వేంగీ దేశాన్ని మాణిక్యవర్మ అనే మహారాజు పాలించేకాలంలో, ఆయన కొలువులో కీర్తిసేన అనే రాజనర్తకి వుండేది. కీర్తిసేన మంచి అందగత్తె. ఆమె అందానికి తగ్గట్టు ఆమె తలనీలాలు చాలా అందంగా వుండేవి. అందమైన కురులంటే, కీర్తిసేన కురుల్లావుండాలని, రాజ్యమంతా చెప్పుకునేవారు. ఇలావుండగా - ఆమె శరీరంలో ఎలాంటిమార్పు జరిగిందోకాని, ఆమె అందమైన జుట్టు రాలిపొవడం మొదలైంది. దాంతో ఆమె భయపడి రాజవైద్యుణ్ణి సంప్రదించింది.
రాజ వైద్యుడు, ఆమెకు వైద్యం చేసినా ప్రయోజనం కనబడలేదు. అప్పుడు రాజవైద్యుడు, "అమ్మా, కీర్తిసేనా! మందులకు నయంకాని రుగ్మతకు, మేము కూడా దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు. మన రాజ్యంలోని పలవెల అనే గ్రామంలో, ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలోని శివలింగానికి కేశాలతో కూడిన కొప్పువున్నది. అందుచేత, అందరూ ఆ శివలింగాన్ని, కొప్పులింగేశ్వరుడి పేరుతో పిలుస్తూ పూజిస్తున్నారు. నీ శిరోజాలను రక్షించమని, ఆ కొప్పులింగేశ్వరుణ్ణి వేడుకో," అని చెప్పాడు.
ఆయన చెప్పిన విధంగా, రాజనర్తకి, "పలవెల గ్రామంలో వెలసిన కొప్పులింగేశ్వర స్వామి! నీవు గనక నా శిరోజాలు రాలిపోవడం అనే జబ్బును నివారిస్తే, నీ కోవెలకు వచ్చి నిన్ను సేవించి, నీ మంటపంలో నాట్యం చేస్తాను," అని మొక్కుకున్నది. రాజవైద్యుడి మందుల ప్రభావమో లేక కొప్పులింగేశ్వరుడి మహిమో - రాజనర్తకి శిరోజాలను పట్టినవ్యాధి నయమై, మళ్ళీ అందంగా కళకళలాడాయి. కీర్తిసేన, రాజుగారి దగ్గరకు వచ్చి, పలివెల గ్రామంలోని కొప్పులింగేశ్వర ఆలయంలో నాట్ర్యప్రదర్శనకు అనుమతి కోరింది. రాజు ఆమె ద్వారా జరిగినదంతా విని, "ఆహా, అద్భుతం! అంత భక్తసులభుడైన కొప్పులింగేశ్వరుణ్ణి దర్శించి తీరవలసిందే!"
అని, మంత్రితో, "కీర్తిసేన నాట్యప్రదర్శనలతో బాటు, మా ప్రయాణానికికూడా సన్నాహాలు చేయించండి!" అని చెప్పాడు. ఈ సంగతి తెలిసి ఒక్కసారిగా పలవెల గ్రామం రూపురేఖలు మారిపోయాయి. దేవాలయాన్ని చక్కగా అలంకరించారు. మండపంలో రాజనర్తకి నృత్య ప్రదర్శనకు చురుగ్గా ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు మాణిక్యవర్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అందువల్ల, సామాన్య భక్తులకు దేవాలయంలో ప్రవేశించే అవకాశం కలగక కొంత ఇబ్బంది కలిగింది.
ఆ సమయంలో, కొంచెం దూరప్రాంతం నుంచి వచ్చిన సుందరమ్మ అనే ఆమె "మహారాజైతే ఊడిపడ్డాడా? కొప్పులింగేశ్వరుడు ఆయన కెంతో మాకూ అంతే! లింగేశ్వరుడి జటాజూటంలోంచి వదిలిన గంగమ్మ నీళ్ళతో తడిసి, ప్రతి ఏటా నేను మగవాడినవుతున్నాను. మా ముసలెద్దుకు యౌవనం వచ్చింది. మళ్ళీ ఆ రోజులు దగ్గరపడుతున్నాయి. మా ఎద్దుకు యౌవనం రావాలి. నేను మగవాడినవ్వాలి. ఈ రాజ్యానికి మేం తిండి పెట్టాలి. స్వామీ! ఆలయ ప్రవేశానికి కరుణించు," అంటూ అరవసాగింది.
మహారాజు, ఆమె అరుపుల సారాంశం విని, సుందరమ్మను దేవాలయంలోకి పిలిపించాడు. ఆమెతోబాటు ఆమె భర్తకూడా లోపలికు వచ్చాడు. వాళ్ళు తమ చేతులలోని సంచీల నుంచి దూదిని రాశికింద పోసి, "హర హర మహాదేవ శంభో" అంటూ, దూదిని వెలిగించి, ఆ గర్భగుడిలోనే శివుడికి సాష్టాంగ నమస్కారం చేసారు.
