Pages

Thursday, September 6, 2012

దానహీనుడు


బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన ఎనభై కోట్లకు అధిపతి అయి ఉండి కూడా, ప్రపంచంమీద వైరాగ్యం కలిగి, తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు.

‘‘నాకు ధనలోపం ఏమీ లేదు. అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో!’’ అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో ఆరు అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దానధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజూ ఒక్కొక్క లక్ష చొప్పున ఖర్చు అవుతూండేది. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్రపదవి సంపాదించాడు.

ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడలలోనే నడిచి చనిపోయి చంద్రుడుగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడుగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగానూ, మాతలి కొడుకు పంచ శిఖాగ్నిగానూ పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు.

కాని పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చే సరికి వంశాచారం నిర్మూలమై పోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు ఎనభై కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతణ్ణి ప్రజలు మచ్ఛరికోశియుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మూయించి, భవనాలను తగలబెట్టి నేలమట్టం చేయించాడు. అన్నసత్రాలు మూయగానే నగరం లోని బీదా బిక్కి జనం మచ్ఛరికోశియుడి ఇంటిముందు మూగి, ‘‘బాబూ, ధర్మం మానకండి!

 సత్రాలు మూయకండి!’’ అని ఆక్రోశించారు. మచ్ఛరికోశియుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందునుంచి గెంటించాడు. మచ్ఛరికోశియుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రులలాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పని చేస్తున్నాడు. కాని ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరగడు.

తాను కడుపునిండా తిని ఎరగడు సరికదా, తన భార్యాబిడ్డలను కూడా తిన నిచ్చేవాడుకాడు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులిమజ్జిగ తాగేవాడు. కటిక దరిద్రుడిలా నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాతబండికి బక్కచిక్కిన ఎద్దులు కట్టి, ఆ బండి మీద ఎక్కడికైనా వెళుతుండేవాడు.

ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజసభకు పోతూ, ఉపకోశాధిపతిని కూడా వెంట బెట్టుకు పోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి ఉపకోశాధిపతీ, ఆయన భార్యా, పిల్లలూ విస్తళ్ళముందు కూచుని చక్కెరపొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి, ఆయనను కూడా చక్కెరపొంగలి తినటానికి రమ్మని ఆహ్వానించాడు.

‘‘ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెరపొంగలి తింటే, రేపు నేను వీడి ఇంటిల్లిపాదినీ పిలిచి విందు చేయవలసి ఉంటుంది!’’ అని భయపడి మచ్ఛరికోశియుడు, ‘‘నాకు ఆకలి లేదు. నేనింతకుముందే కడుపు నిండా తిని వచ్చాను, మీరు కానివ్వండి!’’ అన్నాడు.

కాని ఆ క్షణంనుంచే మచ్ఛరికోశియుడికి చక్కెరపొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకున్నది. కాని ఇంట్లో వండిస్తే తనతోబాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరిదగ్గిరా బయటపెట్టక, మనోవ్యాధితో మంచం పట్టాడు.

ఆయన భార్య వచ్చి, ‘‘మీకు వంట్లో జబ్బుగా ఉందా?’’ అని అడిగింది. ‘‘నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను!’’ అన్నాడాయన. కాని భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకున్నది. అంతా విని ఆమె, ‘‘మనమేం దరిద్రులమా? చక్కెరపొంగలి కోసం మనోవ్యాధి పడాలా? కాశీనగరంలో ఉన్న జనాభాకంతకీ చక్కెరపొంగలి వండిస్తాను!’’ అన్నది.

 ‘‘మీ పుట్టింటివాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే. అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతకీ చక్కెరపొంగలి సంతర్పణ చెయ్యి!’’ అన్నాడు పిసినిగొట్టు. కనీసం  వాళ్ళందరినీ పిలుద్దామన్నది భార్య. వాళ్ళందరితోటీ నీకేమిటన్నాడు భర్త. అయితే కనీసం మనింటిల్లిపాదికీ చక్కెరపొంగలి వండుతానన్నది భార్య. భర్త ఏమాత్రం వీల్లేదన్నాడు. ‘‘సరే అయితే మీకూ, నాకూ వండుతాను,’’ అన్నది భార్య.

‘‘మధ్యనువ్వుదేనికి?’’ అన్నాడు భర్త చిరాగ్గా. ‘‘అయితే మీ ఒక్కరికోసమే వండుతాను. సరా?’’ అన్నది భార్య. ‘‘అసలు ఇంట్లో వండటానికి వీల్లేదు. ఇంత బియ్యమూ, పాలూ, నెయ్యీ, తేనే నా చేతికియ్యి. వంటపాత్రలు కూడా ఇయ్యి. నేను అడివిలోకి వెళ్ళి చక్కెరపొంగలి వండుకుని తింటాను!’’ అన్నాడు భర్త.

భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకుని మచ్ఛరికోశియుడు ముసుగు కప్పుకుని, నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నదీతీరాన ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరుచేత వంటకట్టెలూ, నీరూ తెప్పించి, వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు. ‘‘ఎవరన్నా దారివెంట వస్తుంటే నాకు తెలియజెయ్యి. నీతో నాకు పని ఉంటే కేకవేస్తాను. నేను పిలిస్తే గాని రాకు!’’ అని వాడితో చెప్పాడు.

