Pages

Sunday, September 16, 2012

ఆస్తి పంపకం


వజ్రకరూరులోని సిద్ధరామయ్య గొప్ప పరోపకారిగా పేరుగాంచాడు. అడిగినవారికి లేదనకుండా అంతో ఇంతో ఇవ్వకుండా పంపేవాడు కాదు. పేదరికం నుంచి ఒక్కొక్క మెట్టుగా పైకి వచ్చినవాడు గనక, ఆయనకు లేనివారి కష్టనష్టాలు బాగా తెలుసు. చిన్న పచారీ కొట్టుతో జీవితాన్ని ప్రారంభించి ఈనాటికి వజ్రకరూరులో ధనవంతులైన వ్యాపారుల్లో ఒకడుగా నిలవగలిగాడు. పాడి-పంట, ధన కనక వస్తువాహనాలు సమకూర్చుకోవడంతో పాటు, ఇంద్రభవనంలాంటి ఇల్లు కూడా తన స్వార్జితంతో కట్టించాడు. ఆయనకు శిశిరుడు, వసంతుడు, హేమంతుడు అని ముగ్గురు కుమారులు. వివాహితులైన ముగ్గురూ మూడు రకాల వ్యాపారాలను తండ్రిలాగే దక్షతతో నిర్వహిస్తున్నారు. వయసు మీద పడుతున్న కొద్దీ సిద్ధరామయ్యకు పిల్లలకు ఆస్తి పంపకం చేసి బాధ్యత తీర్చుకోవాలన్న ఆలోచన బలీయం కాసాగింది. ఒకనాడు ఆయన తన ఆప్త మిత్రుడైన నిపుణకుణ్ణి పిలిచి, తన మనసులోని మాట చెప్పాడు. ఇద్దరూ చర్చించి, ఇంటిని తప్ప మిగతా వాటిని ముగ్గురికీ సమంగా విభజించాలని నిర్ణయించారు. ఇంటిని మాత్రం మూడుగా విడగొట్టడం సిద్ధరామయ్యకు ఇష్టం లేదు. ``ప్రతిరోజూ ఎంతలేదన్నా నలుగురైదుగురికి ఆతిథ్యమిచ్చే అన్నపూర్ణ నా ఇల్లు. నేను ఉన్నా, లేకపోయినా ఈ ఇంట్లో ఇదే సంప్రదాయం కొనసాగాలన్నది నా ఆశయం. అందుకు ఎవరు ఒప్పుకుంటే వారిదే ఈ ఇల్లు,'' అన్నాడు సిద్ధరామయ్య నిపుణకుడితో. ``అలా జరిగితే అన్న దము్మల మధ్య ఇర్షా్యద్వేషాలూ, స్పర్థలూ తలెత్తే అవకాశం ఉంది. బాగా ఆలోచించి చూడు,'' అన్నాడు నిపుణకుడు. 

``అందుకే నీ సలహా కోరుతున్నాను. ఈ ఆస్తి నా స్వార్జితం. కాబట్టి దీన్ని పంచడం నా ఇష్టానుసారమే జరుగుతుంది. అయితే, దాని కారణంగా అన్నదము్మల మధ్య సాన్నిహిత్యం తరిగి, స్పర్థలు పెరగకూడదు. ముగ్గురుగా విడిపోయి బతకడం కన్నా ఒకటిగా కలిసి ఇదే ఇంట్లో ఉండాలన్నదే నా అభిమతం. పరోపకారబుద్ధిగలవాడికి ఈ ఇంటిని అప్పగించడం అవసరం. ఈ ముగ్గురిలో అలాంటి వాడెవడో నిర్ణయించడం నీ చేతుల్లో ఉంది,'' అన్నాడు సిద్ధరామయ్య. నిపుణకుడికి ఇది పరీక్షలా తయారయింది. ``ముగ్గురూ మంచివాళ్ళే. ఎవరికీ హాని తలపెట్టే స్వభావులుకారు. వారిలో ఒకరిని నిర్ణయించడం కష్టమే,'' అనుకుంటూ ఆయన ఇంటికి బయలుదేరాడు. మూడు రోజులు తీవ్రంగా ఆలోచించగా ఆయనకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే సిద్ధరామయ్యకు తెలియజేశాడు. ఆయన సరే అన్నాక నిపుణకుడు తన పరీక్షను ప్రారంభించాడు. ఆయన మొదట పెద్దవాడైన శిశిరుణ్ణి పిలిచి, ``నాయనా, నువు్వ నా ప్రాణమిత్రుడి కుమారుడివి. నా బిడ్డతో సమానం. ఇటీవల హిమాలయాల నుంచి ఒక సిద్ధుడు అద్భుత మహిమ గల నాలుగు ఫలాలు తీసుకు వచ్చాడు. వాటిని భుజిస్తే అశ్వనీ దేవతలంత ఆరోగ్యం, కుబేరుడంతటి ధనం లభిస్తుంది. నా పిల్లలకు మూడు ఇవ్వగా ఒకటి మిగిలింది. ఐహిక బంధాల నుంచి విముక్తికోసం ప్రయత్నిస్తూన్న నాకూ, నీ తండ్రికీ దీని అవసరం లేదు గనక, దీన్ని నువు్వ తీసుకో.

