బాలానంద గురుకులంలో చదివే మణిరత్నం ఏం చెప్పినా సహవిద్యార్థులు
నమ్మేవారు కారు. ఎందుకంటే చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం అంటే వాడికి
మహాసరదా. ఒకనాటి సాయంకాలం వాడు ఏదో చెప్పడానికివస్తే, ``వద్దు, నాయనా, మేము
మీ మాట నమ్మం,'' అన్నారు విద్యార్థులు. ``నేను ఇప్పుడు అబద్ధం చెప్పడం
లేదు. నిజం, నా మాట నమ్మండి,'' అంటూ మణిరత్నం ప్రాథేయపడుతున్నప్పటికీ
``వద్దు, నిన్ను నమ్మం,'' అంటున్నారు పిల్లలు. ఆ సమయంలో అటుగా వచ్చిన
గురువు బాలానందుడు, విషయం గ్రహించి మణిరత్నంతో, ``చీటికి మాటికి అబద్ధాలు
చెప్పేవాడి గతి ఇంతే,'' అని చెప్పి పిల్లల కేసి తిరిగి, ``అయినా, ఎవరు ఏం
చెప్పినా అందులోని నిజానిజాలు గ్రహించాలి.
అంతేగాని, అల్ప విషయాలకు కూడా అబద్ధాలు చెప్పేవాడు కదా అని అతడు ఏం
చెప్పినా వినం అనడం భావ్యం కాదు. వెనకటికి ఒక దొంగ జరిగింది ఇదీ అని ఎంత
మొత్తుకున్నా ఎవరూ దాన్ని నిజమని ఒప్పుకోలేదు.
ఒక్కొక్కసారి నమ్మించలేని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఆ కథ
చెబుతాను, వినండి,'' అంటూ ఇలా చెప్పసాగాడు: పెనుగొల్లుకు చెందిన రంగనాధం,
రామనాధం బండి మీద పట్నం సంతకు వెళ్ళి, అక్కడ తాము తెచ్చిన ధాన్యం అమ్మి,
తమకు కావలసిన సరుకులు కొనుక్కుని, మిగిలిన డబ్బులను దుస్తుల్లో దాచుకుని,
వచ్చిన బండిలోనే తిరుగు ప్రయాణమయ్యారు. సగం దూరం వచ్చేసరికి వేసవి ఎండ
తీవ్రం కాసాగింది. బండిని లాగుతూన్న ఎడ్లు కూడా నురగలు కక్కుతూ ఆయాస
పడసాగాయి.
రహ దారికి పక్కన కొద్ది దూరంలో ఒక పాడు పడిన గుడి కనిపించడంతో, బండిని
అటు వైపు తిప్పి ఆపమన్నారు. బండివాడు గుడి దాపులనున్న చెట్టు కింద బండిని
ఆపాడు. కొంత గడ్డి తీసుకువెళ్ళి, గుడి ముందు అరుగు మీద పరిచాడు. ఆ ఎండు
గడ్డి మీద రంగనాధం, రామనాధం కూర్చున్నారు. బండివాడు ఎడ్ల ముందు గడ్డి వేసి,
బండి పక్కనే కూర్చున్నాడు.
ఆ సమయంలో అక్కడికి పెద్ద తలపాగా చుట్టుకుని బుర్ర మీసాలతో, చేతిలో
అద్దాల పెట్టెతో ఒక మనిషి వచ్చాడు. తానొక మిఠాయి వ్యాపారిననీ, సింహాచలం తన
పేరనీ పరిచయం చేసుకుని వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. రంగనాధం, రామనాధం
పెరుగన్నం మూట విప్పి, బండివాడికీ, మిఠాయి వ్యాపారికీ కొంచెం పెట్టి, తామూ
తిని నీళు్ళ తాగారు. ఎండ చల్లబడింది ఇక బయలుదేరుదామనుకుంటూన్నప్పుడు
వ్యాపారి, ``నా మిఠాయిలు తిని చూడండి.
చాలా రుచిగా ఉంటాయి,'' అంటూ ముగ్గురికీ మూడు మిఠాయి ఉండలు ఇచ్చి, తనూ
ఒకటి తిన్నాడు. ``చాలా రుచిగా ఉన్నాయి,'' అంటూ తిన్న ఆ ముగ్గురూ నిమిషాల్లో
స్పృహ తప్పి పడిపోయారు. మిఠాయిలు ఇచ్చినవాడు నిజానికి మిఠాయి వ్యాపారి
కాదు. ఆ వేషంలో వచ్చిన దొంగ. తను మంచి మిఠాయి తిని, వాళ్ళ ముగ్గురికీ మత్తు
మందు కలిపిన మిఠాయిలు ఇచ్చాడు. వాళ్ళ దగ్గరున్న సొము్మను కాజేద్దామని వాడు
అడుగు ముందుకు వేయబోతూండగా, దభీమని తల వెనక భాగంలో బలంగా దెబ్బ పడింది.
