Pages

Tuesday, September 11, 2012

విలువిద్య పోటీ!


ఒకానొకప్పుడు అరుణాచలప్రదేశ్‌ డిబాంగ్‌ లోయను ఆనుకునివున్న ఇడు ముష్మీ గిరిజన పల్లెల సమీపంలో వున్న అడవుల్లో కోతులు మందలు మందలుగా నివసిస్తూండేవి. అవన్నీ బాణాలు వేయడంలో అపరిమితమైన ఆస క్తినీ, నైపుణ్యాన్నీ కనబరచేవి. పెద్దకోతులు, పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధను కనబరచేవి. ‘‘బాల్యంలోనే పట్టు కోవాలి!'' అనే మాటమీద పెద్ద కోతులకు పరి పూర్ణమైన నమ్మకం ఉండేది.
 
విలువిద్యలో నిపుణులైన తమ తాత ముత్తాతలు తమకు శిక్షణ ఇచ్చినట్టే, తమ పిల్లలకు, మనవళ్ళకు విలువిద్యా శిక్షణ ఇవ్వాలని దీక్షతో కృషి చేసేవి. విల్లమ్ములూ, బాణాలూ చేయడానికి ఉపయోగ పడే మంచి వెదుళ్ళు, పేములు, ఏ లోయలో వున్నా, శ్రమను పట్టించుకోకుండా వెళ్ళి తీసుకు వచ్చేవి. వెదుళ్ళతో దృఢమైన విల్లులనూ, పేముతో పదువైన బాణాలనూ తయూరు చేసుకునేవి.
 
వాటిని ఉపయోగించడంలో అపరిమిత మైన ఆనందాన్ని పొందేవి. ప్రతిరోజూ తెల్లవారక ముందే పసికోతులు క్రమం తప్పకుండా బాణాలు వేయడంలో శిక్షణ పొందేవి. చేతులకు దృఢమైన పట్టు, గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడానికి తదేక దృష్టి, అచంచలమైన ఏకాగ్రత అలవడేలా పెద్ద కోతులు, చిన్న కోతులకు శిక్షణ ఇచ్చేవి. తూరుపు కొండల నుంచి అరుణోదయం కాగానే, ‘‘సరిగ్గా పట్టుకో!'' ‘‘నారిని గట్టిగా లాగు!'' ‘‘గురిచూసి కొట్టు!'' ‘‘చేయి వణక కూడదు!'' ‘‘ఒక కన్ను మూసుకో!'' ‘‘అదిగో పండు కనిస్తుందికదా!'' ‘‘గురి చూసి నారిని చెవులదాకా లాగి ఒక్క దెబ్బతో ఆ ఎగురుతూన్న పిట్టను కొట్టు!''
 
మొదలైన సూచనలతో, రివ్వు రివ్వు మంటూ దూసుకు పోయే బాణాల శబ్దాలతో, అరుపులతో, కేకలతో, కీచుకీచు శబ్దాలతో ఆ కొండ ప్రాంతమంతా మారుమ్రోగేది. దీనికంతా కారణం పెద్ద కోతులు, పిల్లకోతులకు విలువిద్యలో శిక్షణ ఇవ్వడమే. అప్పుడప్పుడూ పెద్ద కోతులు చిన్న కోతులతో ఉత్తుత్తి యుద్ధాలు చేసి వినోదించేవి. ఆ సమ యంలో, ఇరువైపుల నుంచీ బాణవర్షం కురి సేది. లోయంతా బాణాలతో నిండిపోయేది.

అందువల్ల ఉదయకాలంలో పక్షులు అటువైపు ఎగరాలన్నా, లేళ్ళు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటుకేసి వెళ్ళాలన్నా భయపడేవి. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయూయి. అయినా, కోతులు కోతులే కదా! వాటి బుద్ధి ఎలా బుద్ధిగా ఉంటుంది? కోతుల నాయకుడి చిన్న కొడుకు ఒకనాడు, ‘‘ఇలా ఎన్నాళ్ళని శిక్షణ పొందుతూ ఉంటాం? కాస్త వినోదం కూడా కావాలి కదా? మన నైపుణ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించకపోతే అభ్యాసంవల్ల ఒరిగే దేమిటి?'' అన్నాడు. ‘‘అవును.
 
మనమంటే లెక్కచేయని ఆ పొగరుబోతు ఏనుగుకూ, కోరలపులికీ అప్పుడ ప్పుడూ మన సత్తా కాస్త చవి చూపాలి. అప్పుడే మనల్ని ఉదాసీన పరచవు,'' అన్నాయి దాని స్నేహితులైన లాలు, కాలు అనే కోతులు. ‘‘అవును, వాటికి మరువరాని గుణపాఠం నేర్పాలి!'' అని వంతపాడింది మిట్టూ అనే పిరికి కోతి. కిచకిచమంటూ నవ్వుతూ ఒక నల్ల కోతి, ‘‘దుర్మార్గమైన ఆ తోడేలు చేసే అఘాయిత్యం చూశారా!
 
