ఒక నగరంలో ధనరాజ్ సేఠ్ అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. ఆయనకు గుణరాజ్ అనే కుమారుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే అతడు మంచి గుణవంతుడు, తెలివితేటలు గలవాడు. నగర జీవనమే కాకుండా, తన కుమారుడికి గ్రామ సీమలను, అక్కడి ప్రజల జీవన విధానాలను ప్రత్యక్షంగా చూపాలని భావించాడు ధనరాజ్. తండ్రీ కొడుకులు సుదూర గ్రామానికి వెళ్ళి, అక్కడి ఒక పేద రైతు కుటుంబంతో కలిసి ఐదు రోజులుండి నగరానికి తిరిగివచ్చారు.
మరునాడు సేఠ్‌జీ కుమారుణ్ణి పిలిచి, ‘‘నాయనా గుణరాజ్, గ్రామజీవితం ఎలా వుంది?’’ అని అడిగాడు ఆప్యాయంగా.
‘‘అద్భుతం, నాన్నా,’’ అన్నాడు గుణరాజ్ నవ్వుతూ.
‘‘అంటే నీకిప్పుడు పేదప్రజల జీవన విధానం ఎలా వుంటుందో బాగా తెలుసునన్నమాట,’’ అన్నాడు తండ్రి సంతోషంగా.
‘‘క్షుణ్ణంగా తెలుసు,’’ అన్నాడు గుణరాజ్.
‘‘ఏమేం తెలుసుకున్నావో చెప్పుచూద్దాం,’’ అని అడిగాడు సేఠ్.
‘‘మన ఇంటికి కాపలాగా ఒకే కుక్కవుంది. వాళ్ళింట్లో నాలుగు కుక్కలున్నాయి. మన ఇంటి వెనకవున్న తోటలో ఒకే కొలను వుంది. ఆ గ్రామంలోని ప్రజలకేమో పెద్ద చెరువుతోపాటు, ఏరు కూడా ఉంది. మన ఇంటి ముందు అలంకార దీపాలు ఉన్నాయి. పల్లెటూరి ప్రజలకేమో ఆకాశం నిండా నక్షత్రాలే. మన ఇంటికి సరిహద్దుగా ప్రహరీగోడ వుంది. వాళ్ళకు సరిహద్దుల్లేవు. మనం నిర్ణీత ప్రదేశంలోనే ఉంటున్నాం. వాళ్ళ పొలాలు కనుచూపు మేరకు విస్తరించి వున్నాయి. మన పనులు చే యడానికి పలువురు సేవకులున్నారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇతరులకు కూడా పనులు చేసి పెడుతూంటారు. మనం ఆహారానికి ఆహార ధాన్యాలు కొంటాం. వాళ్ళు ఆహారధాన్యాలు పండిస్తారు. మన ఇంటి గోడలు మనల్ని రక్షస్తున్నాయి. గ్రామంలోని బంధు మిత్రులే వాళ్ళను ఆదుకుంటారు; కష్టాలలో కాపాడతారు,’’ అన్నాడు గుణరాజ్ ఏకబిగిగా.
కొడుకు మాటలకు విస్మయం చెందిన ధనరాజ్ నోట మాటరాలేదు.
‘‘నాన్నా, మీరు నన్ను అక్కడికి తీసుకు వెళ్ళి, వారితో కలిసి మెలిసి ఉండేలా చేసి నాకెంతో ఉపకారం చేశారు. వాళ్ళతో పోల్చి చూస్తే మనం ఎంతటి పేదవాళ్ళమో నాకిప్పుడు బాగా అర్థమయింది,’’ అన్నాడు గుణరాజ్ మళ్ళీ.
మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామన్నది చాలా ముఖ్యం. మనలోని కోరికలు, మనం పడే శ్రమ మనకు కావలసిన ప్రాపంచిక సుఖాలను సమకూర్చవచ్చు! కావలసిన దాన్ని కొనుక్కోవచ్చు. అయితే, కావలసినప్పుడు మనశ్శాంతిని అలా కొనుక్కోలేము కదా!
No comments:
Post a Comment