Pages

Saturday, September 15, 2012

జ్ఞాపకశక్తి


ఉదయం ఏదో పనిమీద కామేశం ఇంటికి వచ్చాడు రామేశం. ఆ సమయంలో తీర్థయాత్రకు వెళుతూ ఒక సాధువు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. రామేశం రెండు రాగి కాసులాయనకు ఇచ్చి, ``ఒకటి నాది. రెండవది మా కామేశంది,'' అన్నాడు. సాధువు దీవించి, ``మీ స్నేహం ముచ్చటయినది. నువు్వ మిత్రుడి నుంచి రాగి కాసు వెనక్కు తీసుకోకు.
 
ప్రతి అమావాస్యనాడూ నీ మిత్రుడికో రాగి కాసు ఇస్తూ ఉండు. అది ఆయనకెంతో లాభం కలిగిస్తుంది. అలాగే నీ మిత్రుడు ప్రతి పున్నమిరోజూ నీకొక రాగికాసునిస్తే, అది నీకు లాభం కలిగిస్తుంది. అయితే రాగి కాసు విషయం ఎవరికి వారు గుర్తుంచుకోవలసిందే తప్ప, ఒకరికొకరు గుర్తుచేసుకోకూడదు,'' అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఊరికి పుల్లయ్య అనేవాడు వచ్చి, ఊళ్ళో పదేళ్ళ క్రితం చేసి వెళ్ళిన అప్పులన్నీ తీర్చాడు. వాడు కామేశం నూరు వరహాల బాకీని వడ్డీతో సహా తీర్చేసినట్టు తెలిసి సాధువు దీవెన ఫలించిందనుకున్నాడు రామేశం.
 
సాధువు చెప్పిన ప్రకారం పున్నమినాడు కామేశం రామేశానికి రాగికాసు ఇవ్వలేదు. కానీ మళ్ళీ అమావాస్య రాగానే రామేశం కామేశాన్ని కలుసుకుని ఒక రాగి కాసునిస్తే, ``అరే! నీకింకా ఆరోజు సాధువు చెప్పిన విషయం గుర్తుందా?'' అన్నాడాయన ఆశ్చర్యంగా. ``నీకు లాభం కూడా కలిగాక, ఆ విషయం నేనెలా మరిచిపోగలను,'' అన్నాడు రామేశం. కామేశం నవ్వి, ``పుల్లయ్య ఇంకా చాలా మంది అప్పులు తీర్చాడు. వాళ్ళందరికీ నువు్వ రాగికాసు లివ్వలేదుకదా!'' అన్నాడు.

``పూజ చేసిన వాడి కోసం వానకురిస్తే, చెయ్యని వాడి చేనుతడవక పోతుందా? నీవల్లే వాళ్ళందరికీ లాభించిందేమో,'' అన్నాడు రామేశం. కామేశం చిన్నబుచ్చుకుని, ``ఈ మాత్రం నాకూ తట్టిందనుకో. కానీ అదేమిటో పున్నమి వచ్చే సరికి నాకీ విషయమే గుర్తురావడంలేదు. నీ జ్ఞాపకశక్తి నాకూ ఉంటే ఎంత బావుణ్ణు,'' అని నిట్టూర్చాడు. ఆరాత్రే కాపలాభటులకు చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఒక దొంగ దొరికాడు. దోచిన డబ్బు, నగలను చెట్టు తొరల్రో దాస్తున్నాడు.
 
వాటిలో కామేశం పోగొట్టుకున్న నగ కూడా ఉన్నది! తనతోపాటు ఊళ్ళో చాలామంది నగలు దొరికినా-దీనికి కారణం తనకు రామేశం ఇచ్చిన రాగికాసు కావచ్చునన్న అనుమానం కామేశానికి కలిగింది. అయినా, ఆ తరవాత వచ్చిన పున్నమికి కూడా ఆయన రామేశానికి రాగికాసునివ్వలేదు. అయితే, ఆ తరవాత వచ్చిన అమావాస్యకు కూడా రామేశం రాగి కాసునిచ్చాడు. కామేశం తడబడి, ``నువ్విచ్చే రాగి కాసువల్ల నాకు లాభం కలుగుతోంది. గుర్తుంచుకుని నేను నీకు రాగికాసునివ్వకపోవడం వల్లనే నాకు కలిగిన లాభం నీకు కలగకుండా పోతున్నది.
 