పాపం అమాయక మైన ముంగిసను ఎలా హింసిస్తుంది? భయంకరమైన దాని నోటిలోకి బాణం వదిలితే ఎంత సరదాగా ఉంటుంది!'' అన్నది. ఆ మాటకు తక్కిన కోతు లన్నీ నవ్వాయి. ఆ తరవాత ఒక్కొక్క కోతికి ఒక్కొక్క ఆలోచన పుట్టుకు వచ్చింది. పిల్ల కోతు లన్నీ నిజమైన వినోదం కోసం ఉబలాట పడ సాగాయి. వాటికి తోచిన పథకాలను రూపొం దించుకున్నాయి. మరునాటి ఉదయం నుంచే డిబాంగ్‌ అడవీ ప్రాంతంలో కోతులు పెట్టే బాధలు పెరిగి పోయూయి.
 
వాటి బాణాల దెబ్బలకు రోజూ ఎవరో ఒకరు గురయ్యేవారు. ఆఖరికి అవి ఇడుముష్మి పల్లెవాసులను కూడా వదిలిపెట్ట లేదు. కోతులు వదిలే బాణాలు పిల్లల తలల మీదుగా దూసుకుపోయేవి. ముసలివాళ్ళ తలపాగాలను ఎగురగొట్టేవి. బయట ఎండ బెట్టిన మాంసపు ముక్కలను బాణాలు తన్నుకు పోతూంటే ఇడూ స్ర్తీలు నిస్సహాయంగా చూస్తూ ఉండేవారు!
 
కోతులు పెట్టే బాధలు ఇక భరించలేక వన్య మృగాలూ, పక్షులూ ఒకనాడు ఆనో దగ్గరికి వెళ్ళాయి. దయూమయుడూ, గొప్ప శక్తిమం తుడూ అయిన దేవుడు ఆనో. ఆయన వాటిని చూడగానే, ‘‘అందరూ కలిసి కట్టుగా ఒక్క సారిగా వచ్చారే మిటి? ఎందుకలా విచారంగా ఉన్నారు?'' అని ఆదరంతో పలకరించాడు.

‘‘ఏం చెప్పమంటారు ప్రభూ! ఈ రోజుల్లో ఏ ఒక్కరం కూడా ప్రశాంతంగా మా బతుకు మేము బతక లేకున్నాము,'' అన్నది చెకుముకి పిట్ట దీనంగా. ‘‘ప్రభూ! ఈ తుంటరి కోతులు పెట్టే బాధలు రోజు రోజుకూ మితిమించి పోతున్నాయి. నిన్న ఉదయం నా కూన అరటి పండు తినడానికి నోరు తెరిచి అలాగే మూలుగుతూ నేలకొరిగింది. చాటు నుంచి కోతి వేసిన పదునైన బాణం దాని గొంతులోకి దిగిపోయింది.
 
నా బిడ్డ పడే బాధను చూసి భరించలేక పోయూను. తలపైకెత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద బాణాలతో కూర్చున్న రెండు తుంటరి కోతులు పళ్ళికిలిస్తున్నాయి,'' అన్నది ఏనుగు బాధతో తొండాన్ని ఊపుతూ. ‘‘ఈ అన్యాయూన్ని చూడండి ప్రభూ!'' అంటూ ఒక కుందేలు కట్టు కట్టిన తన కాళ్ళను చూపుతూ, ‘‘అడవిలో జరుగనున్న క్రీడా పోటీల్లో పాల్గొనాలన్న ఉత్సాహంతో శిక్షణ పొందుతూ ఆడుకుంటున్నాం. ఆట ప్రారంభించామో లేదో నాలుగు బాణాలు వచ్చి నా కాళ్ళకు గుచ్చుకోవ డంతో చతికిల పడ్డాను.
 
ఈ గాయూలే గనక లేకుంటే పోటీల్లో తప్పక జయించి ఉండేదాన్ని,'' అన్నది బొట బొటా కన్నీళ్ళు కారుస్తూ. ‘దగ్గరికి రావమ్మా' అంటూ ఆనో కుందేలును మృదువుగా నిమిరాడు. ‘‘మీ బాధలు నాకర్థ మయ్యూయి. విచారించ కండి. కోతుల వ్యవహారం నేను చూస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి,'' అంటూ వాటిని ప్రేమతో సాగనంపాడు. మరునాడు ఆనో కోతుల నాయకుణ్ణి పిలి పించి, ‘‘మీ వాళ్ళ విలువిద్యా పాటవం ఎలా వుంది. అడవంతా అదే మాటగా ఉంది,'' అన్నాడు. ‘‘అవును, ప్రభూ.
 
