సునీతకు కొత్తగా పెళ్ళయింది. ఆమెను అత్తవారింటికి కాపురానికి పంపుతూ
తల్లి, ‘‘ఇక మీదట నీకు అత్తగారే తల్లి అనుకో. ఆమెను దేవుడికంటే ఎక్కువగా
గౌరవించు,'' అని చెప్పింది. ఆ మాటలను అక్షరాలా పాటించింది సునీత
అత్తవారింట్లో. కోడలి ప్రవర్తనకు అత్త పద్మావతి ఎంతో మురిసిపోయింది. ఆమె
అందరివద్దా సునీతను పొగుడుతూండేది. పద్మావతి ఇంటిని అందంగా సర్దుతుంది.
వంటలు బాగా చేస్తుంది.
పాటలు చక్కగా పాడుతుంది. సునీత ఆమె దగ్గర చాలా నేర్చుకుని,
‘‘అత్తయ్యూ, మీరు చూడ్డానికి మహాలక్ష్మిలా వుంటారు. కానీ సరస్వతిలా ఎన్ని
విద్యలు తెలుసో! మా అమ్మకిన్ని తెలియవు. మీ దగ్గరకు రాకపోతే నేను
కూపస్థమండూకంలా వుండిపోయేదాన్ని,'' అంది. పద్మావతి ఆనందంగా, ‘‘మీ
అమ్మకేమొచ్చో ఏంరాదో తెలీదుకానీ, నిన్ను సుగుణాల రాశిగా తీర్చిదిద్దింది.
అది వెయ్యి విద్యల పెట్టు!'' అన్నది.
సునీత అత్తవారింట పట్టుమని నెల రోజులైనా గడపకముందే, ఆమె భర్త రాఘవకు
రాజుగారి కొలువులో ఉద్యోగ మొచ్చింది. మంచి జీతం, హోదా, పలుకుబడి వున్న ఆ
ఉద్యోగం రావడం, కోడలు పాదం పెట్టిన వేళా విశేషమని పద్మావతి అందరితోనూ
అన్నది. సునీత భర్తవెంట రాజధానికి బయల్దేరుతూ, పద్మావతితో, ‘‘అత్తయ్యూ!
మీరు మహాలక్ష్మిలా వుంటారు.
మిమ్మల్నో రోజు చూడక పోతే, ఆ రోజుకది లోటే అనిపిస్తుంది నాకు,''
అన్నది దిగులుగా. నాలుగేళ్ళు గడిచాయి. సునీత రాజధానిలో కాపురం పెట్టిన
సంవత్సరమే కూతురును కన్నది. ఉద్యోగ బాధ్యతల ఒత్తిడి కారణంగా, రాఘవ, సునీత
తమ వాళ్ళను చూసేందుకు వెళ్ళలేక పోయూరు. రాఘవ తమ్ముడు గణపతి పెళ్ళికి కూడా
వెళ్ళడం సాధ్యపడలేదు.
గణపతి భార్య తపతిది దుడుకు స్వభావం. పద్మావతి అస్తమానూ పెద్ద కోడలి
గుణగణాల గురించే ఆమెకు చెబుతూండేది. విని విని విసిగిపోయిన తపతి,
‘‘అత్తయ్యూ! దూరపు కొండలు నునుపు. ఇక్కడ వున్నప్పుడు పొగిడిందని
మురిసిపోతున్నారు. అక్కడ ఆమె మీ గురించి ఏం చెబుతున్నదో మీకు తెలియదుగదా?''
అనేసింది. పద్మావతికి ఈ మాటలు బాధ కలిగించాయి.
అప్పట్నించీ ఆమె సకుటుంబంగా రాజధానికి వెళదామని భర్తను పోరడం మొదలు
పెట్టింది. ఒక శుభముహూర్తాన అంతా కలిసి రాజధానికి బయల్దేరారు.
వాళ్ళొస్తున్నట్టు ముందే తెలిసిన రాఘవ, రాజధాని పొలిమేరలోనే వాళ్ళను
కలుసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికి రాఘవ కూతురు నిర్మలకు ఆరేళ్ళు. ఆ
పిల్ల ఒక్కొక్కర్నే పరిచయం చేసుకుని, పద్మావతి తన బామ్మ అని
తెలుసుకున్నాక, ఆశ్చర్యపోతూ, ‘‘అవునా! నువ్వు నా బామ్మవా? అమ్మ అందరితో
నిన్ను గురించి చెప్పడాన్ని బట్టి, నువ్వు నల్లగా, లావుగా, వికారంగా
ఉంటావనుకున్నాను.
మరి నువ్వేమో తెల్లగా, సన్నగా, దేవతలావున్నావు!'' అంది. పద్మావతి ముఖం
మాడి పోయింది. తపతి, చూశారా అన్నట్టు గర్వంగా నవ్వింది. కూతురు మాటలకు
సునీత ఒక్క క్షణం తికమకపడి, ఆ వెంటనే నవ్వింది. రాఘవ కూడా నవ్వాడు.
వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాక మిగతావాళ్ళు ముఖముఖాలు
చూసుకుంటున్నంతలో, వంటావిడవంట గదిలోంచి వస్తూ సునీతతో, ‘‘అమ్మగారూ,
వంటయిపోయింది.
వెంటనే భోజనాలు చేసెయ్యొచ్చు,'' అంది నవ్వు ముఖంతో. ఈ వంటావిడ మరీ
నల్లగా, లావుగా వికారంగా వుంటుంది. సునీత ఆమెతో, ‘‘వంట పని ఇంత త్వరగా
పూర్తవుతుందనుకోలేదు. నీలో ఆ అన్నపూర్ణ అంశలాంటిదేదో వున్నది,
మహాలక్ష్మీ!'' అంటూ ఆమెను మెచ్చుకున్నది. దానితో పద్మావతికీ, ఇతరులకూ
ఆరేళ్ళ నిర్మల అన్న మాటల్లోని ఆంతర్యం తెలిసిపోయి, ఒక్కసారిగా ఫక్కుమంటూ
నవ్వారు. పద్మావతి, నిర్మలను ఎత్తుకుని, ‘‘ఎంత గడుసుదానివే నువ్వు!'' అంటూ
ముద్దాడింది.
No comments:
Post a Comment