మాళవిక రాజ్యంలోని అభయారణ్యంలో, ఒక అందమైన చిన్న పూరిపాక వుండేది. అందులో వీరభట్టు అనే వృద్ధుడూ, ఆయన మనమరాలు చంద్రహాసా నివసిస్తూండేవాళ్ళు. చంద్రహాసకు పదహారేళ్ళ వయసు. అందచందాల్లో ఏ రాకుమార్తో అనిపించేది. ఆ అమ్మాయికి ఊహ తెలిసినప్పటినుంచే, ఆ తాతా మనవరాళ్ళ నివాసం ఆ అరణ్యమే. ఆమెకు ఆ చుట్టుపక్కలవున్న అరణ్య ప్రాంతమంతా బాగా తెలుసు. ఆ అరణ్యంలో జంతువులూ, పక్షులూ ఆమెకు స్నేహితులు. చంద్రహాసకు, తాత వీరభట్టు ప్రాణం. ఆమె తరచూ, ‘‘తాతా! మనం ఈ అరణ్యంలో ఎందుకుంటున్నాం?’’ అని అడిగేది. అందుక్కారణం వీరభట్టు ఎన్నిసార్లు చెప్పినా, చంద్రహాస మళ్ళీమళ్ళీ చెప్పించుకుని వినేది.
గతంలో వీరభట్టు, మాళవికరాజ్యం రాజు ధీరసింహుడి వద్ద రథికుడుగా పనిచేసేవాడు. ఒక పర్యాయం ధీరసింహుడికి, పొరుగు రాజు చిత్రవర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయాన ధీరసింహుడున్న రథాన్ని వీరభట్టు నడిపిస్తున్నాడు. పోరు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో చిత్రవర్ణుడు విసిరిన ఈటె వచ్చి ధీరసింహుణ్ణి తాకి గాయపరిచింది. ఆ తర్వాత యుద్ధంలో విజయం ధీరసింహుడు సాధించినా, తనకు గాయం కావడానికి వీరభట్టు అజాగ్రత్తే కారణం అని భావించి, అతడికి నగర బహిష్కారం విధించాడు.
అప్పటి నుంచి వీరభట్టు, తల్లిదండ్రులు లేని చంద్రహాసతో, అరణ్యంలో కాపురం వుండ సాగాడు. ఒక రోజు చంద్రహాస ఊయల ఊగుతూండగా, ఆమెదృష్టి ఒక నల్లపిచ్చుక మీద పడింది. అది ఒక పొదదగ్గర ఎగరలేక రెక్కలల్లాడిస్తూ పడివున్నది, చంద్రహాస, దాని దగ్గరకు వెళ్ళి చేతుల్లోకి తీసుకున్నది. పిచ్చుక రెక్కల్లో గాయమైవున్నది.
చంద్రహాస, నల్లపిచ్చుక గాయానికి మందు పూసి, అది తినడానికి గింజలు, తాగడానికి నీరు ఇచ్చింది. మర్నాటి కల్లా, ఆమె సపర్యల వల్ల సేదదీరిన నల్లపిచ్చుక, ఆమె వంక కృతజ్ఞతగా చూడసాగింది.
కొద్ది రోజులకు నల్లపిచ్చుక గా యం పూర్తిగా నయమైంది. త్వరలోనే పిచ్చుకా, చంద్రహాసా విడదీ యరాని స్నేహితులయ్యారు. ఒక రోజు మహారాజు ధీరసింహుడు కొంత మంది సైనికులతో, చంద్రహాసవున్న పాక దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో వీరభట్టు దాపుల ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాడు. ధీరసింహుడు, చంద్రహాసను, ‘‘ఏం, అమ్మాయీ! నీకీ అరణ్యప్రాంతమంతా బాగా తెలుసా?’’ అని అడిగాడు. చంద్రహాస, ‘‘తెలుసు, మహారాజా!’’ అన్నది విన గా.
‘‘నేను రాజు ధీరసింహుణ్ణి. కొద్ది రోజులక్రితం నా ఏకైక పుత్రుడు జయసింహుడు, ఈ ప్రాంతాలకు వేటకై వచ్చాడు. ఆ సమయంలో, ఒక చెట్టుకింద తపస్సు చేసుకుంటున్న మునిని చూసి, నా పుత్రుడి వెంటవున్న భటుల్లో ఒక పొగరుబోతు, జడలుకట్టివున్న మునిశిరస్సుపై, అక్కడ చచ్చిపడివున్న ఒక నల్లపిచ్చుకను తీసి వుంచాడు. ఆగ్రహంతో కళ్ళు తెరిచిన మునికి, సమయానికి నా పుత్రుడు కనిపించాడు. అది అతడి దుశ్చర్యగా భావించిన ముని, తన మంత్రశక్తితో రాజకుమారుణ్ణి నల్లపిచ్చుకగా మార్చేశాడు. సైనికుల ద్వారా, ఈ విషాద వార్తవిన్న నేను, నల్లపిచ్చుకను వెదకడం కోసం, ఈ అరణ్యానికి వచ్చాను,’’ అన్నాడు రాజు.
