Pages

Sunday, September 16, 2012

దొంగ బాబాయిలు!

పరమశివం తెలివైన కురవ్రాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వాణ్ణి చేరదీసి ఆప్యాయంగా పెంచసాగింది. కొన్నాళ్ళకు వృద్ధురాలైన అమ్మమ్మ కంటిచూపు మందగించసాగింది. అందువల్ల పరమశివమే ఇంటి పనులన్నీ చేసేవాడు. పరమశివం దగ్గర్లో ఉన్న బడికి రోజు తప్పకుండా వెళ్ళేవాడు. మధ్యాహ్నం వరకే బడి ఉండేది. వాడు తిరిగి వచ్చేలోగా అమ్మమ్మ వంట చేసిపెట్టేది. వాడు బడినుంచి తిరిగి వచ్చేంతవరకు తను తినేది కాదు. మనవడు వచ్చాక ఇద్దరూ కలిసి సంతోషంగా భోజనం చేసేవారు. ఇంటి వద్ద అమ్మమ్మ కాచుకుని ఉంటుందని పరమశివం బడి వదలగానే తిన్నగా ఇంటికి వచ్చేసేవాడు. వాణ్ణి చూసి అమ్మమ్మ ఎంతగానో మురిసిపోయేది. ఒకనాడు పరమశివం బడి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇద్దరు అపరిచిత వ్యక్తులు అమ్మమ్మతో మాట్లాడడం చూశాడు. వాణ్ణి చూడగానే అమ్మమ్మ, ``పరమూ, మీ బాబాయిలు వచ్చారు చూడు,'' అంటూ పిలిచి వాళ్ళకు పరిచయం చేసింది. అందరూ కూర్చుని ముసలావిడ వండిన వంటను తిన్నారు. ఆ వచ్చిన వ్యక్తులు అప్పుడప్పుడు తమలో తాము గుసగుసలాడుకోవడం పరమశివం గమనించాడు. వాళు్ళ ఆ రోజంతా అక్కడే ఉన్నారు. రాత్రి కూడా అక్కడే గడిపారు. మరునాడు తెల్లవారగానే బయలుదేరబోతూ, ``అత్తగారూ, మీకు అభ్యంతరం లేకపోతే పరమశివాన్ని మా వెంట తీసుకువెళ్ళి రెండు రోజుల తరవాత తెచ్చి వదిలి పెడతాం. మా గ్రామంలో ఉన్న మా తరఫు బంధువులు కూడా వాడికి తెలియడం మంచిది కదా,'' అన్నారు ముసలావిడతో. అమ్మమ్మను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి పరమశివానికి అసలు ఇష్టంలేదు. అయినా,  ఆమె వెళ్ళిరమ్మనడంతో వాళ్ళ వెంట బయలుదేరాడు.

