Pages

Thursday, September 6, 2012

ఏడోరోజు


దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వం బ్రిటానీ నగర సరిహద్దులో వెలసిన చిన్న కొండమీద అందమైన భవనం ఉండేది. ఆ కొండకవతల పెద్దపెద్ద నల్ల బండరాళ్ళతో నిండిన సముద్రం ఉండేది. సగం నీళ్ళల్లో మునిగిన ఆ బండలు కొన్ని ఆకాశంలో తేలే మేఘాల కేసి గురిపెట్టిన పెద్ద పెద్ద ఖడ్గాల్లాగానూ, గదల్లాగానూ కనిపించేవి. కొండమీది భవనంలో సముద్రం వైపుగా వున్న కిటికీ వద్ద కూర్చుని డోరిజెన్‌ అనే ఓ అందాల యువతి తదేకంగా చూస్తూ గంటల తరబడి గడిపేది.

ఆమె అలా చూస్తూ కూర్చోవడానికి కారణం ఆమెకు సముద్రమంటే ఇష్టమా అంటే అదేంకాదు. చెప్పాలంటే చెప్పరానంత భయం కూడా. మరెందుకలా చూస్తున్నది? సాహస ప్రియుడైన ఆమె భర్త ఆర్బోర్‌ సుదూరంలోని ఒక దీవికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేప్పుడు తాను ప్ర…యాణం చేస్తూన్న ఓడ దారితప్పి, రాక్షస బండలకేసి గుద్దుకుంటుందేమోనన్న భయంతో ఆమె అలా చూస్తూ కూర్చుంటుంది.

 ఆమె భర్త ప్రయాణం కట్టిన దీవికి వెళ్ళి రావడానికి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పట్టదంటారు. మరి ఆయన వెళ్ళి రెండు సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. సముద్రపు దొంగల బారిన పడిగానీ, వారు వెళ్ళిన దీవుల్లోని దోపిడీ దొంగలకు చిక్కిగానీ, ఆర్బోర్‌ ఆయన అనుచరులు హతులైపోయివుంటారనీ, లేదా వాళ్ళు ప్రయాణం చేసిన ఓడ సముద్రంలో మునిగిపోయివుంటుందనీ నలుగురూ నాలుగు విధాలుగా చెప్పుకోసాగారు.

బ్రిటానీ నగరంలోనే ఆరీలియస్ అనే ఒక ధనిక …యువకుడు ఉండేవాడు. అతడు డోరిజన్‌ను పెళ్ళికాక ముందు తను పెళ్ళాడేందుకు ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఇప్పుడు ఆమె భర్త ఆర్బోర్‌ ఆచూకీ తెలియలేదు. ఇక మీదట అతడు వచ్చే అవకాశం కూడా లేదు గనక, ఇప్పుడు తనను పెళ్ళాడమని కోరాడు. అరీలియస్‌, అంటే డోరిజెన్‌కు ఏహ్యభావం ఉండేది.


అయినా అతడు ధనమూ, పలుకుబడీ గలిగిన రాచకుటుంబానికి చెందినవాడు. అందువల్ల తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పలేక పోయింది. దాన్ని అతడు ఆసరాగా తీసుకుని మరీమరీ పీడించసాగాడు.

ఒకనాడు డోరిజెన్‌ దాపులనున్న ఆలయానికి వెళ్ళింది. అక్కడ ఎదురుపడ్డ అరీలియస్‌, ‘‘డోరిజెన్‌, నీ కోసం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడను. నువ్వు నన్ను పెళ్ళాడతానంటే, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను,’’ అన్నాడు.

అతడు మునుముందు తనకు ముఖం చూపలేని విధంగా గట్టిగా సమాధానం చెప్పాలనుకుని డోరిజెన్‌ ఆగ్రహంతో ఆలోచించింది. ‘‘అరీలియస్‌, నన్ను పెళ్ళాడడానికి నువ్వేమైనా చేస్తావా? అయితే, సముద్ర తీరంలో వున్న రాక్షస బండలన్నింటినీ తొలగించగలవా?’’ అని అడిగింది డోరిజెన్‌.

‘‘తప్పకుండా! అయితే, నేను వాటిని తొలగించిన ఏడురోజులలోగా నన్ను పెళ్ళాడతానని నువ్వు ప్రమాణం చేయాలి!’’ అన్నాడు అరీలియస్‌ ఉత్సాహంగా. ‘‘అలాగే, ప్రమాణం చేస్తున్నాను,’’ అన్నది డోరిజెన్‌, వాడి పీడను వదిలించుకుంటే చాలు నన్న తొందరపాటుతో.

