Pages

Thursday, September 6, 2012

వైరాగ్యం


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో విదేహ దేశానికి ముఖ్యపట్టణమైన మిథిలానగరంలో మహాజనకుడనే రాజు ఉండేవాడు. ఆయనకు అరిష్టజనకుడని, పోలజనకుడని ఇద్దరు కుమారులుండేవారు.

మహాజనకుడు పోయాక అరిష్టజనకుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజై, తన తమ్ముడైన పోలజనకుణ్ణి యువరాజు చేశాడు. అయితే, కొంతకాలానికి అరిష్టజనకుడికి తన తమ్ముడు తనను చంపి రాజు కావాలని చూస్తున్నట్టు నౌకర్ల ద్వారా రహ స్య వార్తలు అందాయి. కాని అరిష్టజనకుడు వాటిని లక్ష్యపెట్టలేదు.

తన అన్న అలక్ష్యం ఆధారం చేసుకుని పోలజనకుడు కొంత పరివారాన్ని కూడగట్టుకుని, అన్నపై కుట్ర పన్ని ఒకనాడు హ ఠాత్తుగా వెళ్ళిపడి ఆయనను హత్య చేసేశాడు.

అరిష్టజనకుడు చనిపోయే సమయానికి ఆయన పట్టపురాణి గర్భవతిగా ఉన్నది. భర్త చనిపోయిన వార్త వినగానే ఆమె తన నగలూ నాణ్యాలూ ఒక గంపలో పెట్టి, వాటిపైన ఊక కప్పింది. తరవాత ఆమె మాసిన బట్టలు కట్టుకుని, గంప నెత్తిన పెట్టుకుని బయలుదేరింది. దారిలో ఆమె నెవరూ గుర్తించలేదు. ఆమె ఉత్తర ద్వారంగుండా నగరం దాటి వచ్చేసింది.

ఎటు వెళ్ళాలో ఆమెకు తెలియలేదు. ఆమె ఎన్నడూ రాజసౌధం దాటి ఇవతలికి వచ్చిన మనిషి కాదు. కాలచంప అనే నగరం ఒకటి ఎక్కడో ఉన్నట్టు ఆమె విని ఉన్నది. అందుచేత ఆమె ఒక చెట్టు కింద తన గంప పెట్టుకు కూచుని, దారి వెంట వచ్చే పోయేవారిని, ‘‘కాలచంప నగరానికి దారి ఎటు, నాయనా?’’ అని అడగసాగింది. కొంత సేపటికి ఒక ముసలివాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చాడు. వాడు రాణితో, ‘‘నేను ఆ నగరానికే పోతున్నాను.బండి ఎక్కి కూచో అమ్మా. నిండు చూలాలులాగా ఉన్నావు. బండి జాగ్రత్తగా, కుదుపు ల్లేకుండా తోలుతాలే,’’ అన్నాడు.


 రాణి ఆ బండిలో ఎక్కి కాలచంప నగరానికి చేరుకున్నది. బండివాడు ఆమెను  ఒక చావడివద్ద దించి వెళ్ళి పోయాడు. ఇక ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు తెలియలేదు. అందుచేత ఆమె ఆ చావడిలోకి  వెళ్ళి కూచుని, దాని ముందుగా నడిచే మనుషులను చూడ సాగింది. కొంత సేపటికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా స్నానానికి వెళుతూ చావడిలో బిక్కు బిక్కుమని కూర్చుని ఉన్న గర్భిణి స్ర్తీని చూశాడు. ఆయన తన శిష్యులను బయటనే ఉండమని, లోపలికి వచ్చి రాణిని పలకరించాడు.

‘‘నాయనా, నేను మిథిలా నగరపు రాణిని. నా భర్త యుద్ధంలో చనిపోవటం వల్ల నేను దిక్కు లేని అనాథనై పోయాను. నా కిప్పుడెవరూ లేరు. ఈ నగరంలో నే నెవరినీ ఎరుగను,’’ అన్నది రాణి బ్రాహ్మణుడితో.‘‘అలా అయితే, నువ్వు మా ఇంట తల దాచుకోవచ్చు. కాని ముందుగా ఒక చిన్న నాటకం ఆడాలి. నా కాళ్ళ మీద పడి, బయట ఉన్న నా శిష్యులు వినేటట్టు భోరుమని శోకాలు పెట్టు. నీ రహస్యం ఎవరికీ తెలియకుండా నిన్ను కాపాడుతాను,’’ అన్నాడు బ్రాహ్మణుడు.

రాణి ఆయన చెప్పినట్టే చేసింది. ఎవరో స్ర్తీ తమ గురువుగారి కాళ్ళ మీద పడి బావురుమనటం చూడగానే శిష్యులు ఆత్రంగా లోపలికి వచ్చి, ‘‘ఏమిటి? ఏమిటి?’’ అని ప్రశ్నించారు. దారే పొయ్యే వారు కూడా చాలామంది చేరారు. బ్రాహ్మణుడు వారితో, ‘‘ఈమె నా కడగొట్టు చెల్లెలు. నేను స్వగ్రామం విడిచిపెట్టాక పుట్టింది. అందుచేత  ఈమెను నేనింతకు ముందెన్నడూ చూసి ఎరుగను,’’ అని చెప్పాడు. ఈ మాటలను అందరూ నమ్మారు. బ్రాహ్మణుడు ఆమెను తన ఇంటికి తీసుకుపోయి, చక్కగా స్నానం చేయించి, భోజనం పెట్టించాడు. కొద్ది రోజులకల్లా ఆమె ఒక మగ పిల్లవాణ్ణి కన్నది. ఆ పిల్లవాడి కామె మహాజనకుడని తన మామగారి పేరు పెట్టుకున్నది. ఈ మహాజనకుడే బోధిసత్వుడు.


 మహాజనకుడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు. అతనితో ఆడుకునే క్షత్రియ కుమారులు అతన్ని చులకనగా చూసేవాళ్ళు. ఇది చూసి మహాజనకుడు మండిపడి వాళ్ళను చితక తన్నేవాడు. వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి తమ పెద్దవాళ్ళతో, ‘‘ఆ విధవరాలి కొడుకు మమ్మల్నితన్నాడు!’’ అని చెప్పేవాళ్ళు. ‘‘విధవరాలి కొడుకు, ’’అన్న మాట వినగానే మహాజనకుడికి తన తండ్రి ఎవరా అని సందేహం కలిగింది. మొదట్లో తల్లి అతనికి నిజం చెప్పలేదు. కాని మహాజనకుడు పట్టుబట్టడంతో ఇక చేసేదిలేక ఆమె జరిగినదంతా కొడుక్కు చెప్పేసింది.

తన పినతండ్రి తన తండ్రితో యుద్ధం చేసి, యుద్ధంలో తన తండ్రిని చంపి విదేహ రాజ్యం వశపరచుకున్నాడని తెలియగానే, ఆ రాజ్యం తిరిగి సాధించాలన్న కోరిక మహాజనకుడికి మనసులో తల ఎత్తింది. పదహారేళ్ళు నిండగానే అతను తన చదువు సంధ్యలు ముగించి, తల్లితో, ‘‘అమ్మా, నేను విదేహ రాజ్యాన్ని జయిస్తాను. నీ దగ్గిర సొమ్మే మైనా ఉన్నదా?’’ అని అడిగాడు.

ఆమె అతనికి తాను గంపలో దాచి మిథిలా నగరం నుంచి తెచ్చిన బంగారమూ, నగలూ చూపింది. అందులో సగం మాత్రమే తీసుకుని మహాజనకుడు మిథిలా నగరానికి ప్రయాణమయ్యూడు. ఆరోజే మిథిలా నగరంలో పోలజనక మహారాజుకు ఒక చెయ్యీ, కాలూ పడి పోయింది. సరిగ్గా మహాజనకుడు మిథిలా నగరంలో అడుగు పెట్టిననాడే రాజభవనంలో పోలజనకుడు మరణించాడు.

ఆయనకు వారసులెవరూ లేరు. రాజపురోహితుడు ఒక రథం మీద రాజకిరీటమూ, రాజఛత్రమూ, రాజదండమూ, పాదుకలూ మొదలైనవి పెట్టి రథాన్ని యథేచ్ఛగా పోనిచ్చాడు. పురోహి తుడూ, మంత్రులూ రథం వెనక నడుస్తూ బయలుదేరారు.


రథం కొంతదూరం వెళ్ళి, ఉద్యాన వనంలో మహాజనకుడు విశ్రాంతి తీసుకుంటున్న చోట ఆగిపోయింది.  రాజపురోహితుడు మహాజనకుణ్ణి పరీక్షించి అతని శరీరంపైన రాజలక్షణాలుండటం గమనించి, విదేహ దేశానికి అతన్ని రాజుగా ప్రకటించాడు. అతనికి పట్టాభిషేకం జరిగింది. తరవాత మహాజనకుడు సీవలీదేవిని పెళ్ళాడి, సుఖంగా రాజ్యం చేయసాగాడు. వారికి దీర్ఘాయువు అని ఒక కుమారుడు కూడా కలిగాడు.

కొంతకాలం గడిచింది. ఒకరోజు మహాజనకుడికి తోటలు చూడాలని వేడుక కలిగింది. ఆయన తన ఏనుగు నెక్కి తోటలు చూడటానికి బయలుదేరాడు. తోటలోకి ప్రవేశిస్తూనే ఆయన రెండు అందమైన గున్న మామిడి చెట్లను చూశాడు. అవి గుబురుగా, నవనవలాడుతూ ఉన్నాయి. వాటిలో ఒక చెట్టు నిండా పళ్ళున్నాయి. ఆ చెట్టు మీద రకరకాల పక్షులున్నాయి. రెండవ చెట్టుమీద ఒక్క పండు కూడా లేదు. పళ్ళున్న చెట్టు నుంచి ఒక పండు కోయించుకుని తిని, అది చాలా రుచిగా ఉండటం చేత రాజుగారు, తిరిగి వచ్చేటప్పుడు మరి కొన్ని పళ్ళు తిందామని తన మనసులో అనుకున్నాడు.

ఆయన ముందుకు సాగి వెళ్ళగానే రాజుగారి పరివారంలో వారంతా ఆత్రంగా మామిడిపళ్ళు కోసుకుని తిన్నారు. కొందరు తొందరలో రెమ్మలు కొమ్మలు కూడా విరిచారు. అంతవరకు ఎంతో అందంగా ఉండిన గున్నమామిడి కొద్ది క్షణాలలో బీభత్సంగా అయిపోయింది. రాజుగారు తోటలన్నీ కలియతిరిగి, తిరిగివస్తూ పాడుపడిపోయిన మామిడి పళ్ళ చెట్టును చూసి నిర్ఘాంతపోయూడు. దాని పక్కనే ఉన్న గొడ్డుమామిడి చెట్టు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎప్పటిలాగే నవనవలాడుతూ ఉంది.



No comments:

Post a Comment