Pages

Sunday, September 16, 2012

నిలబెట్టుకున్న మాట!


పొలంలో పనిచేస్తూ పిడుగుపాటుకు గురై తల్లిదండ్రులు మరణించడంతో కపిలుడనే క్షత్రియ బాలుడు అనాథ అయ్యాడు. కరుణా హృదయుడైన భూస్వామి వాణ్ణి చేరదీసి, తమ ఇంట పశువులు కాచే పనిని అప్పగించాడు. కపిలుడు రోజూ పశువులను దాపులనున్న అడవికి తోలుకుపోయి మేపుకుని వచ్చేవాడు. అలా వాడు ఒకనాడు పశువులను కాస్తూండగా అతడి ఈడువాడే అయిన కాశి అనే కురవ్రాడు పరిచయమయ్యాడు. క్రమంగా వాళ్ళిద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. రోజూ ఇద్దరూ కలుసుకునేవారు.
 
సాయంకాలం కపిలుడు ఆవులు తోలుకురావడానికి కాశి సాయపడేవాడు. ఒకనాడు కపిలుడు పశువులను తోలుకు వెళుతున్నప్పుడు, ఉన్నట్టుండి తీవ్రమైన అలసటకు లోనయ్యాడు. చెప్పరాని తలనొప్పి వచ్చింది. అతడు దూరంగా ఉన్న కాశిని పిలిచి, ``మిత్రమా, నాకెందుకో మరీ అలసటగా ఉంది. కాసేపు అక్కడ నడుం వాలుస్తాను. నేను వచ్చేంత వరకు నా పశువులను కాస్త చూసుకుంటావా?'' అని అడిగాడు.
 
అలాగే అంటూ కాశి పశువుల వెంట వెళ్ళాడు. కపిలుడు ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. కొంత సేపటికి దాపుల నున్న పుట్ట నుంచి వెలుపలికి వచ్చిన ఒక నాగుపాము, పడగవిప్పి కపిలుడి ముఖం మీద ఎండపడకుండా గొడుగులా పట్టసాగింది.
 
ఆ సంగతి కపిలుడికి తెలియదు. చాలా సేపయినప్పటికీ, కపిలుడు రాకపోయే సరికి, కాశి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. కపిలుడి తల మీద పాము పడగ విప్పి నీడ పడుతూన్న దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. కొంత సేపటికల్లా పాము అదృశ్యమై పోయింది. కాశి మిత్రుణ్ణి తట్టి లేపాడు. అతనికి ఎలాంటి అపాయం కలగనందుకు అమితానందం చెందాడు.

తను చూసిన అద్భుత దృశ్యాన్ని మిత్రుడికి వివరించి, ``దేవుడి దయవల్ల పాము నిన్నేమీ చేయలేదు. నువు్వ చాలా అదృష్టవంతుడివి కపిలా,'' అన్నాడు. పాము పడగపట్టిన విషయం ఊరు ఊరంతా వ్యాపించింది. కపిలుడు క్షేమంగా ఉన్నందుకు. భూస్వామితో సహా అందరూ సంతోషించారు. గ్రామంలోని కొందరు వృద్ధులయితే, ``కపిలుడికి రాజయోగం ఉన్నది. అతడు అదృష్టవంతుడు. ఈ దేశానికే రాజు కాగలడు,'' అని జ్యోస్యం చెప్పారు. దాన్ని విని, ``నిజం, నిజం,'' అంటూ అందరూ సంబర పడ్డారు.
 
గ్రామస్థులందరూ తమ గ్రామానికి చెందిన పశులకాపరి కుర్రాడు కపిలుడు తమ రాజ్యానికి రాజయ్యే రోజు అట్టే దూరంలో లేదని మాట్లాడుకో సాగారు. ఇదంతా విన్న కాశి ఒకనాడు ఉత్సాహం కొద్దీ కపిలుణ్ణి, ``నువు్వ రాజైతే, నన్ను మరిచిపోవు కదా?'' అని అడిగాడు. కపిలుడు కాశి రెండు చేతులూ పట్టుకుని, తన వక్షానికి ఆనించి, ``నిన్నెలా మరిచి పోగలను కాశీ? నేను రాజునైతే, నువ్వే నా మంత్రివి!'' అన్నాడు ఆవేశంతో.
 
