Pages

Sunday, September 16, 2012

పాతాళరాక్షసుడు


మగధదేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి, వేరు వేరు తరగతులమధ్య కలహాలుగా పరిణమించి, అరాజక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారూ, వృత్తుల వారూ, కులాల వారూ, తమ తమ వృత్తులకూ, వ్యాపకాలకూ ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్టుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టటానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు.
 
కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింతగా అంతఃకలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రీ, పురోహితుడూ అయిన యజ్ఞశర్మను, ``ప్రజాజీవితం ఇలా కంటకప్రాయం అయిపోతున్నదేం? ఈ పరిస్థితులలో సరి అయిన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి వుంటుంది?'' అని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, ``రాజా, నీ అనుమానాలు తీరగలందులకు ఒక చిన్న ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను!'' అంటూ ఇలా చెప్పసాగాడు: పాతాళలోకంలో రాక్షసరాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో, అఘోరుడు అనే రాక్షసుడు అల్లరులు లేవనెత్తి, అలజడి కలిగించ సాగాడు.
 
అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది. వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగు పెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండీ దొరకక మనుషులుండే ప్రాంతాలకు వచ్చి, అందిన మనుషులను అందినట్టు విరుచుకు తినసాగాడు. ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది.

అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతా నికి వస్తాడో తెలియదు. ఏ క్షణాన ఎవరికి చావుమూడుతుందో తెలియదు. భూలోకంలో చాలా దేశాలున్నాయి. ఎవరి భాష వాళ్ళది. ఎవరికి వాళ్ళే అందరికన్నా గొప్పవాళు్ళ. ఏ రెండు దేశాలకూ పడదు. ప్రతి దేశమూ ఇతర దేశాలను జయించి, వాటిపై పెత్తనం చలాయించాలని చూస్తుంది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి.
 
అందులో పైచెయ్యిగా ఉండటానికి కొత్తకొత్త మారణాయుధాలు కనిపెట్టబడుతూ ఉంటాయి. ఆఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుంచి కాపాడటానికి ప్రయత్నించారు. కాని తాటిచెట్టు ప్రమాణంగల అఘోరుడి శరీరం మామూలు ఆయుధాలను లక్ష్యపెట్టేది కాదు. వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు.
 
వ్యక్తుల శౌర్యపరాక్రమాలు రాక్షసుడి మీద పనిచెయ్యవనీ, ఈ రాక్షసుడి వల్ల అన్నిదేశాల ప్రజలకూ ప్రమాదమేననీ స్పష్టమయింది. అప్పుడు దేశదేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై, కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకీ అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: ``లక్ష చీమలు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి. గడ్డిపోచలను కలిపి వేసిన తాడు మదపుటేనుగును బంధించటానికి పనికి వస్తున్నది.
 
ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీది మనుషులంతా ఒకటైతే ఆ రాక్షసుణ్ణి ఎదుర్కోవడం పెద్ద సమస్య కానేకాదు.'' ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. అఘోరుణ్ణి ఎదుర్కోవడం కోసం మర్నాడే ప్రజలంతా ఒకచోట కూడ సాగారు.
 
వందలూ, వేలతో ఆరంభమై జనసమూహం లక్షలకూ, కోట్లకూ చేరుకున్నది. భాషలను గురించీ, సంస్కృతులను గురించీ మరచిపోయి, అందరూ ఒక్కటైపోయారు. ఈ మహాసైన్యం రెండురోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది. వెంటనే రాక్షసుడికీ, జనసమూహానికీ యుద్ధం ఆరంభమయింది. వాణ్ణి చూసిగాని, వాడి పాదాల కింద నలిగి చస్తామని గాని ఎవ్వరూ భయపడలేదు.

క్షణాలమీద పోయి అఘోరుణ్ణి ఆపాదమస్తకమూ మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడూ తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం ధాటికి తన వజ్రశరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగు లంకించుకున్నాడు. పరిగెడుతున్న వాడి కాళ్ళకింద ఎందరో నలిగి చచ్చారు.
 