ఈలోపల ఇంద్రుడు తన ఆరవతరం వాడైన మచ్ఛరికోశియుణ్ణి గురించి తెలుసుకున్నాడు. ‘‘పంచశిఖుడి దాకా అందరూ దానధర్మాలు చేసి దేవత్వం పొందితే, పంచశిఖుడి కొడుకు పిసినిగొట్టయి, వంశాచారాన్ని మంటకలిపి, చక్కెరపొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు!’’ అనుకుని ఇంద్రుడు చంద్రుణ్ణీ, సూర్యుణ్ణీ, మాతలినీ, పంచశిఖుణ్ణీ పిలిపించి వారితో తాను చేయదలచిన పనిని గురించి చెప్పాడు.
తరవాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి మచ్ఛరికోశియుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి, ‘‘ఇదిగో, కాశీకి దారి ఎటు?’’ అని అడిగాడు.

 ‘‘కాశీకి దారే తెలియదూ? ఇటుకేసి వస్తున్నావేమిటి? పో అవతలికి!’’ అని మచ్ఛరికోశియుడు కేకలు పెట్టాడు. ‘‘ఎందుకలా అరుస్తున్నావు? చక్కెరపొంగలి చేస్తున్నావే? బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు. వాళ్ళతో పాటు నేను కూడా పంక్తిని కూచుంటాను!’’ అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ.

‘‘సంతర్పణా లేదు, గింతర్పణా లేదు! పద, పద!’’ అని మచ్ఛరికోశియుడు అతణ్ణి అదిలించాడు. ‘‘ఎందుకు నాయనా, అంత కోపగించుకుంటావు. అభ్యాగతిని, నీతోబాటు ఆ వండినదేదో ఇంత పెడితే పుణ్యమే గాని పాపం రాదే!’’ అన్నాడు ఇంద్రుడు. ‘‘నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను. ఇది నాకే చాలదు. నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను. అందులో మళ్ళీ నీకు ముష్టా? అదేం కుదరదు!’’ అన్నాడు మచ్ఛరికోశియుడు.

‘‘కొంచెంలో కొంచెమే దానం చెయ్యి. ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి. ఒంటిగా ఎన్నడూ తినరాదు. దానంవల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి!’’ అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్టచివరకు మచ్ఛరికోశియుడు, ‘‘సరే, అలా కూచో, నీక్కూడా కొంచెంగా చక్కెరపొంగలి పెడతాను!’’ అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెరపొంగలి యాచించాడు. అతణ్ణీ కూచోమనక మచ్ఛరికోశియుడికి తప్పలేదు. తరవాత సూర్యుడూ, మాతలీ, పంచశిఖుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి పక్కనే తిష్ఠవేశారు.

త్వరలోనే చక్కెరపొంగలి తయారయింది. ‘‘వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి!’’ అన్నాడు మచ్ఛరికోశియుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంత తామరాకులు వచ్చాయి. ‘‘ఇంతంత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను. మందార పత్రాలలాటివి తెచ్చుకోండి!’’ అన్నాడు మచ్ఛరికోశియుడు. వాళ్ళు మందారపత్రాలు తెచ్చుకున్నా, అవి పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. మచ్ఛరికోశియుడు చక్కెరపొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టినా పాత్రలో ఇంకా చాలా చక్కెరపొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశిఖుడు కుక్క రూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు.

సమయానికి మచ్ఛరికోశియుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కాని ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. ‘‘నేను చెయ్యి కడుక్కోవటానికి కాసిని నీళ్ళు తెచ్చి పెట్టండి!’’ అని ఆయన బ్రాహ్మణులను కోరాడు. వారు నిర్మొహమాటంగా, ‘‘మేము తీసుకురాము!’’ అని చెప్పారు.

‘‘నా చక్కెరపొంగలి తింటూ ఆమాత్రమైనా విశ్వాసం లేదా?’’ అని మచ్ఛరికోశియుడు వారిని అడిగాడు. వారు ససేమిరా తీసుకురామన్నారు. ‘‘అయితే నా పాత్రను కాస్త చూస్తూ వుండండి. నేనే వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాను!’’ అంటూ మచ్ఛరికోశియుడు నదివద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే కుక్క చక్కెరపొంగలి పాత్రలో మూతి పెట్టేసింది.

మచ్ఛరికోశియుడికి కోపం వచ్చి, ఒక కర్ర తీసుకుని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మచ్ఛరికోశియుణ్ణే తరమ సాగింది. అది క్షణక్షణానికీ రంగులు మారుతూ, కాస్సేపు చిన్నదవుతూ, కాస్సేపు పెద్దదవుతూ కనపడింది. మచ్ఛరికోశియుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, ‘‘బాబూ, నన్ను ఈ గుర్రం బారినుంచి రక్షించండి!’’ అని కోరాడు.

వెంటనే ఆ అయిదుగురూ తమ నిజ స్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. ‘‘మీరు మనుషులు కారు, దేవతలు! మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి!’’ అన్నాడు మచ్ఛరికోశియుడు. ‘‘మేము నీ పితృదేవతలం. మానవజన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాం.

నువ్వు లోభివై, వంశాచారాన్ని మంట గలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాం! ఇంటికి పోయి దానధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో!’’ అన్నాడు ఇంద్రుడు. మచ్ఛరికోశియుడి బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి, తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు.

No comments:

Post a Comment