Pages

Thursday, September 6, 2012

రంగాచారి జోస్యం


 రామాపురం అనే ఒక జమీందారీ గ్రామంలో, రంగాచారి అనే పేరుమోసిన జ్యోతిష్కుడుండేవాడు. తన దగ్గరకు వచ్చేవారి జాతకాలు పరిశీలించి, వారి భవిష్యత్తు చెప్పడమేగాక, జాతకం లేనివారికి, వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం తయారు చేసి జ్యోస్యం చెప్పేవాడు. అంతేకాక, కొందరికి గ్రహశాంతులూ అవీ అవసరమంటూ శాంతి పూజలూ, హోమాల పేరుతో, వారివారి తాహతును బట్టి డబ్బు వసూలు చేసేవాడు.


రంగాచారి అదృష్టమో, కాకతాళీయమోగాని చాలా సందర్భాల్లో అతడి జోస్యం ఫలించేది. ఒక్కొక్కసారి ఫలించనివాళ్ళు, అతణ్ణి గట్టిగా ప్రశ్నించినప్పుడు, ఏవేవో కల్లబొల్లి మాటలతో సంతృప్తి పరచాలని చూసేవాడు.రంగాచారి దూరపు చుట్టం పొరుగూరి గోవిందాచారి, ఒకసారి అతడికి అంగడి వీధిలో ఎదురుపడి, ‘‘రంగాచారీ! నువ్వు జ్యోతిశ్శాస్ర్తంలో మహాపండితుడివనుకున్నాను. కిందటి సారి నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆర్నెల్లలో మా అమ్మాయికి నిక్షేపంలాంటి సంబంధం కుదురుతుందని చెప్పావు.


ఏడాది గడిచినా ఒక్క మంచి సంబంధం కూడా రాలేదు సరికదా, వచ్చిన ఒకటి, రెండు నాసిరకం సంబంధాలు కూడా బెడిసికొట్టినయి. పిల్లకి పెళ్ళీడు కూడా దాటిపోతున్నది. బంధువని కూడా చూడకుండా, నా దగ్గర డబ్బు మాత్రం బాగా గుంజావు. నువ్వేమన్న జ్యోతిష్కుడివయ్యా!’’ అంటూ నిలదీశాడు.

అందుకు రంగాచారి ధుమధుమలాడుతూ, ‘‘కాస్త మాటలు తూచివాడడం నేర్చుకో. అయిదేళ్ళ పాటు కాశీలో మహా పండితుల దగ్గర శిష్యరికం చేసి, జ్యోతిశ్శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించినవాణ్ణి. నా జ్యోస్యాన్నే తప్పు పడతావా? నువ్వు నా వద్దకు తెచ్చిన జాతకమే తప్పుల తడక అయిఉంటుంది,’’ అన్నాడు.


దానికి గోవిందాచారి, ‘‘మా అమ్మాయి జాతకం రాసింది, నువ్వే కదయ్యా! అది కూడా మరిచిపోయావా?’’ అన్నాడు వెటకారంగా.
కొద్దిక్షణాలు మౌనంగావున్న రంగాచారి తేరుకుని, ‘‘అయితే, నువ్వు మీ అమ్మాయి జన్మ నక్షత్రం తప్పుగా చెప్పివుంటావు. లేదా ఆమె పుట్టిన సమయం సరిగ్గా చెప్పివుండవు. జనన సమయంలో ఒక్క విఘడియ తేడా వచ్చినా, గ్రహాలు తారుమారే అవకాశంవుంది. ఈ విషయాలన్నీ నీబోటి పామరులకు అర్థంకావు. వెళ్ళు! వెళ్ళు!’’ అని గోవిందాచారిని దబాయించి పంపేశాడు.



