Pages

Sunday, September 16, 2012

నేనెవరిని?

భధ్రయ్య నెమ్మదస్తుడు; అంతకు మించి భయస్తుడు! చిన్నతనంలోనే తల్లి తండ్రులు పోయిన భద్రయ్యను అతని తాత పెంచి పెద్ద చేశాడు. ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించి, వాటిని దగ్గరలో ఉన్న పట్నంలో అమ్ముతూ, గుట్టుగా సంసారం నెట్టుకువస్తున్నాడు.భద్రయ్యకు చంద్రకాంతతో పెళ్ళయిన ఏడాదిలోగా అతడి తాత చనిపోయాడు.

భద్రయ్య కట్నంతీసుకోలేదు గాని, చంద్రకాంత తల్లిదండ్రులు స్త్రీ ధనంగా ఆమెకు యాభైవేల రూపాయలు ఇచ్చారు. ఒక రోజు రాత్రి భర్తకు విస్తరిలో అన్నం వడ్డిస్తూ, "ఎన్నాళ్ళిలా ఎదుగూ బొదుగూ లేని బతుకు గడుపుతాం. నా దగ్గర యాభైవేల రూపాయలు ఉన్నాయి కదా? మనకున్న ఆ ఎకరం పొలం కూడ అమ్మేసి పట్నం వెళ్ళి, అక్కడ ఏదైనా చిన్న పచారీకొట్టు పెట్టుకుందాం," అన్నది చంద్రకాంత.

"పట్నంలో ఇంటి అద్దెలు విపరీతం కదా?" అన్నాడు భద్రయ్య.

"రేపు సొరకాయలు అమ్మేశాక, ఊరికి పెడగా,చౌకలో అద్దె ఇల్లు దొరుకుతుందేమో చూడు. ఈ కార్తీక మాసంలోనే వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజులు ఉన్నాయట," అన్నది చంద్రకాంత.

మర్నాడు అదేవిధంగా పట్నం సంతలో వ్యాపారం ముగించుకుని, భద్రయ్య ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు.తాను అనుకున్నంత తక్కువ అద్దెలో ఎక్కడా ఇల్లు కనిపించలేదు.సాయంకాలానికి పట్నం చివరలో ఒక పాతకాలపు ఇల్లు కనిపించింది.భద్రయ్య ఆ ఇంటిని సమీపించి, నాలుగుసార్లు తలుపు తట్టిన మీదట,ఒక ముసలాయన,"ఏం కావాలి?" అంటూ తలుపు తెరిచాడు.

"మీ ఇంట్లో అద్దెకు వాటా ఏమయినా ఉందా?" అని అడిగాడు భద్రయ్య.

ముసలాయన భద్రయ్యను ఎగాదిగా చూసి,"నేను ఈ ఇల్లు అమ్మేసి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెల క్రితమే దీనిని యాభైవేలకు కొన్నాను. అదే ధరకు నీకు ఇచ్చేస్తాను.కొంటావా?" అని అడిగాడు.

భద్రయ్య ఇల్లంతా తిరిగి చూశాడు. అంత పెద్ద ఇల్లు తమ పల్లెటూళ్ళో కూడ యాభైవేలకు రాదు. అయితే,ఉన్న సొమ్మును ఇంటికే పెట్టేస్తే వ్యాపారం ఎలాగా? అని అలోచించసాగాడు.

భద్రయ్య ఆలోచనలో పడటం చూసి,"పోనీ,నలభైవేలకే ఇస్తాను. వారంలోరా," అన్నాడు ముసలాయన.

మర్నాడు చంద్రకాంతను పట్నం తీసుకువెళ్ళాడు భద్రయ్య. విశాలంగా ఉన్న ఆ ఇంటినీ, పెరటి తోటనూ,ఏపుగా పెరిగి ఉన్న కొబ్బరి, మామిడిచెట్లనూ చూసి మురిసిపోయింది చంద్రకాంత.పొలం అమ్మిన డబ్బుతో భార్యాభర్తలు ఇల్లు కొనేశారు. వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు. ఉన్న సామానులను ఆ ఇంట్లో అందంగా సర్దింది చంద్రకాంత.రెండు కిటికీలున్న పెద్ద గదిలో పందిరిమంచం వేసింది.

ఆ రాత్రి భోజనం చేశాక,"ఇది మనసొంత ఇల్లు. వారం రోజులుగా అలిసిపోయాను. ఈ పూట హాయిగా నిద్రపోతాను," అన్నది చంద్రకాంత పెద్దగా ఆవులిస్తూ.

