సుకేశిని చాలా అందమైన అమ్మాయి. సిరిమేరుగిరి కొండ దిగువన వున్న
రామాపురంలో ఆమె నివసించేది. రామాపురంలో నీటి ఎద్దడి ఎక్కువ. బిందెడు నీళ్ళ
కోసం గ్రామప్రజలు చాలా దూరం వెళ్ళ వలసి వచ్చేది. వ్యవసాయం సక్రమంగా జరిగేది
కాదు. ప్రజలు పేదరికంతో నానా అవస్థలు అనుభవించేవారు. సుకేశిని, ఆమె తల్లి
ఒక గుడిసెలో నివసించేవారు. వాళు్ళ పేదలే కాని, చాలా కష్టపడి పనిచేసేవారు.
వాళ్ళకు కొన్ని గొర్రెలుండేవి. వాటిని మేపుకుంటూ జీవనం సాగించేవారు.
సుకేశినికి అందమైన చాలా పొడవైన శిరోజాలుండేవి. ఆమె నడుస్తూంటే జుట్టు పాదాల
వరకు జీరాడుతూ ఉండేది. ఒకనాడు గొర్రెలకు కావలసిన గడ్డి సుకేశినికి
చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. కొండమీదికి వెళ్ళి గడ్డి
కోసుకురావాలనుకున్నది. కష్టపడి కొండ ఎక్కి సగం దూరం వెళ్ళేసరికి బాగా
అలిసిపోయి ఒక వేపచెట్టు కింద కూర్చున్నది. వేపచెట్టు నీడలో విశ్రాంతి
తీసుకుంటూండగా లేత ఆకులతో ఒక వింత తీగ ఆమె దృష్టిని ఆకర్షించింది. అలాంటి
తీగను ఆమె అంతకు ముందెన్నడూ చూడలేదు. ఆ తీగను గొర్రెలకు వేస్తే తింటాయన్న
ఉద్దేశంతో, సుకేశిని ఆ తీగను పట్టి గట్టిగా లాగింది. ఆ తీగతో భూమికి అడుగున
వున్న గుమ్మడికాయ పైకి వచ్చింది.
మరుక్షణమే ఆ గుమ్మడికాయ పల్లం నుంచి బుగ్గలా నీరు పైకి చిమ్మి
సుకేశిని ముఖాన్ని తడిపింది. ఆ నీళ్ళను తాగి చూసింది సుకేశిని. తియ్యగా
ఉన్నాయి. ఆమె మనసు సంతోషంతో నాట్యం చేసింది. ఇంతకాలానికి నీటి బుగ్గను
కనుగొన్నదన్న మాట! తన గ్రామ ప్రజలు ఈ నీళ్ళను ఉపయోగించుకుంటే వాళ్ళ నీటి
సమస్య శాశ్వతంగా పరిష్కారమై పోతుంది! ఆమె ఇలా అనుకుంటూండగా హఠాత్తుగా
సుడిగాలి వీచడంతో, గుమ్మడికాయ ఎగిరి వెళ్ళి, నీటి బుగ్గకు అడ్డుగా పడి
నీళు్ళ రావడం ఆగిపోయింది.
ఏమి జరుగుతున్నదో గ్రహించే లోపలే ఆమె కొండ శిఖరం మీదికి చేర్చబడింది.
కొండ మీద అందమైన తటాకం కనిపించింది. అంతలో అక్కడున్న ఒక రాక్షసుడు అమిత
ఆగ్రహంతో, ``బుడిగీ! నేనీ కొండకు అధిపతిని. ఇక్కడ రెండు జలవనరులు నా
అధీనంలో ఉన్నాయి. ఒకటి ఈ తటాకం. రెండవది ఆ బుగ్గ.
ఇప్పుడు నీకా రహస్యం తెలిసి పోయింది. ఈ రహస్యాన్ని నీ గ్రామస్థులకు
చెప్పావో, నిన్ను తెచ్చి, తటాకం కింద పాతిపెట్టి, రోజూ నీ జుట్టు మీద
నీళు్ళ ప్రవహించేలా చేయగలను. జాగ్రత్త! ఇదే నీకు నా హెచ్చరిక! ఇక నువు్వ
వెళ్ళవచ్చు,'' అని బిగ్గరగా అరిచాడు. సుకేశిని సమాధానం చెప్పేలోగా ఆమెను
సుడిగాలి, గ్రామంలోకి తెచ్చి పడవేసింది. ఇవన్నీ కూడా కళు్ళ మూసి తెరిచేలోగా
చకచకా జరిగిపోవడంతో అంతా కలలా అనిపించింది సుకేశినికి. అయితే, అది కలకాదు
నిజమని చెప్పడానికి ఆమె చేతిలోవున్న వింత తీగ ఆకు ఒకటి గుర్తుగా నిలిచింది.