అప్పుడు చంద్రహాస, ‘‘ప్రభూ! నేనా నల్లపిచ్చుకను చూడడమే కాదు, గాయపడి ఎగరలేని స్థితిలోవున్న దాన్ని కాపాడాను కూడా. అది ఈ దాపుల చెట్లలోనేవున్నది,’’ అంటూ చిన్నగా చప్పట్లు కొట్టింది. ఆ మరుక్షణం నల్లపిచ్చుక ఎగురుతూ వచ్చి, చంద్రహాస భుజం మీద వాలింది. ఆ నల్లపిచ్చుకను చూసిన రాజు, తన కుమారుడు తిరిగి దక్కినంతగా సంతోషపడ్డాడు. ‘‘ప్రభూ! రాకుమారుడికి నిజరూపం ఎలా వస్తుందో తెలియడం లేదు,’’ అన్నది చంద్రహాస.
‘‘నేను, ఆ శపించిన మునిని దర్శించి, ఆయనకు జరిగిన అవమానానికి రాజకుమారుడు కారణం కాదనీ, ఒక భటుడనీ చెప్పి, వాస్తవం వివరించాను. అప్పుడు అకారణంగా శిక్షకు గురైన రాకుమారుడిపై జాలి పడిన ముని, నాకు మంత్రజలంయిచ్చి - అకారణంగా శిక్షకు గురైన వ్యక్తి, దీన్ని ఆ నల్లపిచ్చుక మీద చల్లితే, తిరిగి అతడికి నిజస్వరూపం వస్తుందని, చెప్పాడు,’’ అన్నాడు రాజు.
రాజు ఇలా చెప్పగానే చంద్రహాస ఆనందంగా, ‘‘ప్రభూ! సమస్య పరిష్కారమై పోయినట్లే!’’ అన్నది. ఆ జవాబు అర్థంకాని రాజు, ఆతృతగా, ‘‘ఏవిధంగా?’’ అంటూ ప్రశ్నించాడు.
‘‘ప్రభూ! నేను, లోగడ తమ వద్ద రథికుడిగా పనిచేసిన వీరభట్టు మనమరాలిని. నా పేరు చంద్రహాస. యుద్ధంలో శత్రురాజు విసిరిన ఈటె వల్ల తమరు గాయపడినప్పుడు, ఆ కోపంలో అందుకు కారణం ఏమైవుంటుందో ఆలోచించకుండా, మా తాతకు నగర బహిష్కార శిక్ష విధించారు. అయితే, దేశంపట్లా, మీ పట్లావున్న అచంచల భక్తి కారణంగా, ఆయన ఊద్యోగ సంపాదనకు మరొక రాజ్యానికి వెళ్ళక, ఇక్కడే అరణ్యంలో కాపురం వుంటున్నాడు. అకారణంగా శిక్షకు గురైన తాత చేత, ఆ మంత్రజలం నల్లపిచ్చుక మీద చల్లించండి,’’ అన్నది.
అప్పుడే నది నుంచి తిరిగివచ్చిన వీరభట్టు, రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, సంగతి తెలుసుకుని, మంత్రజలాన్ని నల్లపిచ్చుక మీద చల్లాడు. ఆ మరుక్షణం అక్కడ నల్లపిచ్చుక మాయమై, రాకుమారుడు జయసింహుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి పరమానందభరితుడైన రాజు ధీరసింహుడు, ‘‘వీరభట్టూ! ఆనాడు నీకు అకారణంగా నగర బహిష్కరణ విధించినందుకు విచారిస్తున్నాను,’’ అన్నాడు. అందుకు వీరభట్టు వినయంగా, ‘‘ప్రభూ! ఆనాడు తమరు నాకు విధించిన శిక్ష, ఈనాడు యువరాజుకు వరమైంది. ఇందుకు సంతోషిస్తున్నానే కాని, నన్ను శిక్షంచినందుకు బాధ చెందడం లేదు,’’ అన్నాడు.
జయసింహుడు, తండ్రికి నల్లపిచ్చుకగా తను వున్నప్పుడు చంద్రహాస తనను ఎంత ఆప్యాయంగా చూసిందో చెప్పి, ‘‘మీరూ, తాత వీరభట్టూ అనుమతిస్తే, ఆమెను వివాహ మాడదలిచాను,’’ అన్నాడు. ‘‘మా ఇద్దరి అనుమతి మాట సరే! రాకుమారి చంద్రహాస అనుమతి మాటేమిటి?’’ అంటూ రాజు చిన్నగా నవ్వాడు. చంద్రహాస సిగ్గుతో తలవంచుకుని, తాత వీరభట్టు చాటుకుపోయి నిలబడింది. ఆ తర్వాత నెల తిరక్కుండానే, యువరాజు జయసింహుడితో, చంద్రహాస వివాహం మహావైభవంగా జరిగిపోయింది.
No comments:
Post a Comment