Pages

Sunday, September 16, 2012

మంజరీదేవి


ఉదయగిరి రాజు భానుప్రతాపుడు చండశాసనుడు. భయం వుంటే తప్ప మనిషి సక్రమ మార్గంలో నడవడనే దృఢ అభిప్రాయం కలవాడు. అందువల్ల చిల్లరమల్లర నేరాలకు కూడా కఠినమైన శిక్షలు విధించేవాడు. నేరాన్ని బట్టి మరణశిక్షలు విధించడానికి కూడా వెనుకాడేవాడుకాడు. రాజ్యం ప్రశాంతంగా ఉన్నప్పటికీ మామూలు ప్రజలు భయం భయంగా కాలం గడిపేవారు. భానుప్రతాపుడి ఏకైక కుమార్తె మంజరీదేవి క్షత్రియోచిత విద్యలనభ్యసించింది. హఠాత్తుగా అనారోగ్యం పాలైన రాజు, యుక్తవయస్కురాలైన మంజరీదేవికి రాజ్య పట్టాభిషేకం చేయించి, పాలనా బాధ్యతలు అప్పగించాడు.
 
వృద్ధమంత్రి భైరవామాత్యుల సలహాలతో కుశాగ్రబుద్ధి అయిన మంజరీదేవి అచిర కాలంలోనే పాలనా వ్యవహారాలలో దక్షత సంతరించుకున్నది. కుమార్తె శక్తి సామర్థా్యలు భానుప్రతాపుడికి ఆనందాన్నిచ్చాయి. స్త్రీ అయినప్పటికీ ఆమె సమర్థవంతంగా రాజ్య పాలన చేయగలదన్న సంతృప్తితో ఆయన ప్రశాంతంగా కన్నుమూశాడు.
 
తండ్రి మరణం మంజరీదేవికి తీవ్రమనస్తాపం కలిగించింది. ``ఇటువంటి విషాద పరిస్థితులలోనే గుండెదిటవు చేసుకోవాలి,'' అంటూ మంత్రి భైరవామాత్యులు మంచి మాటలతో ఆమెకు ధైర్యం నూరిపోశాడు. తండ్రిలాంటి మంత్రి ఓదార్పు కారణంగా మంజరీదేవి త్వరలోనే విషాదం నుంచి బయటపడి పాలనా వ్యవహారాలలో నిమగ్నురాలయింది.
 
భైరవామాత్యులు ఒకసారి పొరుగు రాజుతో ఏవో వ్యాపార సంబంధాల గురించి మంతనాలు జరపడానికి వెళ్ళాడు. ఆ సమయంలో మంజరీదేవి వినోదార్థం పరివారంతో అడవికి వేటకు వెళ్ళింది.

ఆమె మృగాలను గురిపెట్టి వదిలే బాణాలు, వాటి వేగం చూసి సైనికులు అబ్బుర పడ్డారు. అలా వేటాడుతూ క్రమంగా ఆమె తమ సైనికుల నుంచి వేరుపడి అడవిలోకి వెళ్ళింది. చాలాసేపు వేటాడిన తరవాత మంజరీదేవి కొలను దాపులనున్న ఒక చెట్టు కింద కూర్చున్నది. అప్పుడు చెట్టు చాటు నుంచి ఒక యువకుడు ఆమెను చూసి, ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్థుడై, మరింత దగ్గరికి వెళ్ళి చూద్దామనుకుంటూండగా, కొందరు సైనికులు అక్కడికి రావడం గమనించి వెనక్కు తగ్గాడు.
 
చెట్ల చాటునుంచి లేచి వెళ్ళేంత వరకు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ యువకుడు ఒక చిత్రకారుడు. పేరు ముకుందుడు. ఒక ఊళ్ళో నిలకడగా ఉండకుండా దేశసంచారం చేస్తూ ఉంటాడు. దేవాలయాల గోడలపై దేవతామూర్తుల చిత్రాలు చిత్రించడంలోనూ; పక్షులను, జంతువులనూ, మనుషులనూ చూసి అలాగే చిత్రించడంలోనూ సిద్ధహస్తుడు. చిత్రలేఖనానికి కావలసిన పసరుల ఆకులూ, పళూ్ళ, కాయలూ సేకరించడానికి అడవికి వచ్చి రాణిగారిని చూశాడు.
 