వాడి శరీరం మీదికి పాకిన మనుషులు కిందికి దూకి కాళూ్ళ, చేతులూ విరుచుకున్నారు. అయితేనేం? ప్రజలకు వాడి పీడ వదిలింది. అటు తరవాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి రెండు మూడు ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యాడు. తరవాత వాడు అరణ్యాలను ఆశ్రయించి, తన జీవన విధానం మార్చుకుని, పొదుపుగా జంతువులను చంపితిన సాగాడు. లేకపోతే వారం రోజుల్లో అడివంతా ఖాళీ అయి, తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడది కనిపించింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యిచాచి, ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ ఆడది రాక్షసిగా మారిపోయి వాడికి దిగ్భ్రమ కలిగించింది. ఆ రాక్షసిని వాడు పాతాళలోకంలో ఎరుగును.
 
ఆమె పేరు అఘోరిక. ఆమె ఇలా అన్నది: ``నువు్వ వెళ్ళిపోయాక పాతాళలోకం చిన్నబోయిందనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషిరూపంలో వచ్చాను.'' అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు.
 
అఘోరిక నవ్వి, ``వెర్రివాడా, మనుషులు బలంగల వాళు్ళ కాకపోయినా, తెలివిగల వాళు్ళ. వాళ్ళను బలంతో కన్న తెలివితో ఎదుర్కోవాలి! మనం వాళ్ళమధ్య వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ, వాళ్ళను మోసం చెయ్యాలి. అప్పుడు జీవితం పాతాళలోకంలో కన్న బాగుంటుంది!'' అన్నది. రాక్షసులిద్దరూ మానవరూపాలు ధరించి, మానవుల మధ్య జీవించసాగారు.

మనుషులకు తెలివి తేటలుంటే ఉన్నాయేమో వాళు్ళ వట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్ళకు తెలిసిపోయింది. వాళు్ళ మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకుని మనుషులను ఒకరిమీద ఒకరిని రెచ్చగొట్టసాగారు. ప్రజలలో మళ్ళీ అన్ని రకాల భేదాలూ వచ్చేశాయి-భాషాభేదాలూ, జాతిభేదాలూ, కులభేదాలూ, మతభేదాలూ! మనుషుల మధ్య కొట్లాటలు ఎక్కువ అయ్యాయి.
 
అఘోరుడూ, అఘోరికా ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ, తమ మధ్యనే వున్న రాక్షసులను అనుమానించలేకపోయారు! రాక్షసులకు ఈ జీవితం చాలా బాగున్నది. వాళు్ళ భూలోకంలో శాశ్వతంగా ఉండిపోదలచుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకూ విస్తరించింది. వాళు్ళ తమ సంతతికి ఇలా హితబోధ చేశారు: ``మీరు రాక్షసులని తెలిస్తే మనుషులంతా ఒక్కటై పోతారు. మనిషిరూపంలోని రాక్షసుణ్ణి వాళు్ళ ఎంతో ఆదరిస్తారు.
 
అదే మనకు క్షేమం.'' అఘోరుడి సంతతి వాళు్ళ ఇప్పుడు అన్ని కులాలలోనూ, మతాలలోనూ, భాషలలోనూ, దేశాలలోనూ ఉండి, మనుషులంతా ఏకం కాకుండా చెయ్యగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి, మనుషుల మధ్య నుంచి వారిని తరిమివేయ గలిగే వరకూ భూమిమీద శాశ్వతమైన శాంతి నెలకొనదు! యజ్ఞశర్మ కథ ముగించి, ``రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతిజీవనాన్నే కోరుకుంటారు.
 
వారు పోరాటానికి దిగారంటే, వారిని అలా పురికొల్పిన శక్తులు వారి మధ్యనే ఉంటాయి. అరాజక పరిస్థితి వల్ల లాభం పొందేవారెవరో తెలుసుకొని, వారు ఎంత సన్నిహితులైనా, పలుకుబడి గలవారైనా సంకోచించకుండా పురుగేరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమై, సుస్థిరమైన శాంతి నెలకొంటుంది,'' అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి, తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసుల నందరినీ తొలగించి, మగధరాజ్యపు ప్రతిష్ఠను తిరిగి నెలకొల్పాడు.

No comments:

Post a Comment