కిటికీలలోంచి చల్లటి గాలి వీస్తూండడంతో, పడుకోగానే నిద్ర ముంచుకు వచ్చంది భార్యాభర్తలకు. అర్ధరాత్రి కావస్తూండగా ఏదో భీకరశబ్దం వినవచ్చి,ఉలిక్కిపడిలేచారు. మంచం అదురుతోంది. గదిలో సామాను కంపిస్తోంది. అంతలో వికృతమైన నవ్వుతో పాటు,"నేనెవరిని?" అనే ప్రశ్న వినిపించింది.భయంతో గడగడలాడుతూన్న ఆ ఇద్దరికీ నోరు పెగలలేదు.

"చెప్పండి,నేనెవరిని?" అని రెట్టించింది ఆ భీకరస్వరం.

ముందుగా చంద్రకాంతే దైర్యం కూడ దీసుకుని,"మాకు తెలియదు," అన్నది మెల్లగా.

మరుక్షణమే ఇద్దరి వీపుల మీదా రెండు కొరడా దెబ్బలు పడ్డాయి. వీపు మీద వాతలు తేలి భగ్గుమనడంతో కెవ్వుమన్నారు.వాళ్ళ అరుపులు విని పెద్దగా నవ్వుతూ,"రేపు ఇదే వేళకు వచ్చి ఇదే ప్రశ్న వేస్తాను. సమాధానంతో సిద్ధంగా ఉండండి," అని హెచ్చరించిందా వికృతస్వరం.

ఆ రాత్రంతా భార్యాభర్తలకు నిద్రలేదు. అక్కడ దయ్యం ఉండడం వల్లే, ఆ ముసలాయన చవగ్గా దానిని తమకు అంటగట్టాడని గ్రహించి, ఏం చెయ్యాలో తెలియక సతమత మయ్యారు.

మర్నాడు అర్ధరాత్రి అదే భీకరస్వరం "నేనెవరిని?" అని ప్రశ్నించింది.

"పిశాచానివి! దయ చేసి మమ్మల్ని భాధించకు," అని వేడుకున్నారు భార్యాభర్తలు.

అయినా కొరడా దెబ్బలు తగిలాయి.

మూడో రాత్రి "నేనెవరిని?" అన్న ప్రశ్నకు,"మా పాలిటి దేవుడివి. మమ్మల్ని కరుణించు," అన్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తప్పలేదు.

అది మొదలు ప్రతి రాత్రి, ఆ అదృశ్య స్వరం "నేనెవరిని?" అని ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం చెప్పినా, ఎంతగా పొగిడినా వాళ్ళకు కొరడా దెబ్బలు తినక తప్పడం లేదు. ఈ భాధతో భద్రయ్య ఇంకా వ్యాపారం ఆరంభించనేలేదు.

ఇలా ఉండగా వాళ్ళ కొత్త ఇల్లు చూడడానికి చంద్రకాంత పిన్నమ్మ కొడుకు ఒక సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చుట్టి చూసి, "లక్షకు పైగా ఖరీదు చేసే ఇల్లు, నలభైవేలకు ఎలా వచ్చిందబ్బా?"అన్నాడు ఆశ్చర్యపోతూ.

భద్రయ్య ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు.

తమ్ముణ్ణి తొందరగా పంపించేయాలని చంద్రకాంత చీకటి పడగానే అతనికి భోజనం పెట్టేసింది. అయినా అతడు వెళ్ళేలా కనిపించలేదు. ఆ కబురూ ఈ కబురూ చెబుతూ, గదిలో పడుకోవడానికి ఒక పక్కగా చాప వాల్చుకున్నాడు.

"నువ్వు ఊరికి బయల్దేరలేదా? ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా?"అని ఆదుర్దాగా అడిగింది చంద్రకాంత.

"అలా కంగారు పడతావేంటి? తెల్లవారాక పట్నంలో కొద్దిగా పని ఉంది నాకు," అన్నాడతడు.

"రాత్రికి ఇక్కడే ఉంటే, నీకూ కొరడా దెబ్బలు తప్పవు," అంటూ నోరు జారింది చంద్రకాంత. "కొరడా దెబ్బలేమిటి?" అని తెల్లబోయాడు అతడు.

భద్రయ్య కల్పించుకుని, "ఇంట్లో దోమలు ఎక్కువ.అవి కుడితే,కొరడాతో కొట్టినంత బాధగా ఉంటుందట మీ అక్కకు," అంటూ సర్ది చెప్పబోయాడు.