నీ జ్ఞాపకశక్తి నాకు లేకపోవడం చిన్నతనంగా అనిపిస్తున్నది,'' అన్నాడు రామేశంతో. రామేశం నవ్వి, ``అప్పిచ్చి నష్టపోయావు. నగపోగొట్టుకున్నావు. నా కలాంటి నష్టాలేమీ లేకపోవడం అదృష్టమే కదా! నేనిచ్చిన రాగికాసువల్ల నీకా నష్టాలు పూడుకున్నాయి. నాకేమో నా అదృష్టం గురించి తెలిసింది. కాబట్టి అనవసరంగా చిన్నబుచ్చుకోకు,'' అని వెళ్ళిపోయాడు. ఆ తరవాత కూడా రామేశం వరుసగా ప్రతి అమావాస్యకూ కామేశానికి రాగి కాసు ఇస్తూనే ఉన్నాడు.
 
కామేశానికి లాభం కలుగుతూనే ఉన్నది. అయినా ఒక్క పున్నమికీ కామేశం రామేశానికి రాగి కాసునివ్వలేదు. అలా ఆరు నెలలు గడిచాక రామేశం ఏదో పని మీద ఊరెళ్ళడం వల్ల కామేశానికి ఒక అమావాస్యకు రాగి కాసు ఇవ్వలేక పోయాడు. ఆ మర్నాడు కామేశం పెరట్లో గొయ్యి తవ్విస్తూంటే ఒక చెక్కపెట్టె నిండా రాళూ్ళరప్పలూ బయటపడ్డాయి.

రామేశం తనకు రాగి కాసు ఇచ్చివుంటే ఆరాళు్ళ వజ్రాలుగా మారివుండేవని అనిపించి, ఈసారి పున్నమికి రామేశానికి రాగి కాసొకటి ఇవ్వాలనుకున్నాడు కామేశం. ఈలోగా రామేశం పెరట్లో నుయ్యి తవ్వించడానికి పున్నమి నాడు ముహూర్తం పెట్టాడు. అది కామేశానికి తెలిసి, ఆరోజు తను గనక రాగి కాసు ఇస్తే, సాధువు వరం ఫలించి రామేశానికి నిధి దొరికినాదొరకవచ్చునని అనుమానించి కాసు ఇచ్చే ఆలోచనను పక్కనబెట్టాడు.
 
అందుకని పున్నమి ఘడియలు వెళ్ళి, పాడ్యమి ఘడియలు వచ్చేదాక ఆగి అప్పుడు రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశం ఆయన్ను చూసి, ``రా, కామేశం! నువ్వే ఇంకా రాలేదేమని చూస్తున్నాను,'' అన్నాడు. ``నాకు జ్ఞాపకశక్తి తక్కువ కావడం వల్ల నేను సాధువు చెప్పిన నియమం పాటించలేకపోయాను. ఇప్పుడు నేను నీకు కాసునివ్వాలనే వచ్చాను,'' అన్నాడు కామేశం గొప్పగా. ``అందుకేనేమో పది అడుగుల్లోనే జల ఊరుతోంది కామేశం,'' అన్నాడు రామేశం. వాళ్ళేమి మాట్లాడుతున్నదీ అర్థం గాక, అక్కడివారు ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు.
 
అప్పుడు రామేశం సాధువు ఇచ్చిన వరం గురించీ, ఆ తరవాత జరిగిన విశేషాలూ వివరించి, ``పోయిన అమావాస్యకు ఊళ్ళో లేనుగనక ఇవ్వలేదు. అయితే, వచ్చే అమావాస్యకే కాదు. ఇంకెప్పుడూ రాగి కాసివ్వకూడదని నిర్ణయించుకున్నాను,'' అన్నాడు. ``మంచి వాడనీ, పరోపకారి అనీ ఈయనకు పేరు. ఇప్పుడు చూశారు కదా అసలు రంగు,'' అన్నాడు కామేశం హేళనగా. అప్పుడు రామేశం కూడా నవు్వతూ, ``అలా అంటావేమిటి కామేశం? నేను రాగికాసులిచ్చినంత కాలం మూలబడ్డ నీ జ్ఞాపకశక్తి, ఇవ్వడం మానగానే పని చేస్తోంది. మనిషికి అనుకోని లాభాలకంటే, జ్ఞాపకశక్తి ముఖ్యం కదా.
 
అంటే, రాగికాసు ఇవ్వడంకంటే, ఇవ్వక పోవడం వల్లనే నీకు ఎక్కువ ప్రయోజనం. నీకు రాగికాసు ఇవ్వడం మానేసి నా పరోపకారబుద్ధిని మరోసారి రుజువు చేసుకున్నాను,'' అన్నాడు. ఇది వింటూనే అక్కడ ఉన్న వారందరూ ఫక్కున నవ్వారు. కామేశం, రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.

No comments:

Post a Comment