ఇప్పటికిప్పుడే తిన్నావంటే నాకూ చాలా సంతోషం,'' అన్నాడు. ఆ మాట వినగానే శిశిరుడి కళు్ళ ఆనందంతో మెరిసిపోయాయి. ``నా మీద మీకున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞుణ్ణి మామయ్యా. మీ మాట నాకు వేదవాక్కు. ఇదిగో ఎవరికంటా పడకుండా ఇక్కడే తింటాను,'' అంటూ ఫలాన్ని అందుకుని మొత్తం తిని, పదే పదే కృతజ్ఞతలు చెప్పి, ఆనందంగా వెళ్ళి పోయాడు. ఆ తరవాత వసంతుణ్ణి పిలిపించి, నిపుణకుడు శిశిరుడితో చెప్పినట్టే చెప్పాడు. ``చాలా సంతోషం మామయ్యా. అయినా, అంత మహిమ గల ఫలాన్ని నేనొక్కణ్ణే తినలేను. అన్నయ్యకు గానీ, తము్మడికి గానీ ఇవ్వండి. పంచుకుని తింటే ఫరవాలేదనుకుంటే మా ముగ్గురికీ సమానంగా పంచి ఇవ్వండి. ముగ్గురూ కలిసే తింటాం. ఆరోగ్యం, ఐశ్వర్యం అందరికీ కావలసినవే కదా!'' అన్నాడు వసంతుడు వినయంగా. అతని మాటలను తోసి పుచ్చలేక నిపుణకుడు సరేనన్నట్టు తల ఊపి అతన్ని పంపేశాడు. ఇక మూడోవాడు హేమంతుడి వంతు వచ్చింది. అతడు నిపుణకుడి మాటలకు ఆనందంతో ఉబ్బితబ్బియ్యాడు. ``మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. కానీ, ఒక్క కోరిక,'' అని ఆగాడు హేమంతుడు. ఏమిటి అన్నట్టు చూశాడు నిపుణకుడు. ``నా భార్యాబిడ్డల ఆరోగ్యం, ఐశ్వర్యా లకు మించిన ఆనందం నాకు ఇంకేం ఉంటుంది? తమకు అంగీకారమైతే వాళ్ళను ఇక్కడికి రహస్యంగా పిలిపిస్తాను. 

మేమందరం పంచుకుని ఆ ఫలాన్ని ఆరగిస్తాం, ఏమంటారు?'' అన్నాడు. ``సరే,'' అన్నాడు నిపుణకుడు. రెండు రోజుల తరవాత సిద్ధరామయ్యను తన ఇంటికి ఆహ్వానించిన నిపుణకుడు, ``ఇంటి భారం మొత్తం వసంతుడికి అప్పగించు. నువు్వ ఆశిస్తున్నట్టే పదిమందీ నీ పరోపకార గుణాన్ని పది కాలాలపాటు గుర్తుంచుకుంటారు. ఇల్లు చెక్కు చెదరకుండా నిలుస్తుంది,'' అని సలహా ఇచ్చాడు. ``ఈ నిర్ణయానికి ఎలా రాగలిగావు?'' అని అడిగాడు సిద్ధరామయ్య మిత్రుణ్ణి. నిపుణకుడు జరిగింది వివరించి, ``నీ కొడుకులు ముగ్గురూ మంచివారే. అందులో సందేహం లేదు. అయితే, పెద్దవాడు శిశిరుడు తన కోసం మాత్రమే ఆలోచిస్తాడు. ఇతరుల గురించి పట్టించుకోడు. మూడవవాడు హేమంతుడు తన ఆలోచనా పరిథిని తన భార్యాపిల్లల వరకు మాత్రమే విస్తరించగలడు. ఇతనికి కూడా ఇతరుల గురించిన ఆలోచనలేదు. పోతే, రెండవ కొడుకు వసంతుడు మాత్రమే తనూ, తన కుటుంబంతో పాటు పరుల క్షేమం గురించి కూడా ఆలోచించే విశాల దృక్పథం కలవాడు. పరోపకారమే పరమార్థంగా భావించే నీకు తగిన వారసుడు అతడే. అందువల్ల నువు్వ నిశ్చింతగా ఇంటి బాధ్యతలను అతనికి అప్పగించవచ్చు. నీ ఆశయం నెరవేరి, నీ కుటుంబ గౌరవం చిరకాలం నిలిచి ఉంటుంది. నిజానికి నేనిచ్చినవి మా పెరట్లో పండిన తియ్యటి ఫలాలు మాత్రమే,'' అన్నాడు నవు్వతూ. ``సూక్ష్మ దృష్టితో తెలివిగా నా సమస్యను పరిష్కరించావు. చాలా సంతోషం,'' అని మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేసి ఇంటికి బయలుదేరాడు సిద్ధరామయ్య. కొన్ని రోజుల తరవాత సిద్ధరామయ్య, చెరొక వ్యాపారం నిర్వహిస్తూన్న ముగ్గురు కొడుకులకు ఆయా వ్యాపారాలను వాళ్ళకే ఇచ్చేశాడు. మిగిలి ఉన్న తన ఆస్తిని రెండు భాగాలుగా చేసి శిశిరుడికీ, హేమంతుడికీ సమంగా పంచాడు. ఇంటినీ, ఇంటి బాధ్యతలనూ వసంతుడికి అప్పగించాడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని వసంతుడు తండ్రి పేరు నిలబెట్టాడు.
  

No comments:

Post a Comment