Pages

Thursday, September 6, 2012

రత్నశేఖరుడి సూచనలు


రత్నశేఖరుడనే పండితుడు, ప్రశాంతనగరాన్నేలే రాజుకు గురువు. ఆయన గురుకులంలో చాలామంది విద్యార్థులుండేవారు. వారి వారి విద్యలు పూర్తికాగానే రత్నశేఖరుడు, విద్యార్థులకు తగిన వృత్తులు సూచించి వీడ్కోలు చెప్పేవాడు. వారిలో అసమాన ప్రతిభ కలవారని తను భావించిన వారిని మాత్రం, ఎంపిక చేసి రాజాస్థాన ఉద్యోగాలకు పంపేవాడు. అలాంటి వారికి రాజు ఆదర పూర్వకంగా ఆస్థానంలో తగిన ఉద్యోగాలిస్తూండేవాడు.

ఆ విధంగా ఒక సంవత్సరం విద్యలు ముగించిన ఐదుగురు శిష్యులను గురువు ఎంపికచేసి రాజు వద్దకు పంపాడు. వారిని పంపేటప్పుడు రత్నశేఖరుడు, మొదటివాడికి పాదుకలు, రెండవవాడికి బెత్తం, మూడవ వాడికి జల్లెడ, నాల్గవవాడికి చీపురుకట్ట ఇచ్చి-ఐదవవాడికి తలనున్నగా గుండు చేయించి పంపాడు. ఈ ఐదుగురూ రాజప్రాసాదం చేరేసరికి, రాజు పొరుగు రాజు ఆహ్వానం మీద ఆ రాజ్యానికి వెళ్ళాడు.

యువరాజు, ప్రధానమంత్రి పర్యవేక్షణలో తాత్కాలికంగా పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. రత్నశేఖరుడి వద్దనుంచి వచ్చిన శిష్యులు రాజసభలో ప్రవేశించి  యువరాజుకు నమస్కరించి, తమ గురువుగారిచ్చి పంపిన వస్తువులను చూపించారు. రత్నశేఖరుడి గురుకులంలో విద్యనభ్యసించి వచ్చినవారు మెరికలవంటి వారైవుంటారని, …యువరాజుకు తెలుసు. కాని, వారు వెంట తెచ్చిన వస్తువులను బట్టి, వారికి ఎలాంటి ఉద్యోగాలివ్వాలో అతడికి అర్థంకాలేదు. ఆ కారణంగా అతడు ఆ పని ప్రధానమంత్రికి అప్పగించాడు.

మంత్రి వారిని లౌకిక, వ్యవహారజ్ఞానాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలడిగి, వారిచ్చిన జవాబులకు తృప్తిగా తలాడించి; పాదుకలు తెచ్చినవాడికి కోశాగారంలోనూ, బెత్తం పట్టుకొచ్చినవాడికి ఉద్యోగులకు శిక్షణనిచ్చే అధికారిగానూ, జల్లెడ తెచ్చినవాడికి రక్షణ శాఖాధికారిగానూ, చీపురు తెచ్చినవానికి సైనికాధికారిగానూ- చివరకు, తలగుండు చేయించుకు వచ్చినవాడికి ఉపమంత్రిగానూ ఉద్యోగాలిచ్చాడు.


 రాజగురువు రత్నశేఖరుడి శిష్యులు తెచ్చిన వస్తువుల ఆధారంతో, మంత్రి వారికి తగిన పదవులంటూ ఎలా ఎన్నిక చేయగలిగాడో, …యువరాజుకు ఎంత ఆలోచించినా ఏమాత్రం అర్థంకాలేదు. వింతగా తోచింది. అతడు వినయంగా మంత్రిని, ‘‘మంత్రివర్యా! శిష్యులు వెంట తెచ్చిన వస్తువులను బట్టి, వారికి ఆయా పదవులు ఎలా నిర్ణయించారో, నాకేమీ అర్థంకాలేదు. దయచేసి వివరించగలరా?’’ అని అడిగాడు.

