Pages

Thursday, September 6, 2012

మూగజీవిసాక్ష్యం


శిళ్ళంగేరి గ్రామంలో, భీమ…య్య అనే రైతువుండేవాడు. అతడు తనకున్న నాలుగెకరాల పొలంలో గుమ్మడికాయలు కాయించి, వాటిని దాపులవున్న కోలార్‌ పట్టణంలోని దుకాణదారుకు అమ్ముతూండేవాడు. ఒకసారి భీమయ్యకు దూర ప్రాంతాలవున్న బంధువులను చూసి రావలసిన అవసరం కలిగింది. అతడు పొలం కాపలా కాసే చెంగయ్యకు సంగతి చెప్పి, ‘‘నేను తిరిగి రావడానికి నెల రోజులైనా పడుతుంది. పొలం కాపలా అశ్రద్ధ చేయకు,’’ అని హెచ్చరించి వెళ్ళాడు.

చెంగయ్య నాలుగైదు రోజులకొకసారి, తన కొడుకు ఒంటెద్దు బండిలో పదీ పన్నెండు గుమ్మడి కాయలను వేసుకుని కోలార్‌ పట్టణంలోని దుకాణదారుకు అమ్మసాగాడు. నెల రోజులు గడిచాక భీమయ్య తిరిగి వచ్చాడు. అతడు వెళ్ళేప్పుడు షుమారుగా గుమ్మడి పాదులకు ఎన్నెన్ని కాయలున్నదీ లెక్కపెట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది. ఈ దొంగతనం చెంగయ్యదే అయివుంటుదనుకుంటూ అతడు దొంగను పట్టేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు.

మర్నాడు భీమ…య్య, చెంగయ్యను పిలిచి, ‘‘చెంగయ్యా! నీ కొడుకు ఒంటెద్దు బండిని ఉద…యాన్నే తీసుకురా. పట్నంలో గుమ్మడికాయలు అమ్ముకురావాలి,’’ అని చెప్పాడు. మర్నాడు చెంగయ్య బండి తోలుకు వచ్చాడు. భీమయ్య ఒక పాతిక గుమ్మడికాయలు కోయించి బండిలో వేశాక, చెంగయ్యతో, ‘‘నా ఒంట్లో కాస్త నలతగావుంది. దారిమార్గమంతా కుదుపులు. ఎద్దును ఊరికే అదిలించి తోలకు. దాని దారిన దాన్ని పోనీ,’’ అన్నాడు.
చెంగ…య్య అలాగే చేశాడు. బండెద్దు సరాసరి పట్నంలోని దుకాణం ముందుకు వెళ్ళి ఆగింది. దుకాణదారు బండిలోని గుమ్మడికాయలు చూసి చెంగయ్యతో, ‘‘ఎప్పుడూ పదీ పన్నెండు కాయలకంటే ఎక్కువ తేనివాడివి, ఒకేసారి ఇన్ని కాయలు తెచ్చావేం?’’ అన్నాడు.

దానితో చెంగయ్య దొంగతనం బయట పడింది. భీమయ్య, అతడితో, ‘‘బండెద్దులు అలవాటైన చోట్లకు ఎవరూ తోలకుండానే అలా నడిచి పోగలవు. ఇప్పుడీ మూగజీవి, నువ్వు దొంగవని సాక్ష్యం చెప్పింది! నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను,’’ అన్నాడు.  

No comments:

Post a Comment