ఇలా గోవిందాచారిలాగా ప్రశ్నించే ధైర్యం లేనికొందరు, ‘‘అంతా మనప్రారబ్ధం. ఒకర్ని అని ఏం లాభం!’’ అని సమాధానపడి మిన్నకుండి పోయేవారు. జోస్యం పేరుతో రంగాచారి చేస్తున్న మోసాల గురించి జమీందారుకు తన ఉద్యోగుల ద్వారా తెలుస్తూనే వున్నది.


అయితే, పదిమందికీ అతడు బూటకపు జ్యోతిష్కుడని తెలిసేలా చేయడం ఎలాగా అని ఆ…యన ఆలోచించసాగాడు.
అలాంటి సమయంలో రాజ ప్రతినిధి ఒకరు గ్రామాల వెంట పర్యటిస్తూ, రామాపురం వచ్చాడు. జమీందారు, ఆయనకు తగువిధంగా అతిథి మర్యాదలు చేసి, రంగాచారి గురించి చెప్పి, ‘‘ఈ బూటకపు జ్యోతిష్కుడివల్ల మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలవాళ్ళు కూడా మోసపోతున్నారు. ఇతగాడి నిజరూపం అందరికీ ఎరుక పడేలా చేయడం ఎలాగో అర్థంకావడంలేదు,’’ అన్నాడు.


ఇందుకు రాజప్రతినిధి కొంతసేపు మౌనంగావూరుకుని, తర్వాత జమీందారుకు ఇలాంటి కపట జ్యోతిష్కుల పీడ ఎలా వదిలించుకోవాలో చెప్పి, అప్పటి కప్పుడే రాజధానికి తిరుగు ప్రయాణమయ్యాడు.ఆ మర్నాటి అర్ధరాత్రి రంగాచారి ఇంట్లో దొంగలు పడి, ఇనప్పెట్టెలోని డబ్బు, నగానట్రా అంతా దోచుకుపోయారు.తెల్లవారే సరికి ఈ వార్త గ్రామమంతా పాకి పోయింది. ప్రతి ఒక్కరూ అదేమాట.

అందరికీ భూత భవిష్యత్‌ వర్తమానాలు జోస్యం చెప్పే రంగాచారికే ఇలా జరగడం చూసి కొందరు ముక్కు మీద వేలేసుకుంటే, మరికొందరు తిక్క కుదిరిందంటూ నవ్వుకున్నారు. రంగాచారి తన ఇంట జరిగిన దొంగతనం గురించి, ఇరుగుపొరుగులకు చెప్పుకుని గగ్గోలు పడుతూంటే, జమీందారు నుంచి రమ్మంటూ కబురు వచ్చింది.


 దొంగలు దొరికి పోయారేమో అన్న ఆశ  కొద్దీ హడావుడిగా అతడు వెళ్ళే సరికి, జమీందారు దివాణంలో కొలువు తీరివున్నాడు. అక్కడ చాలా మంది గ్రామస్థులు గుమిగూడి గుసగుసలాడుతున్నారు. దీనవదనంతో వచ్చిన రంగాచారిని, జమీందారు ఒక సారి పరీక్షగా చూసి, ‘‘ఏం, రంగాచారీ! అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిన సామెతగా-పరగణా అంతటికీ జోస్యం చెప్పే నీ ఇంట దొంగలు పడతారనే సంగతి ముందుగా గ్రహించలేకపోయావా?’’ అని అడిగాడు.


ఆ ప్రశ్నకు ఖంగుతిన్న రంగాచారి తమాయించుకుని, ‘‘అ…య్యా! రాత్రి దొంగతనం జరుగుతుందని, నాకు ముందే తెలుసు. కానీ, జరిగేది జరగక మానదుగదా, అన్న వివేకంవున్నవాడిని గనక, నేను పెద్దగా పట్టించుకోలేదు,’’ అన్నాడు.