మునుముందు తాను రాజు కాగలనని అందరూ చెప్పుకోవడం విని కపిలుడు పొంగిపోయాడు. భూస్వామి పశువులు కాయడం పట్ల ఆసక్తిని కోల్పోయాడు. తీవ్రంగా ఆలోచించాడు. తన మిత్రుణ్ణిసైతం సంప్రదించలేదు. అక్కడి నుంచి బయలుదేరాలని నిర్ణయించాడు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో భూస్వామి ఇంటి నుంచి బయట పడ్డాడు. రెండు రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగి, ఆఖరికి రాజధాని పూరీ చేరాడు. జగన్నాధ మందిరంలో పెట్టే ప్రసాదం తింటూ కాలక్షేపం చేయసాగాడు.
 
ఒకనాడు రాజ్యాన్నేలే భానుదేవ మహారాజు ఆలయంలో ప్రార్థన ముగించుకుని వెలుపలికి వస్తూండగా ఆయన చూపులు కపిలుడి మీద పడ్డాయి. పసివాడి మెరిసే కళు్ళ, అద్భుతమైన ముఖ వర్ఛస్సు ఆయన్ను ఆకర్షించాయి. ఆయన వాడి దగ్గరికి వెళ్ళి, ``ఎవరు నువు్వ? ఇక్కడేం చేస్తున్నావు?'' అని అడిగాడు. రాజు ప్రశ్నలకు ఉలిక్కిపడిన కపిలుడు వెంటనే తేరుకుని ధైర్యాన్ని కూడదీసుకుని, ``ప్రభూ! నేనొక పేద క్షత్రియ బాలుణ్ణి. నా పేరు కపిలుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అభాగ్యుణ్ణి. ఏదైనా పని ఇప్పించే దయామయుల కోసం చూస్తున్నాను,'' అన్నాడు వినయంగా.

రాజు అతడి మాటలకు, వినయానికి మరింత ముచ్చటపడి, ``నా భవనంలో పని చేస్తావా?'' అని అడిగాడు. ``చిత్తం, మహారాజా! తమరేపని ఇప్పించినా సంతోషంగా చేయగలను,'' అన్నాడు కపిలుడు. ఆ కురవ్రాణ్ణి రాజభవనానికి తీసుకురమ్మని భటులకు చెప్పి, రాజు రథం ఎక్కి బయలుదేరాడు. రాజభవనం చేరిన కపిలుడికి సకల సదుపాయాలతో విశాలమైన గది కేటాయించ బడింది.
 
రాజభటులతో కలిసి భోజనం చేసే వాడు. రాజు అతనికి ప్రత్యేకంగా ఏ ఉద్యోగమూ ఇవ్వలేదు గాని, రాజభవన ప్రాంగణంలో తిరుగుతూ అక్కడ చూసే విశేషాలను తెలియజేయమని చెప్పాడు. కపిలుడు గురప్రుశాల వద్ద చాలా సేపు గడిపేవాడు. రాజుగారి గుర్రాలను సైనికులు పోషించే పద్ధతులను ఆసక్తితో గమనించేవాడు. రాజు భానుదేవుడికి సంతానం లేదు. అందువల్ల ఆయన కపిలుణ్ణి సొంత బిడ్డలా చూసుకోసాగాడు. అతడికి విద్యాబుద్ధులు నేర్పాడు. రాజోచిత విద్యలలో శిక్షణ నిచ్చాడు.
 
