తిరిగి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. చిన్న తాబేలు పిల్లగా ఉన్నప్పుడు
వేల కిలోమీటర్ల సముద్రాన్ని ఈదుకుంటూ రావడం అన్నది మాటలు కాదు. ఒక్క దూరమే
కాదు. దారి పొడవునా ఎన్నెన్ని అవరోధాలు. ఎన్నెన్ని ప్రమాదాలు. సముద్రంలో
ఎదురుపడ్డ దాన్నంతా లాగేసుకోవాలని చేపలుపట్టే నావలు విసిరే పెద్ద పెద్ద
వలలు; హతమార్చే మోటార్‌బోట్ల ప్రోపెల్లర్లు; అడపాదడపా తారసపడే
ప్రాణాంతకాలైన తిమింగిలాలు.
ఇవన్నీ మమ్మల్ని ఒంటరివాళ్ళను చేస్తున్నాయంటే అబద్ధంకాదు. బహుశా పెద్ద
జలచరాలు మమ్మల్ని మింగేస్తే వాటి కడుపులు జీర్ణించుకోకుండా అవస్థ పెట్టే
మా చిప్పలవల్ల, అవి మా జోలికి రావడం లేదనుకుంటాను. మా వీపుల మీదిదృఢమైన
కవచాలు అదే మీరు తాబేటి చిప్పలంటారు చూడండి. అవే మమ్మల్ని కాపాడుతున్నాయి.
అవునూ, తిరిగి రావడం నాకెంతో సంతోషంగా ఉందని చెప్పాను కదూ. ఈ అందమైన
తీరాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళానో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు గాని, ఎంత
కాదన్నా అది పాతిక, ముపై్ఫ ఏళ్ళనాటి మాట. అప్పుడే నేను పుట్టాను.
అసంఖ్యాకమైన నక్షత్రాలతో, సగం చందమామ గల అందమైన ఆకాశం కింద చాలా మంది
అక్కచెల్లెళ్ళతో, అన్నదము్మలతో ఉండేదాన్నన్న సంగతిమాత్రం నాకింకా జ్ఞాపకం
ఉంది. దూరంగా కనిపించే నల్లటి తీరాన్ని చేరుకోవాలని ఉబలాటపడేవాళ్ళం. అలలతో
నేను పుట్టిన తీరాన్ని తాకుతూన్న సముద్రం అది! సముద్రతీరంలో మా తల్లి తయారు
చేసిన గూట్లో పుట్టిన చాలా మంది పిల్లల్లో నేనూ ఒకతెననుకుంటాను. గూడంటే
పక్షులు కట్టే గూడులాంటిది కాదు. తల్లితాబేళు్ళ గుడ్లు పెట్టడానికి ఇసుకలో
చేసే బొరియల్లాంటి గోతులన్న మాట. వాటిలోనే అవి గుడ్లు పెడతాయి. అలా పెట్టిన
ఒక గుడ్డు నుంచే నేను పుట్టి, రెండడుగుల లోతు నుంచి ఇసుకను తోసుకుంటూ
బయటికి వచ్చానని మా పిన్నమ్మ చెబుతూ ఉంటుంది. (ఆమెకు నాకు రెండింతల వయసు.
అందువల్ల ఇలాంటి విషయాలు చాలా తెలిసుంటుంది.) నా తల్లిని గురించి
నాకేమీ తెలియకపోవడం చాలా విచారకరం. గుడ్లు పెట్టిన వెంటనే, తల్లితాబేళు్ళ
బొరియలను ఇసుకతో మూసేసి సముద్రంలోకి వెళ్ళిపోతాయని మా పిన్నమ్మ చెప్పింది.
నాకు యుల్రిడ్ అనే పేరు పెట్టింది కూడా ఆ పిన్నమ్మే.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె నాకు చెప్పిన నమ్మలేని నిజాలు చాలా చాలా
ఉన్నాయి. వాటిలో ఒకటి చూడండి: నేను పుట్టినప్పుడు మరీ చిన్నదిగా, అప్పుడే
పుట్టిన మీ తము్మడు, చెల్లాయి అరచేతిలో ఇమిడి పోయేంత పరిమాణంలో ఉండేదాన్నట.
ఇప్పుడేమో నేను మూడడుగుల పొడవుతో మీ బడిలోని బల్లంత ఉన్నాను. నా బరువెంతో
తెలుసా? 60 కిలోలు! అయితే, నాకు మహా ఇష్టమైన విషయం ఏమిటంటే నన్ను కాపాడిన
మనుషుల గురించి చెప్పడం.