మా పిల్లలు అందులో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూన్నారు,'' అన్నాడు నాయకుడు గర్వంగా. ‘‘అంటే, ఈ యేటి అరణ్య క్రీడాపోటీల్లో ప్రథమ బహుమతి మీదే నన్న మాట!'' అన్నాడు ఆనో. ‘‘అవును, ప్రభూ! మా కుర్రాళ్ళు మంచి ప్రతిభావంతులు. బుడతగాళ్ళు సైతం, ఎగిరే సీతాకోకచిలుకనూ, బాణంలా దూసుకుపోయే పిచ్చుకనూ సునాయూసంగా పడగొడుతున్నా రంటే చూడండి,'' అన్నాడు నాయకుడు.
 
‘‘అలాగా!'' అని ఆనో తల పంకించి, ‘‘మీ వాళ్ళ ప్రతిభను స్వయంగా చూడాలని కుతూ హలంగా ఉంది. రేపు నదీ తీరంలో జరుగనున్న పోటీకి మీలో చాలా గట్టివాడుగా పేరు తెచ్చు కున్న ఒక విలుకాణ్ణి పంపండి,'' అన్నాడు. మరునాడు అందమైన ఒక కోతి యువ కుడు, విల్లమ్ములతో వచ్చి ఆనోకు నమస్క రించాడు.

అప్పటికే ఆనో చేతిలో బాణం ధరించి నిలబడి ఉన్నాడు. ‘‘అంటే, నువ్వు పోటీకి సిద్ధంగా వచ్చావన్న మాట!'' అంటూ కోతియువ కుడి కేసి తిరిగాడు ఆనో. ‘‘అవును, ప్రభూ!'' అన్నాడు యువకుడు. ‘‘సరే, అదో అలా చూడు,'' అంటూ ఆనో నది ఆవలి గట్టును చూపుతూ, ‘‘గట్టుకు దగ్గ రగా నీళ్ళల్లో మునిగివున్న పెద్ద బండ కని పిస్తున్నది కదా?'' అని అడిగాడు. ‘‘కనిపిస్తున్నది,'' అన్నాడు కోతియువకుడు నీళ్ళలోకి పరిశీలనగా చూస్తూ.
 
‘‘బాణంతో నీళ్ళల్లో మునిగివున్న కొండను కొట్టాలి. అలా కొండను కొట్టగలిగిన వాడే పోటీలో విజేత!'' అని వివరించాడు ఆనో. ఇద్దరూ విల్లమ్ములతో పోటీకి సిద్ధమయ్యూరు. పోటీ ఆరంభమయింది. మొదట ఆనో కొండను గురిచూసి బాణం వదిలాడు. ‘క్లంగ్‌' మన్న శబ్దంతో గాలిలోకి దూసుకు వెళ్ళిన లోహపు బాణం ఆవలి గట్టు సమీపంలో నీళ్ళను చీల్చు కుంటూ వెళ్ళి రక్కుమని బండను తాకింది.
 
తరవాత ఆయన వదిలిన నాలుగు బాణాలూ అలాగే వెళ్ళి లక్ష్యానికి తగిలాయి. ఆ తరవాత కోతియువకుడు విల్లును ఎక్కుపెట్టి, లక్ష్యాన్ని గురిచూసి పేము బాణాన్ని వదిలాడు. అది రివ్వున వెళ్ళింది గాని, బండ సమీపంలో నీళ్ళు తగల గానే పేముబాణం గనక ముందుకు దూసుకు వెళ్ళలేక మెల్లగా ఆగి పోయింది. దాన్ని చూసి కోతియువకుడు దిమ్మెర పోయూడు. ఇంకో బాణం వదిలాడు. అదీ నీళ్ళపై తేలుతున్నది గాని, అందులోకి చొచ్చుకుని వెళ్ళి బండను తాకలేక పోయింది.
 
అతడు ఎన్ని సార్లు బాణం వేసినా అలాగే జరిగింది. లక్ష్యాన్ని ఛేదించలేక పోయూడు. ‘‘నా బాణం నీళ్ళ లోపలికి చొచ్చుకు పోవడం లేదు. నేను ఓడి పోయూను,'' అంటూ తలదించుకు న్నాడు కోతి యువకుడు. ఆ తరవాత అవమాన భారంతో ఇకపై విల్లమ్ములు ముట్టుకోకూడదన్న నిర్ణయంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయూడు.
 
ఆనో చిన్నగా నవ్వుకున్నాడు. తన బాణం ఇనుముతో తయూరైనది గనక నీళ్ళలోకి చొచ్చుకు పోగలదనీ, కోతియువకుడి బాణం పేముతో తయూరు చేయబడింది కాబట్టి, నీళ్ళలోకి మునగదనీ ఆయనకు ముందే తెలుసు. ఆ రోజు నుంచే కోతులు విల్లమ్ములను ఉపయోగించే శక్తిని కోల్పోయూయి!

No comments:

Post a Comment