Pages

Sunday, September 16, 2012

రాణి - దాసి

వైశాలీనగరంలో హీరాదత్తుడికి లేక లేక నలభై ఏళ్ళ వయసులో ఒక బంగారుబొమ్మ లాటి కూతురు పుట్టింది. ఆ బిడ్డను చూసుకుని హీరాదత్తుడు పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. అయితే అతని ఆనందం త్వరలోనే తీరని దుఃఖంగా మారింది. ఆ చంటి పిల్లను ఒకనాడు చల్లగాలికి తొట్టెతోసహా ఆరుబయట పడుకోబెట్టారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక బ్రహ్మాండమైన గద్ద వచ్చి, పొత్తి గుడ్డలను ముక్కుతోనూ, కాళ్ళతోనూ పట్టుకుని, ఆ బిడ్డతోసహా ఎటో వెళ్ళిపోయింది. హీరాదత్తుడు ఆ పక్షిని వేటాడటానికి వేటగాళ్ళను పంపాడు; తన బిడ్డను తెచ్చి ఇచ్చిన వారికి అంతులేని ధనం ఇస్తానని చాటింపు వేయించాడు. కాని అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంతకూ, హీరాదత్తుడి బిడ్డను ఎత్తుకు పోయినది నిజంగా గద్ద కాదు. అది శాపం పొంది, కొంతకాలం పాటు యక్షలోకం నుంచి బహిష్కరించబడిన యక్షిణి. ఆమె పక్షి రూపంలో ఆకాశంలో తిరుగుతూ హీరా దత్తుడి కుమార్తెను చూసి, ఆ పిల్లను పెంచు కోవాలని ముచ్చటపడింది. పక్షి ఎత్తుకు పోయిన కారణంగా హీరాదత్తుడి కుమార్తెకు శకుంతకుమారి అన్న పేరు వచ్చింది. శకుంతకుమారి యక్షిణి పెంపకంలో ఎంతో ప్రపంచజ్ఞానమూ, అనేక యుక్తులూ నేర్చుకుని, పెరిగి పదహారేళ్ళ వయసుదయింది. అప్పుడు ఒకనాడు యక్షిణి శకుంతకుమారితో, ``అమ్మా, నా శాపం గడువు తీరిపోయింది. నేనిక మా లోకానికి తిరిగి పోతాను. నీకు అందమూ, తెలివి తేటలూ ఉన్నాయి. ఏ రాజకుమారుడైనా నిన్ను కళ్ళ కద్దుకుని పెళ్ళాడతాడు. ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ తండ్రి ఉండే వైశాలీనగరం వస్తుంది.

నువు్వ మీ తల్లిదండ్రులను చేరుకుని, నీకు తగిన భర్తను పెళ్ళాడి, నేను నేర్పిన యుక్తులన్నీ వినియోగించి సుఖంగా జీవించు,'' అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయింది. శకుంతకుమారి తన జీవితమంతా అరణ్యం మధ్యనే గడిపినప్పటికీ ఆమెకు అన్నిరకాల నాగరిక జీవితం గురించీ పూర్తిగా తెలుసు. అందుచేత ఆమె నాగరిక జీవితంలోకి అడుగు పెట్టటానికి సిద్ధపడి, వైశాలీనగరం ఉండే దిక్కుగా బయలుదేరింది. ఆమె అరణ్యంలో కొంతదూరం వెళ్ళేసరికి ఒక చోట ఒక విచిత్రమైన రాజభవనం కనిపించింది. ఆమె ఆ భవనంలోకి ప్రవేశించింది. అందులో ఏనుగులూ, గుర్రాలూ, ద్వారపాలకలూ, సేవకులూ, దాసీలూ-అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంకా లోపలికి పోయి ఆమె విశాలమైన ఒక శయన మందిరం ప్రవేశించింది. అక్కడ ఒక అందగాడైన రాజకుమారుడు హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. ఆ గదిలో గోడకు ఒక చిత్తరువు వేళ్ళాడుతున్నది. అందులో ఈ రాజకుమారుడే గుర్రం మీద ఎక్కి ఉన్నాడు. అయితే అతని మెడలో ఒక హారం చిత్రించి ఉన్నది. ఆ హారం ఇప్పుడు రాజకుమారుడి మెడలో లేదు; అది అతని పాదాల దగ్గిర ఒక పెట్టెలో పెట్టి ఉన్నది. ఆ హారం అతని మెడలో లేకపోవటానికీ, అతని గాఢనిద్రకూ ఏమైనా సంబంధం ఉన్నదేమో చూడాలని, శకుంతకుమారి ఆ హారాన్ని పెట్టె నుంచి తీసి, అతని రొము్మకు ఆనించింది. వెంటనే రాజకుమారుడు నిద్రలో మసిలి, లేవబోయేవాడిలాగా కనబడ్డాడు. శకుంతకుమారి ఆ హారాన్ని తీసి తిరిగి పెట్టెలో పెట్టింది. తాను ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్నది. చక్కగా స్నానం చేసి, రాజభవనంలో నుంచి మంచి బట్టలు తీసి కట్టుకుని, రాజకుమారుడు కళు్ళ తెరిచేసరికి అందంగా తయారవుదామనుకున్నది శకుంతకుమారి. ఆమె ఆ గది నుంచే అందమైన బట్టలు ఏరి తీసుకుని, సమీపంలోనే ఉన్న కొలనుకు వెళ్ళి, అందులో స్నానం చెయ్యసాగింది. ఆ సమయంలో అటుగా ఒక కుబ్జ ఏడుస్తూ వెళ్ళటం ఆమెకు కనిపించింది.

