మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో
రత్నాకరదేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థతతో పరిపాలించాడు. ఆయన రాజ్యం నాలుగు
దిక్కులా బాగా విస్తరించింది. మారుమూలల నివసించే ప్రజల కష్టసుఖాలను
కేంద్రంలో ఉన్న రాజు విచారించటం కష్టసాధ్యమయింది. ఈ సమస్యను గురించి
మణికంఠుడు మంత్రులతో విచారించగా, దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి,
నాలుగు ప్రాంతాలనూ పాలించటానికి దక్షత గల రాజ ప్రతినిధులను
ని
ుమించమన్నారు.
వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి, నాలుగు భాగాలకూ నలుగురు
విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. నలుగురు రాజప్రతినిధులూ నెల
నెలా రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించీ, వాటిని
తొలగించటానికి తీసుకుంటున్న చర్యలను గురించీ నివేదికలు పంపుతూ వచ్చారు.
వారిలో ప్రతి ఒకరూ తన రాజ్యభాగం మిగిలిన మూడింటి కన్నా ఉన్నతంగా తయారు
కావాలని తమలో తాము పోటీ పడ్డారు.
ప్రజలను ఉత్సాహపరచటానికి వారు ప్రాంతీయాభిమానాలను రెచ్చగొట్టారు.
కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ప్రజలలో ఎప్పుడో వెనకబడిపోయిన
జాతి వైరాలు తిరిగి తల ఎత్తటానికి అవకాశం కలిగించారు. ఇంతేగాక, ఏ ప్రాంతంలో
అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా
రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు.
ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది, కాని నేతలో ప్రావీణ్యం గల జాతులు
దక్షణాన ఉన్నాయి. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షణ
ప్రాంతపు నేతగాళ్ళకు అందేది; దేశంలో మేలురకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా
సాగింది. కాని ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే
పత్తిని దక్షణానికి పోనివ్వక, తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు.
ఈ పరిస్థితిలో దక్షణ ప్రాంత రాజప్రతినిధి, ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో
పత్తి పండించ సాగాడు. ఈ విధంగా, మంచి నేతగాళ్ళున్న చోట మంచి పత్తి
లేకుండానూ, మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండానూ పోయి, వస్త్రాల
నాణ్యం బాగా దెబ్బతిన్నది. ఇదే దుర్గతి లోహపరిశ్రలకూ పట్టింది.
దేశానికి తూర్పున మంచి గనులున్నాయి; పడమట నిపుణులైన లోహకారులున్నారు.
కాని తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి,
లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న
రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను
కొనుక్కున్నాడు. కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు
చూస్తే, వారంతా దేశాన్ని అభివృద్ధి పరచటానికి శక్తివంచన లేకుండా
పాటుపడుతున్నట్టు కనిపించేది.
కాని దేశం అభివృద్ధి చెందటం లేదని ఆ
ునకు తెలుసును. రాజప్రతినిధులను
ఏర్పాటు చేసి అయిదేళ్ళు అయింది. దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా, పూర్వం
ఉండిన అభివృద్ధి క్రమంగా క్షణించి, చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం
తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి,
అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు. ఒక గోష్ఠిలో వర్తకులు
ప్రసంగిస్తూ, గడచిన అయిదేళ్ళలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి
అయిందన్నారు.
అలాగే పరిశ్రమల వాళ్ళూ దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగా
ున్నారు. ఇదంతా
వింటున్న రాజుకు ఈ పెరుగు దలలు చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి
కాకపోవటానికి చింతించాలో తెలియలేదు. ఒక రోజు పండిత గోష్ఠి కూడా జరిగింది.
ఆ గోష్ఠిలో శశిభూషణుడనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి, రాజుగారి నుంచి
బహుమానం పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో, ‘‘పాండిత్యానికి
సంబంధించిన విషయం కాదు గాని, నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది.
దానికి సమాధానం ఇవ్వగలరా?'' అన్నాడు.
‘‘అడగండి, శక్తికొద్దీ ప్రయత్నిస్తాను,'' అన్నాడు శశిభూషణుడు. ‘‘ఈ
ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. అందుచేత దేవుడే అందరి కన్న గొప్పవాడంటాం.
కాని దేవుడి కన్న గొప్పవారు ఎవరైనా ఉన్నారా?'' అని రాజు అడిగాడు. ‘‘లేకేం,
దేవుడి కన్న గొప్పవాడు మనిషి,'' అన్నాడు శశిభూషణుడు. రాజు తెల్లబోయి,
‘‘సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు. అది సరి అయినదని నిరూపించుకోవాలి,''
అన్నాడు.
శశిభూషణుడు వినయంగా, ‘‘నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను, మహారాజా.
దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర
ప్రాంతంలో బోధకుడుగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి. కాని నేను తూర్పు
ప్రాంతానికి చెందిన వాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది. అందుచేత నేను
నేర్చుకున్న విద్యను నలుగురికీ పంచి ఇచ్చే పని మానుకుని, ప్రస్తుతం
వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను.
దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే
చెప్పండి,'' అన్నాడు. శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పు అయింది.
ఏకరాజ్యంగా ఉండవలసినది నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది. దీన్ని గురించి
రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యను చర్చించి,
‘‘మహారాజా, పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పులేదు.
ప్రాంతీయ దురభిమానాలు పెరగటానికి కారణం, ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ
ప్రాంతంవాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులూ, అసమర్థులూ అనటానికి కూడా
లేదు. కాని ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ
దుస్థితి కలిగేది కాదు.
వారికి స్థానచలనం కలిగించండి, సమస్య పరిష్కారమవుతుంది. ప్రజలు తామంతా
ఒక దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు. వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి,
సఖ్యత ఏర్పడుతుంది,'' అన్నారు. రాజు అలాగే, చేసి దేశం అభ్యున్నతిని
సాధించేటట్టు చేశాడు.
No comments:
Post a Comment