గిర్రున కళు్ళ తిరిగి కింద పడ్డ దొంగకు ఎదుట పెద్ద కత్తితో దృఢకాయుడైన
యువకుడొకడు కనిపించాడు.
వాడూ దొంగతనానికి వచ్చిన దొంగే! నలుగురూ సొమ్మసిల్లి పడి వుండడం చూసి,
తన పని సులభం అయిపోయిందన్న ఆనందంతో, వాడు పెద్ద అంగవేసి గుడి ముందున్న
అరుగు మీదికి ఎక్కబోయాడు. అప్పుడు వాడి చూపులు యథాలాపంగా ఆ గుడిలోపలి
విగ్రహం మీద పడడంతో ఉలిక్కి పడ్డాడు. అది తను నిత్యం మొక్కుకునే భైరవీమాత
విగ్రహం. ఆ మాత ఎదుట దొంగతనం చేయకూడదని తన తండ్రి చెప్పిన మాట గుర్తు
రావడంతో, వాళ్ళ దగ్గరున్న సొము్మలను ఒక్కటి కూడా ముట్టుకోకుండా వెళ్ళి
పోయాడు.
కొంత సేపయ్యాక ఆ రహదారిగుండా వెళుతూన్న సోమనాధం, గుడి దగ్గరి బండిని
చూసి, ``ఇది మన ముత్యాలు బండిలాగున్నదే,'' అనుకుంటూ కేక వేసి పిలిచాడు.
సమాధానం రాకపోయేసరికి, దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న
నలుగురిలో ముగ్గురు తమ ఊరి వారని తెలియడంతో, దారిన వెళ్ళే నలుగురికి విషయం
చెప్పి, వారి సాయంతో ఆ నలుగురినీ బండిలోకి ఎక్కించి పెనుగొల్లుకు
తీసుకుపోయి వైద్యం చేయించాడు.
స్పృహ రాగానే రంగనాధం, సోమనాధం చెప్పింది విని, ``ఈ సింహాచలం దొంగ
వెధవ! మాకు మత్తుమందు కలిపిన మిఠాయిలు ఇచ్చి మోసం చేశాడు. దేవుడు వీడికి
తెలివి తప్పించి తగిన శాస్తి చేశాడు,'' అన్నాడు. ``అవును. పాపం చేస్తే
దేవుడు ఊరుకుంటాడా?'' అన్నాడు రామనాధం. ఈలోగా చాలామంది జనం అక్కడ
పోగయ్యారు. ఆఖరుగా కళు్ళ తెరిచి వాళ్ళను చూసిన సింహాచలం, ``అవును. నేను
దొంగనే. ఒప్పుకుంటున్నాను. అయితే, మీరు అనుకుంటున్నట్టు దేవుడు నాకు స్పృహ
తప్పించలేదు. నా వెనక వచ్చిన ఒక దొంగ తల వెనక బలంగా కొట్టి, స్పృహ
కోల్పోయేలా చేశాడు,'' అన్నాడు.
ఇంతలో విషయం తెలిసి అక్కడికి వచ్చిన గ్రామపెద్ద వాడి మాట విని,
``నిజంగానే దొంగ వచ్చి వుంటే దొంగతనం చేయకుండా వెళ్ళి ఉండడు కదా? నీ మాటలు
ఎవరు నమ్మగలరు? ఇంకా ఎందుకీ అబద్ధాలు?'' అని మందలించివాణ్ణి భటులకు
అప్పగించాడు. ఇంత వరకు చెప్పిన గురువు బాలానందుడు, ``చూశారా, సింహాచలం నిజం
చెప్పినా ఒక్కరూ నమ్మలేదు. ఎందుకంటే వాడు మొదట చేసింది మోసకృత్యం. పైగా
వాడొక దొంగ. ఇక మన మణిరత్నం మంచివాడేగాని పనిదొంగ.
చెప్పిన పని చేయకుండా తప్పించుకోవడానికి ఏవేవో అబద్ధాలు కల్పించి
చెప్పేవాడు. అందుకే వాడిప్పుడు నిజం చెబుతున్నా మీరు నమ్మడం లేదు. అదీ
మంచిది కాదు. వాడు చెప్పే నిజం వినండి. వాడూ నిజం మాట్లాడడానికి
ప్రోత్సహించండి,'' అన్నాడు. విద్యార్థులు సరే నన్నట్టు సంతోషంగా తల లూపారు.
No comments:
Post a Comment