Pages

Tuesday, September 11, 2012

అత్యాశ


కుముద్వతీ రాజ్యం పొలిమేరలో ప్రవహించే కుముదినీ నదీ తీరంలో సుప్రసిద్ధమైన సోమశేఖర ముని ఆశ్రమం ఉండేది. అక్కడ గురుకుల ఆశ్రమాన్ని నడిపే సోమశేఖర ముని శిష్యులకు వివిధ ధ్యాన పద్ధతులను బోధించడంతోపాటు, చిత్రలేఖనంలో కూడా సిద్ధహస్తుడు. మనుషులను చూసి యథాతథంగా చిత్రించడంలో అద్భుతమైన ప్రతిభ కనబరచేవాడు.
 
అందువల్ల కళాభిరుచిగల సంపన్నులు, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన అడిగిన సొమ్ము చెల్లించి ఆయన చేత తమ చిత్రాలను గీయించుకుని వెళ్ళేవారు. ముని తను గీసిన చిత్రాలకు ఎక్కువ మొత్తాలు వసూలు చేయడంలో చాలా జాగ్రత్త వహించేవాడు. ఇది పలువురికి ఆశ్చర్యం కలిగించేది. మరి కొందరయితే, ‘‘సర్వసంగ పరిత్యాగి అయిన మునికి ఇంత ధనాశ పనికిరాదు,'' అని చాటుమాటుగా విమర్శించేవారు.
 
ముని వీటన్నిటినీ పట్టించుకోకుండా చిత్రలేఖనం ద్వారా సొమ్మువసూలు చేయడంలోనే నిమగ్నుడై ఉండేవాడు! ఇలా ఉండగా ఒకనాడు చక్కగా అలంకరించబడిన ఒక అందమైన గురబ్బ్రండిలో ఆశ్రమానికి వచ్చిన రాజనర్తకి శుభాంగి మునిని సందర్శించి, తన చిత్రపటం గీయించుకోవాలన్నది. ‘‘సంతోషం. క్షణాలలో చిత్రించి ఇస్తాను. అయితే కొంచెం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది!'' అన్నాడు ముని.
 
‘‘ఆ విచారమే వద్దు. తమరు ఎంత అడిగినా ఇస్తాను. అయినా, ముందుగానే అడుగుతున్నారు. ఎంత కావాలేమిటి?'' అని అడిగింది రాజనర్తకి. ‘‘నీ స్థాయికి తగ్గట్టు ఎంత ఇవ్వగలవో నువ్వే చెప్పు,'' అన్నాడు ముని. ‘‘వంద వరహాలు చాలా?'' అని అడిగింది నర్తకి, ముని పరమానందం చెందగలడన్న ఆశతో.

‘‘రెండు వందల వరహాలు,'' అన్నాడు ముని ఏమాత్రం తొణక్కుండా. ఆ మాటవిని ఒక్క నిమిషం అవాక్కయి పోయిన నర్తకి, వెంటనే తేరుకుని, ‘‘మరీ ఎక్కువ మొత్తం. అయినా మునివర్యులకు అంతటి అత్యాశ పనికి రాదు!'' అన్నది నిష్ఠూరంగా. ‘‘ఇందులో బేరసారాలకు ఏమాత్రం తావు లేదు. మరో మాట మాట్లాడకుండా అడిగిన మొత్తం ముందు పెడితేనే చిత్రపటం. లేకుంటే వచ్చిన దారినే తిరిగి వెళ్ళవచ్చు,'' అన్నాడు ముని నిష్కర్షగా.
 
వచ్చిన పని పూర్తి చేసుకోకుండా తిరిగి వెళ్ళడానికి నర్తకి అహం అడ్డుపడి, ముని అడిగిన రెండు వందల వరహాలు తీసి ఆయన ముందుంచి, ‘‘సరే, ఆ పొన్నచెట్టు కింద నిలబడతాను. చిత్రించు,'' అంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు కింద నృత్యభంగిమలో నిలబడింది. ముని తదేకంగా ఆమెవంక కొంతసేపు చూసి, కుంచెనందుకుని చకచకా చిత్రపటం చిత్రించి ఆమె చేతికిచ్చాడు.
 
దానిని చూసిన ఆమె, ‘‘చిత్రపటం అద్భుతంగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే దానిని గీసినందుకు మీరు పుచ్చుకున్న మొత్తం మాత్రం చాలా ఎక్కువ. ఇలా ధనం కూడబెట్టి వెళ్ళేప్పుడు పట్టుకు పోతారా?'' అంటూ విసురుగా వెళ్ళి, గురబ్బ్రండిలో కూర్చుని నగరానికి తిరుగు ప్రయూణమయింది.

మరికొన్ని నెలల పాటు ముని దీక్షగా చిత్రాలు గీస్తూ, అలాగే ధన సంపాదన కొనసాగించాడు. అయితే, ఆ తరవాత హఠాత్తుగా చిత్రాలు గీయడం మాని శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, ధ్యాన పద్ధతులు నేర్పడం ప్రారంభించాడు. ఆ సంగతి తెలిసి, ఆయనలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ రాజనర్తకి ఒకనాడు ఆశ్రమానికి బయలుదేరింది.
 
కిందటిసారి వచ్చినప్పుడు రాయిరప్పలతో ఎత్తు పల్లాలుగా ఉన్న ఆశ్రమానికి వెళ్ళే బాట ఇప్పుడు చదును చేయబడి ఉండడంతో ఆమె ప్రయూణం హాయిగా సాగింది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద మంటపం ఉండడం చూసి ఆమె ఆశ్చర్యం చెందింది.
 
మంటపంలోపల శిష్యులనూ, భక్తులనూ ఉద్దేశించి సోమశేఖర ముని ప్రధాన శిష్యుడు ఉపన్యసిస్తున్నాడు: ‘‘ధ్యాన మందిరం నిర్మించాలని ఎంతగానో ప్రయత్నించి, అది నెరవేరకుండానే తన గురువు భానుప్రకాశానంద స్వాములు పరమపదించడంతో, ధ్యాన మందిర నిర్మాణాన్ని తనలక్ష్యంగా పెట్టుకుని, మన గురువర్యులు సోమశేఖర ముని నిర్విరామంగా కృషి చేశారు. స్వార్థపరుడనీ, దురాశాపరు డనీ తనను లోకులు కాకులై కూసినా బాధ పడలేదు.
 
తనకు తెలిసిన చిత్రలేఖనం ద్వారా స్వయంగా ధనార్జన చేసి గురువు కోరికను నెరవేర్చారు. భావితరాలకు మహోపకారం చేసి, తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిన మహానుభావుడాయన. ఆయన కారణంగానే ఆశ్రమానికి ఈరోజు చక్కని బాట ఏర్పడింది. మన మందరం ఆయనకెంతో రుణపడి ఉన్నాం!'' ఆ మాటలు వినగానే రాజనర్తకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
 
మునివర్యులను అపార్థం చేసుకున్నందుకు నొచ్చుకుని, మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నది. ఆ తరవాత తన కంఠహారాన్నీ, చేతులకు పెట్టుకున్న బంగారు మురుగులనూ తీసి, ధ్యానమందిరానికి కానుకగా సమర్పించి, ప్రశాంత చిత్తంతో నగరానికి తిరుగు ప్రయూణమయింది.

No comments:

Post a Comment