మహారాజు కనుసన్నలతో వారించడం చేత, ఆ దంపతులు చేస్తున్న పనిని ఎవరూ వారించలేదు. ఆ తర్వాత, రాజు మాణిక్యవర్మ పూజతోబాటే, ఆ దంపతుల పూజ కూడా, పూజారి స్వామికి జరిపించాడు. పూజ పూర్తయిన తర్వాత మహారాజు, సుందరమ్మను పిలిపించి వాళ్ళతో, "దేశమేలే మహారాజును కాబట్టి, శత్రుభయం అనే వంకతో సంప్రదాయంగా వస్తున్న రక్షణ ఏర్పాట్లు, నాకు ఇష్టంలేకపోయినా, తప్పలేదు. దైవ సన్నిధిని చేరడానికి - మగవాడి నయ్యాను. ముసలెద్దుకు యౌవనం వచ్చింది అంటూ ఉన్మాదిలా ప్రవర్తించి, గర్భగుడిలో దూదిని మంటబెట్టడం గురించి మాత్రం, మీరు వివరణ ఇచ్చుకోక తప్పదు, " అన్నాడు కోపంగా.
అప్పుడు సుందరమ్మ భర్త వెంగళప్ప వినయంగా, "మహారాజా! నా భార్యది పిచ్చివాగుడు కాదు. మనకు అశ్వని మొదలు రేవతివరకుగల, ఇరవై ఏడు నక్షత్రాలలోను సూర్యుడి ప్రవేశాన్ని బట్టి వర్షపాతాన్ని లెక్కగట్టడం ఆనవాయితీ. ముఖ్యంగా మృగశిర మొదలుకుని విశాఖవరకు గల నక్షత్రాలకు, పన్నెండు నక్షత్రాల కార్తెలలోనూ కురిసే, కురవకూడని వర్షపాతం బట్టి వ్యవసాయానికి లాభ నష్టాలు అంచనా వేస్తారు. ఈ ఏడు వానలు బాగా పడ్డాయి. మృగశిరలో కురిసిన వానలకు ముసలెద్దులు కూడా చురుగ్గా పొలాలు దున్నాయి. రుద్రుడి జటాజూటంలోంచి పొంగిన గంగలా, ఆరుద్రకార్తెలో కురిసిన వానలో తడుస్తూ, నా భార్య మగవాడితో సమంగా కష్టించి పొలంలో పనిచేసింది. నాభార్య మాటాడిన మాటలు ఆరుధ్రవానకు, మృగశిరకు సంబంధించినవి. నా భార్య, తమదృష్టిలో ఉన్మాదిలా ప్రవర్తించినందుకు క్షమించండి!" అన్నాడు.
ఆ మాటలతో శాంతించిన మాణిక్యవర్మ, "అది సరే, మరి శివుడి గర్భగుడిలో దూది మంట వేయడం ఏమిటి?" అని అడిగాడు. "మహారాజా ! పుష్యమాసంలో మునిమాపు వేళ నాగలి కాడికి, పలివెడు - అంటే ఇరవైచిన్నెముల ఎత్తుగల దూదిని చుట్టిపొలంలో వుంచుతాం. వేకువున వచ్చి ఆ దూదినిపిండినప్పుడు ధారగా నీటిబిందువులు వస్తే, మృగశిరకార్తె నుంచి మంచివానలు! బిందువులు, బిందువులుగా పడితే తక్కువ వాన. ఈ ఏడు మంచి వానలు కురవాలని పరీక్షించిన దూదినే మేము శివుడి ముందు హారతిగా వెలిగించాం," అన్నాడు వెంగళప్ప.
ఆ జవాబుకు రాజు సంతోషించి, "ఆరుద్రవానలో ఏమోగాని, ఈ రుద్రుడి గుడిలో సుందరమ్మ మగవాడిలా రాజునుకూడా తప్పుపట్టింది. ఆరుద్రవానలో తడిసి, ఆడది మగవాడిలా పనిచేయగలిగే వానలు కురిసి, పంటలతో మన వేంగీరాజ్యం అన్నపూర్ణ కావాలి!" అన్నాడు. రాజనర్తకి కీర్తిసేన నాట్యం ముగిశాక రాజుసుందరమ్మను, వెంగళప్పను అందరిముందు సన్మానించాడు. ఆనాటి వేంగీరాజ్యంలో ఆరుద్రవానలు కురిసినప్పుడు, స్త్రీలు ఒక్కరోజైనా పొలంలో పనిచేసేవారు.
No comments:
Post a Comment