పసరు ఆకులతో సమీప గ్రామం చేరిన ముకుందుడి కళ్ళ ముందు మంజరీదేవి రూపమే కదలాడసాగింది. ఆమెను మళ్ళీ ఒక సారి చూసి, ఆమెరూపం చిత్రించాలని అతడి మనసు తపించింది. తాను తిరిగి వస్తూన్నప్పుడు, మార్గ మధ్యంలో ఏటిగట్టున కొందరు సైనికులు గుడారాలు నిర్మిస్తూండడం ముకుందుడు చూశాడు. వేట ముగించుకుని రాణిగారు రాత్రికి అక్కడే బసచేయనున్నట్టు వాళు్ళ మాట్లాడుకోవడం కూడా విన్నాడు. అది రాణిగారిని చూడడానికి చక్కని అవకాశం అనుకుని, ముకుందుడు అప్పటికప్పుడే బయలుదేరాడు.
 
సైనికులు గుడారాలు ఏర్పాటు చేసిన చోటికి చేరేసరికి బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో వెళితే కాపలాభటులు అనుమతించరన్న అనుమానంతో దూరంగా కాచుక్కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయంలో కాపలా భటుల కన్ను గప్పి, గుడారంలోకి ప్రవేశించి, చుట్టూ చెలికత్తెల మధ్య, వేటాడిన అలసటతో ఆదమరచి నిద్రపోతూన్న మంజరీదేవిని తదేక దృష్టితో కొంతసేపు చూశాడు.


ఇక ఆమె చిత్రం చిత్రించగలననుకుని వెనుదిరిగి వస్తూన్న సమయంలో కాపలా భటులు అతణ్ణి చూసి పట్టి బంధించారు. మరునాడు రాజధానికి చేరిన మంజరీదేవి సమక్షానికి, బందీగా ఉన్న ముకుందుణ్ణి తెచ్చి నిలబెట్టారు. ఆ సమయంలో భైరవామాత్యులు సభలో లేరు గనక సేనాధిపతి- అర్ధరాత్రి సమయంలో వచ్చిన అతడు శత్రుదేశపు గూఢచారి కావచ్చుననీ, అతడికి శిరశ్ఛేదమే సరైన శిక్ష అనీ రాణిగారికి విజ్ఞప్తి చేశాడు.
 
ఆమె ముకుందుడి కేసి చూసింది. ``నేనొక చిత్రకారుణ్ణి. వేటాడుతున్నప్పుడు మిమ్మల్ని చూసిన నేను, మీ చిత్రపటాన్ని చిత్రించాలన్న ఆసక్తితో మిమ్మల్ని చూడడానికి వచ్చానే తప్ప, నాకెలాంటి దురుద్దేశమూ లేదు,'' అన్నాడు ముకుందుడు. ``అనుమతి లేకుండా అర్ధరాత్రి సమయంలో మహారాణి నిద్రిస్తూన్న గుడారంలో ప్రవేశించడం మహాపరాధం. కారణమేదైనా, మన రాజ్య శాసనం ప్రకారం అతడికి మరణ దండన విధించాలని మనవి చేస్తున్నాను,'' అన్నాడు సేనాధిపతి.
 
సభలోని ప్రముఖులు కూడా మరణ దండనే సరైన శిక్ష అని అభిప్రాయపడడంతో మంజరీదేవి, ``అనుమతి లేకుండా కాపలా భటుల కన్ను కప్పి ప్రవేశించినందుకు మరణ దండన విధిస్తున్నాను. రేపు సూర్యోదయానికల్లా ఇతన్ని ఉరితీయండి,'' అని ఆజ్ఞాపించింది. ముకుందుణ్ణి చెరసాలకు నడిపించేందుకు భటులు ముందుకు రాగానే, అతడు మహారాణికేసి చూస్తూ, ``అనుమతిలేకుండా అపరాత్రి వేళ నేను అక్కడికి రావడం నేరమే. మరణదండన అమలుపరచండి.
 
