హేలాపురి న్యాయాధికారి సమక్షంలో, ఒక వెండి దీపంకుందె దొంగతనం గురించి విచారణ జరుగుతున్నది. కుందె పోగొట్టుకున్న కేశవుడు, ‘‘అయ్యా! ఆ రోజు శ్రావణ శుక్రవారం. నా భార్య వ్రతం చేసుకుంటూ ముత్తయిదువులను పేరంటానికి పిలిచింది. వ్రతం పూర్తయి పేరంటాళ్ళందరూ వెళ్ళిపోయాక చూసుకుంటే,అప్పుడు తెలిసింది దొంగతనం జరిగిన విషయం. ఆదొంగిలించింది ఎవరో కాదు, మాధవుడి భార్య గుణవతి, ...’’ అంటూ ఇంకా చెప్పబోతూంటే- న్యాయాధికారి మధ్యలో అడ్డుపడి, ‘‘అయితే, ఆ కుందె దొంగిలించింది మాధవుడి భార్య గుణవతి అని ఎలా అనుమానించావు?’’ అని అడిగాడు.
‘‘అయ్యా! వారం రోజుల క్రితం గుణవతి ఇంట్లో జరిగిన శుభకార్యానికి, నా భార్య కూడా వెళ్ళింది. అప్పుడు పూజలో పెట్టబడివున్న, మా వెండి దీపంకుందెను, నా భార్య గుర్తించింది. దయచేసి దాన్ని మా కిప్పించండి,’’ అన్నాడు కేశవుడు.
‘‘అది మీదే అనడానికి గట్టి ఆధారం ఏమిటి? వెండి దీపంకుందెలు ఎన్ని ఇళ్ళల్లో లేవు!’’ అంటూ ప్రశ్నించాడు, న్యాయాధికారి. ‘‘అ య్యా! మా దీపంకుందె ఓం ఆకారంలో వుంటుంది,’’ అన్నాడు కేశవుడు. ‘‘అలాగా!’’ అంటూ న్యాయాధికారినవ్వి, ‘‘ఆ మాటకొస్తే, మా ఇంట్లోనూ ఓం ఆకారంలో వున్న దీపపుకుందె వున్నది,’’ అన్నాడు.
‘‘అయ్యా! ఆ విషయమే తమకు మనవి చేయబోయాను. తమరు అవరోధం కలిగించారు. వ్రతం రోజున మా ఇంట్లో దొంగిలించిన ఓం ఆకారపు దీపపు కుందెను, మాధవుడి భార్య తెలివిగా తమ భార్యగారికే అమ్మిందని తెలిసింది. ఇప్పుడది వాళ్ళింట్లోలేదు. తమ ఇంట్లోనే ఉంది,’’ అన్నాడు కేశవుడు. అది విన్న న్యాయాధికారితో పాటు, అక్కడవున్న వాళ్ళందరూ నివ్వెరపోయారు.
No comments:
Post a Comment