆయన ద్వారా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించి, అనామకుడుగా
చాలా కాలం సుఖంగా జీవించాడు.
No comments:
Post a Comment