‘‘ఈ ఆలయంలోపల చేసిన ప్రమాణాన్ని తప్పక పాటించాలి. అలా పాటించక, మాట తప్పిన వారి కుటుంబమంతా శాశ్వత నరకం పాలవుతుంది. తాత ముత్తాతల ఆత్మలకు కూడా అదే గతి తప్పదు. ఆ సంగతి నీకు తెలుసనుకుంటాను. మరిచి పోవద్దు,’’ అంటూ అక్కడి నుంచి  వెళ్ళిపో…ూడు అరీలియస్‌.

ఆమాట వినగానే డోరిజెన్‌ భయంతో ఒక్కక్షణం ఉలిక్కి పడింది. ఆ సంగతి తెలియక తొందర పడ్డానా అని కలవరపడింది. అయినా తను పెట్టిన షరతును నెరవేర్చడానికి మానవ మాత్రులకు సాధ్యం కాదన్న విషయం గుర్తుకురావడంతో చిన్నగా నవ్వుకుంటూ ఆలయం నుంచి వెలుపలికి వచ్చింది.

తన భవనం చేరిన అరీలియస్ ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించ సాగాడు. ముఖం నుంచి చిరునవ్వు మటుమాయమయింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎలా? నిద్రాహారాలు మాని ఆలోచించాడు. సన్నిహితులనూ, శ్రేయోభిలాషులనూ సంప్రదించాడు. ‘‘ఏమిటీ పిచ్చి? నీ నుంచి తప్పించుకోవడానికి ఆమె ఆ షరతు విధించిందని అర్థం కావడం లేదా?’’ అని హితవు చెప్పారు మిత్రులు.  ఇది అతని మొండితనాన్ని మరింత పెంచింది. తనను మభ్యపెట్టి మోసం చేయడానికి  చూస్తుందా? ఆమెనెలాగైనా తనతో పెళ్ళికి ఒప్పించి తీరాలి! అతడి స్నేహితుడొకడికి మాయలు మంత్రాలు తెలుసు. ఆ స్నేహితుడి ద్వారా వెయ్యిమైళ్ళ కావల ఒక గుహలో ఉంటూన్న మహామాంత్రికుణ్ణి గురించి తెలుసుకున్నాడు.


 అప్పటికప్పుడే బయలుదేరి కొన్ని రోజుల ప్రయాణానంతరం గుహలోని మాంత్రికుణ్ణి దర్శించి, బ్రిటానీకి వెంటబెట్టుకుని వచ్చాడు. ప్రమాద భరితమైన సముద్ర తీరాన్ని పరిశీలించిన మాంత్రికుడు, ‘‘వీటిని నిర్మూలించడం అసాధ్యం. అయితే, ఈ బండలు ఏడురోజుల పాటు కనిపించకుండా ఒక మాయను సృష్టించగలను,’’ అన్నాడు.
‘‘ఆహా! అది చాలు నా పంతం నెగ్గి కోరిక తీరడానికి!’’ అన్నాడు అరీలియస్ అమితానందంగా.

మాంత్రికుడు కళ్ళు మూసుకుని చేతులు ఊపుతూ ఏవో విచిత్ర శబ్దాలు పుట్టించాడు. మరుక్షణమే సముద్ర తీరంలోని బండలు అదృశ్యమై పోయాయి! అరీలియస్ పరిగెత్తి కొండ వద్దకు వెళ్ళి డోరిజెన్‌ను గట్టిగా పిలిచాడు. అయితే, ఆ కేకవిని భవనం నుంచి ఆమె భర్త ఆర్బోర్‌ వెలుపలికి వచ్చాడు. అరీలియస్ మాంత్రికుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిన సమయంలో ఆర్బోర్‌ తిరిగి వచ్చేశాడు.

‘‘మిత్రమా, అరీలియస్‌, బావున్నావా? నువ్వేదో బండలను నిర్మూలిస్తానని మాట ఇచ్చావట. వింతగా వుంది. అయినా, నేను లేనప్పుడు డోరిజెన్‌కు నీ మాటలతో కాస్త వినోదం కలిగించినందుకు కృతజ్ఞతలు,’’ అన్నాడు ఆర్బోర్‌ నవ్వుతూ. ‘‘ఏమిటీ, నా మాటలు వింతగా ఉన్నాయా? ఒక్కసారి సముద్రం కేసి చూడు. నీకే తెలుస్తుంది,’’ అన్నాడు అరీలియస్‌ ఆగ్రహంతో.