కొంతదూరం వెళ్ళాక, ఆ ఇద్దరు తమ వద్ద ఉన్న బుట్టనూ, పెట్టెనూ పరమశివాన్ని మోసుకు రమ్మన్నారు. పరమశివం బుట్టను తల మీద పెట్టుకున్నాడు. పెట్టెను ఒక చేత్తో పట్టుకున్నాడు. రెండూ బరువుగానే ఉన్నాయి. అయినా వాళ్ళకు ఎదురుచెప్పకుండా వాటిని మోసుకుంటూ పరమశివం వాళ్ళవెంట నడవసాగాడు. మరికొంత దూరం నడిచాక ఒక గ్రామం కనిపించడంతో, ``ఇదేనా మన బంధువులున్న గ్రామం?'' అని అడిగాడు పరమశివం. ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ హేళనగా నవు్వకోవడం గమనించిన పరమశివంలో వారిపట్ల అంతవరకు ఉన్న అనుమానం మరింత బలపడింది. తన తండ్రికి తము్మలమని చెప్పి, వాళు్ళ తననూ, తన అమ్మమ్మనూ మోసం చేశారని గ్రహించాడు. ``కాదు. ఆ గ్రామం చేరుకోవడానికి ఇంకా కొంత దూరం నడవాలి. నువు్వ ఇక్కడే కూర్చుని ఆ బుట్టను జాగ్రత్తగా చూసుకో. మేము సంతకు వెళ్ళి, ఇప్పుడే వస్తాం,'' అన్నాడు ఒకడు. మరొకడు పెట్టెను తీసి భుజాన పెట్టుకుని, ``బుట్టను తెరవొద్దు. అందులో అరుదైన పామును పట్టి బంధించాం. మన గ్రామానికి తీసుకువెళ్ళాలి,'' అని హెచ్చరించాడు. ఆ తరవాత ఇద్దరూ గ్రామం కేసి వెళ్ళారు. పరమశివం ఒక చెట్టు బోదె నానుకుని కూర్చున్నాడు. వెళ్ళిన వాళు్ళ ఎంతసేపటికీ రాలేదు. పరమశివానికి ఆకలి వేయసాగింది. ఒకవేళ వాళు్ళ రాకపోతే ఏం చేయాలి? తన గ్రామానికి ఒంటరిగా తిరిగి వెళ్ళడం ఎలాగా? అని ఆలోచించసాగాడు. బుట్టలో ఏముందో చూడాలన్న ఉత్సుకత కొద్దీ, మెల్లగా బుట్ట మూతను కొద్దిగా తెరిచి చూశాడు. పాము ఉన్నట్టు కనిపించలేదు. పైన చక్కగా మడిచిన మెత్తటి బట్ట కనిపించింది. దాని అడుగున పాము ఉంటుందో ఏమో అని లేచి నిలబడి బుట్టను కాలితో కదిలించి దూరంగా వెళ్ళాడు. ఎలాంటి పామూ బయటకు రాలేదు. వాడు బుట్ట వద్దకు వెళ్ళి, మెల్లగా మూత తొలగించి బట్టను పైకెత్తి చూశాడు. లోపల తినుబండారాలు, ఘుమ ఘుమలాడే పిండివంటలు ఉన్నాయి! ``ఆహా, ఆకలి తీర్చుకోవడానికి కావలసినన్ని పిండివంటలున్నాయి! నన్ను మోసపుచ్చడానికే వాళు్ళ బుట్టలో అరుదైన పాము ఉందని చెప్పారన్న మాట! ఇంకా ఎంతసేపని వాళ్ళ కోసం ఎదురుచూడడం?''


అనుకుంటూ అందులో నుంచి కొంత తీసుకుని తిని, బుట్టను మునుపటిలాగే గట్టిగా మూసి పెట్టాడు. మరి కొంతసేపయ్యాక, బుట్టను చెట్టుబోదె వద్ద వదిలిపెట్టి, పరమశివం తన గ్రామం కేసి తిరుగుప్రయణమయ్యాడు. కొంత దూరం వెళ్ళే సరికి ఒక నది కనిపించింది. వాడు నదీ తీరం గుండా నడవసాగాడు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి, ఇద్దరు భటులు ఎదురు పడ్డారు. వాళు్ళ పరమశివాన్ని చూసి ఆగి, ``ఎవరు నువు్వ? నీది ఏ ఊరు?'' అని అడిగారు. ``నా పేరు పరమశివం. ధర్మపురి సమీపంలోని శివగిరి మా గ్రామం. మా అమ్మమ్మతో కలిసి ఉంటాను. మా బాబాయిలిద్దరు వచ్చి, వాళ్ళ గ్రామానికి పిలిస్తే, వాళ్ళ వెంట బయలుదేరాను. వాళు్ళ నన్ను ఒక చోట వదిలి ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళారు. ఎంతకూ తిరిగి రాకపోయేసరికి నేను మా గ్రామానికి తిరిగి వెళుతున్నాను,'' అన్నాడు కురవ్రాడు. ``మేము రాజుగారి భటులం. ఇద్దరు దొంగలు రాజభవనంలోని ఆభరణాలను దొంగిలించుకుని పారిపోయారు. మేము వాళ్ళను వెతుక్కుంటూ వస్తున్నాం. ఆ దొంగలు నీకేమైనా కనిపించారా?'' అని అడిగారు వాళు్ళ. ``మా బాబాయిల్ని తప్ప నేనెవ్వరినీ చూడలేదు,''అంటూ కాస్సేపు ఆలోచించిన పరమశివం, ``అయినా, మీరు చెబుతున్నది వింటూంటే, వాళ్ళిద్దరూ ఆ దొంగలేమో అన్న అనుమానం కలుగుతున్నది,'' అన్నాడు. ఆ తరవాత పరమశివం వాళ్ళిద్దరూ బాబాయిలమంటూ వచ్చి, తనను పిలిచిన విషయమూ, వాళ్ళ వద్ద ఉన్న పెట్టె, బుట్ట సంగతీ వివరించాడు. ``బహుశా, వాళు్ళ దొంగలే అయివుంటారు. వాళు్ళ నిన్ను వదిలి వెళ్ళిన చోటికి వెళదాంపద. ఒకవేళ వాళు్ళ అక్కడికి తిరిగివచ్చి నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు,'' అన్నారు భటులు. పరమశివం భటులను వెంట బెట్టుకుని వెనక్కు తిరిగాడు. తాను బుట్టతో కూర్చున్న చోటును సమీపిస్తూండగా, ఇద్దరు మనుషులు చెట్టుకింద కూర్చుని ఉండడం కొద్ది దూరం నుంచే గమనించి ఆగాడు. ``పరమశివం, నువు్వ ముందుగా వెళ్ళి, వాళ్ళతో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఉండు. మేము వెనకగా వచ్చి వాళ్ళను పట్టుకుంటాం. ఒకవేళ వాళు్ళ మేము వెతికే దొంగలు కానిపక్షంలో వదిలేద్దాం,'' అన్నాడు ఒక భటుడు.


