అనగా అనగా ఒకప్పుడు ఓ ఊరిలో ఓ పేదవాడికి అయిదేళ్ల కూతురు ఉండేది.
ఒకరోజు ఆమె బంగారు జిగినీ కాగితాన్ని చెరిపేస్తుండగా తండ్రి చూసి ఇలా అడిగాడు
" ఏం చేస్తున్నావమ్మా.."
నాయనా. ఇదిగో ఈ పెట్టెకు బంగారు కాగితం చుట్టి దేవుని ముందు పెట్టాలనుకుంటున్నా అంతే.
నాయన ఆమెను తిట్టాడు. మనం పేదోళ్లం కదా. విలువైన కాగితాన్ని ఖరాబు చేస్తావా, బుద్ది లేదూ..
తండ్రి మాటలను చిన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కాగితాన్ని పెట్టుకు చుట్టి తర్వాత దేవుడి ముందు పెట్టింది.
మరుసటి రోజు ఉదయం ఆ బహుమతిని తండ్రికి ఇవ్వబోయింది.
"నాయనా, ఇది నీకు.." అంటూ తీసి ఇచ్చింది.
మెల్లగా పెట్టెకున్న కాగితం విప్పాడు. లోపల ఖాళీగా ఉండటం చూసి ఉగ్రుడయ్యాడు.
"ఈ మాత్రం తెలీదేమే నీకు.. ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు లోపల ఏదో ఒకటి ఉంచాలని తెలీదా నీకు" ఉరిమాడు.
చిట్టితల్లి ఓ సారి ఎగాదిగా చూసి కన్నీళ్లు కారుతుండగా ఇలా అడిగింది.
"అయ్యో నాయనా, ఇది ఖాళీ పెట్టె కాదు.. ఈ పెట్టెనిండా నా ముద్దుల్ని నింపి ఇచ్చా. అవన్నీ నీకే నాయనా..
తండ్రి ఒక్కసారిగా కింద కూర్చుండిపోయాడు. కూతురిని గాఢంగా హత్తుకున్నాడు.
"అన్యాయంగా తిట్టేశానమ్మా... నువ్విచ్చిన బహుమతిని అర్థం చేసుకోలేకపోయా..
తర్వాత కొద్ది కాలానికే ఓ ప్రమాదంలో పాప కన్నుమూసింది. తండ్రి కుప్పగూలిపోయాడు.
గతంలో కూతురు అన్న మాటలు తల్చుకుని తల్చుకుని కుమిలిపోయాడు.
"నువ్విచ్చిన బంగారు ముద్దులను ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటానమ్మా.. ప్రపంచంలో ఇంకేవీ నాకు అక్కరలేదు."
తర్వాత ఎప్పుడు తనలో నిరుత్సాహం కలిగినా, చిట్టితల్లి తనకు ఇచ్చిన పసిడి ముద్దులను మనసులో ఊహించుకునే వాడు.
వాటిలో తన కూతురు పంచిన ప్రేమను కూడా మనసునిండా తల్చుకునేవాడు.
No comments:
Post a Comment