ఆ సమయానికి భవనంలోనున్న డోరిజెన్‌ కూడా వెలుపలికి వచ్చింది. భార్యా భర్తలిద్దరూ ఒక్కసారిగా సముద్రం కేసి చూశారు. అక్కడ ఒక్క బండ కూడా కనిపించకపోవడంతో దిగ్భ్రాంతి చెందారు. వారి ముఖాలు వెలవెల బోయాయి. డోరిజెన్‌ నిలబడలేక తూలికింద పడింది. కొంతసేపటికి ఆమెకు స్పృహ వచ్చాక, ‘‘నువ్వు చెప్పినట్టు అసాధ్యాన్ని సాధించి చూపాను. మరి నన్ను ఎప్పుడు పెళ్ళాడతావు?’’ అని గద్దించాడు అరీలియస్‌.

‘‘డోరిజెన్‌, ఇచ్చిన మాటను నిలుపుకోవడం ప్రాణాల కన్నా విలువైనది. మనం మాట తప్పి, మన తాతముత్తాతల ఆత్మలను నరకయాతనల పాలుచేయడం భావ్యం కాదు,’’ అన్నాడు ఆర్బోర్‌. డోరిజెన్‌ నోట మాట రాలేదు. శిలాప్రతిమలా నిలబడి పోయింది. ఆ తరవాత కొంతసేపటికి తేరుకుని, ‘‘బండలు అదృశ్యమైన ఏడు రోజులలోగానే నిన్ను నేను పెళ్ళాడతానని మాట ఇచ్చాను. ఏడో రోజే పెళ్ళాడగలను. అంతకు ముందు కాదు,’’ అన్నది.


ఆమె నిర్ణయానికి అడ్డు చెప్పలేక పోయాడు అరీలియస్‌. ఈ మాయ ఏడురోజులు కొనసాగుతుంది గనక భయం లేదనుకున్నాడు. ఏడో రోజు పెళ్ళికాగానే, డోరిజెన్‌తో కలిసి సుదూర ప్రాంతంలోని మరో నగరానికి వెళదామని పథకం వేసుకున్నాడు.

ఆ రోజునుంచే ఆకాశం మేఘావృతం కాసాగింది. ఏడోరోజు గాఢాంధకారం కమ్ముకుని ఉరుములతో, మెరుపులతో కుంభవృష్టి ఆరంభమయింది. ఇళ్ళ నుంచి ఎవరూ వెలుపలికి అడుగు పెట్టలేకపోయారు. తుఫాను గాడ్పులతో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఆలయాలలో పూజలు ఆగిపోయాయి. అరీలి…యస్ తన పెళ్ళికూతురును తెచ్చుకోవాలని పలుమార్లు బయలుదేరాడు. కాని ప్రతికూల వాతావరణం కారణంగా గుర్రాలు బెదరడంతో వాహనం ముందుకు సాగక వెనుతిరగవలసి వచ్చింది. అలా ఏడోరోజు గడిచి పోయింది. మరునాడు తెల్లవారగానే ఆకాశం నిర్మలంగా కనిపించింది. డోరిజెన్‌ను ఎలాగైనా తీసుకుపోయి, ఆల…యంలో పెళ్ళాడేద్దామన్న ఆశ చావక, అరీలి…యసస్ కొండ దగ్గరికి వచ్చాడు.

డోరిజెన్‌ కూడా అప్పటికే సిద్ధంగా ఉంది. ఆర్బోర్‌ ఆమెకు కన్నీళ్ళతో వీడుకోలు పలికాడు.  అయినా, అంతలోనే అరీలియస్‌ కంగారు పడసాగాడు. సత్యసంధులైన డోరిజెన్‌, ఆర్బోర్‌ దంపతుల శక్తి ముందు బండలు లేనట్టు మాయ కల్పించిన అతడు నిలబడలేక  గడగడలాడసాగాడు.

హఠాత్తుగా ఉరుము ఉరిమి సముద్ర తీరంలో పిడుగు పడిన భీకరధ్వని ప్రకంపనలు సృష్టించింది. అందరూ ఒక్కసారి అటుకేసి తిరిగి చూశారు. వేలాది సంవత్సరాలుగా ఉన్నట్లే ఇప్పుడూ నల్లటి బండలు ఆకాశంకేసి నిక్కబొడుచుకుని కనిపించాయి. ఆవరించిన మాయ పటాపంచలయింది! అరీలి…యస్ స్పృహతప్పి పడిపోయాడు. డోరిజెన్‌, ఆర్బోర్‌ సేవకులను పిలిచి, అతడికి స్పృహ వచ్చేలా పరిచర్యలు చేయించారు. స్పృహ రాగానే అతడు ఆ దంపతులకు నమస్కరించి, ‘‘క్షమించండి. పాపినైన నన్ను క్షమించండి!’’ అంటూ అక్కడినుంచి పారిపోయాడు. ఆ తరవాత అతని జాడ మరెప్పుడూ బ్రిటానీలో కనిపించలేదు.



No comments:

Post a Comment