Pages

Thursday, September 6, 2012

చందూ కథల వనం


ఒకానొకప్పుడు ఒక అడవిలో చందు అనే అందమైన కుందేలు ఉండేది. తన ఇంటి ముందున్న చెట్టుకింద కూర్చుని కథలు చదువుకోవడం అంటే చందూకు మహా ఇష్టం. అది చాలా తెలివైనది. మిగతా జంతువులతో అది ఎంతో ప్రేమతో మసలుకునేది. అందువల్ల అది చెప్పే కథలు వినడానికి పక్షులూ, జంతువులూ రాసాగాయి.

చందు కథలు చెప్పడం ప్రారంభించినప్పటినుంచి మృగరాజు సింహం కొలువులో రోజు రోజుకూ జంతువుల సంఖ్య తగ్గిపోసాగింది. ఆఖరికి ఒక్క జంతువు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. నక్కలకూ, తోడేళ్ళకూ కుందేలు అంటే అసూయ ఉండేది. ఆ కారణంగా అవి మాత్రం చందూ కథలు వినడానికి వెళ్ళేవికావు.

ఒకనాటి ఉదయం సింహం అడవిలో తిరుగుతూ - కుందేలు ఒక పిట్టకు కథ చెప్పడం గమనించింది. కథ పూర్తి కాగానే పిట్ట చెట్టుమీదికీ, కుందేలు ఇంట్లోకీ వెళ్ళిపోయాయి. సింహం పిట్టను కథలు వింటున్నావేమిటని అడిగింది అమాయకంగా.

 ‘‘నేనే కాదు; చందూ చెప్పే కథలను ఈ అడవిలోని జంతువులూ, పక్షులూ అన్నీ వింటున్నాయి. అందుకే అవి నీ కొలువుకూటానికి రావడం కూడా మానేశాయి,’’ అన్నది పిట్ట ఎంతో ఆనందంగా.


సింహానికి కోపం వచ్చింది. కేవలం కథలు వింటూ, నా కొలువుకు రావడం మానేస్తాయా ఈ అల్ప ప్రాణులు అన్న ఆగ్రహంతో వెళ్ళి నక్కలకూ, తోడేళ్ళకూ సంగతి చెప్పింది. జంతువులను మళ్ళీ తమ వద్దకు రప్పించాలంటే కుందేలును చంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చాయి. అందుకు ఒక పథకం ఆలోచించాయి.

సింహం సాధువు వేషం ధరించింది. చిరకాలం హాయిగా జీవించమని కుందేలు చందూను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లుగా నక్కలకూ, తోడేళ్ళకూ చెప్పుకున్నది. ఈ సంగతిని ఒక కోతి వెళ్ళి చందూ చెవిని వేసింది. చందూ సంతోషంగా బ…యలుదేరుతూన్న ప్పుడు ఒక పిట్ట ఎగిరి వచ్చి, దానిని చంపడానికి సింహం వేసిన పథకం గురించి చెప్పింది.

చందూ ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నది. అప్పుడు ఒక తోడేలు వచ్చి కుందేలు తలుపు తట్టింది. అయితే కుందేలు, ‘‘ఇప్పుడు బాగా పోద్దుపోయి చీకటి పడుతోంది. రేపు వచ్చి సాధువు ఆశీస్సులు పొందుతాను,’’ అన్నది.

 పిట్ట జంతువులన్నిటినీ హెచ్చరించడంతో మరునాడు తెల్లవారే సరికి, జంతువులూ, పక్షులూ ఆ అడవి వదిలి పక్క అడవిలోకి వెళ్ళి పోయాయి.

అక్కడ జంతువులకు చందూ చక్కని కథలు చెబుతూ, వాటికి అదే రాజయింది. ఆ అడవికి చందూ కథలవనం అనే పేరు ఏర్పడింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. చందూకు భార్య ద్వారా చాకూ, చలూ అనే ఇద్దరు మగ పిల్లలు పుట్టాయి.


వాటికి కూడా అన్నీ చందూ బుద్ధులే వచ్చాయి. చెప్పాలంటే అవి చందూ కన్నా చాలా తెలివైనవి కూడా. చందూ తన పిల్లలకు, తనను చంపడానికి ప్రయత్నించిన సింహం గురించి చెప్పింది.

ఒకనాడు ఒక సింహపుపిల్ల వాటితో ఆడుకోవడానికి వచ్చింది. సాయంకాలం వరకు ఆడుకున్నాయి. ఇంటికి వెళ్ళి, ‘‘నాన్నా, మాతో ఆడుకోవడానికి ఒక సింహపు పిల్ల వచ్చింది.  బహుశా అది నిన్ను చంపడానికి ప్రయత్నించిన సింహపు పిల్లే అయివుంటుంది. ఇప్పుడు దానికి మనం వున్న చోటు తెలిసిపోయింది గనక, అది మన మీదికి వస్తుందేమో!’’ అన్నవి భయం భయంగా.

అయినా చందూ, ‘‘భయపడకండి. ఆ సింహం ఇప్పుడు బాగా ముసలిదై పోయివుంటుంది. నా మీద పగ కూడా చల్లారి పోయివుంటుంది. విచారించకండి,’’ అని ఓదార్చింది. మరునాడు తెల్లవారగానే ముసలి సింహం, కుందేలు మీదికి దాడికి బ…యలుదేరింది. తన నేస్తాలయిన కుందేలు పిల్లలు తన తండ్రికి శత్రువులని సింహపు పిల్లకు అప్పుడే తెలియవచ్చింది. వాటిని చంపవద్దని తండ్రిని హెచ్చరించింది. సింహం తన చర్యకు సిగ్గుపడుతూ ఒంటరిగా తన గుహకు తిరిగి వెళ్ళింది. తండ్రి మీది కోపంతో అది దాని వెంట తిరిగి వెళ్ళలేదు.

చందూ ఇంటికి వచ్చాక, సింహపు పిల్ల జరిగిన సంగతి చెప్పి ఇక్కడే ఉండిపోవాలన్న తన నిర్ణయాన్ని తెలియజేసింది. కొన్ని రోజులు గడిచాయి. తన బిడ్డ తనను వదిలి శత్రువుల పంచచేరడంతో, ముసలి సింహం అసలు వేటాడలేక పోయింది. ప్రశాంతంగా ఆలోచించింది. తన పొరబాటుకు పశ్చాత్తాప పడింది.

ఒకనాటి సూర్యోదయ వేళ చందూ కథల వనానికి వెళ్ళి చందూను చూసి, ‘‘ఇకపై నేను కూడా నీకు నేస్తంగా వుంటూ, నువ్వు చెప్పే కథలు వినాలని వుంది. అనుమతిస్తావా?’’ అని అడిగింది. చందూ అంగీకరించింది. ఆ తరవాత జంతువులన్నీ కలిసి మెలిసి వుంటూ సుఖసంతోషాలతో జీవించాయి.


No comments:

Post a Comment