సరేనని పరమశివం ముందుకు నడిచాడు. వాణ్ణి దూరం నుంచి చూడగానే, ఆ ఇద్దరిలో ఒకడు, ``అదిగో! ఆ తుంటరి వెధవ ఇప్పుడు వస్తున్నాడు,'' అని అరిచాడు. ``ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు?'' అని అడిగాడు రెండవవాడు కోపంగా. ``మీ కోసం చాలాసేపు ఎదురుచూశాను. మీరు ఎంత సేపటికీ రాకపోయేసరికి మిమ్మల్ని వెతుక్కుంటూ అలా వెళ్ళి వస్తున్నాను. చాలా ఆకలిగా ఉంది,'' అన్నాడు పరమశివం అమాయకంగా. ``బుట్టనెందుకు తెరిచావు?'' అని అడిగాడు మొదటివాడు. ``ఆ పాము ఎలా ఉంటుందో చూద్దామని కొద్దిగా తెరిచి చూశాను. అందులో పాము లేదు. పిండివంటలున్నాయి. అందులో పాము ఉందని నాతో అబద్ధం చెప్పారు కదూ?'' అన్నాడు పరమశివం ధైర్యంగా. ఆ ఇద్దరూ పరమశివం దగ్గరికి వచ్చారు. ఒకడు వాడి చేయిని వడిసి పట్టుకున్నాడు. రెండవవాడు కొట్టబోయాడు. పరమశివం విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో తమకు వెనకగా వచ్చిన భటులను ఆ ఇద్దరు గమనించలేదు. భటులు వాళ్ళను పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టారు. ``రాజుగారి ఆభరణాలతో పారిపోయిన దొంగలు మీరేకదా? వాటిని ఎక్కడ దాచారో చెప్పండి,'' అని గద్దించి అడిగాడు ఒక భటుడు కోపంగా. నిజం చెప్పక తప్పదని గ్రహించిన దొంగలు, ``ఒక వడ్డీ వ్యాపారికి అమ్మేశాం,'' అన్నారు ఒక్కసారిగా. భటులు వాళ్ళను వడ్డీ వ్యాపారి వద్దకు లాక్కెళ్ళారు. దొంగలు తమ వద్ద ఉన్న డబ్బిచ్చి, నగలను తీసి భటులకు అప్పగించారు. ఆ ఇద్దరి దొంగలకూ కారాగార శిక్ష విధించిన రాజు, దొంగలను పట్టుకోవడంలో భటులకు సాయపడిన పరమశివాన్ని అభినందించి కానుకలిచ్చాడు. ఆ తరవాత భటులు పరమశివానికి తోడుగా వెళ్ళి, వాణ్ణి ఇంటి వద్ద వదిలి వచ్చారు. జరిగినదంతా పరమశివం అమ్మమ్మకు వివరించాడు. అమ్మమ్మ మనవణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకుని, ``నిజంగానే, నీ బాబాయిలని నమ్మి ఆ దొంగల వెంట నిన్ను పంపాను. మతిలేని దాన్ని. అయినా ఇద్దరు దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, భటులకు పట్టిచ్చిన నీ తెలివి చాలా గొప్పది,'' అంటూ మురిసిపోయింది.

No comments:

Post a Comment