కాని ఒక్క కోరిక,'' అన్నాడు. ``ఏమిటది?'' అని అడిగింది రాణి. ``తమ చిత్రం గీయాలన్నది నా వాంఛ. వారంలో పూర్తి చేస్తాను. ఆ తరవాత నిరభ్యంతరంగా శిక్ష అమలు పరచండి. నా చివరి కోరికను కాదనకండి,'' అని వేడుకున్నాడు ముకుందుడు. క్షణకాలం ఆలోచనలో పడ్డ రాణి తలపంకించి, ``సరే, ఒకవారం గడువిస్తున్నాను. ఈలోగా చిత్రం పూర్తయినా, కాకున్నా రాబోయే శుక్రవారం ఉదయం నీకు మరణశిక్ష ఖాయం,'' అన్నది.

ముకుందుడి అభ్యర్థన మేరకు చిత్రలేఖనానికి కావలసిన రంగులు, కుంచెలు, ఇతర సామగ్రి చెరసాల గదిలోనే సమకూర్చ బడ్డాయి. వారం రోజులు గడిచి పోయింది. చివరి రోజురాత్రి ముకుందుడు తాను గీసిన మంజరీదేవి తైలవర్ణ చిత్రపటాన్ని ఆమె మందిరానికి పంపాడు. మరునాడు తెల్లవారగానే తన చిత్రపటాన్ని చూసి మంజరీదేవి ఆనందాశ్చర్యాలు పొందింది.
 
తన రూపులేఖలను ఇంత హృద్యంగా చిత్రించిన ముకుందుడికి తానే మరణ శిక్ష విధించడమా? అన్న ఆలోచనలో పడింది. భటులను పిలిచి, ``మరణ దండన ఆపి, ముకుందుణ్ణి ఇక్కడికి తీసుకురండి,'' అని ఆజ్ఞాపించింది. అప్పటికే భటులు ముకుందుణ్ణి వధ్యభూమికి తీసుకువెళ్ళారు. శిక్ష నెరవేరనున్న క్షణంలో సైనికులు హుటాహుటిగా వెళ్ళి, రాణిగారి ఆజ్ఞను తెలియ జేసి శిక్షను ఆపారు.
 
ముకుందుణ్ణి రాణిగారి సమక్షానికి వెంట బెట్టుకు వచ్చారు. అప్పుడే పొరుగుదేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన ప్రధాని భైరవామాత్యులు జరిగిన సంగతి తెలుసుకుని, ``మరణశిక్ష ఏకాలంలో ఏర్పడిందో ఏమోగాని, మహాదారుణమైనది. దానివల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. కొద్దిపాటి ఆలస్యం జరిగి ఉంటే అపురూప కళాకారుడి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. ఎలాంటి తప్పు చేసినా ఎదుటి వారి ప్రాణాలు తీసే హక్కు ఎంతటి వారికైనా ఉండకూడదు.
 
చేతనైతే మనిషికి ప్రాణాలు పొయ్యాలేగాని, తీయకూడదు,'' అన్నాడు. ``అవును, అమాత్యవర్యా! ఈ క్షణం నుంచే ఉదయగిరి రాజ్యంలో మరణశిక్షను రద్దు చేస్తున్నాను,'' అన్నది మంజరీదేవి. భైరవామాత్యులు మందహాసం చేస్తూ ఆమెను అభినందించాడు. ``అంతేకాదు. ముకుందుణ్ణి మన ఆస్థాన చిత్రకారుడిగా నియమిస్తున్నాను,'' అన్నదామె ముకుందుడి కేసి అభినందన పూర్వకంగా చూస్తూ. సభికుల కరతాళ ధ్వనులతో సభాప్రాంగణం మారుమోగింది.
 

No comments:

Post a Comment