సువర్ణపురి కోశాధికారి ధననందుడు హఠాత్తుగా మరణించడంతో ఆ పదవికి పలువురు పోటీ పడసాగారు. ఆ పదవిలో ఎవరిని నియమించడం అన్నది రాజు విక్రమ సింహుడికి పెద్ద సమస్యగా తయారయింది. రాజు మహామంత్రిని పిలిపించి సమస్యను వివరించాడు. మంత్రి దీర్ఘంగా ఆలోచించి, రాజుకు ఒక చక్కని సలహా ఇచ్చాడు.
మరునాడే కోశాధికారి పదవికి అర్హతలు నిర్ణయిస్తూ-అర్హత, సామర్థ్యముగల చురుకైన యువకులు ఫలానా రోజు మహామంత్రి భూపతి సమక్షానికి రావలసిందిగా దేశమంతటా చాటింపు వేశారు.
తన దగ్గరకు వచ్చిన అభ్యర్థులను మంత్రి నిశితంగా పరీక్షంచిన తరవాత సునందుడు, విశాఖుడు అనే ఇద్దరు యువకులను ఎంపిక చేశాడు. ఇద్దరూ అన్ని పోటీల్లోనూ సమ ఉజ్జీలుగా నిలిచారు. ఇక ఆ ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చే యాలి. అదే అసలు సమస్య.
మంత్రి, రాజుకు సంగతి తెలి యజేశాడు. రాజు ఇద్దరు యువకులనూ పిలిచి, చెరొక పట్టు సంచీ అందిస్తూ, ‘‘ఇందులో వంద బంగారు నాణాలు ఉన్నాయి. వీటిని తీసుకుని వెళ్ళండి. రాత్రికి విడిదిలో బస చేసి, రేపు వచ్చేప్పుడు ఈ వంద నాణాలను భద్రంగా తెచ్చి నాకు అప్పగించాలి,’’ అన్నాడు.
యువకులిద్దరూ ఆ సంచీలను తీసుకుని విడిదికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయంలో విడిదిలో దొంగలు పడ్డారు. ఇద్దరు యువకులూ దొంగలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడారు. కొందరు దొంగలు పారిపోయారు.
ఒక దొంగ వారికి పట్టుబడ్డాడు. వాణ్ణి యువకులు బంధించి, తెల్లవారాక రాజభటులకు అప్పగించారు. ఆ తరవాత ఇద్దరు యువకులూ బ యలుదేరి వెళ్ళి రాజును దర్శించి తమ దగ్గరున్న నాణాల సంచులను అప్పగించారు.
దొంగను పట్టి బంధించినందుకు, రాజు వారిద్దరినీ అభినందించాడు. ఆ తరవాత మంత్రి ఆ యువకులు తెచ్చిన సంచులలోని నాణాలను లెక్కించమని భటులను ఆజ్ఞాపించాడు. వాటిని లెక్కించిన భటులు సునందుడి సంచీలో వంద నాణాలు, విశాఖుడి సంచీలో తొంభై నాణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
మహామంత్రి మందహాసం చేస్తూ, ‘‘మహారాజా, విశాఖుణ్ణి కోశాధికారిగా ని యమించండి,’’ అన్నాడు. ‘‘ఇది అన్యాయం!’’ అన్నాడు సునందుడు. అందుకు మంత్రి, ‘‘కాదు, నూటికి నూరు పాళ్ళూ న్యాయం. కోశాధికారికి తెలివి తేటలు, ధైర్య సాహసాలతో పాటు నిజాయితీ ప్రధానం. దాని కోసమే ఈ పరీక్ష పెట్టాము. నిజానికి మీ ఇద్దరికీ ఇచ్చిన రెండు సంచుల్లోనూ తొంభై నాణాలే ఉంచాము. దొంగలుగా వచ్చిన వాళ్ళు కూడా మా మనుషులే. వారిని ఎదుర్కోవడంలో మీరు చూపిన సాహసం ద్వారా మీరిద్దరూ ధైర్యవంతులని తెలిసింది.
ఇక తేలవలసింది మీ నిజాయితీ. రాజుగారు వంద నాణాలను భద్రంగా తీసుకురమ్మన్నాడన్న భ యం కొద్దీ నువ్వు సంచీ విప్పి చూసి అందులో పది నాణాలు తక్కువ ఉండే సరికి, గాభరాపడి, నీ దగ్గరున్న నాణాలు కలిపి, వాస్తవాన్ని మెరుగు పరిచే ప్ర యత్నం చేశావు. అయితే, విశాఖుడు అలా చేయలేదు.
నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. రాజుగారు ఇచ్చిన సంచీని అలాగే తెచ్చి ఇచ్చాడు. అందుకే అతడు కోశాధికారి పదవికి అర్హుడయ్యాడు,’’ అన్నాడు.సునందుడు మారు మాట్లాడకుండా రాజుకూ, మంత్రికీ నమస్కరించి అక్కిడినుంచి వెళ్ళి పోయాడు.విశాఖుడు కోశాధికారి పదవి చేపట్టి, అచిర కాలంలోనే సమర్థుడిగా పేరుతెచ్చుకుని అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు.
No comments:
Post a Comment