మీరు గోవా అంటారు చూడండి. అదే నా జన్మస్థలం. నేను పుట్టినప్పుడు,
కొందరు మనుషులు తాబేళ్ళ వేట కోసం వచ్చినట్టుంది. (తాబేళ్ళ మాంసం
తింటారటవాళు్ళ. మేము అంత రుచిగా ఉంటామా?) తాబేళ్ళ గుడ్లను కూడా తినడానికి
దొంగిలిస్తారు. అలాంటి పనిజరక్కుండా చూడడానికి కూడా కొందరు మనుషులుండడం మా
అదృష్టం! అలాంటి బృందానికి చెందిన మనుషులు కొందరు తాబేటి గూళ్ళను గుడ్ల
కోసం గాలించేవారని మా పిన్నమ్మ చెప్పింది. గూళు్ళ కనిపించగానే జాగ్రత్తగా
అందులోని గుడ్లను వెతికి తీసుకుని తమ ఇళ్ళ దగ్గరున్న సురక్షిత ప్రాంతాలకు
చేర్చేవారట. గుడ్లను భద్రపరచే స్థలంచుట్టూ కంచె ఏర్పాటుచేసి కాపాడే వారట.
అక్కడి ఇసుకలో గుడ్లను పాతిపెట్టి పిల్లల కోసం ఎదురుచూసేవారు. అలా కాపాడ
బడిన గుడ్లలో నేనూ ఒక దాన్ని! అలాంటి మంచి మనుషులు లేకుంటే, ఏదో ఒక
రెస్టారెంట్‌లో టర్టిల్ ఎగ్‌సూప్‌గా నా బతుకు ఎప్పుడో పరిసమాప్తమైపోయి
ఉండేది! ఇప్పుడు నేను నా పుట్టిన తీరానికి మళ్ళీ తిరిగివచ్చాను.
నేను ఎక్కడో హిందూమహా సముద్రంలో, మీరు శ్రీలంక అంటారే ఆ ప్రాంతానికి
అవతల ఉండేదాన్ని. మేము పుట్టిన వెంటనే, సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్ళిపోతాం.
జీవన విధానాలను తెలుసుకుంటూ పెరుగుతాం. కొంతకాలానికి తీరానికి తిరిగి
రావాలనే కోరిక మాలో బలంగా కలుగుతుంది. పిన్నమ్మలతో, అక్కాచెల్లెళ్ళతో
పుట్టిన స్థలాలకు వస్తాం.
నేను తీరంలో అడుగు పెట్టగానే, నాకన్నా ముందుగా తీరం చేరిన నా
బంధుమిత్రులు నన్ను చుట్టుముట్టాయి. అవినాకొక సంతోషకరమైన వార్తను చెప్పాయి.
ఈ తీరమంతా ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనే మా జాతి తాబేళ్ళ పరిరక్షిత
ప్రాంతంగా ప్రకటించబడిందట.
ఇకపై ఇతరులు మమ్మల్ని చంపుతారనిగాని, మా గుడ్లను దొంగిలిస్తారనిగాని
భయం లేదన్నమాట. ఆ మాటవిని సంతోషిస్తూన్న నా మనసులో ఉన్నట్టుండి విషాదం
ఆవరించింది. అప్పుడప్పుడు మమ్మల్ని వేధించే మనుషుల మీద పట్టరాని ఆగ్రహం
కూడా కలిగింది. నా సన్నిహిత నేస్తం ఉల్వియా నా మనసులో కదలాడింది. ఉల్వియా,
నేనూ మరి కొందరితో కలిసి పుట్టినింటికి బయలుదేరుతూ ఎలా వెళ్ళాలో దారి
చెప్పమని మా పిన్నమ్మలాంటి పెద్దలను అడిగాం.
వాళ్ళేమో మీకు ఎటు వెళ్ళాలని తోస్తే అటు వెళ్ళండి అన్నారు. మేము అలాగే
బయలుదేరాం. నేను వచ్చి చేరాను. కాని నా ప్రియనేస్తం ఉల్వియా మార్గ మధ్యంలో
సముద్రంలో ట్రాలెర్ నెట్‌లో చిక్కుకున్నది. పాపం అది వలను కొరికి
బయటపడడానికి ఒక గంటసేపుకు పైగా పోరాడింది. ఉపరితలానికి వచ్చి ఊపిరి
పీల్చుకునే వీలులేక ఆఖరికి ప్రాణాలు విడిచింది. అది నన్ను చూసిన చివరి చూపు
మరిచిపోలేకుండా ఉన్నాను. ఆ చూపు విషాద పూరితమేగాని, ``నేను రా లేను.
నువు్వ తప్పక చేరాలి,'' అని ప్రోత్సహించే విధంగా తోచింది. నేను
చేరాను. అయితే, అంత త్వరగా కాదు. నా కడుపు పగిలిపోయేలా ఉంది. నా
బంధుమిత్రులకు దూరంగా వెళ్ళి గొయ్యి తవ్వడానికి చోటు చూసుకోవాలి. ఎందుకా?
మీకు చెప్పనే లేదు కదూ? ఇప్పుడు నా సొంత గుడ్లు నా కడుపునిండా ఉన్నాయి.
వాటిని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను! మీరూ గోవాలోని మన మానవ మిత్రులతో
కలిసి నా పిల్లల్ని కాపాడగలరని విశ్వసిస్తున్నాను!
No comments:
Post a Comment