 ఆమనిషి గూనిదీ, అనాకారిదీ అయినప్పటికీ, ఆమె దుఃఖం చూసి జాలిపడి శకుంతకుమారి ఆమెను, ``ఎందుకు అలా దీనంగా ఏడుస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు?'' అని అడిగింది. ``నా మొగుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. నేను ఈ మహారణ్యంలో ఏ పులివాత అయినా పడతాను,'' అన్నది కుబ్జ. ``విచారించకు. నీ పోషణ నేను చూస్తాను. నువు్వ వెళ్ళి ఆ కనిపించే భవనం వద్ద ఉండు. నేను స్నానం పూర్తిచేసి వస్తాను,'' అన్నది శకుంతకుమారి. కుబ్జ రాజభవనానికి వెళ్ళి లోపల ప్రవేశించి, రాజకుమారుడి గది చేరుకున్నది. శకుంతకుమారికి కలిగినట్టే కుబ్జకు కూడా హారం విషయం అనుమానం తగిలింది, ఆమె పెట్టెలోనుంచి హారాన్ని తీసి రాజకుమారుడి మెడకు తగిలించింది. త్వరలోనే రాజకుమారుడు మేలుకున్నాడు. అతనితోబాటు రాజభవనం అంతా మేలుకున్నది. తన నిద్ర వదిలించినందుకు కుబ్జను రాజకుమారుడు పెళ్ళాడ నిశ్చయించాడు. ``నేనొక రాజకుమార్తెను. నా దాసి ఇప్పుడే వస్తుంది,'' అన్నది కుబ్జ రాజకుమారుడితో. ఆమె అన్నట్టుగానే శకుంతకుమారి అక్కడికి చేరుతూ, రాజభవనమంతా మేలుకుని ఉండటం చూసి మోసం జరిగిందని గ్రహించింది. దానికి తగినట్టుగానే శకుంతకుమారి రాగానే కుబ్జరాజకుమారుడితో, ``అదుగో, నా దాసి!'' అని చెప్పింది. శకుంతకుమారి కుబ్జను నానా తిట్లూ తిట్టి, జరిగినదంతా రాజకుమారుడికి చెప్పింది. ``మీ ఇద్దరిలో ఎవరు దాసీ అయినదీ, ఎవరు రాణీ అయినదీ, ఎవరిని ఎవరు మోసం చేస్తున్నదీ నాకు తెలియటం లేదు.

నేను ఇంతకు మునుపే నిద్ర లేచాను. నేను లేచేసరికి ఈ కుబ్జ ఎదురుగా కనిపించింది. ఈమెకే నేను రుణపడి ఉన్నాననుకుంటున్నాను,'' అన్నాడు రాజకుమారుడు. ``ఎవరు రాణీ అయిందీ, ఎవరు దాసీ అయిందీ ఇప్పుడే తేలుస్తాను. రాణీ అనీ, దాసీ అనీ చీట్ల మీద రాసి ఈ పెట్టెలో పోసి, చూడకుండా రాణీ చీటీలన్నీ నేను తీస్తాను. అప్పుడు మీకే నిజం తెలుస్తుంది,'' అన్నది శకుంతకుమారి. రాజకుమారుడు ఆ పరీక్షకు ఒప్పుకున్నాడు. శకుంతకుమారి కొన్ని చీట్లు తయారు చేసి, వాటిమీద `రాణి', `దాసి' అని రాసి, చీట్లన్నిటిని ఒక పెట్టెలో వేసి, కళు్ళ మూసుకుని `రాణి' అని రాసిన చీట్లన్నీ, ఒక్క బీరు పోకుండా తీసేసింది. పెట్టెలో మిగిలిన చీట్లు అన్నిటి మీదా `దాసి' అనే ఉన్నది. ఇది చూసి కుబ్జ వణికిపోతూ తాను చేసిన మోసం ఒప్పేసుకున్నది. శకుంతకుమారి కుబ్జను క్షమించి తన దాసిగా ఉండనిచ్చింది. రాజకుమారుడికీ, శకుంతకుమారికీ వైభవంగా పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి వైశాలీనగరం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చారు. ఏనాడో తమకు కాకుండా పోయిన తమ కుమార్తె తమకు తిరిగి దొరికినందుకు వాళు్ళ పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. తన కథ అంతా శకుంతకుమారి తన తల్లిదండ్రులకు చెప్పింది. అప్పుడు తల్లి, ``కుబ్జకు మంచి పరాభవమే చేశావు. కాని, చీట్లు లాగటంలో నువు్వ ఏదో యుక్తి చేసి ఉండాలి. ఆ యుక్తి ఏమిటి?'' అని అడిగింది. శకుంతకుమారి నవ్వి, ``ఏమీ లేదమ్మా! సూటిగా కత్తిరించిన అట్టముక్కలు తీసుకుని, ఒక్కొక్కటీ మూడుగా మడిచి, మధ్య భాగంలో `రాణి' అనీ, రెండు చివర భాగాలలోనూ `దాసి' అనీ రాసి, ఒక్కొక్క అట్టనూ మూడేసి ముక్కలుగా చించాను. `రాణి' అని రాసి ఉన్న చీటీకి రెండు పక్కలా అంచులు గరుకుగా ఉంటాయి. `దాసి' అని రాసి ఉన్న చీటీకి ఒక అంచు నున్నగానూ, ఒక పక్క అంచే గరుకుగానూ ఉంటుంది. అందుచేత, `రాణి' ముక్కలు తడివి తెలుసుకోవటం తేలిక. కుబ్జ నన్ను మోసగించినందుకు నేను దాన్ని అలా మోసం చేశాను,'' అన్నది. 

No comments:

Post a Comment