అందుకు మంత్రి చిరునవ్వు నవ్వి, ‘‘…యువరాజా, విను! మొదటి శిష్యుడు తెచ్చినవి పాదుకలు కదా. పాదుకలను మనం ఎంత తొక్కినా సహించడం తప్ప, ఏమాత్రం ఎదిరించవు. అంటే, పాదుకలు వినయానికీ, విశ్వాసానికి చిహ్నం. వినయ విశ్వాసాలు గల అలాంటి వ్యక్తి కోశాగారంలో పనిచేయడం అన్ని విధాలా ఉత్తమం అని, గురువుగారి ఉద్దేశ్యం. అందుకే అతడికి పాదుకలిచ్చి పంపాడు,’’ అన్నాడు. అర్థమయిందన్నట్టు తలాడించాడు …యువరాజు.


‘‘ఇక రెండవ శిష్యుడు బెత్తం తెచ్చాడు. బెత్తం క్రమశిక్షణకు గుర్తు! కనుక, అతడు ఉద్యోగులకు, సరైన శిక్షణ ఇవ్వగలడని గురువుగారి అభిప్రాయం. అందుకే అతనికి శిక్షణాధికారి ఉద్యోగం ఇచ్చాను. అలాగే, మూడవ శిష్యుడు తెచ్చినది జల్లెడ. అంటే, జల్లెడ మంచిని వదిలిపెట్టి, చెడును బంధిస్తుందన్నమాట. అతడు మంచి వ్యక్తులను తగు విధంగా గౌరవించి, దుష్టులను బంధించే లక్షణాలున్న వాడని గురువుగారు సూచించారు. అందుకే, అతడికి రక్షణ శాఖాధికారి పదవి ఇవ్వడం జరిగింది. నాల్గవ శిష్యుడు తెచ్చినది చీపురు. అతడికి సైనికాధికారి పదవి ఇవ్వడం జరిగింది.

చీపురు చేసే పనేమిటి? గాలివల్లనో, మరొక కారణంగానో గృహంలో చేరిన చెత్తాచెదారాన్ని శుభ్రంగా చిమ్మి వెలుపలకు తోసేస్తుంది. అలాగే, శత్రు సైనికులెవరైనా మనరాజ్యంలో ప్రవేశిస్తే, వాళ్ళను చీపురుతో చెత్తను చిమ్మినంత సులువుగా తరిమికొట్టగలడని గురువుగారి భావం,’’ అన్నాడు మంత్రి. ‘‘మంత్రివర్యా! నేను తమరిని పొగడగలిగినంత స్థాయిగలవాణ్ణికాను; అన్నిటా అర్భకుణ్ణి!’’ అంటూ యువరాజు, మంత్రిని మెచ్చుకుని, ‘‘రత్నశేఖర పండితులు, తన శిష్యుల్లో ఒకరిని తలనున్నగా చేయించి పంపారు. ఆ చర్య నాకు చాలా చిత్రమనిపించింది. పైగా అతణ్ణి తమరు ఉపమంత్రిగా ఎన్నిక చేశారు! ఇది నాకు మరింత విచిత్రంగావున్నది,’’ అన్నాడు.

‘‘అవును, …యువరాజా! నాకూ మొదట విచిత్రంగానే తోచింది. కాని, కాస్త తర్కించి చూడగా, గురువుగారి ఆలోచనా సరళి అవగతమైంది. ఆ ఐదవ శిష్యుడు, తన జుట్టు కిందవున్నదాన్ని-అంటే మెదడును, బహు చాకచక్యంగా ఉపయోగించగలడని, గురువుగారు సూచనప్రాయంగా తెలియ బరిచారు. ఆ విధంగా అతడిని ఉపమంత్రిగా ఎన్నిక చేశాను,’’ అన్నాడు మంత్రి. ఆ జవాబుతో అన్ని సంశయాలు తీరిన యువరాజు, ప్రధానమంత్రి వివేకానికి ఎంతగానో సంతసించాడు.


No comments:

Post a Comment