చలపతికి ఐదేళ్ళ వయసులో తండ్రి చనిపోతే, తల్లి అలివేలమ్మ
విద్యాబుద్ధులు నేర్పి పెంచి పెద్ద చేసింది. కొడుక్కు జమీందారు దివాణంలో
ఉద్యోగం రాగానే, వనజ అనే చక్కని అమ్మాయిని చూసి పెళ్ళి చేసింది. చలపతి
కొద్ది కొద్దిగా డబ్బు చేర్చి కొన్నాళ్ళకు ఒక ముచ్చటయిన ఇల్లు కట్టాడు. ఆ
ఇంటికి తన తల్లి అలివేలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించి, ఆ మాట భార్యకు
చెప్పాడు.
అయితే, ఆ ఇంటికి తన పేరు పెడితే బావుంటుందని భార్య వనజ ఆశతో
సూచించింది. అష్ట కష్టాలు పడి తనను పెంచి ప్రయోజకుణ్ణి చేసిన తన తల్లి పేరు
పెట్టాలా? తనను పంచప్రాణాలుగా భావిస్తూన్న భార్య కోరికను మన్నించి ఆమె
పేరు పెట్టడమా? అన్న సందిగ్ధంలో పడ్డాడు చలపతి. ఎటూ తేల్చుకో లేక తన
స్నేహితుడు రాఘవుణ్ణి చూసి, తన సమస్యను చెప్పాడు. ``దీనికింత బాధ ఎందుకు?
నీ తల్లి ప్రేమ నాకు తెలియనిదా? మీ ఇంటి గోడమీద మీ అమ్మ పేరుకు బదులు కేవలం
`అమ్మ' అని రాయించు.
అది నీకు నీ తల్లిని గుర్తు చేస్తుంది. నీ పిల్లలు దాన్ని చూసి వాళ్ళ
అమ్మ ఇల్లు అనుకుంటారు. దాంతో నీ భార్య కూడా సంతోషిస్తుంది,'' అన్నాడు
రాఘవుడు. ``మంచి సలహా ఇచ్చావు రాఘవా. `అమ్మ'కు మించిన పేరు లేదు,'' అంటూ
చలపతి ఇంటికేసి నడిచాడు. ఇప్పుడు అతడి కొత్త ఇంటి పేరు `అమ్మ'. ఆ పేరును
చూసి చలపతి ఇంట్లో వాళ్ళే కాకుండా, ఆ వీధిలోని వాళ్ళందరూ సంతోషించారు. -
కంచనపల్లి వేంకట కృష్ణారావు
No comments:
Post a Comment