అప్పుడు జమీందారు, అతడి కేసి తీవ్రంగా చూస్తూ, ‘‘నువ్వు చెప్పిందే నిజమైతే, నువ్వు ఒకటికి రెండు నేరాలు చేసినట్టవుతుంది. మొదటిది, ఇంట దొంగలు పడే సంగతి ముందుగా తెలిసి కూడా, ఆ విషయం దాచిపెట్టి, దొంగలు తప్పించుకు పోవడానికి నువ్వు పరోక్షంగా సాయపడ్డావు. జరిగేది జరగక మానదని తెలిసి కూడా ఇంతకాలం జోస్యం పేరుతో అమాయక ప్రజల్ని నమ్మించి, కల్లబొల్లి కబుర్లు చెప్పి ధనార్జన చేయడం రెండో తప్పు. ఏమంటావు?’’ అని ప్రశ్నించాడు.


 ‘‘ప్రభువులంతవారు అన్నదాన్ని, నేను కాదనగలనా?’’ అంటూ రంగాచారి తలవంచుకుని చేతులు జోడించాడు. ఇది చూసి అక్కడ చేరినవాళ్ళందరూ గొల్లుమంటూ నవ్వారు.

జమీందారు చిన్నగా నవ్వి, ‘‘రంగాచారీ! నీ జోస్యం మాటకేంగాని - నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిన్న వచ్చాడే, ఆ రాజప్రతినిధి - యువకుడుగా కాశీలో మంత్రశాస్ర్తాలూ, గయాప్రయాగల్లో జ్యోతిశ్శాస్ర్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు.


ఆయన నిన్న ఉదయం ప్రయాణమైపోతూ, రాత్రికి గ్రామంలో ఒక ఇంట దొంగలు పడబోతున్నారనీ, కాపలావాళ్ళను తగు హెచ్చరికగావుంచమనీ చెప్పిపోయాడు. ఆ కారణంగా కాపలావాళ్ళు దొంగల కోసం మాటువేశారు. అయితే, అది గమనించిన దొంగలు భయంకొద్దీ, నీ ఇంట దొంగిలించిన వస్తువుల్ని వీధిలో జారవిడిచి పారిపోయారు!’’ అన్నాడు. ‘‘అంటే, నా డబ్బూ, నగలూ దొంగల బారిన పడలేదన్న మాట. అంతా, ప్రభువులవారి దయాభిక్ష!’’ అన్నాడు రంగాచారి.


ఆ వెంటనే జమీందారు, అందరూ వినేలా పెద్దగొంతుతో, ‘‘అవన్నీ ఇప్పుడే ఎత్తుకుపో. ఈ రోజు నుంచీ జ్యోతిష్కుడనని ఎక్కడా చెప్పుకోకు. ఉన్న డబ్బుతో వర్తకమో, ఇంత పొలం కొని ఏ వ్యవసాయమో చేసుకో. ఏమంటావు?’’ అని అడిగాడు. ‘‘తమ ఆజ్ఞను కాదనగలనా, ప్రభూ! ఈ క్షణం నుంచీ నేను జ్యోతిష్యుణ్ణి కాదని తమ సమక్షంలో ప్రమాణం చేసి మరీ ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను!’’  అన్నాడు రంగాచారి. తరవాత జమీందారు అక్కడి ప్రజలతో, ‘‘భవిష్యత్తు పట్ల భయంకొద్దీ అమాయక ప్రజలు ఏర్పరుచుకునే మూఢవిశ్వాసాల ఆసరాతోనే రంగాచారిలాంటి కపట జ్యోతిష్కుల ఆట సాగుతోంది. మనలో ఆ బలహీనత ఉన్నంతకాలం ఇలాంటి వారి బాధ తప్పదు. ఈ రోజు రంగాచారి పోతే, రేపు వేరొకరు పుట్టుకొస్తారు. ఇలాంటి వారిపీడ శాశ్వతంగా విరగడ కావాలంటే మొదట మనం మూఢవిశ్వాసాల నుంచి బయట పడాలి,’’ అన్నాడు.



No comments:

Post a Comment