యుద్ధ కళలను అభ్యసించేలా చేశాడు. యుక్త వయస్కుడు కాగానే అతన్ని ఉపసేనాధిపతిగా నియమించాడు. పలుయుద్ధాలలో పాల్గొని తన శక్తిసామర్థా్యలను నిరూపించే అవకాశాలు కపిలుడికి కలిగాయి. దాంతో రాజుగారి అభిమానానికి పాత్రుడయ్యాడు. ఇలా మరి కొంత కాలం గడిచేసరికి రాజు భానుదేవుడు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఒకనాడు ప్రధానమంత్రి కృష్ణదేవుణ్ణి పిలిచి, ``మహామంత్రీ, నేను మరెంతోకాలం బతకననిపిస్తోంది. కపిలుణ్ణి పుత్రసమానుడిగా నేను చూసుకుంటూన్న విషయం నీకు తెలియనిది కాదు.
 
నా తదనంతరం అతడే నా సింహాసనానికి వారసుడు కావాలన్నది నా కోరిక. అతడు దయామయుడూ, తెలివైనవాడూ, శక్తిసమన్వితుడూ అయిన ఆదర్శపాలకుడిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొనగలడని భావిస్తున్నాను,'' అన్నాడు. రాజు అభీష్టానుసారం కపిలుడికి యౌవ రాజ్యాభిషేకం చేయబడింది. యువరాజు కపిలుణ్ణి ప్రజలు అమితంగా గౌరవించారు. కొన్నాళ్ళకు అతడు కపిలేంద్ర దేవుడనే నామధేయంతో రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు.

ఈ వార్త కొన్నాళ్ళకు గ్రామంలోని కాశికి తెలిసింది. ఇప్పుడు తను వెళ్ళి రాజుగారిని దర్శిస్తే, తనను గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడా అని ఆలోచించాడు. రాజును దర్శించాలని అప్పటికప్పుడే బయలుదేరాడు. అతడు పూరీ రాజభవనం సమీపించాడు. కాని తాను రాజుగారి బాల్యస్నేహితుడినని చెబితే, భవన ద్వార కాపలా భటులు నమ్మలేదు. ``రాజుగారు జగన్నాధ ఆలయానికి వచ్చేప్పుడు చూడు.
 
వెళు్ళ,'' అని అక్కడి నుంచి గెంటేశారు. మరునాడు రాజుగారు దేవాలయానికి వెళ్ళే మార్గంలో కాశి జనంమధ్య నిలబడ్డాడు. దైవ దర్శనానంతరం రాజు వస్తూన్నప్పుడు, కాశి జనం నుంచి ముందుకువెళ్ళి రథానికి అడ్డంగా నిలబడ్డాడు. అతన్ని పక్కకు తప్పుకోమని ఒక భటుడు తోయబోయాడు. కాశి రాజును చూడాలని ప్రాథేయపడ్డాడు.
 
వారిద్దరి మధ్యా జరుగుతూన్న సంభాషణను ఆలకించిన రాజు, రథాన్ని ఆపమని అతన్ని పరిశీలనగా చూశాడు. ``రాజా, నేనే కాశిని. తమ గ్రామం వాణ్ణి. పాము పడగ విప్పి తమకు నీడ పట్టిన విషయం చూసి చెప్పిన వాణ్ణి. తమరు రాజు కాగలరని గ్రామంలోని పెద్దలు చెప్పారు కదా? తమ మిత్రుడు కాశిని మరిచిపోయారా?'' అన్నాడు కాశి. కాశి అనే మాట వినగానే పశులకాపరిగా గడచిన తన బాల్యమంతా రాజు మనసులో కదలాడింది. ఆయన రథం దిగివచ్చి కాశిని ఆప్యాయంగా కౌగిలించుకుని, ``నిన్నెలా మరిచి పోగలను మిత్రమా! రా, వెళదాం,'' అంటూ చేయిపట్టుకుని రథంలోకి ఎక్కించుకున్నాడు.
 
మరునాడు కొలువు తీరగానే రాజు కపిలేంద్ర దేవుడు, నిండు సభలో, ``నా బాల్య స్నేహితుడు కాశిని మంత్రిగా నియమిస్తున్నాను!'' అని ప్రకటించాడు. సభాప్రాంగణం హర్షధ్వానాలతో మారు మోగింది. కాశి ఆనందాశ్చర్యాలతో రాజుగారికి కృతజ్ఞలు తెలియజేశాడు.

No comments:

Post a Comment