ఆమె దీనిని గురించి చాలా రోజులు ఆలోచించింది. ఎలాగైనా గ్రామ ప్రజల
నీటి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. అయితే రాక్షసుడి హెచ్చరికను
తలుచుకున్నప్పుడు, ``చల్లటి నీళు్ళ ఎప్పుడూ నా జుట్టు గుండా ప్రవహిస్తూనే
ఉంటాయి కదా!'' అని భయపడేది. రోజులు, నెలలు గడిచాయి. నీటి ఎద్దడి ఎక్కువయ్యే
కొద్దీ, ఆమె మానసిక వేదన కూడా ఎక్కువయింది. పట్టరాని వేదన కారణంగా ఆమె
జుట్టు తెల్లబడసాగింది. కొన్నాళ్ళకు ఆమె జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది.
ఆమె
అందం కూడా కనుమరుగయింది. ఒకనాడు ఆమె జబ్బు పడ్డ తల్లికీ, దప్పికతో
విలవిలలాడుతూన్న గొర్రె పిల్లలకూ బిందెడు నీళు్ళ తేలేక పోయింది. వేసవి
ఎండలు మండిపోతున్నాయి. ఆమె చాలా సేపు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి
వచ్చింది. మొత్తం గ్రామం మేలుకోసం తను ఒక్కతె ప్రాణత్యాగం చేయడం
ఫరవాలేదనిపించింది. మరునాడు తెల్లవారగానే గ్రామస్థులందరినీ సమావేశపరచి,
జరిగినదంతా వివరించి, ``నేను మిమ్మల్ని ఆ బుగ్గ దగ్గరికి తీసుకువెళతాను,''
అన్నది.
అక్కడ చేరిన జనం నుంచి ఒక యువకుడు లేచి నిలబడి, ``మా సుఖం కోసం నువు్వ
ప్రాణ త్యాగం చేయడం బాగా లేదు. అందుకు నేనొక పరిష్కారం చెబుతాను. నీలాగే
ఒక కొయ్యబొమ్మను తయారు చేద్దాం. నువు్వ నీ శిరోజాలను తీసి ఇచ్చావంటే, నేను
వాటిని బొమ్మ తలకు అతికిస్తాను. శిరోజాలు లేకుండా నీ ముఖం మరోలాగా ఉంటుంది
గనక, నిన్ను గుర్తు పట్టడం కొత్తవారికి అంత సులభం కాదు.
ఆ రాక్షసుడు కూడా నీ శిరోజాలతో ఉన్న నీ రూపం బొమ్మను తీసుకువెళ్ళి
తటాకం కింద పాతి పెడతాడు. అంతే,'' అన్నాడు. అది మంచి ఆలోచన అని అందరూ
భావించారు. మరునాడు, మంచి దేహసౌష్ఠవంగల వాళూ్ళ, యువతీయువకులూ సుకేశిని వెంట
సిరిమేరు కొండ మీదికి వెళ్ళారు. కొండ మీది వేపచెట్టునూ, వింత తీగనూ
చూశారు. ``నేను గుమ్మడి కాయను లాగేలోగా మీరు ఇక్కడి నుంచి మన గ్రామం వరకు
కాలువ తవ్వండి. నేను గుమ్మడి కాయను లాగిన వెంటనే దానిని పగలగొట్టి ధ్వంసం
చేయండి. ఆ తరవాత దేవుడి చిత్తం!'' అన్నది సుకేశిని.
గ్రామస్థులు ఆమె చెప్పినట్టే చేశారు. ఆమె తీగను లాగగానే బుగ్గ నుంచి
పెల్లుబికిన నీళు్ళ కాలువ గుండా గ్రామం కేసి ఉరకలెత్తింది. మరుక్షణమే
సుడిగాలిలా వచ్చి, రాక్షసుడు పొడవాటి శిరోజాలుగల బొమ్మను కొండ మీదికి
తీసుకు వెళ్ళి, తటాకం కింద పాతిపెట్టాడు. అది బొమ్మ అని గ్రహించక రాక్షసుడు
మరింత ఆవేశంతో, తటాకం గట్టును తెగగొట్టి శీతల జలాలు పట్టులాంటి ఆమె
పొడవాటి శిరోజాల గుండా ప్రవహించేలా చేశాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారని
రాక్షసుడు ఆవేశంతో సిరిమేరుగిరి మీది నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు.
సుకేశిని తెల్లటి జుట్టు మీదుగా జారిన తటాక జలాలు కొండ పైనుంచి కింది
లోయలోకి వెండి జలపాతాల్లా ఉరకసాగాయి.
ఆ
జలాలు గ్రామస్థుల వ్యవసాయం సాగుకు ఉపయోగ పడ్డాయి. కాలువ జలాలూ తాగునీరుగా
ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచి రామాపురం కరువు కాటకాల నుంచి రక్షించబడింది.
సుకేశినికి మళ్ళీ ఒత్తుగా, నల్లగా, నిగనిగలాడుతూ శిరోజాలు పెరిగాయి. ఆమె
నిస్వార్థ సేవకు రామాపురం ప్రజలు తమ కృతజ్ఞతలు తెలియజేసి, ఆమెను ఎంతగానో
కొనియాడారు.
No comments:
Post a Comment