"అది కాదు," అంటూ చంద్రకాంత, తమ్ముడికి ఆ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న తతంగమంతా చెప్పేసి," ముప్ఫై వేలు వచ్చినా ఈ ఇల్లు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నాడు మీ బావ," అన్నది.

"ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తోంది. ఇంటి బేరం సంగతి రేపు అలోచిద్దాం," అంటూ అతడు చాప మీదే గుర్రుపెట్టి నిద్రపోయాడు.

అర్ధరాత్రి కాగానే,గది అంతా కంపించి రోజూలాగే,"నేనెవర్ని?" అనే భీకరస్వరం వినిపించింది.

అంతవరకూ నిద్రపట్టక, మంచం మీద అటూ ఇటూ దొర్లుతూన్న భద్రయ్య, అదిరి పడిలేచి,"ఆంజనేయులూ....దయ్యం... దయ్యం..కాపాడు," అంటూ భయంతో బావమరిదిని పిలవసాగాడు.

బావమరిది ఆంజనేయులు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.

"నేనెవరిని?"అని మళ్ళీ గద్దించింది భీకరస్వరం.

"నువ్వెవరివా? అసలు నేనెవరో నీకు తెలుసా? ఆంజనేయుల్ని! రోజూ నిద్రాభంగం కలిగించి మావాళ్ళను బాధిస్తూన్న నీ పని పట్టడానికే వచ్చాను. నిన్ను వదిలి పెట్టను. నాకు ఇప్పుడు నిద్ర ముంచుకువస్తోంది. నువ్వెవరో రేపు చెబుతాను," అన్నాడు ఆంజనేయులు.

"ఎప్పుడు చెబుతావు? ఎక్కడ చెబుతావు?" అని అడిగింది కంఠస్వరం.

"ఆ సంగతి ఇప్పుడే అడిగితే ఎలా? రేపు ఏ చింత చెట్టుకో నిన్ను బంధించి, మేకు దిగవేసేప్పుడో,... సీసాలో బంధించి, భూస్థాపితం చేసేప్పుడో.... నువ్వెవరివో చెబుతాను," అన్నాడు ఆంజనేయులు మరింత పెద్దగా నవ్వుతూ.

మరుక్షణమే కీచుమనే అరుపు, ఆ వెంటనే,"బాబ్బాబు, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు అన్నంతపనీ చేయకు," అనే మాటలతో పాటు దభీమంటూ ఒక చిన్న మూట మంచం మీద పడింది. అలా పడడంతో మూట ముడి విడిపోయి బంగారు కాసులు మంచమంతా చిందరవందరగా పడిపోయాయి. అన్ని కాసుల్ని ఒక్కసారిగా చూడడంతో భద్రయ్యకు మూర్ఛ వచ్చినంత పనయింది. ఆంజనేయులు అతడి భుజం పట్టుకుని కుదపడంతో, "నేనెవరిని?" అన్నాడు అయోమయంగా చూస్తూ.

"నువ్వు భద్రయ్యవి. పైగా మగాడివి; ఈ ఇంటి యజమానివి! మనిషికి ఇంత పిరికితనం, మొహమాటం పనికిరాదు.భయపడేవాళ్ళనే ఎదుటివాళ్ళు మరింత భయపెడతారు. మీ మంచి మాటల్ని పట్టించుకోని ఆ దయ్యం, నేను గట్టిగా బెదిరించేసరికి పారిపోయింది. ఇన్నాళ్ళ మీ కష్టాలకు పరిహారం చెల్లించి మరీ వెళ్ళింది.దెబ్బకు దయ్యం జడుస్తుంది అంటారు కదా! ఇకపైనైనా ధైర్యంగా వ్యాపారం చేసుకో బావా," అన్నాడు ఆంజనేయులు నవ్వుతూ.

"నా కన్నా చిన్నవాడివైనా పెద్ద జీవితసత్యం చెప్పి, నా కళ్ళు తెరిపించావు," అని,ఆ తరవాత కొంత ఆలోచించి,"దయ్యం బాధ తొలగడమే కాకుండా, నీ మూలంగా అనుకోకుండా ధనమూ సమకూరింది. నీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రారంభించబోయే వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను.ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది కదా," అంటూ భద్రయ్య బావమరిదిని మనసార మెచ్చుకున్నాడు.

అందుకు సమ్మతిఇస్తున్నట్టు ఆంజనేయులు చిన్నగా నవ్వాడు. 

No comments:

Post a Comment